నిప్పుల కుంపటి తెలంగాణ!

వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర  ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.  మొత్తంమీద ఈ నాలుగు రోజులూ రాష్ట్రంలో సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. మండే ఎండలకు తోడు వేడి గాలులు కూడా వీస్తాయనీ, వడదెబ్బ ప్రమాదం హెచ్చుగా ఉంటుందనీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయనీ, ఉక్కపోత తీవ్రత ఎక్కువ అవుతుందని తెలిపింది.   ఇక వచ్చే నెలలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకూ నమోదౌతున్నాయనీ, రానున్న రోజులలో ఇవి 50 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయనీ పేర్కొంది.   
Publish Date: Apr 27, 2024 12:26PM

వైసీపీ నేతల నుంచే లక్ష్మీనారాయణకు ముప్పు!

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని వుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన విశాఖ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ని కలసి ఆయన వినతిపత్రం సమర్పించారు. తన ప్రాణాలకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు ఎలాంటి హాని జరిగినా నంబాల రాజేష్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు బాధ్యులని లక్ష్మీనారాయణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. నంబాల రాజేష్ కుమార్, వీవీ రాజు, గాలి జనార్దనరెడ్డి కలసి వున్న ఫొటోను కూడా ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అందించారు. ‘‘నేను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వున్న సమయంలో అనధికార మైనింగ్ విషయంలో గాలి జనార్దనరెడ్డిని విచారించాను. ఆ సమయంలో గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా ప్రచారంలో వున్న నంబాల రాజేష్‌కుమార్ కూడా విచారణను ఎదుర్కొన్నారు. ‘నా బాస్ గాలి జనార్డనరెడ్డిని లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతీకారం తీర్చుకుని మా బాస్‌కి బహుమతి ఇస్తాను. నాకు కేకే రాజు అండగా వుంటారు’ అంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నంబాల రాజేష్ అందరి ముందూ బాహాటంగానే మాట్లాడారు’’ అంటూ లక్ష్మీనారాయణ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణకు ఏదైనా ముప్పు ఏర్పడకముందే పోలీసులు స్పందించాల్సిన అవసరం వుంది.
Publish Date: Apr 27, 2024 12:21PM

ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.   బేగంపేటలోని ప్రముఖ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ అధికారులు రద్దు చేశారు. లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్ లో నిబంధనలకు విరుద్ధంగా యువతుల చేత ఆశ్లీల నృత్యాలు చేయించడం, యువకులను రెచ్చగొట్టడం, చెవులు చిల్లులు పడే డీజే శబ్దాల హోరులో మద్యం తాగుతూ చిందులు వేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఆ సందర్భంగా బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది యువతులు, 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన బేగంపేట పోలీసులు బార్ లో అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బార్ ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆధారాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదికను ఇచ్చారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు.
Publish Date: Apr 27, 2024 12:21PM

ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు. పార్టీల అధినేతలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. సహజంగా తమ ప్రచారానికి సినీగ్లామర్ ను కూడా జోడించాలని సినీ పరిశ్రమతో సంబంధాలు, బంధుత్వాలు ఉన్న అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ బంధువులు, స్నేహితుల కోసం ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.  ఇందులో భాగంగానే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎం కొండయ్యయాదవ్ తరఫున నటుడు నిఖిల్ సిద్ధార్థ  ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో కూడా పాల్గొని తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు పలువురు నటులు రంగంలోకి దిగారు. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కమేడియన్ ఆది తదితరులు పిఠాపురంలో మకాం వేసి జనసేనాని తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా శుక్రవారం పిఠాపురంలో సందడి చేశారు. రానున్న రోజులలో మెగా హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మెగా హీరో చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  అదే విధంగా సాధారణంగా రాజకీయాలకూ పూర్తిగా దూరంగా ఉండే వెంకటేష్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలో  కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీలో ఉన్న తన బంధువుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన వియ్యంకుడు రామసహాయం రాఘవ రెడ్డి తరఫున వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కైకులూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివస్ తరఫున కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామినేని శ్రీనివాస్ వెంకటేష్ సతీమణి నీరజకు స్వయాన మేనమామ. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచిన తన సమీప బంధువుల తరఫున వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 
Publish Date: Apr 27, 2024 11:48AM

ఎపిలో పించన్ల పంపిణీ పట్ల  కేంద్రఎన్నికల సంఘం అసంతృప్తి 

పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. తమ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులకు మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులకు గురైనట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. శాశ్వత ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయవచ్చని గత మార్గదర్శకాల్లోనే సూచించామని తెలిపింది.
Publish Date: Apr 27, 2024 11:35AM

హరీష్‌రావు రాజీడ్రామాలు చూసి జనం నవ్వుతున్నారు!

తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిరోజులు తండ్రి, అన్నలతో కలసి డ్రామాలాడిన బాలనటి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ డ్రామా కంపెనీలోకి మరో ఛైల్డ్ ఆర్టిస్టు ఎంటరయ్యాడు. ఆ డ్రామా ఆర్టిస్టు మరెవరో కాదు... కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్యామిలీ ఎన్ని డ్రామాలు ఆడినా, ఉద్యమ స్ఫూర్తితో వున్న జనం నమ్మారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ కోసమే కదా అని క్షమించారు. పదేళ్ళు అధికారంలో అహంకారంతో వ్యహరించినప్పుడు సమయం కోసం వేచి చూశారు. ఆ సమయం రాగానే గద్దె దించారు. అహంకారం, డ్రామాలు ఎప్పుడూ పనికిరావన్న విషయాన్ని తెలుసుకోలేని ఈ కుటుంబం ఇంకా తమ పంథా మార్చుకోకుండా జనంలో పరువు పోగొట్టుకుంటోంది. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను పట్టుకుని హరీష్ రావు డ్రామా క్రియేట్ చేశాడు. రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు. అయితే రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో, ఆగస్టు 15 తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా వుండు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకుని వెంటనే ప్లేటు తిప్పేశాడు. అయితే, నేను నా రాజీనామా లేఖ అమరవీరుల స్థూపం దగ్గరకి తెస్తా.. నువ్వూ నీ రాజీనామా లేఖ తీసుకుని  శుక్రవారం నాడు అక్కడకి రా అని సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాడా? కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో వున్నప్పుడు అలా ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు వున్నాయా? ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన సందర్భాల్లో అయినా ఆయన వెళ్ళిన చరిత్ర వుందా? వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రాజీనామా లేఖ పట్టుకుని వాళ్ళు చెప్పిన దగ్గరకి రావాలి. ముఖ్యమంత్రి ఎలాగూ రాడని తెలుసు, శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపానికి ఏదో ముక్కుబడిగా నాలుగు పూలు చల్లేసి, ఒక నమస్కారం పారేసి సీఎం అక్కడకి రాలేదని ఫీలయ్యారు. స్పీకర్‌కి రాసిన రాజీనామా లేఖను అక్కడే వున్న మీడియా వాళ్ళకి ఇచ్చారు. రాజీనామా లేఖ అంటే స్పీకర్ ఫార్మాట్లో వుండాలి. తనకు చేతికి వచ్చినట్టు రాసి ఇదే రాజీనామా లేఖ అనుకో అంటే కుదరదు. హరీష్ రావు తన రాజీనామాలో ఏదేదో చేట భారతం అంతా రాశారు. ప్రస్తుతానికి ఇలా చేటభారతం రాజీనామా లేఖ రాశానని, రుణ మాఫీ చేశాక స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తానని, ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ కూడా చేయనని ప్రకటించారు. ఈ తిరకాసు వ్యవహారమంతా ఎందుకు? ఆ ఇచ్చేదేదో స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ ఇవ్వచ్చుగా..  మొన్నటి వరకు ‘ఆగస్టు 15 లోగా 2 లక్షల రైతు రుణ మాఫీ’ అనే పాయింట్ మీదే హడావిడి చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర ఇంకా ఏవేవో అంశాలను ప్రస్తావించి ఇవన్నీ నెరవేరిస్తేనే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తా అని మెలిక పెట్టాడు. రాజీనామా చేసే దమ్ము లేనప్పుడు రాజీనామా సవాళ్ళు విసరసం ఎందుకు.. ఇప్పుడు రాజీనామా గండం నుంచి బయటపడటానికి పనికిరాని నాటకాలన్నీ ఆడటం ఎందుకు? రేపు ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీని చేయడంతోపాటు ఇంకెన్ని హామీలను అమలు చేసినా హరీష్ రావు ఏదో మెలికో, తిరకాసో పెట్టి రాజీనామా చేయకుండా తప్పించుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ మనుషులు ఎప్పటికి మారతారో!
Publish Date: Apr 27, 2024 11:21AM