స‌ర్వేలో జ‌గ‌న్ పాపులారిటీ గ‌ల్లంతు.. ఇండియా టుడే నివేద‌క‌తో వైసీపీలో వ‌ణుకు..

మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో ఇండియా టుడే స‌ర్వే. గ‌తంలో చేసిన స‌ర్వేలోనే జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మైంది. లేటెస్ట్‌గా మ‌రో స‌ర్వే కూడా చేసింది ఇండియా టుడే. మ‌న రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థ కాదు కాబ‌ట్టి.. ఎల్లో మీడియా అనే అబాంఢాలు వేసే అవ‌కాశ‌మే లేదు. సో.. ఈ స‌ర్వే నివేదిక కాస్త రియ‌లిస్టిక్‌గా ఉంటుంద‌ని న‌మ్మొచ్చు. పోల్‌లో ఏపీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.  ఇండియా టుడే సర్వేలో.. సోదిలో కూడా లేకుండా పోయారు సీఎం జ‌గ‌న్‌. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు అస‌లేమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని తేలిపోయింది. సీఎం జగన్ ఓ జాబితాలో అసలు చోటే ద‌క్క‌లేదు.  ఏపీలోని ఓటర్లతో నిర్వహించిన పోల్‌ను.. మోస్ట్ పాపులస్ సీఎం కేటగిరీగా ఇండియా టుడే వెల్ల‌డించింది. ఈ కేటగిరిలో ఆయా రాష్ట్రాల ఓటర్లకు ఫోన్లు చేసి.. మీ సీఎం పని తీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో సీఎం జగన్‌కు చోటు దక్కలేదు. అసలు తాము నిర్ణయించుకున్న బెంచ్ మార్క్ కు ఆయన పాపులారిటీ రీచ్ కాలేద‌ని ఇండియాడు టుడే స్ప‌ష్టం చేసింది. అంటే.. మామూలు బాష‌లో చెప్పాలంటే.. 100కు 35 మార్కులు వ‌స్తే పాస్ అయితే.. మ‌న జ‌గ‌న‌న్న‌కు క‌నీసం ఆ పాస్ మార్కులు కూడా రాలేద‌న్న‌ట్టు.   గ‌తేడాది ఇండియా టుడే చేసిన‌.. మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో జ‌గ‌న్ 12వ ర్యాంక్‌లో ఉన్నారు. అంత‌కుముందు ఏడాది టాప్ 5లో. అంటే, వ‌రుస ఏడాదుల్లో జ‌గ‌న్ ప‌ర‌ప‌తి దారుణంగా ప‌తనమైందని తెలుస్తోంది. టాప్ 5 నుంచి.. 12 ర్యాంకుకు ప‌డిపోగా.. ఈసారి స‌ర్వేలో ఏకంగా ఏ స్థానం ద‌క్క‌కుండా.. అస‌లు పాపులారిటీ కేట‌గిరిలోనే లేకుండా పోవ‌డం ఆసక్తికరం. జ‌గ‌న‌న్న ప‌త‌నానికి ఇండియా టుడే స‌ర్వే ఓ నిద‌ర్శ‌నం అంటున్నారు. ఇదే స‌ర్వేలో.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనితీరును బెంగాల్ ప్రజలు 69.9 శాతం స్వాగతించారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత భిశ్వ శర్మ, భూపేష్ బాఘెల్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల ప్రజల్లో కనీసం 44.9 శాతం ప్రజల ఆమోదం పొందారు. మిగతా సీఎంలు ఎవరూ ఆ స్థాయి వరకూ రాలేదు. ఈ జాబితాలో సీఎం జగన్ లేనే లేరు. ఆయన ఓట్లు వేసే ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం పాపులారిటీ కేట‌గిరిలో ఎలాంటి ర్యాంక్ ద‌క్క‌లేదు. మంచి ఫ్రెండ్స్ అయిన‌.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. దొందు దొందేన‌ని.. ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేతో మ‌రోసారి తేలిపోయింది. జ‌గ‌న్‌, కేసీఆర్‌లానే.. దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం అయిన యోగి సైతం.. త‌న‌ సొంత రాష్ట్రం యూపీలో మాత్రం కనీస ఆదరణ దక్కించుకోలేకపోయారు. ఇలా.. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న అందిస్తున్న ముఖ్య‌మంత్రులంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌నున్నార‌నే దానికి ఇండియా టుడే స‌ర్వే ఓ ముంద‌స్తు సూచ‌న‌. 
Publish Date: Jan 21, 2022 6:15PM

హామీలు ఇచ్చి, అమ‌లు మ‌రిచి!.. జగనన్న మాట త‌ప్పుడు.. మ‌డ‌మ తిప్పుడు..

