Top Stories

ఆంధ్రప్రదేశ్‌లో 66 ఏఎంసీలకు ఛైర్మన్లు ఖరారు

  వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది. వీటిలో 9 చోట్ల జనసేన, 4 చోట్ల బీజేపీ నేతలకు అవకాశం కల్పించారు. 66 ఛైర్మన్‌ పదవుల్లో 17 మంది బీసీలు, 10 ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.  మొత్తం 66 ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. ఇది వరకే కొన్ని ఏఎంసీలకు ఛైర్మన్లను ఖరారు చేయగా.. తాజాగా మరో 66 మందిని ప్రభుత్వం ప్రకటించింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రైతులకు వారి ఉత్పత్తులకు సరైన రేటులు అందేలా, మార్కెట్ వ్యవస్థను నియంత్రించేలా పనిచేస్తాయి. ఈ కమిటీలు రైతులకు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ నియామకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.  
ఆంధ్రప్రదేశ్‌లో 66 ఏఎంసీలకు ఛైర్మన్లు ఖరారు Publish Date: Jul 17, 2025 9:37PM

రాజా సింగ్ రాజీనామా గోషామహల్ ఉప ఎన్నిక అనుమానమే

  గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన  నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీకి రాజీనామా  చేసిన రాజా  సింగ్’ ఇంతవరకు  ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామ చేయలేదు. బీజీపీ అధ్యక్షుడికి రాసిన రాజీనామా లేఖను, అసెంబ్లీ స్పీకర్’కు పంపి, తనను అనర్హుడిగా ప్రకటించమని కోరాలని సూచన చేసారు. అయితే, రాజా సింగ్  ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. రాజీనామా చేయాలనుకుంటే రాజా సింగ్’  నేరుగా అసెంబ్లీ స్పీకర్’కే టం రాజీనాం లేఖను సంర్పించాలని, బీజేపీ అధికార ప్రతినిధులు స్పష్టం చేసారు. అలాగే, రాజసింగ్’ రాజీనామను తిరస్కరించి సందర్భంలోనూ బీజేపీ అధ్యక్షుడు, అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించలేదు. రాజా సింగ్ పార్టీ కోర్టులోకి కొట్టిన బండిని, బీజేపీ  తిరిగి  ఆయన కోర్టులోకి తిప్పికొట్టింది.  అయితే,పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి  రాజా సింగ్ చేసిన రాజీనామాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించి వారం రోజులు పైగానే అయింది, అయినా, రాజా సింగ్ ఇంత వరకు ఎమ్మెల్యే పదవికి సంబంధించి పెదవి విప్పలేదు. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు,పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసినా హిదుత్వ సిద్దాంతాన్ని వదలనని, వేరే పార్టీలో చేరనని  చెప్పారు. కార్యకర్తలకు ఉద్భోదలు చేసారు.,కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి మాత్రం ఇంత వరకు మాట్లాడ లేదు. రాజీనామా చేసే సంకేతాలు కూడా కనబడడం లేదు. మరోవంక  బీజేపీ కూడా వత్తిడి చేయడం లేదు. సో... రాజీనామా చేస్తారా ? స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగుతారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అదొకటి అలా ఉంటే, ఒక వేళ రాజా సింగ్’ స్పీకర్ ఫార్మేట్’లో రాజీనామా సమర్పించినా, స్పీకర్’ను స్వయంగా కలిసి రాజీనామా ఆమోదించమని కోరినా,స్పీకర్’ వెంటనే రాజీనామాను ఆమోదిస్తారా? అంటే, అది కూడా జరగక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే, బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయం ఎటూ తేలకుండా వుంది. స్పీకర్’ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, న్యాయ స్థానాలు సూచించినా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పడు రాజ్ సింగ్ రాజీనామాను తక్షణం ఆమోదిస్తే, స్పీకర్’, విమర్శలను ఎదుర్కోనవలసి వస్తుంది. అందుకే,  రాజా సింగ్ రాజీనామా చేసినా, స్పీకర్ ఆమోదించక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో గోషామహల్ నియోజక వర్గానికి, ఉప ఎన్నిక వచ్చే  అవకాశం ఇంచుమించుగా లేనట్లే అంటున్నారు. ఒక  విధంగా ఇది, రోగి కోరుకున్నది  వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్లుగా ఉందని  పరిశీలకులు పేర్కొంటున్నారు.  కారణాలు వేరైనా, ఎవ్వరూ కూడా ఉప ఎన్నికను కోరుకోవడం లేదు. అవును,అటు రాజా సింగ్ ఉప ఎన్నిక కోరుకోవడం లేదు, బీజేపీ పట్టుపట్టే పరిస్థితి లేదు.. అన్నిటికంటే ముఖ్యంగా అంతిమ తీర్పు ఇవ్వవలసిన స్పీకర్, తక్షణ నిర్ణయం తీసుకోక పోవచ్చని అంటున్నారు.అందుకే ..గోషామహల్ ఉప ఎన్నికపై ఆశలు పెట్టుకున్న మాధవీలత గోషామహల్ కాకపోతే జూబ్లీ హిల్స్’ అంటూ అటుగా చూస్తున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా అంటన్నారు.అయితే ఆమె ఏకపక్షంగా చేస్తున ప్రకటనల విషయంలో ఇప్పటికీ పార్టీలో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. నిజానికి, పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే ఆమెను, హెచ్చరించినట్లు చెపుతున్నారు.మాధవీ లత విష్యం ఎలా ఉన్నా, రాజా సింగ్ రాజీనామా, గోషామహల్ ‘  ఉప ఎన్నిక  రెండూ అనుమానమే, అంటున్నారు.
రాజా సింగ్ రాజీనామా గోషామహల్ ఉప ఎన్నిక  అనుమానమే Publish Date: Jul 17, 2025 9:21PM

ఢిల్లీలో సీఎం చిట్ ..పటలు

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోమారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్,  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్’గా విమర్శనా అస్త్రాలు సంధించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా, మాట్లాడారు. ఈ సందర్భంగా,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి రాష్ట్రప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని,ఆయన ఇచ్చిన స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనలసధనకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని అన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో, కేంద్ర మంత్రి   కిషన్రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే అదే సమయంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్’కు గట్టిగా చురకలు అంటించారు. ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన, కేటీఆర్’ ను ఉద్దేశించి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా? అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అలాగే, కేటీఆర్’ పై,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్’తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురకలు అంటించారు. అలాగే, దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోలాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని ఎద్దేవా చేసారు. అలాగే, కేసీఆర్ కుటుంబ కలహాల అంశాన్ని ముఖ్యమంత్రి వదిలి పెట్టలేదు. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అడుగుతున్నారని, కేటీఆర్‌ కోరికను కేసీఆర్‌ ఒప్పకోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సొంత వివాదాలతోనే కేసీఆర్‌ కుటుంబానికి సరిపోతోందని,కేటీఆర్‌ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ జరిగిన చర్చల విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రుల సమావేశంలో మూడు అంశాలు పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని వేశామని, కమిటీ పరిష్కరించలేని అంశాలపై ముఖ్య మంత్రుల స్థాయిలో మరో మారు చర్చిస్తామని చెప్పారు.  నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధించాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై తమకో వ్యూహం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో కేసీఆర్‌ పంచాయితీ రాజ్‌ చట్టంలో మార్పులు చేశారని, 50శాతం రిజర్వేషన్లు వద్దని చట్టంలో మార్పులు చేశారని, 2014 ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని తెలిపారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బీసీ-ఇ గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని, బీజేపీ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్‌రెడ్డి మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు.  
ఢిల్లీలో సీఎం చిట్ ..పటలు  Publish Date: Jul 17, 2025 9:12PM

కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితమే ఈ లవ్ లెటర్ : బండి సంజయ్

  బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుండి ఈ లవ్ లెటర్ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చింది. నాతో పాటు నా కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచుడు కేసీఆర్. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గ కుటుంబం కేసీఆర్ దే. సిట్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా. నాకు తెలిసిన, నా దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు అందజేస్తాని కేంద్ర మంత్రి తెలిపారు.
కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితమే ఈ లవ్ లెటర్ : బండి సంజయ్ Publish Date: Jul 17, 2025 8:56PM

క్లైమాక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ తోపాటు ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది.  ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఆయన వద్దకే వచ్చి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బండి సంజయ్ సూచన  మేరకు హైదరాబాద్ లోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గ్రుహంలో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారు. బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వీరంతా అదే రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెట్టిందే బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మొట్టమొదటగా గళం విన్పించిన నేత బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బండి సంజయ్ అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాలకులకు కొరకరాని కొయ్యలా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యలో బండి సంజయ్ ను కట్టడి చేయాలని భావించిన నాటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు ఒడిగట్టింది. తనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ ప్రభుత్వం తనతోపాటు తన కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ నీచానికి ఒడిగడుతోందని 2022లోనే బండి సంజయ్ సంచలన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతోపాటు నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా జడ్జీల, ప్రతిపక్ష పార్టీల నాయకుల, సినీ తారలతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ పలుమార్లు ఆరోపించారు.   ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం ద్వారానే టెన్త్ పేపర్ లీక్ అనే తప్పుడు కేసు బనాయించి అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి అరెస్ట్ చేశారని బండి సంజయ్ పేరొన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవోను సవరించాలంటూ చేపట్టిన దీక్ష జరగకుండా నిలువరించేందుకు పోలీసులు  శతవిధాలా ప్రయత్నించి చివరకు టియర్ గ్యాస్ ఆఫీసు గేటు బద్దలు కొట్టి, ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి బండి సంజయ్ ను, బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే సంభాషణలను కూడా ట్యాప్ చేసి అనేక మంది జీవితాల్లో చిచ్చు పెట్టిన దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్ అంటూ బండి సంజయ్ అనేక సభల్లో, మీడియా వేదికల ద్వారా ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపడుతున్న సిట్ పోలీస్ వర్గాలు నాడు బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రత్యర్థులతోపాటు జడ్జీల, సినీ తారల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని, చివరకు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ కు గురయ్యాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ను ఈనెల 24న సిట్ విచారించడంతోపాటు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు బండి సంజయ్ సైతం తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ ముందుంచాలని భావిస్తున్నారు.  
క్లైమాక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం Publish Date: Jul 17, 2025 8:39PM

హెచ్‌సీఏపై మనీలాండరింగ్ కేసు

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఐదుగురిపై కేసులు నమోదు చేసింది.  ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్  సెక్షన్ల కింద నమోదైంది. PMLA సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  బీసీసీఐ నుంచి వచ్చిన నిధులలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఎ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజ్ కు ఆయన సహకరించినట్టు శాఖాపరమైన విచారణలో వెల్లడయింది. దేవరాజ్ అరెస్ట్ కు కూడా సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. నకిలీ పత్రాల ద్వారానే హెచ్‌సీఏలో ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు విచారణలో తేలింది. 
 హెచ్‌సీఏపై మనీలాండరింగ్ కేసు Publish Date: Jul 17, 2025 7:54PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. పలు ప్రాంతాల‌లో ట్రాఫిక్ జామ్

  హైదరాబాద్‌లో పలు  ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిలింనగర్, శేరిలింగంపల్లి, చందానగర్ మియాపూర్,  ఈసీఐఎల్‌, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, బొల్లారం, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట, అల్వాల్‌ ప్రాంతాల్లో వర్షం పడింది.  పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి వచ్చే ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా.. పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా, వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.   
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. పలు ప్రాంతాల‌లో ట్రాఫిక్ జామ్ Publish Date: Jul 17, 2025 7:09PM

టీడీపీకి ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యత..రెండో గవర్నర్ పదవిపై హామీ

  ఢిల్లీలో ఏపీ కేంద్రంగా  కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా  కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు.  ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సందర్భంగా జరిగిన చర్చల్లో టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో టీడీపీ మరో సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అధినాయకత్వం ఎన్డీఏ బలోపేతంలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత పెంచుతోంది. ఉత్తరాదిన బీజేపీ ఆధిపత్యానికి గండి పడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్న కమలనాథులు ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో పడ్డారంట. త్వరలో బీహార్ .. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాషాయ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీకి కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవిపైన హామీ దక్కింది కాని అమలు కాలేదు. ఈ సారి తొలి ఏడాది పూర్తవుతూనే అశోక్ గజపతికి గవర్నర్ పదవి కట్టబెట్టారు. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి మరింత  ప్రాధాన్యత కల్పించాలని మరో గవర్నర్ పదవిపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కితే చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. అశోక్ గజపతి రాజు కు అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. ఆయన పార్టీ ఆవి ర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటు వివాద రహితుడు. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, బీసీ - ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు సైతం ఈ రేసులో ప్రము ఖంగా  వినిపిస్తున్నా ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారంటున్నారు. యనమల సైతం రాజ్యసభకు వెల్లడానికి మొగ్గు చూపుతున్నారంట.  ఆ క్రమంలో రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినా ఆయన వయోభారం, ఆరోగ్య పరిస్థితి ప్రతికూలంగా మారాయంటున్నారు. ప్రస్తుతం కేఈ కుమారుడు పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్ పదవి దక్కించుకునే టీడీపీ సీనియర్ ఎవరన్నదానిపై పార్టీలో విస్తృత చర్చ మొదలైంది. j
టీడీపీకి ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యత..రెండో గవర్నర్ పదవిపై హామీ Publish Date: Jul 17, 2025 6:29PM

జూబ్లీహిల్స్ నుంచి..నిర్మాత దిల్ రాజు పోటీ?

