వేధింపులకు విద్యార్ధిని ఆత్మహత్య

  ఆకతాయిల వేధింపులు బరించలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్ నగర్ లో విజేత డిగ్రీ కాలేజీలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న హారికను గత కొద్దిరోజులుగా కొంత మంది ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అనంతరం పోకిరీలు వేధింపులు ఎక్కువ చేశారు. దాంతో మనస్తాపంకు గురైన హారిక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఆకతాయిల వేధింపుల వల్లే హారిక ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

టాప్ సీడ్ చైనా వాంగ్‌కు షాకిచ్చిన సైనా

  ప్రతిష్ఠాత్మక డెన్మార్క్ ఓపెన్‌లో టాప్ సీడ్ చైనా యిహాన్ వాంగ్‌పై తొలి సారి గెలిచిన సైనా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యిహాన్ వాంగ్‌పై గెలిచి లండన్ ఒలింపిక్స్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‌లో మూడో సీడ్ సైనా 21-12, 12-7తో యిహాన్‌ను చిత్తుచేసి జర్మనీకి చెందిన జులియన్ షెంక్‌తో టైటిల్ పో రుకు సిద్ధమైంది. తొలిగేమ్ నెగ్గిన సైనా రెండోగేమ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నపుడు. యిహాన్ మోకాలి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఇంతకు ముందు ఈ ఇద్దరూ ఆరు సార్లు తలబడగా.. సైనాను ఒక్క సారి కూడా విజయం వరించలేదు. ఫైనల్లో తలపడబోయే జులియన్ షెంక్‌పై సైనాకు మంచి రికార్డే ఉంది. ఇంతకు ముందు వీరిద్దరరూ ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడగా.. సైనా ఐదు సార్లు విజేతగా నిలిచింది.

పవన్ కళ్యాణ్ రాంబాబుకు ఏడు కట్‌లు

  కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రానికి 7 కట్స్ సూచిస్తూ ఆ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంది. చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌వి చంద్రవదన్‌, ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఐఎఎస్‌ అధికారి చందనా ఖాన్‌, దర్శకులు ఎన్‌.శంకర్‌, అల్లాని శ్రీధర్‌, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి, సీనియర్‌ పాత్రకేయుడు అల్లం నారాయణ, చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.చంద్రవదన్‌తో పాటు అల్లాని శ్రీధర్‌, విజయేం దర్‌రెడ్డి, దిల్‌ రాజా తదితరులు ఈ చిత్ర ప్రివ్యూను పరిశీలించారు. మిగిలిన సభ్యులు ఈ కార్య క్రమాన్ని బహిష్కరించారు. తెలుగు తల్లి అన్న పదాన్ని, తెలంగాణ ఇవ్వడానికి ఇష్టం లేదా?, నీకో తల్లి- నాకో తల్లి అంటూ చెప్పిన డైలా గు, ఓ సన్నివేశంలో నిజాం నవాబు బ్యాక్ గ్రౌండ్ ఫోటో తో పాటు పలు పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది. కమిటీ సూచించిన కట్స్… 1. తెలుగుతల్లి మీద డైలాగ్ 2.లీడర్ స్టేయింగ్ ఇన్ ద ఢిల్లీ గెస్ట్ హౌస్ 3. బ్యాక్ గ్రౌండ్‌లో నిజాం ఫొటో 4. తెలంగాణ కావాలా వద్దా ..డిస్కషన్ సీన్ 5.ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటున్నారు.. డైలాగ్ 6. యువత ఆత్మహత్యలు.. దృశ్యం 7. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సెటిలర్స్ రెచ్చగొడుతున్నారు.

బెంగుళూరులో బార్ గర్ల్స్ పై 8మంది గ్యాంగ్ రేప్

  బెంగుళూరులో కేసినో బార్ లో పనిచేసే ముగ్గురు యువతులపై ఎనిమిదిమంది యువకులు అత్యాచారం చేసి, ఇంట్లోని నగలు, వస్తువులు తీసుకొని పారిపోయారు. కేసినో రాయల్ బార్ లో మద్యం సరఫరా చేసే ముగ్గురు యువతులు కెంచనాపురంలో ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరికి రక్షణగా ముగ్గురు యువకులు కుడా ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో రెండు కార్లలో వచ్చిన ఎనిమిది మంది యువకులు వీరి ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న యువకుడిని కొట్టి ముగ్గురు యువతులపై అత్యాచారం చేశారు. వారి ఇంట్లో ఉన్న నగలు, మొబైల్ ఫోన్లు, టీవీ, డీవీడీ తదితర వస్తువులను పట్టుకెళ్లారు. రామ్‌నగర్ జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ ఘటనాస్థలానికి చేరుకుని యువతులను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. దుండగుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు.