ఎన్నికల సందర్భంగా ఇచ్చీ హామీలు అన్నీ అమలు చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వనికీ సాధ్యంకాదు. కానీ, ఏవో కొన్ని ఉచితాలు తప్ప, ఇచ్చిన హామీలు ఏవీ, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఆడగా నిలిచే హామీలు ఏవీ  అమలు చేయని ఘనత మాత్రం నిస్సందేహంగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది.  ప్రభుత్వ ఉద్యోగుల విషయమే తీసుకుంటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన, సాధ్యా సాద్యాల గురించి క్షణమైనా ఆలోచించకుండా, సీపీఎస్ రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. అదికూడా ఎప్పుడో కాదు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే సీపీఎస్’ను ఎత్తేసి మళ్ళీ పాత పెన్షన్ పద్దతిని తెస్తామని హమీ ఇచ్చేశారు. ఉద్యోగులు ఆశ పడ్డారు ... గుడ్డిగా ఓట్లు గుద్ది గెలిపించారు. అయినా, వారం పోయి వందవారాలు అయినా, సీపీఎస్ పోలేదు .. చివరకు ఆల్ ఇన్ వన్ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అబ్బే అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాం... సీపీఎస్ రద్దు సాధ్యంకాదని చావు కబురు చల్లగా చెప్పారు.  ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసన సభలో అమరావతి రాజధాని అంటే ఓకే అన్నారు. రాజధాని బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుమారు 40 నిముషాలకు పైగా సాగిన ప్రసంగంలో  అధికార వికేంద్రీకరణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత  వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ముచ్చట తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనను, మూత కట్టి అటకెక్కించారు. నవ్యాంధ్ర ప్రదేశ్’ను రాజధాని లేని రాష్ట్రంగా త్రిశంకు స్వర్గంలో వెళ్లాడ దీశారు.  ఇక అంచెల వారీ సంపూర్ణ మధ్య నిషేధం హామీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. సంపూర్ణ కాదు , పాక్షిక మధ్య నిషేధం కూడా మరో పాతికేళ్ళు వెనక్కి నేట్టేశారు. జగన రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, మరో 25 సంవత్సరాల పాటు, ఆంధ్ర ప్రజలు చచ్చినట్లు ప్రతి రోజు మందు తాగకే తప్పదు. చావకా తప్పదు. రానున్న 25 సంవత్సరాలలో మద్యం అమ్మకాల మీద  వచ్చే అదాయాన్ని పూచికత్తుగా పెట్టి జగనన్న అప్పు తెచ్చుకున్నారు. సో ... మరో రెండేళ్లలో ఈ ప్రభుత్వం పోయినా, జగన్ రెడ్డి జ్ఞాపకంగా నిత్య మధ్య విధానం కొనసాగుతూనే ఉంటుంది.మధ్య నిషేధం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వమే మద్యం వ్యాపారంలో పీకలలోతు కూరుకుపోయింది. బడి పంతుళ్ల చేత మధ్యం అమ్మించే ‘ఎత్తు’కు ఎదిగిపోయింది.   అలాగే, పోలవరం ప్రాజెక్టు, 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హమీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్, అసెంబ్లీలో విపక్షాలను అవహేళన చేస్తూ 2021 డిసెంబర్ చివరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, జరిగింది ఏమిటో .. అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ వదిలిందో .. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత కూడా అక్కడే వుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు చాపచుట్టేసింది.  అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినవి చేయక పోయినా, చెప్పనివి చాలా చేసింది ... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళలో ఎప్పుడు పెంచని ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు జగన్ సర్కార్ పెంచింది. ఇలా, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు తప్పడం అలవాటుగా చేసుకుంది. అందుకే, రాష్ట్ర అభివృద్ది కోరుకునే ప్రతి ఒక్కరూ, ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.
Publish Date: Jan 21, 2022 5:49PM

కోహ్లీ డ‌కౌట్‌.. రిష‌భ్‌, రాహుల్ హిట్‌.. చిత‌క్కొట్టిన బౌల‌ర్లు.. స‌ఫారీల‌కు బిగ్ టార్గెట్‌..

ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు బ‌రిలో దిగింది టీమిండియా. మొద‌ట బ్యాటింగ్ చేసి.. సౌత్ ఆఫ్రికాకి 287 ప‌రుగుల‌ భారీ టార్గెట్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. రిష‌భ్ పంత్ చెల‌రేగి పోయాడు. చివ‌రాఖ‌రిలో బౌల‌ర్లు శార్దూల్‌ ఠాకూర్‌, అశ్విన్ స్టో అండ్ స్ట‌డీగా ప‌రుగులు సాధించి భారీ స్కోరుకు కార‌ణ‌మ‌య్యారు. విరాట్ కోహ్లీ డ‌కౌట్ కావ‌డం ఒక్క‌టే కాస్త నిరాశ ప‌రిచే అంశం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో అతిథ్య జట్టుకు టీమ్‌ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఆటగాడు రిషభ్ పంత్‌ (85; 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (55; 79 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తొలి వన్డేలో హాఫ్ సెంచ‌రీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఈ సారి డకౌట్‌ అయ్యి నిరాశపరిచాడు.  టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కి ఓపెనర్లు శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమ్ఇండియా స్కోరు 57/0. అయితే, 12 ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ (29)ని మార్‌క్రమ్ పెవిలియన్‌కి పంపాడు. ఆ నెక్ట్స్‌ ఓవర్‌లో కేశవ్ మహారాజ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీ (0) బవుమాకి దొరికిపోయాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడాడు.    బౌండరీలు బాదుతూ రిష‌భ్‌ స్కోరు వేగం పెంచాడు. షంసీ వేసిన 24 ఓవర్‌లో పంత్‌ మూడు ఫోర్లు కొట్టాడు. 43 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కంప్లీట్ చేశాడు. 29 ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ కొద్దిసేపటికే అవుట‌య్యాడు. ఆ వెంటనే రిషబ్‌ పంత్ కూడా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. శ్రేయస్ అయ్యర్‌ (11), వెంకటేశ్ అయ్యర్‌ (22) మ‌మ అనిపించారు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (40*), అశ్విన్‌ (25*) నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించేలా చేశారు.  దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి రెండు, మగళ, కేశవ్‌ మహారాజ్‌, మార్‌క్రమ్, పెహులుక్వాయో తలో వికెట్ తీశారు.  
Publish Date: Jan 21, 2022 5:36PM

రాహుల్ వెడ్స్‌ అతియా.. లేటెస్ట్ అప్‌డేట్‌..

కేఎల్ రాహుల్‌కు గోల్డెన్ టైమ్ న‌డుస్తున్న‌ట్టుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఆ జోష్ అలా కంటిన్యూ అవుతుండ‌గానే.. లేటెస్ట్‌గా వెడ్డింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌వ‌ర్ క‌మ్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నాడు కేఎల్ రాహుల్. ఈ అప్‌డేట్ ఇటు బాలీవుడ్‌.. అటు క్రికెట్‌వుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.  ఒక‌ప్ప‌టి బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి కూతురు అతియా శెట్టి. రాహుల్‌-అతియాలు మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరి ల‌వ్‌..ఎఫైర్‌.. ఓపెన్ సీక్రెట్‌. అలానే ల‌వ‌ర్స్‌లానే ఎంజాయ్ చేస్తారా.. లేక పెళ్లి కూడా చేసుకుంటారా.. అంటూ ఎప్ప‌టినుంచో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ స‌స్పెన్స్‌కు ఎండ్‌కార్డ్ వేస్తూ.. వారి వెడ్డింగ్ న్యూస్‌ను వెల్ల‌డించారు.  తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారించార‌ట‌. అంటే, సినిమాటిక్ గొడ‌వ‌లు.. నో చెప్ప‌డాలు.. గ‌ట్రా లేవ‌ట‌. వీళ్లు రిచ్‌.. వాళ్లు రిచ్‌.. రాహుల్ క్రికెట్ స్టార్‌.. అతియా బాలీవుడ్ స్టార్‌.. ఇంకేముంటుంది ప్రాబ్ల‌మ్‌. అందుకే, మ్యారేజ్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది. వెడ్డింగ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. ఈ ఇయ‌ర్‌లోనే పెళ్లి ఉంటుంద‌ని అంటున్నారు. 
Publish Date: Jan 21, 2022 5:17PM

అధికారంలోకి వ‌స్తే సీపీఎస్ రద్దు.. జగన్ బాటలో అఖిలేష్ హామీ..