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ‌రిలో నిర్మాత‌ దిల్ రాజు దిగుతారా? అంటే అవున‌నే తేలుస్తోంది. ఆల్రెడీ ఆయ‌న ఎఫ్ డీ సీ చైర్మ‌న్ గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ అడుగు పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది బేసిగ్గా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. మాములుగా అయితే సెంటిమెంటు కొద్దీ మాగంటి గోపీనాథ్ భార్య‌కు ఇక్క‌డి నుంచి టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మ‌రో కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్ కాకుండా.. ర‌క‌ర‌కాల ప‌థ‌క ర‌చ‌న‌లు చేస్తోంది. ఒక స‌మ‌యంలో  కేటీఆర్ స‌తీమ‌ణి శైలిమ పేరు కూడా తెర‌పైకి వ‌చ్చింది. అంత‌కు ముందు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, రావుల శ్రీధ‌ర్ రెడ్డి పేర్లు కూడా వెలుగులోకి వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి గ‌త  ఎన్నిక‌ల్లో అజ‌రుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు.  త‌న‌కు ఛాన్స్ ఇస్తే మ‌ళ్లీ ప్రూవ్ చేసి చూపిస్తా అంటున్నారు. అయితే, ఆయ‌న ఆశ‌లు ఆశ‌యాలు ఏమంత వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్టు లేవు. దీంతో ఆయ‌న హెచ్ సీ ఏ మీద ప‌డ్డారు. త‌న‌కు హెచ్ సీ ఏ ఛాన్స్ ఇస్తే మంచిగా న‌డిపిస్తానంటున్నారు.కాంగ్రెస్ ఎలాగైనా స‌రే ఈ సీట్ ని గెలిచి తీరాల్సిందేన‌న్న గ‌ట్టి  నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ్ త‌న వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. ఈ సీటు త‌ప్ప‌క గెల‌వ‌డానికి ఖ‌మ్మం నుంచి ఒక తెలుగు బాగా మాట్లాడే మైనార్టీనైనా స‌రే ర‌ప్పించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఇక జూబ్లీహిల్స్ బేస్ చేసుకుని.. ఎన్డీఏ కూట‌మి ఇక్క‌డ త‌మ కొత్త అధ్యాయం మొద‌లు పెట్టాల‌ని ట్రై చేస్తోంది. ఇది వ‌ర‌కూ బీజేపీ ఎంపీ మాజీ ఏపీ చీప్ పురంధేశ్వ‌రి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ఫ‌లితం ఒక కొత్త రాజ‌కీయ‌ ప్రేర‌ణగా అభివ‌ర్ణించారు. దీంతో ఇక్క‌డ కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నుంచి ఎవ‌రైనా బ‌రిలోకి దిగే ఛాన్సుంది.  కూట‌మికి ఇక్క‌డున్న అవ‌కాశాలేంట‌ని చూస్తే.. ఈ ప్రాంతం దాదాపు క‌మ్మ‌వారి కంచుకోట‌. తొలి నుంచీ ఇది టీడీపీ సీటే.  గోపీనాథ్ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్లిన వారే కాబ‌ట్టి.. ఆయ‌న కూడా ఇదే సామాజిక వ‌ర్గం నుంచి వ‌చ్చిన వారు కాబ‌ట్టి.. ఆయ‌న‌లా వ‌రుస‌గా మూడు సార్లు గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు.  ఇప్పుడు దిల్ రాజు విష‌యానికి వ‌స్తే.. ఇదెలాగూ సినీ ప్ర‌ముఖులు అధికంగా నివ‌సించే ప్రాంతం.. క‌మ్మ- కాపు- రెడ్డి అంద‌రు హీరోల‌తో సినిమాలు తీసే నిర్మాత. ఆ ఇన్ ఫ్లూయెన్స్ ని వ‌ర్క‌వుట్ చేస్తూ.. ఇక్క‌డ పాగా వేయాల‌ని దిల్ రాజు చూస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి చూడాలి ఈ ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం ఏ మ‌లుపు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
జూబ్లీహిల్స్ నుంచి..నిర్మాత దిల్ రాజు పోటీ? Publish Date: Jul 17, 2025 6:14PM

రాహుల్ గాంధీ బావపై ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ

  వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ  ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. వాద్రాకు చెందిన కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించింది. ఈ ఒప్పందంపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి 2018లో రాబర్ట్ వాద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాద్రాతో పాటు నాటి హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హుడా, రియాల్టీ సంస్థ డీఎల్ఎఫ్, ఓ ప్రాపర్టీ డీలర్ పేరును ఇందులో ప్రస్తావించారు. ఇందులో అవినీతి, ఫోర్జరీ చీటింగ్ తదితర నేరాలు నమోదయ్యాయి. మరోవైపు రాబర్ట్ వాద్రా మాట్లాడుతు రాజకీయ కుటుంబంలో కావడంతో ఈ ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ బావపై ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ Publish Date: Jul 17, 2025 5:28PM

రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి చాలు : సీఎం చంద్రబాబు

  నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీనీవా కాలువలకు నీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతు నందికొట్కూరులో ఉండే హంద్రీ-చిత్తూరులోని నీవాని కలపాలి అనుకున్నాప్పుడు అసాధ్యం అన్నారు. ఆ కల కనింది నందమూరి తారక రామారావు అయితే దాన్ని మేము సాకారం చేశామని చంద్రబాబు తెలిపారు.  రాయలసీమ నీరిచ్చానన్న తృప్తి  నాకు చాలు. హంద్రీనీవాతో 6లక్షల ఎకారాలకు నీరు అందుతుంది. సీమ చరిత్రను మార్చాలని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆరే అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఫేక్ పార్టీ అని ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లు కూడా సీమ కోసం జగన్ ఖర్చు చేయలేదని ఆయన తెలిపారు.   వైసీపీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఆపార్టీకి లేదు అని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పని చేసిన వ్యక్తి రౌడిషీటర్లు, గంజాయి బ్యాచ్‌ను పరామర్శించేందుకు వెళ్తారా? ఇలాంటి వారు రాజకీయల్లో ఉండాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అన్నదాత కష్టపడి పండించిన మామిడి కాయలను రోడ్లపై తొక్కించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. రౌడీలు తోక జాడిస్తే కట్ చేస్తాం మీరు ఏం చేసిన నిఘా ఉంచుతాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్‌ తొలిసారి ఆలోచించారు.  హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్‌, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది.  గత వైసీపీ ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చాం. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత మాదే. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారు. మేం వచ్చాక మళ్లీ అధికారంలోకి వచ్చాక 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించాం’’ అని చంద్రబాబు అన్నారు.
రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి చాలు : సీఎం చంద్రబాబు Publish Date: Jul 17, 2025 4:32PM

రాజా సింగ్ ఏక్ అకేలా!