ఎన్టీఆర్‌తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి కన్నుమూత

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రేమతో ..గౌరవంగా ‘బావ’ అని పిలుచుకునే కమ్యూనిస్టు కురు వృద్ధుడు, మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ శాసన సభ్యుడు చిలుముల విఠల్ రెడ్డి (98) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు. విఠల్ రెడ్డి నర్సాపూర్ శాసనసభ్యుడిగా 1962లో తొలిసారిగా ఎన్నికయ్యారు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ ‘బావ’గా అభివర్ణించేవారు. ఆ తర్వాత, టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా విఠల్ రెడ్డికి మంచి అనుబంధమే ఉండేది.

గాల్లోంచి పెట్రోల్ పుడుతుందా?

  ఇకపై కారు కొనుక్కోవాలనుకునేవాళ్లు హాయిగా ముందడుగేయొచ్చు. పెట్రోల్ రేటు మండిపోతోందని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గాల్లోంచి పెట్రోల్ ని పుట్టించే ఓ అద్భుతాన్ని బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ విధానం ప్రయోగాత్మక దశనుంచి ఆచరణ దశకు చేరుకుంటే ఇకపై చమురు సంస్థల నోట్లో మట్టే.. గాలి, విద్యుత్ ఆధారంగా పెట్రోల్ ని తయారు చేసే విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బ్రిటన్ కి చెందిన ఎయిర్ ఫుయూయెల్ సిండికేషన్ అనే సంస్థ ఈ విధానానికి రూపకల్పన చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించి విజయం సాధించింది. ఉత్తర ఇంగ్లండ్ లో ఉన్న ఈ కంపెనీ ఎయిర్ క్యాప్చర్ అనే సాంకేతిక విధానంతో గాల్లోంచి పెట్రోల్ ని తయారుచేయొచ్చని రుజువుచేసింది. పూర్తిస్థాయిలో ప్లాంట్ ని ఏర్పాటుచేస్తే ఈ విధానంలో రోజుకి టన్ను పెట్రోల్ ని ఉత్పత్తి చేయొచ్చట. వాతావరణంలోఉన్న బొగ్గుపులుసువాయువు ఆధారంగా పెట్రోల్ ని తయారుచేయొచ్చని ఈ సంస్థ చెబుతోంది. లండన్ ఇంజినీరింగ్ సదస్సులో ఈ కాన్సెప్ట్ కి విపరీతమైన స్పందనకూడా కనిపించింది. ఈ పద్ధతి అందుబాటులోకొస్తే భగ్గున మండుతున్న పెట్రోల్ ధరలు ఒక్కసారిగా నేలకు దిగొస్తాయ్.