ఎన్నికలు అన్నతర్వాత హామీలు ఇవ్వవలసిందే. అమలు చేయడం చేయక పోవడం తర్వాతి విషయం. అయితే ఓ వంక ఏపీలో అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన సీపీఎస్ రద్దు, హామీని ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో వినిపించడం కొంచెం ఆసక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తమ ప్రతి అధికారంలోకి వస్తే, సీపీఎస్ రద్దు చేస్తామని హమీనిచ్చారు. ఆ హామీకి స్పందించిన  ఉద్యోగులు గంప గుత్తగా వైసీపీకి ఓటేశారు. వైసీపీ గెలిచింది. హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాలు అయింది. అయినా, సీపీఎస్ రద్దు హామీ మాత్రం నెరవేరలేదు. అంతేకాదు, అది అయ్యేది కాదని, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. ఇప్పడు ఏపీలో రోడ్డెక్కిన ఉద్యోగులు  సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి అది అమలు చేయక పోగా పీఆర్సీ, హెచ్ఆర్ఎకు ఎసరు తెచ్చారని ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.  అదలా ఉంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అందులో భాగంగా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ ఉద్యగులకు హామీ ఇచ్చిన విధంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తానని మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హామీ ఇస్తున్నారు. 2004లో అప్పటి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని తీసుకురాగా.. 2005లో ఉత్తర్‌ ప్రదేశ్ దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకొస్తే 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని అఖిలేశ్ అన్నారు. అలాగే, ప్రయివేట్ పాఠశాలలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉపాధ్యాయులకు ఆర్ధిక సాయం కూడా అందజేస్తామని, మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చేలా మార్పులు చేస్తామని అఖిలేశ్ ప్రకటించారు.పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తమ పార్టీ మేనిఫేస్టోలో మరో ముఖ్యమైన హామీ అని అఖిలేశ్ వివరించారు. అయితే, యూపీ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులతో పోటీ పడి బకరాలు అవుతారో లేక, స్మార్ట్’గా ఓటు చేస్తారో ..చూడవలసి వుంది.
Publish Date: Jan 21, 2022 4:54PM

ప్రియాంకే సీఎం.. కాంగ్రెస్ చివ‌రి అస్త్రం..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు మరి కొందరు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ (ఎస్పీ) తీర్ధం పుచ్చుకున్నారు. మరో వంక ఎస్పీ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ములాయం సింగ్ యాదవ్ రెండవ కోడలు అపర్ణ, ములాయం తోడల్లుడు, మాకీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్, బీఎస్పీ కూడా పోటీలో ఉన్నా ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ కూటమి మధ్యనే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత ఒంటరిగా బరిలో నిలుస్తోంది.అంతే కాకుండా, సర్వేలన్నీ హస్తం పార్టీకి సింగిల్ డిజిట్ చూపిస్తున్నా, కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు.  అదలా ఉంటే,  ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్ది  అఖిలేశ్‌ యాదవ్‌ తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో  దిగుతున్నారు. యోగి గోరఖ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగుతుండగా.. అఖిలేశ్‌ గతంలో ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురిలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దుగుతున్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారన్న విషయంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే, ప్రియాంక గాంధీ వాద్రాను ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ప్రకటిస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా ప్రియాంక గాంధీ  ఈరోజు (శుక్రవారం) వ్యూహాగానాలకు తెరదించారు. ఇందుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రియాంక . “నేను గాక ఇంకెవరు” కాంగ్రెస్ పార్టీలో నేను గాక  ఇంకో చహారా (ముఖం) కనిపిస్తుందా అని ఎదురు ప్రశ్నవెశారు. ఆవిధంగా ‘స్పెక్యులేషన్’ కు చుక్క పెట్టారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మీడియాసమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. ‘‘ఇంకెవరైనా కన్పిస్తున్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?’’ అని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక పేరునే ప్రకటించే అవకాశాలు దాదాపు ఖాయంగానే కన్పిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్‌ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టొచ్చు. అయితే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనసమండలి ఏదో ఒకదానికి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. గతంలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎమ్మెల్సీనే కావడం గమనార్హం.  మొత్తం403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. నిజంగానే కాంగ్రెస్ గెలిచి, ప్రియాంక సీఎం అయితే, గాంధీ నెహ్రు ఫ్యామిలీ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి ప్రియాంకే అవుతారు. నెహ్రు నుంచి రాజీవ్ వరకు అందరూ నేరుగా ప్రధాని పదవినే చేపట్టారు తప్పు ముఖ్యమంత్రి పదవిని చెప్పట్టలేదు.
Publish Date: Jan 21, 2022 4:46PM

బోండా ఉమాపై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం.. వైసీపీ మూక‌ల అరాచ‌కం..