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కరుడుగట్టిన హిదుత్వ వాది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఇమేజ్ తోనే ఆయన వరసగా మూడు సార్లు  బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యే అయినా..  ఎందుకో  ఆయన కమలం పార్టీలో ఇమడ లేక పోయారు. నిజానికి.. రాజాసింగ్  కమల దళంతో కలిసి నడిచిన  పుష్కర కాల ప్రస్థానంలో అనేక మార్లు పార్టీతో, పార్టీ విధానాలతో, పార్టీ నాయకత్వంతో విభేదించారు. పార్టీ నుంచి ఒకటి రెండు సార్లు సార్లు   సస్పెండ్ కూడా అయ్యారు. అయినా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవతో పార్టీ కేంద్ర నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసి  గోషామహల్ టికెట్ మళ్ళీ ఆయనకే ఇచ్చింది. రాజా సింగ్ మళ్ళీ గెలిచారు. హ్యాట్రిక్ సాధించారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. కథ మొదటికి వచ్చింది. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా..  తనకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించి, పార్టీకి రాజీనామా చేశారు. మీకో దండం.. పార్టీకో దండం అంటూ రాజీనామా లేఖ అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చేశారు. ఆయన ఆ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించడం, ఆయన ఆమోదించేయడం చకచకా జరిగిపోయాయి.  ఒక విధంగా ఇది రాజా సింగ్  ఉహించని పరిణామం. నిజానికి జాతీయ స్థాయిలోనూ హిందుత్వ వాదిగా మంచి గుర్తింపు ఉన్న రాజా సింగ్  విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇంత వేగంగా ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటుందని రాజే సింగ్’ మాత్రమే కాదు.. ఎవరూ ఉహించలేదు.కానీ..  బీజేపీ జాతీయ నాయకత్వం కనీసం వివరణ అయినా అడగకుండానే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది. దీంతో..  బీజేపీలో రాజాసింగ్ ప్రస్థానం ముగిసింది. ఈ నేపథ్యంలో..  రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏమిటి?  ఆయన  ఎటు అడుగులు వేస్తారు? ఏమి చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి.. రాజా సింగ్  పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ బాట తప్పననీ, కాంగ్రెస్,బీఆర్ఎస్ వంటి సెక్యులర్  పార్టీలలో చేరననీ ప్రకటించారు. అంతే కాకుండా.. రాజా సింగ్  తనకు పార్టీ జాతీయ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవనీ,  ఇప్పటికీ ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వాన్ని సమర్దిస్తానని చెపుతున్నారు. సో.. రాజ సింగ్  రాజకీయ భవిష్యత్  ప్రస్తుతానికి  ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఒక విధంగా అటూ ఇటూ కాకుండా గాలిలో తేలుతోంది  అనుకోవచ్చు.    అదలా  ఉంటే.. పార్టీకి రాజీనామా చేసిన  రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా?  లేక ఏ పార్టీకి చెందని సభ్యునిగా కొనసాగుతారా? అనేది చూడవలసి వుంది. నిజానికి  పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలోనే రాజా సింగ్  తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కి పంపి తన సభ్యత్వాన్ని రద్దుచేయమని కోరాలని పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. అయితే.. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ..  రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కానీ ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ కు ఎలాంటి లేఖా రాయలేదని సమాచారం. అంతే కాకుండా.. ప్రస్తుతానికి పార్టీకి అలాంటి ఆలోచన కూడా లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి రాజా సింగే నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకులు అంటున్నారు. సో ... ప్రస్తుతం అమర్ నాథ్ యాత్రలో ఉన్న రాజా సింగ్ తిరిగి వచ్చిన తర్వాత కానీ తదుపరి ఘట్టం మొదలు కాదని అంటున్నారు. రాజా సింగ్  తనంతట తానుగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సమర్పిస్తే మాత్రం మరో ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. అదలా ఉంటే  బీజేపీ రాజా సింగ్ రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి, నియోజక వర్గంలో పట్టును నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. కాగా, ఇటీవల పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్ర రావు అభినందన సభ పేరిట నిర్వహించిన  కార్యకర్తల సమావేశంలో చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు  రాజా సింగ్ పట్ల అభిమానం వ్యక్త పరుస్తూనే..  పార్టీ ఫస్ట్ అంటున్నారు. అలాగే..  రాజాసింగ్ ను పార్టీ దూరం చేసుకోలేదు.. ఆయనే పార్టీని దూరం చేసుకున్నారంటున్నారు.  అంతే కాదు..  ఉప ఎన్నిక అంటూ వస్తే  బీజేపీ విజయం సాధిస్తుందని  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. గోషామహల్  మొదటి నుంచి బీజేపీకి మంచి పట్టున్న నియోజక వర్గం. రాజ్ సింగ్  కంటే ముందు రామ స్వామి, ప్రేమ సింగ్ రాథోడ్ ఇదే నియోజక వర్గం నుంచి గెలిచారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. రాజా సింగ్’ పార్టీకి రాజీనామా చేసినా  మా వాడే ,హిందుత్వం కోసం, బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తారు అంటున్నారు. బీజేపీ నాయకుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.  గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన కళ్యాణ్ సింగ్, ఉమా భారతి, యడ్యూరప్ప, మన రాష్ట్రంలో  టైగర్ నరేంద్ర వంటి పార్టీని వదిలి వెళ్ళిన  మహా మహా  నాయకులే..  తప్పు తెలుసుకుని తిరిగి సొంత గూటికి  చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదొకటి అయితే, ఒకప్పుడు..అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా ఉన్న రాజాసింగ్ ..ఇప్పడు నియోజక వర్గంలో ఏక్  అకేలా.. అయ్యారని అంటున్నారు.
రాజా సింగ్  ఏక్ అకేలా! Publish Date: Jul 17, 2025 4:32PM

అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. నిరవధికంగా వాయిదా పడిన యాత్ర

అమర్‌నాథ్ యాత్ర భారీ వర్షాల కారణంగా రద్దైంది. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై క్లారిటీ రాలేదు . యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతుండటంతో అమర్‌నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి ఓ నిండు ప్రాణం బలైంది. కొండచరియలు విరిగిన ఘటనలో ఓ భక్తురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భారీ వర్షాల కారణంగా గందర్ బాల్ జిల్లా, బల్తల్ ఏరియాలోని అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే దార్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బల్తల్ దారిలో కొండపైకి వెళుతున్న కొంతమంది భక్తులు బురదలో కొట్టుకుపోయారు. ఓ మహిళ చనిపోయింది. మరికొంతమంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కొండపై చిక్కుకుపోయిన వారిని అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి తరలించాయి. ఇక, భారీ వర్షం కారణంగా అమర్‌నాథ్ యాత్ర సైతం రద్దయింది. యాత్ర పున:ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ లేదు. వర్షం కారణంగా యాత్ర సాగే రెండు దారులు బాగా పాడయ్యాయి. దీంతో ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. యాత్ర సాగే రెండు దార్లను బాగుచేస్తోంది.  వర్షం కారణంగా పెద్ద మొత్తంలో బురద మట్టి కిందకు జారుతోంది. దీంతో భక్తులు మొత్తం కొండ చివర్లలో ఉన్న రెయిలింగ్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇద్దరు జారిపోయి బురదలో పడ్డారు. కిందకు అలాగే కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన ఇద్దరిలో మహిళ చనిపోగా.. పురుషుడ్ని రెస్క్యూ టీమ్ రక్షించినట్లు తెలుస్తోంది.
 అమర్‌నాథ్ యాత్రలో విషాదం.. నిరవధికంగా వాయిదా పడిన యాత్ర Publish Date: Jul 17, 2025 3:59PM

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఇండియా పైలెట్ల ఫైర్

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంలో 275 మంది మృతి చెందిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) కొద్దిరోజుల క్రితం విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అందులో విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవటమే ప్రమాదానికి కారణమని తేల్చింది. ఏఏఐబీ ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో విమానం ముందుకు వెళ్లలేకపోయింది. విమానాశ్రయానికి కొద్ది దూరంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలిపోయింది. పైలట్, ఫస్ట్ ఆఫీసర్‌తో సహా 241 మంది చనిపోయారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా 34 మంది చనిపోయారు. 275 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాసింది. తాజాగా.. విమానం కుప్పకూలడానికి ముందు పైలట్ల మధ్య జరిగిన సంభాషణనను బయటపెట్టింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. బోయిగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని నడుపుతున్న ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్.. ‘మీరెందుకు ఫ్యూయల్ స్విచ్‌లు ఆపేశారు’ అని క్యాప్టెన్ సుమీత్ సబర్వాల్‌ను అడిగాడు. ప్రమాదం జరగబోతోందని తెలిసి కుందర్ ఎంతో భయపడ్డాడు. అయితే, క్యాప్టెన్ సుమీత్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ ప్రెసిడెంట్ సీఎస్ రంద్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ సరైన ఆధారాలు లేకుండా కథనం రాసిందంటూ మండిపడ్డారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌పై న్యాయ పరమైన చర్యలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. గురువారం (జులై 17)ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైలట్లు ఫ్యూయల్ స్విచ్‌లు ఆపేశారని ఏఐఐబీ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని... ఫైనల్ రిపోర్టు వచ్చే వరకు ప్రజలు తుది నిర్ణయానికి రావద్దని అభ్యర్ధించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఇండియా పైలెట్ల ఫైర్ Publish Date: Jul 17, 2025 3:46PM

హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

  హంద్రీనీవా కాలువలకు నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరును అందుబాటులోకి వచ్చింది జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్మనను ముఖ్యమంత్రి తిలకించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ-నీవా కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. తొలుత మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు.  శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించారు. మల్యాల పంప్ స్టేషన్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. హంద్రీ-నీవా ఫేజ్-1 విస్తరణ పనులు, కాల్వల ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరీ, అధికారులు పాల్గోన్నారు.   
హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు Publish Date: Jul 17, 2025 3:35PM

హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట

తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ముఖ్యమంత్రిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో 2016 లో సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు కొండల్ రెడ్డి, లక్షయ్యలపై గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలని 2020లో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన కోర్టు..  తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్‌రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని న్యాయస్థానం తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.
హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ ఊరట Publish Date: Jul 17, 2025 3:06PM

కన్నడ నటికి ఏడాది జైలు శిక్ష

  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు  బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే  హక్కును నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదు. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్‌జైన్‌లు సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది.  కాగా, బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌ఫోర్ట్‌లో దుబాయ్ నుంచి 14.3 కిలోల బంగారం (రూ. 12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. నటి రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్‌‌లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బెంగ‌ళూరు కోర్టు వెల్ల‌డించిన తీర్పు ప్ర‌కారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి విచార‌ణ‌లు జ‌రుగుతాయ‌ని కోర్టు పేర్కొంది. ఇలా ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది.   
కన్నడ నటికి ఏడాది జైలు శిక్ష Publish Date: Jul 17, 2025 2:40PM

మీ పర్యటనలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి?

జగన్ పై పోలీసుల ఆగ్రహం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో గురువారం (జులై 17)  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. డీజీపీ స్థాయి అధికారులను మాఫియాడాన్ లతో పోల్చడం దారుణమన్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే పోలీసులు పని చేసిన విషయాన్ని ఆయన మరిచిపోయారా అని నిలదీశారు.  ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు పూర్తిగా అవాస్తవమన్నారు.   పోలీసుల్ని బెదిరించ‌డం సరికాదనీ, పోలీసులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తారన్న శ్రీనివాసరావు. పోలీసుల తీరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలే గానీ ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం సమజసం కాదన్నారు. జగన్ పర్యటనలలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయని, దీని వెనుక ఉన్న కారణమేంటో జగనే జప్పాలన్నారు. పోలీసులు, పోలీసు వ్యవస్థ ఏ రాజకీయపార్టీకీ తొత్తుగా వ్యవహరించదన్న శ్రీనివాసరావు.. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 
 మీ పర్యటనలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? Publish Date: Jul 17, 2025 2:30PM

అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరి మృతి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ లో ఓ వ్యక్తి మరణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు స్నేహితులను, మరణానికి కారణమైన మరో నలుగురు నిందితులను పోలీసులు  అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి నిందితులను  ముందు హాజరు పరిచారు. ఆయన కథనం ప్రకారం ఈనెల 12  రాత్రి సుమారు 10 గంటలకు గండికోట సాంబయ్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి గోపాల్ పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వైపు పావురాల వేటకు వేళ్లారు. అప్పటికే అక్కడ అడవి పందుల కోసం గ్రామానికి చెందిన చందర్ రావు ప్రోద్బలంతో మరో ముగ్గురు వ్యక్తులు అమర్చిన విద్యుత్ వైర్ కాలికి తగిలి సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో భయంతో మృతుడు సాంబయ్య   స్నేహితులిద్దరూ అక్కడినుండి పారిపోయారు. అక్కడ విద్యుత్ వైర్లు అమర్చిన నిందితులు నేరం తమపై రాకుండా ఉంటుందని సాంబయ్య మృతదేహాన్ని పక్కనే   ఉన్న మరొక వ్యక్తి బావిలో పడేశారు.  మృతుడు సాంబయ్య స్నేహితులు విషయాన్ని మరుసటి రోజు ఉదయం   గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కు తెలియజేశారు. వా వారి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ సాంబయ్య మృత దేహం కనిపించలేదు. గాలించగా పక్కనే ఓ వ్యవసాయ బావిలో సాంబయ్య మృతదేహం కనిపించింది.  దీంతో అడవి పందుల కోసం విద్యుత్ వైర్లు అమర్చిన నలుగురు నిందితులతో పాటు మృతుడు సాంబయ్య ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుకున్నారు. 
అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరి మృతి Publish Date: Jul 17, 2025 2:10PM

వల్లభనేని వంశీ బ్యాడ్ టైమ్.. సుప్రీంలో చుక్కెదురు

పలు కేసుల్లో జైలు పాలై నానా కష్టాలు పడి బెయిల్‌పై బయటకు వచ్చిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. తాజాగా వంశీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వంశీకి ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం అనుమతిచ్చింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి,  పీటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
వల్లభనేని వంశీ బ్యాడ్ టైమ్.. సుప్రీంలో చుక్కెదురు Publish Date: Jul 17, 2025 12:14PM

అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (జులై 16) మధ్యాహ్నం 12:37 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భూకంపం వల్ల అలస్కా ప్రాంతంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలస్కాకు 20 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.  అలస్కా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాగా, తరచుగా భూకంపాలు వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ అలస్కా రాష్ట్రం ఉంది. ఇక్కడ తరచుగా భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అయితే భారీ భూకంపం మాత్రం 1964లో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతో భూకంపం సంభవించింది ఆ విపత్తులో ఏకంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు Publish Date: Jul 17, 2025 11:57AM

బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందే అంటున్న కవిత

ఎప్పటికైనా ఇంటి పార్టీ తన దారిలోకి రావాల్సిందేనని.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు. అలాగే తనపై మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను‌‌ సమర్ధించి  కవిత.. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు.. అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని పేర్కొన్నారు. ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ ను తాను సమర్ధించానని కవిత చెప్పారు.  తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెం ట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాజాగా గురువారం ( జెలై 17) హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
బీఆర్ఎస్ తన దారికి రావాల్సిందే అంటున్న కవిత Publish Date: Jul 17, 2025 11:47AM

భ‌ళా శిష్యా భ‌ళా.. అంతా నీ చ‌ల‌వే గురువా!