ప్రజల మెడకు గ్యాస్ గుదిబండ

  యూపీఏ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. పైసా రావాలంటే పెటపెటలాడుతోంది.. అప్పుల తిప్పలు ఆఖరి అంకానికి వచ్చేశాయ్.. డబ్బులేమైనా చెట్లక్కాస్తున్నాయా.. అంటూ చిర్రుబుర్రులాడిన ప్రథాని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ని దేశంలోకి అనుమతించేందుకు పచ్చజెండా ఊపింది అందుకే.. సబ్సిడీల భారాన్ని మోయడంవల్ల ఒరిగేదేంలేదని యూపీఏ సర్కారు గ్రహించింది. అందుకే సబ్సిడీలకు అన్ని వైపులనుంచీ కోతలు పెట్టేందుకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయ్. వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేసే విషయంలో సర్కారు ఆగమేఘాలమీద నిర్ణయంకూడా తీసేసుకుంది. వచ్చే ఏప్రియల్ నుంచి వంటగ్యాస్ బండ రేటు రూ. 967. ఇకపై అందరికీ రాయితీ లేని సిలిండర్లే అందుబాటులోకొస్తాయ్. ఒకేసారి సబ్సిడీల్ని పూర్తిగా ఎత్తేస్తే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది కనుక సర్కారు తెలివిగా అంచెలంచెలుగా సబ్సీడీలకోత విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏప్రియల్ నెలనుంచి గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేయాలని చమురు కంపెనీలు, ప్రభుత్వం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయ్. కొంతకాలంపాటు ఇలా నేరుగా డబ్బు చెల్లించే పద్ధతిని వినియోగదారులకు అలవాటు చేస్తూ సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తూ పోతే.. తర్వాత్తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ విషయాన్ని వదిలేసినా జనం పెద్దగా పట్టించుకోని స్తితికి చేరుకుంటారన్నది ఆర్థిక నిపుణుల అంచనా.

ఘనంగా గరుడ సేవ – శ్రీవారి మోహినీ రూపం

  నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. తిరుమాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగాయి. మలమప్పస్వామికి మూలవర్ల ఆభరణాల్ని అలంకరించారు. గరుడసేవ ప్రారంభమయ్యే సమయానికి జోరున వర్షం.. శ్రీవారి గరుడసేవని చూడవచ్చిన భక్తకోటి పాపాలను కడిగిపారేయడానికా అన్నట్టు వరుణుడు ఆకాశగంగని కురిపించాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం. గరుడుడు శ్రీవారి వాహనం. ఓ కాలిని మడిచి మరోకాలిపై నిలిచి స్వామి ఎప్పుడు అనుజ్ఞ ఇస్తారా అని రెప్పవాల్చకుండా ఎదురుచూసే నిజమైన భక్తుడు గరుడుడు. శ్రీవారిని, దేవేరినీ సకలలోకాల్లో విహరింపజేయగల భాగ్యం ఒక్క గరుత్మంతుడికే దక్కింది. తల్లి దాస్యాన్ని విముక్తి చేసి ఆమెకు సద్గతిని కలిగించిన అఖండ శక్తిశాలి గరుత్మంతుడు. గరుత్మంతుడిని సేవించుకుంటే అఖండమైన శక్తి సంప్రాప్తమవుతుంది. సకల నాగదోషాలూ పటాపంచలైపోతాయ్. అనంతుణ్ణి తన వీపుపై మోసే గరుత్మంతుణ్ణి దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. మోహనరూపుడైన శ్రీనివాస విభుడు శుక్రవారం ఉదయం మోహినీ రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనాన్ని ప్రసాదించారు. మోహినీ రూపంలో శ్రీవారిని చూసి సకలచరాచర సృష్టీ మోహపరవశంలో మునిగితేలింది.

కేజ్రీవాల్ తను హిట్లర్ ననుకుంటున్నారు : దిగ్విజయ్ సింగ్

  కేజ్రీవాల్ హిట్లల్ లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేజ్రీవాల్ కి సామాజిక పోరాటం చేస్తున్న కార్యకర్తగా పేరుండేదని, ఇప్పుడు పూర్తిగా స్వలాభంకోసం పాకులాడుతున్న వ్యక్తిగా ముద్రపడిపోయిందని తీవ్రంగా విమర్శించారు. “పౌర సమాజ ఉద్యమంలో మీ మాజీ సహచరుడు ఐఎఎస్ వై.పి.సింగ్ మిమ్మల్ని హిట్లర్ గా పేర్కొన్నాడు. ఆ పోలిక సబబే అనిపిస్తోంది.” అంటూ దిగ్విజయ్ కేజ్రీవాల్ కి ఓ లేఖ కూడా రాశారు. అరుణ్ రాయ్ తో , కిరణ్ బేడీతో, అన్నా హజారేతో తెగతెంపులు చేసుకున్నప్పుడే కేజ్రీవాల్ మీద స్వార్ధపరుడనే మచ్చపడిపోయిందని, జనం అంతా గమనిస్తూనే ఉన్నారని దిగ్విజయ్ ఆ లేఖలో వ్యాఖ్యలు చేశారు. జాతీయ సలహామండలిలో సభ్యుడి పదవికి తన పేరు సిఫారసు చేయమని కేజ్రీవాల్ తనని కోరారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ విషయంలో అన్నా హజారేనికూడా తనదారిలోకి తెచ్చుకునేందుకు కేజ్రీవాల్ విశ్వప్రయత్నం చేశారని కామెంట్ చేశారు దిగ్విజయ్..

