కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం
posted on Oct 12, 2012 @ 5:55PM
ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు ఓ మంచి ఉదాహరణ కాకినాడ బీచ్ తవ్వకాలు. కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో గుల్లచేస్తూ సముద్ర తీరానికి చేటుతెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ ట్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో సముద్రంలో ఏ ఉపద్రవం తలెత్తినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదని పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా ఇలాంటి పనులకు అడ్డుకట్టపడడంలేదు. గతంలో వచ్చిన సునామీ కాకినాడను ముంచెత్తకుండా ఉండడానికిగల ఏకైక కారణం హోప్ ఐలాండ్ మాత్రమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. గ్యాస్ తవ్వకాల పేరుతో జరుగుతున్న అరాచకాలవల్ల చేపలవేటకు వెళ్తున్న జాలర్లు ఉట్టి చేతుల్లో తిరిగొస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గలతోపాటు కాకినాడకు కూడా భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు గాల్లో కలిసిపోతున్నాయ్. ఇంత పెద్దఎత్తున పర్యావరణానికి నష్టం కలుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కోస్తావాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.