((ఫోటో చెప్పిన క‌థ‌) స‌మ‌ర్ధుడి చెమ‌ట బిందువు కూడా పిల్ల‌ల్ని పుట్టించ‌గ‌లిగే సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుంద‌ని అంటారు పెద్ద‌లు. అలాంటి స‌మ‌ర్ధుడిగా చంద్ర‌బాబు నాయుడ్ని అభివ‌ర్ణించ‌కుండా ఉండ‌లేమంటారు కొంద‌రు. ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనాల‌నిపిస్తోందనీ చెబుతారు. అప్ప‌ట్లో బాబు  తీసుకున్న ఒకానొక   నిర్ణ‌యం త‌ర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదినా.. త‌ర్వాత రాష్ట్రం రెండుగా చీలినా.. ఆయ‌న‌కేం ఫ‌ర‌క్ ప‌డ‌లేదు. ఆయ‌న న‌వ్యాంధ్ర‌కూ తొలి ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను త‌యారు చేసిన పేరు కూడా సాధించ‌గ‌లిగారు. మొద‌ట త‌న మంత్రి మండ‌లిలోకి కొత్త‌గా పీజేఆర్ పై గెలిచిన విజ‌య‌రామారావుకి మంత్రి ప‌ద‌వి ఇద్దామని భావించిన ఆయ‌న అదే సామాజిక వ‌ర్గానికి సంబంధించిన కేసీఆర్ ని ప‌క్క‌న పెట్టారు చంద్ర‌బాబు. దీంతో అలిగిన కేసీఆర్.. త‌ర్వాతి కాలంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కెళ్లి కొత్త పార్టీ  పెట్టి ఆపై తెలంగాణ ఏర్పాటుకు కార‌ణం కావ‌డం మాత్ర‌మే కాదు.. సీఎం కూడా అయ్యారు. ప‌దేళ్లు కొత్త రాష్ట్రాన్ని పాలించారు. దాంతో మ‌రో దారి లేక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ ఎంపీ కావ‌డం, ఆపై టీపీసీసీ చీఫ్ కావ‌డం.. త‌ర్వాతి కాలంలో తెలంగాణకు  సీఎం కాగ‌లిగారు.   ఇప్పుడు చూస్తే త‌న గురువుతో స‌మానంగా తాను కూడా ఒక ముఖ్య‌మంత్రిగా స‌త్స మాన‌మైన హోదాలో ఆయ‌న్ను క‌లిసి అభివాదం చేశారు. చంద్ర‌బాబు కూడా త‌న శిష్యుడ్ని అభినందించారు. ఎన్నో ర‌కాల బ‌హుమ‌తులిచ్చారు. ఇది క‌దా అస‌లు రాజ‌కీయ‌మంటే.. ఒక నాయ‌కుడంటే కేసీఆర్ ప‌రిభాష‌లో చెబితే.. తాను మాత్ర‌మే నాయ‌కుడిగా ఉండి.. ఇత‌రుల‌ను ప‌నికిమాలిన చ‌వ‌ట- ద‌ద్ద‌మ్మ- స‌న్నాసుల‌ను చేయ‌డం కాదు. త‌నతో స‌మాన‌మైన నాయ‌క‌త్వాన్ని పుణికిపుచ్చుకోవ‌డం. అదే బాబు చేసి చూపించార‌ని అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
భ‌ళా శిష్యా భ‌ళా.. అంతా నీ చ‌ల‌వే  గురువా! Publish Date: Jul 17, 2025 11:37AM

బనకచర్లపై జగన్ విషం!

వైసీపీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత ప్రాంతమైన రాయలసీమపై విషం చిమ్ముతున్నారు. సీమ సాగు, తాగు నీటి కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గోదావరిపై నిర్మింత తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఇసుమంతైనా మేలు, ప్రయోజనం కలగకూడదన్న ఆయన ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించేందుకు తాను ఇసుమంతైనా వెనుకాడనని బనకచర్లపై చేసిన వ్యాఖ్యల ద్వారా జగన్ మరో సారి రుజువు చేశారు.  సరిగ్గా హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్  అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలో  జగన్ తన కపటత్వాన్ని బయటపెట్టుకుంటూ బనకచర్లకు వ్యతిరేకంగా విష వ్యాఖ్యలు చేశారు. బుధవారం జులై (16) జాతీయ మీడియాతో  మాట్లాడిన జగన్  బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టు కాదన్నారు. మిగులు జలాలు లేకుండా లింక్ ప్రాజెక్టును నిర్మించడం తగదని చెప్పారు. తెలంగాణ వాదనను బలపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీమ ప్రయోజనాలకు పోలవరం - బనకచర్ల అవసరమని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. జగన్ సీమ ప్రయోజనాలు కాదు.. తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బనకచర్చకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా మరో సారి రుజువు చేసుకున్నారు.  గతంలో  కూడా హంద్రీ - నీవాను నిర్లక్ష్యం చేసి జగన్ సీమకు తీరని అన్యాయం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. జగన కు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, సీమ అభివృద్ధి ముఖ్యం కాదని తేలిపోయిందని అంటున్నారు.   ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కడం కూడా అందుకేనని అంటున్నారు.   మిగుల జలాలే లేనప్పుడు బనకచర్ల నిర్మాణం వృధా అని ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేయడమే అవుతుందన్న జగన్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
బనకచర్లపై జగన్ విషం! Publish Date: Jul 17, 2025 11:12AM

కాళేశ్వ‌రం కాద‌ది కాసులు రాల్చేశ్వ‌రం!

కాళేశ్వ‌రం కాదు అది కూలేశ్వ‌రం అంటారు సీఎం  రేవంత్. కానీ ఇక్క‌డ సీన్ చూస్తే అది కొంద‌రు ఉన్న‌తాధికారుల పాలిట కాసుల క‌ల్ప‌వృక్షం అన్న‌ది తెలుస్తోంది. మొన్న హ‌రిరాం అనే ఈఎన్సీ ప‌ట్టుబ‌డితే అత‌డి అక్ర‌మాస్తుల విలువ వంద కోట్లు. అదే ఓపెన్ మార్కెట్లో రెండు వంద‌ల యాభై కోట్లు. త‌ర్వాత నూనె శ్రీధ‌ర్ అనే మ‌రో ఈఈ ప‌ట్టుబ‌డితే ఇత‌డి ఆస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు ఏసీబీ అధికారులు. అయితే దీని మార్కెట్ వాల్యూ 450 కోట్ల వ‌ర‌కూ ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రావు అనే ఈ పెద్ద‌మ‌నిషి అక్ర‌మాస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు. దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 450 నుంచి ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుందని స‌మాచారం. ఈ ముగ్గురి అక్ర‌మాస్తుల విలువే వెయ్యికోట్ల పై మాట‌. ఈ ముగ్గురి అక్ర‌మార్జ‌న క‌థ ఒక్కొక్కొరిదీ ఒక్కో ప్ర‌త్యేక అవినీతి అధ్యాయంగా చెబుతారు. శ్రీధ‌ర్ త‌న అక్ర‌మార్జ‌న ద్వారా వ‌చ్చిన డ‌బ్బు ఏం చేయాలో అర్ధం కాక కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్ లో చేశార‌ట‌. ఇక ముర‌ళీధ‌ర్ రావు త‌న కొడుకును ఒక కంపెనీలో బ‌ల‌వంతానా డైరెక్ట‌ర్ గా చేసి.. ఈ కంపెనీకి కాళేశ్వ‌రం స‌బ్ కాంట్రాక్టులు వ‌చ్చేలా చేసి.. త‌ద్వారా త‌న అవినీతి సొమ్ము ఏరులై పారించార‌ట‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ప‌ద‌వీకాలం పూర్త‌యిన ఈ ఈఎన్సీని అదే ప‌నిగా.. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ముర‌ళీధ‌ర‌రావు అనే ఈ ఈఎన్సీ అవినీతి స‌ర‌ళి ఎలా సాగిందంటే.. ప్ర‌తి సంత‌కానికి విలువ క‌ట్ట‌డం. బిల్లులు ఆపేస్తానంటూ  బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై త‌న బంధు మిత్రుల‌కు స‌బ్ కాంట్రాక్టులు ఇప్పించ‌డం.. ఇదీ ఈయ‌న‌గారి నిర్వాకం. దీంతో కుప్ప‌లు తెప్ప‌లుగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన  ఘ‌న‌త ఈయ‌న సొంతంగా చెబుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. పై స్థాయి అధికారులే ఒక్క కాళేశ్వ‌రం పేరు చెప్పి వెయ్యి కోట్ల పైగా కూడేస్తే.. కింది స్థాయి అధికారుల మాటేంటి? ఆపై ఈ మొత్తం ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న చేసిన ఆ పై స్థాయి వారి మాటేంటి? అన్న‌దిప్పుడు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేద‌ట‌.  ఈ ప్రాజుక్టును 80 వేల 500 కోట్ల‌తో మొద‌లు పెట్ట‌గా.. దాని అంచ‌నా వ్య‌యాల‌ను అంచ‌లంచ‌లుగా పెంచీ పెంచీ ల‌క్షా ముప్పై వేల కోట్ల‌కు చేర్చార‌ట‌. ఒక్క మేడిగ‌డ్డ ప్రాజెక్టునే వంద సార్ల‌కు పైగా.. రివైజ్ అంచ‌నాల‌ను పెంచి ప్రాజెక్టు కాస్ట్ పైపైకి ఎగ‌బాకేలా చేశార‌ట‌. దీన్నిబ‌ట్టీ ఈ ప్రాజెక్టు కూలేశ్వ‌ర‌మా.. లేక కాసులు రాల్చేశ్వ‌ర‌మా? అర్ధం చేసుకోవాలంటారు ఇరిగేష‌న్ నిపుణులు.
కాళేశ్వ‌రం  కాద‌ది కాసులు రాల్చేశ్వ‌రం! Publish Date: Jul 17, 2025 10:31AM