అన్నాహజారే టీమ్ లో కొత్త సభ్యులు

  జన్ లోక్ పాల్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని అన్నా హజారే నిర్ణయించారు. ఇందుకోసం తన బృందాన్ని విస్తరించే ఏర్పాట్లను మొదలుపెట్టారు. మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ తో పాటు మరికొందరు ప్రముఖుల్నికూడా తన బృందంలోకి ఆహ్వానించేందుకు సామాజిక శాస్త్రవేత్త అన్నా హజారే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. రాలేగావ్ సిద్ధిలో ఈ విషయమై జరిగిన చర్చల్లో కిరణ్ బేడీ ప్రథానపాత్రను పోషించారు. ఉద్యమంకోసం ప్రత్యేక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని, రాలేగావ్ సిద్ధిలో ట్రస్ట్ కి ప్రత్యేక భవనం నిర్మించాలని అన్నా బృందం నిర్ణయించింది. వీకేసింగ్ తోపాటు, పీవీ రాజగోపాల్, రాజేందర్ సింగ్, మాజీ ఐపిఎస్ ఓం ప్రకాష్ సింగ్ తదితరులను తన బృందంలో చేర్చుకోవాలని అన్నా హజారే గట్టిగా అనుకుంటున్నారని సమాచారం.

కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత లోక్ పాల్

  కేజ్రీవాల్.. యూపీఏ సర్కారుతోపాటు ప్రతిపక్ష నేతలకుకూడా పంటికింద రాయిలా నలుగుతూ ఇబ్బందిపెడుతున్న పేరిది. సమాచార హక్కు చట్టమనే బ్రహ్మాస్త్రాన్ని అడ్డంపెట్టుకుని కేజ్రీవాల్ సేకరిస్తున్న సమాచారం పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారుకదా.. అని ప్రతిపక్ష పార్టీలు సంబరపడేలోపే విపక్షంలో ఉన్న అవినీతి జలగల్ని రోడ్డుమీదికి లాగడం కేజ్రీవాల్ కి నిత్యకృత్యమైపోయింది. దీంతో అన్ని రాజకీయపార్టీలూ కలిసి కట్టుగా కేజ్రీవాల్ పై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయ్. రివర్స్ గేర్ లో కేజ్రీవాల్ పార్టీలోని వ్యక్తులకు సబంధించిన వివరాలను సేకరించి వారిపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఇలాంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు కేజ్రీవాల్ తెలివిగా ఓ ఉపాయాన్ని ఆలోచించారు. తన పార్టీలోని సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చేందుకు ముగ్గురు రిటైర్డ్ జడ్జ్ లతో ఓ ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేశారు. ఢిలీ హైకోర్ట్ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా, బాంబే మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.హెచ్. మర్లపల్లె, ఢిల్లీ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిల్ జస్పాల్ సింగ్ ఈ బృందంలో సభ్యులు.

డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ జోరు

  డెన్మార్క్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారమిక్కడ జరుగుతున్న మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ సైనా లోకల్ స్టార్ టినెబాన్‌ 21-10, 21-11తో ఓడించి సెమీస్‌కు చేరింది. తొలిగేమ్ నుంచే ఆధిపత్యం కొనసాగించిన సైనా దూకుడైన ఆటతీరుతో బాన్‌ను బెంబేలెత్తించింది. ఆరంభంలోనే 18-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సైనా అదేఊపులో 21-10తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సైనాలో దూకుడు తగ్గలేదు. ఏ దశలోనూ టిన్ బౌన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్‌ను 18 నిమిషాల్లో ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. డెన్మార్క్ ఓపెన్‌లో నాలుగోసారి పాల్గొంటున్న సైనా తొలిసారి సెమీఫైనల్ దశకు చేరింది.