క‌నిపిస్తే దాడులు.. కుదిరితే కేసులు.. వీలైతే హ‌త్య‌లు.. ఏపీలో వైసీపీ మూకల ఆగ‌డాల‌కు అంతేలేకుండా పోతోంది. ఇటీవ‌ల ప‌ల్నాడులో చంద్ర‌య్య‌ను వైసీపీ నాయ‌కులు న‌డిరోడ్డుపై దారుణంగా చంపేస్తే.. తాజాగా గుడివాడ‌లో టీడీపీ నేత బోండా ఉమాపై మ‌రోసారి హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్ తీసుకొచ్చి.. కె క‌న్వెన్ష‌న్‌లో గ‌బ్బు గ‌బ్బు చేసిన ఘ‌ట‌న‌పై.. టీడీపీ నిజ‌నిర్థార‌ణ క‌మిటీ కొడాలి నాని ఇలాఖాలో అడుగుపెట్టింది. టీడీపీ నాయ‌కుల రాక‌న త‌ట్టుకోలేని.. వైసీపీ మూక‌లు వారిపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు.  రాళ్ల‌తో బోండా ఉమాపై దాడికి ప్ర‌య‌త్నించారు. ఆ దాడిలో ఆయ‌న‌ కారు అద్దాలు ప‌గిలిపోయాయి. పెద్ద సంఖ్య‌లో పోగైన వైసీపీ శ్రేణుల దాడి నుంచి పోలీసుల ర‌క్ష‌ణ‌లో బోండా ఉమా అదృష్ట‌వ‌శాత్తు బ‌య‌ట‌ప‌డ్డారు.  బోండా ఉమాపై దాడి ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మాచ‌ర్ల‌లో ఇలానే జ‌రిగింది. బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌లు ప్ర‌యాణిస్తున్న కారును.. వైసీపీ రౌడీలు కొన్ని కిలోమీట‌ర్ల పాటు వెంబ‌డించి దాడి చేశారు. తుర‌క కిశోర్ అనే వైసీపీ లీడ‌ర్‌ పెద్ద క‌ర్ర‌తో.. బోండా ఉమాపై దాడి చేశాడు. కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి.. కారు లోప‌ల ఉన్న ఉమాను ఆ క‌ర్ర‌తో కొట్టాడు. కానీ, తృటిలో త‌ప్పించుకుని.. కారును వేగంగా న‌డిపి.. ఆ హ‌త్యాయ‌త్నం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయినా, వ‌ద‌ల‌కుండా బోండా ఉమా కారును వైసీపీ వ‌ర్గాలు వెంబ‌డించ‌గా.. స్థానిక పోలీసులు త‌మ వాహ‌నంలో బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌ల‌ను సుర‌క్షితంగా విజ‌య‌వాడ త‌ర‌లించారు. ఆనాడు బోండా ఉమాను చంపాల‌ని చూసిన తుర‌క కిశోర్‌కు ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త వైసీపీది. రౌడీల‌కు ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం ఉంటుంద‌నే దానికి ఆ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.  అప్ప‌టి నుంచీ బోండా ఉమాను టార్గెట్ చేస్తూనే వ‌స్తున్నారు వైసీపీ నాయ‌కులు. తాజాగా, ఆయ‌న గుడివాడ వ‌స్తున్నార‌ని తెలిసి మ‌రోసారి కాపు కాసిన‌ట్టున్నారు. ఈసారి బోండా ఉమా కారుపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు ఉన్నారు కాబ‌ట్టి స‌రిపోయింది.. లేదంటే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగుండేద‌ని అంటున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ వ‌ర్గీయుల చేతిలో 33 మంది టీడీపీ నాయ‌కులు హ‌త్య‌కు గుర‌య్యారు. 500 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఇక కేసుల సంఖ్య అయితే లెక్కేలేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి మాజీ మంత్రులు, అధికార ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు.. అనేక వంద‌ల మందిని ఏదో ఒక కేసులో ఇరికించింది వైసీపీ ప్ర‌భుత్వం. అయినా ఆగ‌కుండా.. చంద్ర‌బాబు ఇంటిపై ముట్ట‌డి.. మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీసు ధ్వంసం.. లాంటి విధ్వంస‌కాండ కొన‌సాగిస్తూనే ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం.. క‌డ‌ప ఫ్యాక్ష‌న్ అంటూ టీడీపీ ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. డీజీపీ కొమ్ము కాస్తున్నారంటూ ఎంత‌గా ఆరోపిస్తున్నా.. ఏపీలో వైసీపీ మూక‌ల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. వారి అరాచ‌కాల‌కు అంతే లేకుండా పోతోంది.  వీడియో లింక్-- https://www.youtube.com/watch?v=QYtMoy5YxNw&t=3s
Publish Date: Jan 21, 2022 4:34PM