తిరుపతిలో చిరుత కలకలం!

తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అలిపిరి జూపార్క్ రోడుపై  బుధవారం (జులై 16)చిరుత పులి కనిపించింది. అలిపిరి జూపార్క్ రోడ్డుపై  అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో డివైడర్ పక్కన సేద తీరుతున్న చిరుతపులిని చూసిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యింది. తిరపతి ప్రజలు చిరుత సంచారంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా  ఎస్వీ యూనివర్సిటీ, జూపార్క్ రోడులలో చిరుత కదలికలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.  చిరుతను బంధించేందుకు ఎస్వీ వర్సిటీ ప్రాంగణంలో బోను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జూపార్క్ రోడ్డులో చిరుత కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  
తిరుపతిలో చిరుత కలకలం! Publish Date: Jul 17, 2025 10:08AM

ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్లపై చర్చ.. బాబు పంతం నెగ్గినట్లేగా?

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.   ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌తో ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలపై కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ చ‌ర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే తెలంగాణ మాత్రం గోదావ‌రి బోర్డు స‌హా.. నీటి కేటాయింపులు.. త‌మ రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించే ప్రాజెక్టుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బ‌న‌క‌చర్ల అంశంపై చ‌ర్చించేది లేద‌ని తేల్చేసింది. అయితే.. ఏపీ సీఎం పట్టుబట్టడంతో   బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.  రెండు మూడు నిమిషాల పాటు  మాత్ర‌మే బనకచర్ల విషయం ప్రస్తావనకు వచ్చినా చంద్రబాబుదే పై చేయి అయ్యిందని చెప్పక తప్పదు. ఇక బనకచర్లపై తెలంగాణ సీఎం తన అభ్యంతరాలు తెలియజేశారనుకోండి అది వేరే విషయం. అస‌లు గోదావ‌రిలో మిగులు జ‌లాలు.. రెండు రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని.. అలాంట‌ప్పుడు ఏక‌ప‌క్షంగా ఏపీ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవ‌డం ఎందుకని తెలంగాణ ప్ర‌శ్నించింది. ఇది క‌డితే.. త‌మ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయ‌ని ఆందోళన  వ్యక్తం చేసింది.   దీనిపై  ఏపీ సీఎం అవ‌స‌ర‌మైతే.. రెండు తెలుగు రాష్ట్రాలూ కూడా నీటిని పంచుకునేందుకు   స‌హ‌క‌రిస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో బనకచర్ల వివాదంపై చ‌ర్చించేందుకు  ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు వీలుగా  క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి పాటిల్ ప్ర‌క‌టించారు. ఇంత వరకూ చూస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకునే బనకచర్లపై ముందుకు సాగాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసినట్లే భావించాల్సి ఉంటుంది. బనకచర్ల తరువాత  రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల‌కు సంబంధించిన ఉమ్మ‌డి ప్రాజెక్టులు స‌హా.. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్రాజెక్టుల‌పై టెలీ మెట్రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా ఎవ‌రు ఎంత నీటిని వాడుతున్నార‌న్న‌ లెక్కలు కచ్చితంగా తేలనున్నాయి.   గ‌తంలో కేసీఆర్ దీనిని వ్య‌తిరేకించ‌గా.. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. తద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఫుల్ స్టాప్ పడే దిశగా ఒక అడుగు పడిందని చెప్పవచ్చు.  అలాగే   కీల‌క‌మైన శ్రీశైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తులు, నీటి విడుద‌ల‌, స్టోరేజీ అంశాల‌పై కూడా చర్చ జరిగింది. నాగార్జున సాగ‌ర్ వివాదంపై కూడా ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.  
ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్లపై చర్చ.. బాబు పంతం నెగ్గినట్లేగా? Publish Date: Jul 17, 2025 9:53AM

బాబోయ్.. మోస్ట్ డేంజర్ ఫుడ్.. దీన్ని తిన్న ప్రతి సారి 36నిమిషాల జీవితకాలం మటాష్..!

      ఆహారం శరీరానికి శక్తి వనరు.  తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది. అయితే పుర్రెకో బుద్ధి,  జిహ్వకో రుచి  అని పెద్దలున్నారు. కానీ నేటి కాలంలో మాత్రం జిహ్వకు బోలెడు రుచులు కావాలి. నేచి జనరేషన్ లో తిండి మీద చూపిస్తున్న ఆసక్తి వేరే దేని మీద లేదంటే అతిశయోక్తి కాదు.. దీనికి తగినట్టే వీదులలో బోలెడు ఫుడ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల్లా వచ్చేసాయి. కానీ ఆహారం అనేది శరీరాన్ని దృఢంగా ఉంచేలా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.  అయితే దీన్ని పాటించేవారు ఇప్పట్లో చాలావరకు తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా రుచి కోసం తింటున్న ఆహారాలు మనిషి ఆయుష్షును తగ్గించేస్తున్నాయ్ అని అంటున్నారు. వాటిలో చాలా డేంజర్ ఫుడ్ కూడా ఉంది. ఈ ఫుడ్ ఐటమ్ తిన్న ప్రతి సారి 36 నిమిషాల మానవ జీవితకాలం తగ్గిపోతోందట. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? తెలుసుకుంటే.. ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. నగరాల్లోనే కాదు, ఇప్పుడు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు,  యువత ఫాస్ట్ ఫుడ్ అంటే పడి చస్తారు.   ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా  సంతోషంగా తింటున్నారు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ ల గురించి చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హాట్ డాగ్ తినడం వల్ల ఒక వ్యక్తి వయస్సు 36 నిమిషాలు తగ్గుతుందని, సోడా తాగడం వల్ల  12 నిమిషాలు తగ్గుతుందని పరిశోధకులు తమ పరిశోధనలలో కనుగొన్నారు. సంతోషంగా తినే ఫాస్ట్ ఫుడ్ వాస్తవానికి ఆయుష్షును మింగేస్తోందని వారు అంటున్నారు. శాండ్‌విచ్‌లు,  గుడ్లు జీవితాన్ని 13 నిమిషాలు తగ్గిస్తాయట.  చీజ్ బర్గర్‌లు  దాదాపు 9 నిమిషాలు,  బేకన్‌ను 6 నిమిషాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఇవి ఎందుకు ప్రమాదం అంటే.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలు..  ఎందుకంటే వాటిలో ఎటువంటి పోషకాహారం లేకపోవడం,  శుద్ధి చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, ఉత్పత్తులు పాడవకుండా ఉండటం కోసం వినియోగించే రసాయనాలు,   కృత్రిమ రుచులు, రంగులు  ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి. ప్రమాదాలు.. ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా  తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలక్రమేణా అవి దీర్ఘకాలిక మంట, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్,  కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పెద్ద మొత్తంలో తీసుకునే వ్యక్తులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 50% ఎక్కువగా ఉంటుంది.  ఆందోళన,  నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే అవకాశం 48-53% ఎక్కువగా ఉంటుంది.  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందట.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
బాబోయ్.. మోస్ట్ డేంజర్ ఫుడ్.. దీన్ని తిన్న ప్రతి సారి 36నిమిషాల జీవితకాలం మటాష్..! Publish Date: Jul 17, 2025 9:30AM