జగన్ బాణం ఎవరిమీద : సత్తిబాబు మండిపాటు

  తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ చేసేసి ఇప్పుడు వాటన్నింటినీ కాంగ్రెస్ నెత్తిన పడేసి తాము మంచివాళ్లుగా నిరూపించుకునే ప్రయత్నం జగన్ వర్గం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని వదిలిన బాణాలన్నీ నిష్ఫలమైపోయాయన్న సత్యాన్ని చరిత్రను చూసి తెలుసుకోవాలని బొత్స అన్నారు. అవకాశం కోసం పూటకోమాట మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టుపట్టించొద్దంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్చం చేశారు. రైతన్నలకోసం తాను ఓ పూట తిండిమానుకున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి వైద్యులు సలహా ఇవ్వడంవల్లే ఓ పూట రాత్రి భోజనం మానేశారు తప్ప, చంద్రబాబుకి చేనేతల సమస్యలమీద అక్కర లేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

కిరణ్ పై షర్మిల వాగ్బాణాలు

  “రాష్ట్రంలో ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమౌతుంటే ముఖ్యమంత్రి మొద్దునిద్రపోతున్నారా లేక ఏమీ చేయలేక మొద్దనిద్రని నటిస్తున్నారా ?” అంటూ వై.ఎస్ తనయ షర్మిల ముఖ్యమంత్రిపై విమర్శలు కురిపించారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా కడపజిల్లా వేంపల్లె దగ్గర్లోని రాజీవ్ నగర్ నుంచి వేముల మండలం భూమయ్యగారి పల్లె మలుపు వరకూ రెండోరోజు పాదయాత్ర చేశారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, వై.ఎస్ హయాంలో అమలుచేసిన పంటలబీమా పథకాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని షర్మిల విమర్శించారు. మళ్లీ అధికారంలోకొస్తే రైతులకు న్యాయం చేస్తానంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆమె అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యల్ని గుర్తుచేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రని టార్గెట్ చేస్తూ షర్మిల పాదయాత్రను మొదలుపెట్టారని వస్తున్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు. తన యాత్ర పూర్తయ్యేలోపు జగన్ జైలునుంచి బైటికొస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, వై.ఎస్ హయాంలో జరిగిన మంచి పనుల్ని ఏకరువుపెడుతూ ప్రజాభిమానాన్ని చూరగొనే ప్రయత్నంచేస్తూ.. షర్మిల పాదయాత్రలో ముందుకు కదులుతున్నారు.

చంద్రబాబుని కదిలిస్తున్న జనం అవస్థలు

  ఎక్కడికెళ్లినా ఆకలి కేకలు.. ఏ వైపు చూసినా పూట గడవడానిక్కూడా దిక్కులేని గడపలు.. రైతులు, చేనేతలు, వృత్తిపనివాళ్లు.. ఒకరేమిటి రాష్ట్రంలో అందరి పరిస్థితీ అధ్వాన్నంగానే ఉంది. జనం పడుతున్న బాధల్ని చూస్తుంటే చంద్రబాబుకి గుండె తరుక్కుపోతోంది. ఎలాగైనా ప్రజలకు మేలుచేయాలన్న తపన.. ఈసారి అధికారంలోకొస్తే తప్పనిసరిగా సామాన్యుల కష్టాలు తీర్చాలన్న దీక్ష.. చంద్రబాబుని పాదయాత్రలో ముందుకు నడిపిస్తున్నాయ్. కాళ్లనొప్పులు బాబుని బాధిస్తున్నాయ్. మట్టిరోడ్డుపై నడిస్తే కాస్త ఊరటకలుగుతుందేమోనని వైద్యులు సలహా ఇచ్చారు. ఫిజియోథెరపిస్టులు ఇస్తున్న సూచనల్ని చంద్రబాబు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్య పరిస్థితి విషయంలో చంద్రబాబు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సుంది. కానీ..జనం సమస్యలు ఆయన్ని నిలువనీయడంలేదు. ప్రజలు పడుతున్న బాధలు బాబుని స్థిమితంగా కూర్చోనివ్వడంలేదు.. ఇంకా ఇంకా ముందుకెళ్లాలన్న తపన.. జనం అవస్థల్ని తెలుసుకుంటే మళ్లీ అధికారమొచ్చాక వాటిని విరగడ చేయొచ్చన్న కసి.. చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అలుపెరగక చివరికంటా నడిచి పాదయాత్రను పూర్తి చేయాలన్న పట్టుదల చంద్రబాబులో గట్టిగా పాతుకుపోతోందంటున్నారు.

