పాపం విజయ్..'కింగ్‌డమ్'తో కమ్ బ్యాక్ కష్టమేనా..?
on Jul 17, 2025
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు ఓ సంచలనంలా వినిపించింది. 2016లో వచ్చిన 'పెళ్లి చూపులు'తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విజయ్.. ఆ మరుసటి ఏడాది వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ.. 2018లో వచ్చిన 'గీత గోవిందం'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇక విజయ్ కి తిరుగులేదని భావించారంతా. అందుకు తగ్గట్టే 2018 లోనే వచ్చిన 'ట్యాక్సీవాలా'తో మరో సక్సెస్ ను చూశాడు. కానీ ఆ తర్వాత నుంచి విజయ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. 2019 నుంచి విజయ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఆరేళ్లలో విజయ్ నుంచి ఐదు సినిమాలు రాగా.. అవన్నీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిలిగాయి. ఈ జూలై 31న 'కింగ్‌డమ్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు విజయ్. ఈ సినిమాతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. కమ్ బ్యాక్ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'కింగ్‌డమ్'. విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది. అయినప్పటికీ సినిమాకి రావాల్సినంత బజ్ రావట్లేదు. నిజానికి విజయ్-గౌతమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాపై ఆశించిన హైప్ రాలేదు. దానికి ప్రధాన కారణం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండటమని చెప్పవచ్చు. అలాగే, 2019లో వచ్చిన 'జెర్సీ'తో ఆకట్టుకున్న డైరెక్టర్ గౌతమ్.. తన నెక్స్ట్ తెలుగు మూవీ కోసం ఏకంగా ఆరేళ్ళు టైం తీసుకున్నాడు. దాంతో ప్రేక్షకుల్లో 'జెర్సీ' ఇంపాక్ట్.. అప్పుడున్న స్థాయిలో ఇప్పుడు లేదు. నిజానికి 'కింగ్‌డమ్' మూవీ.. విజయ్ గత చిత్రం 'ఫ్యామిలీ స్టార్' కంటే ముందు రావాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అది కూడా 'కింగ్‌డమ్' బజ్ పై ప్రభావం చూపించింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా, జనరల్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా.. 'కింగ్‌డమ్' నుంచి సరైన కంటెంట్ కూడా రాలేదు. ఎప్పుడో ఐదారు నెలల క్రితం ఎన్టీఆర్ వాయిస్ తో ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. దానిని ఇప్పటికే జనాలు మర్చిపోయారు. పేరుకి ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ.. విడుదలైన ఒకట్రెండు పాటలు ఆ స్థాయిలో లేవు. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది. ఇంతవరకు ట్రైలర్ రాలేదు. సాంగ్స్ అన్నీ విడుదల కాలేదు. ప్రమోషన్స్ లో జోష్ లేదు. చూస్తుంటే.. అసలు 'కింగ్‌డమ్' పట్ల నిర్మాతలు కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
'కింగ్‌డమ్' సినిమాకి నాగవంశీ నిర్మాత. నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన సినిమాలకు అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తాడు. సినిమా నచ్చితే చాలు.. రిలీజ్ కి ముందు ఆ సినిమా గురించి మీడియా ముందు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. కానీ, 'కింగ్‌డమ్' విషయంలో నాగవంశీలో ఏమంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. తాను నిర్మించిన 'కింగ్‌డమ్' కంటే కూడా.. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'వార్-2' గురించే ఎక్కువ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. పైగా విజయ్ దేవరకొండ మీద జనాలు జాలి చూపించాలని ఆయన మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగించింది. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఆయనను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన మీద జనాలు జాలి చూపించాలి అన్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ వ్యాఖ్యలు చేయడం విశేషం. సినిమా ఆలస్యమవ్వడం, సరైన కంటెంట్ రాకపోవడం, ప్రమోషన్స్ లో దూకుడు లేకపోవడం, నాగవంశీలో మునుపటి కాన్ఫిడెన్స్ లేకపోవడం.. ఇవన్నీ కలిసి 'కింగ్‌డమ్'కి రావాల్సినంత హైప్ లేకుండా చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హిట్ కోసం విజయ్ మళ్ళీ ఎదురుచూడక తప్పేలా లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
