రాజా సింగ్ ఏక్ అకేలా!

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కరుడుగట్టిన హిదుత్వ వాది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఇమేజ్ తోనే ఆయన వరసగా మూడు సార్లు  బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యే అయినా..  ఎందుకో  ఆయన కమలం పార్టీలో ఇమడ లేక పోయారు. నిజానికి.. రాజాసింగ్  కమల దళంతో కలిసి నడిచిన  పుష్కర కాల ప్రస్థానంలో అనేక మార్లు పార్టీతో, పార్టీ విధానాలతో, పార్టీ నాయకత్వంతో విభేదించారు. పార్టీ నుంచి ఒకటి రెండు సార్లు సార్లు   సస్పెండ్ కూడా అయ్యారు. అయినా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవతో పార్టీ కేంద్ర నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసి  గోషామహల్ టికెట్ మళ్ళీ ఆయనకే ఇచ్చింది. రాజా సింగ్ మళ్ళీ గెలిచారు. హ్యాట్రిక్ సాధించారు.

అయినా ఆయనలో మార్పు రాలేదు. కథ మొదటికి వచ్చింది. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సందర్భంగా..  తనకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించి, పార్టీకి రాజీనామా చేశారు. మీకో దండం.. పార్టీకో దండం అంటూ రాజీనామా లేఖ అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చేశారు. ఆయన ఆ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించడం, ఆయన ఆమోదించేయడం చకచకా జరిగిపోయాయి.  ఒక విధంగా ఇది రాజా సింగ్  ఉహించని పరిణామం. నిజానికి జాతీయ స్థాయిలోనూ హిందుత్వ వాదిగా మంచి గుర్తింపు ఉన్న రాజా సింగ్  విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇంత వేగంగా ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటుందని రాజే సింగ్’ మాత్రమే కాదు.. ఎవరూ ఉహించలేదు.కానీ..  బీజేపీ జాతీయ నాయకత్వం కనీసం వివరణ అయినా అడగకుండానే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది. దీంతో..  బీజేపీలో రాజాసింగ్ ప్రస్థానం ముగిసింది.

ఈ నేపథ్యంలో..  రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏమిటి?  ఆయన  ఎటు అడుగులు వేస్తారు? ఏమి చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి.. రాజా సింగ్  పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ బాట తప్పననీ, కాంగ్రెస్,బీఆర్ఎస్ వంటి సెక్యులర్  పార్టీలలో చేరననీ ప్రకటించారు. అంతే కాకుండా.. రాజా సింగ్  తనకు పార్టీ జాతీయ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవనీ,  ఇప్పటికీ ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వాన్ని సమర్దిస్తానని చెపుతున్నారు. సో.. రాజ సింగ్  రాజకీయ భవిష్యత్  ప్రస్తుతానికి  ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఒక విధంగా అటూ ఇటూ కాకుండా గాలిలో తేలుతోంది  అనుకోవచ్చు.   
అదలా  ఉంటే.. పార్టీకి రాజీనామా చేసిన  రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా?  లేక ఏ పార్టీకి చెందని సభ్యునిగా కొనసాగుతారా? అనేది చూడవలసి వుంది. నిజానికి  పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలోనే రాజా సింగ్  తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కి పంపి తన సభ్యత్వాన్ని రద్దుచేయమని కోరాలని పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. అయితే.. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ..  రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కానీ ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ కు ఎలాంటి లేఖా రాయలేదని సమాచారం. అంతే కాకుండా.. ప్రస్తుతానికి పార్టీకి అలాంటి ఆలోచన కూడా లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి రాజా సింగే నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకులు అంటున్నారు. సో ... ప్రస్తుతం అమర్ నాథ్ యాత్రలో ఉన్న రాజా సింగ్ తిరిగి వచ్చిన తర్వాత కానీ తదుపరి ఘట్టం మొదలు కాదని అంటున్నారు. రాజా సింగ్  తనంతట తానుగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సమర్పిస్తే మాత్రం మరో ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. అదలా ఉంటే  బీజేపీ రాజా సింగ్ రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి, నియోజక వర్గంలో పట్టును నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ.

కాగా, ఇటీవల పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్ర రావు అభినందన సభ పేరిట నిర్వహించిన  కార్యకర్తల సమావేశంలో చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు  రాజా సింగ్ పట్ల అభిమానం వ్యక్త పరుస్తూనే..  పార్టీ ఫస్ట్ అంటున్నారు. అలాగే..  రాజాసింగ్ ను పార్టీ దూరం చేసుకోలేదు.. ఆయనే పార్టీని దూరం చేసుకున్నారంటున్నారు.  అంతే కాదు..  ఉప ఎన్నిక అంటూ వస్తే  బీజేపీ విజయం సాధిస్తుందని  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. గోషామహల్  మొదటి నుంచి బీజేపీకి మంచి పట్టున్న నియోజక వర్గం. రాజ్ సింగ్  కంటే ముందు రామ స్వామి, ప్రేమ సింగ్ రాథోడ్ ఇదే నియోజక వర్గం నుంచి గెలిచారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు.. రాజా సింగ్’ పార్టీకి రాజీనామా చేసినా  మా వాడే ,హిందుత్వం కోసం, బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తారు అంటున్నారు. బీజేపీ నాయకుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.  గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన కళ్యాణ్ సింగ్, ఉమా భారతి, యడ్యూరప్ప, మన రాష్ట్రంలో  టైగర్ నరేంద్ర వంటి పార్టీని వదిలి వెళ్ళిన  మహా మహా  నాయకులే..  తప్పు తెలుసుకుని తిరిగి సొంత గూటికి  చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదొకటి అయితే, ఒకప్పుడు..అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా ఉన్న రాజాసింగ్ ..ఇప్పడు నియోజక వర్గంలో ఏక్  అకేలా.. అయ్యారని అంటున్నారు.