కిరణ్ చాతగానితనంవల్లే రాష్ట్రంలో కరువు : మంత్రి డి.ఎల్

  కిరణ్ పై మంత్రి డిఎల్ ఆరోపణల వర్షాన్ని కురిపిస్తున్నారు. కరువుని ఎదుర్కునే విధానాలు ప్రణాళికల్ని తనతోపాటు మరో ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టీపెట్టీ అలసిపోయామని డి.ఎల్ ఆరిపిస్తున్నారు. ఆరునెలలుగా తాము పడ్డ శ్రమ పూర్తిగా వృథా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఏ ఏ రంగాల్ని ఎలా చూసుకోవాలో తెలుసని, కేవలం లక్ష్యంలేని కారణంగానే ముఖ్యమంత్రి కిరణ్ తన మాటల్ని పెడచెవినపెడుతున్నారని డి.ఎల్ మండిపడుతున్నారు. “ నేనెన్నడూ చూడని దుర్భిక్షం రాష్ట్రాన్ని కాటేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయ్.. మంచినీళ్లు దొరకడంలేదు. సాగునీరందడంలేదు. వ్యవసాయానికి అన్యాయం జరుగుతోంది. విద్యుత్తు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జిల్లాకి చెందిన ముగ్గురం మంత్రుల కీలకమైన రంగాలకు ప్రాథాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. చాలాసార్లు ఈ విషయాల్ని సీఎంతో చెప్పాం. ఎంతగా వేడుకున్నా మా మాట పట్టించుకున్న పాపాన పోవడంలేదు. “ అంటూ సొంతపార్టీ సర్కారుమీద, ముఖ్యమంత్రి మీద మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విరుచుకుపడ్డారు.

3 యువతులను రేప్ చేసిన 8 మంది యువకులు

  బెంగుళూరులో కేసినో బార్ లో పనిచేసే ముగ్గురు యువతులపై ఎనిమిదిమంది యువకులు అత్యాచారం చేసి, ఇంట్లోని నగలు, వస్తువులు తీసుకొని పారిపోయారు. కేసినో రాయల్ బార్ లో మద్యం సరఫరా చేసే ముగ్గురు యువతులు కెంచనాపురంలో ఓ ఇంట్లో ఉంటున్నారు. వీరికి రక్షణగా ముగ్గురు యువకులు కుడా ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో రెండు కార్లలో వచ్చిన ఎనిమిది మంది యువకులు వీరి ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న యువకుడిని కొట్టి ముగ్గురు యువతులపై అత్యాచారం చేశారు. వారి ఇంట్లో ఉన్న నగలు, మొబైల్ ఫోన్లు, టీవీ, డీవీడీ తదితర వస్తువులను పట్టుకెళ్లారు. రామ్‌నగర్ జిల్లా ఎస్పీ అనుపమ్ అగర్వాల్ ఘటనాస్థలానికి చేరుకుని యువతులను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. దుండగుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాకు లగడపాటి మద్దతు

  పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు లగడపాటి రాజగోపాల్ మద్దతు ప్రకటించారు. రాంబాబు సినిమాను తెరాస నాయకులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. టీఆర్ఎస్ నాయకులు సినిమాలను టార్గెట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ నాయకులు తమ స్వార్ధం కోసం అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారని, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. పూరిజగ్ననాద్ తన చిత్రంలో ఏ ప్రాంతం గురించి చెప్పలేదని, కావాలనే తెరాస నాయకులు పూరి ఆఫీస్ పై దాడి చేశారని అన్నారు. ఆఫీస్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి వదిలేస్తున్నారని, వారిని వదిలేయకుండా కటినంగా శిక్షించాలన్నారు. టీఆర్ఎస్ నాయకుల దాడులను కేసిఆర్ వెంటనే ఖండించాలని, లేదంటే తాము సహించబోమని అన్నారు.