ట్రిపుల్ సెంచరి పూర్తిచేసిన చంద్రబాబు
చంద్రబాబు మూడో సెంచరీ కొట్టారు. పాదయాత్రలో రెండో జిల్లాలో భాగంగా మూడు వందల కిలోమీటర్ల మైలురాయిని బుధవారం దాటేశాడు. అనంతపురం జిల్లా టీడీపీకి పట్టుగొమ్మ కాబట్టి మంచి స్పందన వచ్చిందన్నారు, కానీ కర్నూలులో కూడా బాబుకు మంచి స్పందనే వస్తోందని తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నాయి. ప్రస్తుతానికైతే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో “వస్తున్నా మీకోసం” పాదయాత్ర కొనసాగింది. 16వ రోజు చాలా సందడిగా గడిచింది. బాబు ఆటోవాలాలతో, మహిళలతో, డ్రైవర్లతో కూలీలతో ఎక్కువగా కలిసి మాట్లాడారు. పలు చోట్ల ఆటోలు ఎక్కారు. ఘనాపురం నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ యాత్రకు మంచి స్పందన లభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సీపీఎం కార్యకర్తలు, గంగపుత్రులు, కురుమ సంఘాలు బాబుకు స్వాగతం పలుకుతూ వచ్చే ఎన్నికల్లో తమకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని వినతులు సమర్పించాయి. ఆదోని సర్కిల్ చేరుకున్నాక ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ఈ పట్టణం తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. రెండేళ్ల కిందటి వరకు కలిసున్న నేతలు ఇప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ గా వేరుపడి దోచుకోవడానికి సిద్ధమయ్యాయని అన్నారు.