 డైవర్స్ తర్వాత కొత్త బంధం ఆలోచనా? మొదట ఇది తెలుసుకోండి..!

విడాకులు.. అనే మాట అంత సులభమైనది ఏమీ కాదు. జీవితాంతం కలిసుండాలని ఒక వ్యక్తితో కొంత కాలం ఉండి ఆ తరువాత వారి నుండి విడిపోవడం అనేది మానసికంగా చాలా బాధాకరం. ఇలా విడిపోవడం వల్ల ఎప్పుడూ ఒకరిని మిస్ అవుతున్న భావన ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత సంబంధం వల్ల అయిన  గాయాన్ని మాన్పుకోకుండా,  దాన్ని మర్చిపోకుండానే  కొన్ని కారణాల వల్ల  కొత్త వ్యక్తితో  మళ్లీ బంధంలోకి వెళ్లడానికి సిద్దపడుతుంటారు. వైవాహిక బంధం జీవితంలో  ముఖ్యమైన భాగం. దానిని మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు చాలా జాగ్రత్త అవసరం. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం నుండి విడిపోయారు అంటే అర్థం అది  చెడు సంబంధం అని. ఆ బంధంలో గాయపడిన వారికి ఆ బందం  మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉండటం అంత సులభం కాదు.  ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒంటరితనాన్ని నివారించడానికి తొందరపడి కొత్తం సంబంధాన్ని ప్రారంభించడం కూడా మంచి ఆలోచన కాదు. కాబట్టి విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంబంధంలోకి రావడానికి  మానసికంగా  సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ముఖ్యం. విడిపోయిన తర్వాత..  భార్యాభర్తల బంధం చాలా భావోద్వేగమైనది. ఆ బంధంలో ఇద్దరు వ్యక్తులు చాలా ఓపెన్ అవుతారు. దురదృష్ణ వశాత్తు చాలా నిజాయితీగా ఉండి గాయపడిన వ్యక్తులు ఆ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అంత తొందరగా మరచిపోలేరు. కానీ కొందరు మాత్రం వాటిని మరచిపోవడానికి మరొక సంబంధాన్ని ప్రారంభించాలని అనుకుంటారు.  ఈ పొరపాటు ఎప్పుడూ చేయవద్దని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. విడిపోవడాన్ని మరచిపోవడానికి ఏర్పడిన సంబంధాలు సాధారణంగా కాలక్రమేణా విషపూరితంగా మారుతాయి. కోల్పోయిన భావన.. ఎవరితోనైనా అయినా సరే.. చాలా అపురూపమైన సమయాన్నిగడిపి ఆ తర్వాత కారణాల వల్ల విడిపోతే..  వారి మనస్సు నుండి సదరు వ్యక్తులను  తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ  ఒక విషయం.. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టాపిక్ లో విడిపోయిన భాగస్వామిని గుర్తు చేసుకుంటూ వారి గురించి మాట్లాడుతూ ఉంటే..  కొత్త సంబంధానికి సిద్దంగా లేనట్టేనని గుర్తించాలి. ఒంటరితనం.. ఆరోగ్యకరమైన సంబంధం కావాలంటే, ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని కూడా  ఆనందించడం నేర్చుకునే వరకు కొత్త బంధంలోకి వెళ్లకూడదు.  చాలా కాలంగా ఉన్న సంబంధం విడిపోయినప్పుడు తరచుగా  తమతో తాము సమయం గడపలేరు. తమను తాము సంతోషంగా ఉంచుకోలేరు. ఇలాంటి వారు సంతోషంగా ఉండటానికి ఏవైనా వెన్నంటి ఉండాల్సి ఉంటుంది.   ఆశిస్తున్నారా? భార్యాభర్తల సంబందం గురించి సరైన అవగాహన లేకపోయినా,  అందులో లోతుగా జరిగే వాటిని అర్థం చేసుకోలేకపోయినా దయచేసి వెంటనే కొత్త సంబంధం కోసం ప్రయత్నించకూడదు. కేవలం  సమయం గడపడానికి ఒక సంబంధం నుండి మరొక సంబంధానికి మారడం  మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు తరచుగా నిరాశ,  స్వీయ-అపరాధ భావనతో బాధపడుతుంటారు.                              *రూపశ్రీ.
 డైవర్స్ తర్వాత కొత్త బంధం ఆలోచనా? మొదట ఇది తెలుసుకోండి..! Publish Date: Jul 17, 2025 9:30AM

బెజవాడలో హైదరాబాద్ తరహా పబ్ కల్చర్.. రోడ్లపై యువత వీరంగం

విజయవాడలో  పబ్ కల్చర్ రాను రాను పెరిగిపోతోంది. పబ్‌లలో తాగి తందనాలు ఆడటమే కాకుండా హైదరాబాద్‌ తరహాలో రోడ్ల‌పైకి వస్తున్న యువత ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవల కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని బందరు రోడ్‌లో అర్ధరాత్రి యువకులు ఘర్షణ పడ్డారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందర్ రోడ్డులో యువకులు  బాహాబాహీకి దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా ఆరా తీయగా... అర్ధరాత్రి రెండు గంటల వరకూ పబ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో అర్ధరాత్రి పబ్‌లో తనిఖీలు చేసిన పోలీసులు. లాఠీలతో యువతీ, యువకులను చెదరగొట్టి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో పబ్‌లోని మందు బాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీపీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తుండటంతో యువత మత్తుకు బానిసలుగా మారుతున్న పరిస్థితి. మత్తు పదార్థాలతో పాటు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహాలో అర్ధరాత్రి వరకు పబ్‌ లు నిర్వహిస్తుండే వారు. కానీ విజయవాడలో మాత్రం రాత్రి 10 లేదా 11 గంటల వరకు పబ్‌లు క్లోజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి వరకు పబ్‌లను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అర్ధరాత్రి వరకు పబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో సిటీలోని పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. రెండు రోజుల కిందట అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.
బెజవాడలో హైదరాబాద్ తరహా పబ్ కల్చర్.. రోడ్లపై యువత వీరంగం Publish Date: Jul 17, 2025 9:26AM