మ‌రో బండ్ల గ‌ణేశ్‌!.. కేసినో నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చస్తా.. కొడాలి నాని కామెడీ!

బండ్ల గణేశ్ ఎపిసోడ్ గుర్తుందిగా! అప్ప‌ట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఒక‌వేళ తాను ఓడిపోతే.. 7' ఓ క్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకొని చ‌స్తా నంటూ స‌వాల్ చేశారు. ఆ త‌ర్వాత అస‌లా ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేశ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెటే ఇవ్వ‌లేదు. ఆయ‌న పోటీనే చేయ‌లేదు. దీంతో.. కొంద‌రు ఉత్సాహ‌వంతులు 7' ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని ఆయ‌న ఇంటికెళ్లారు. బండ్ల గ‌ణేశ్ ఇంట్లో లేరు. అప్ప‌టి నుంచీ ఆయ‌న్ను బ్లేడ్ బాబ్జీ అంటున్నారు. ఆ త‌ర్వాత అదే విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తే.. ఊరుకోండి.. ఫ్లో లో ఎన్నెన్నో అంటాం.. అవ‌న్నీ చేస్తామా ఏంటి? అంటూ బండ్ల గ‌ణేశ్ కామెడీ చేశారు. సేమ్ టూ సేమ్‌.. అలాంటి సంద‌ర్భ‌మే ఇప్పుడు ఏపీలో తెర‌మీద‌కు వ‌చ్చింది.  గుడివాడ‌లో గోవా. ఈ లైన్ వింటే ఈపాటికే మీకు మేట‌ర్ అర్థ‌మైపోవాలి. సంక్రాంతికి గుడివాడ‌లో మంత్రి కొడాలి నానికి చెందిన కె క‌న్వెన్ష‌న్‌లో ర‌చ్చ రంబోలా జ‌రిగింది. కేసినోలు, పేకాట‌, గుండాల‌, జూదం, మందు, విందు, చిందు, చీర్ గ‌ర్ల్స్‌.. ఇలా నానా హంగామా చేశారు. సుమారు 500 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని అన్నారు. ఈ కేసినో విజువ‌ల్స్‌, అందులో ఆటా-పాట‌.. ఆ వీడియోల‌న్నీ మీడియాలో ఫుల్‌గా ప్ర‌సార‌మ‌య్యాయి. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. మొత్తం త‌తంగ‌మంతా ముగిసాక‌.. కె క‌న్వెన్ష‌న్‌లో కేసినోను ఎత్తేశాక‌.. తీరిగ్గా మీడియా ముందుకు వ‌చ్చారు మంత్రి కొడాలి నాని. తాను స‌చ్చీలుడినంటూ బాగా క‌వ‌రింగ్ ఇచ్చారు.  తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని.. కొడాలి నాని స‌వాల్ చేశారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి.. తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.  కొడాలి నాని మాట‌లు విన్న‌వారంతా తెగ న‌వ్వుతున్నారు. అరెరే.. ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. అప్ప‌ట్లో బండ్ల గ‌ణేశ్‌.. ఆ త‌ర్వాత ఇప్పుడు కొడాలి నాని.. అంటూ ఆ రెండు ఎపిసోడ్ల‌ను క‌లిపి  మీమ్స్ చేస్తున్నారు. బండ్ల గ‌ణేశ్ తాను ఓడిపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటాన‌న్నార‌ని.. ఇప్పుడు కొడాలి నాని సైతం.. కేసినో నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చ‌చ్చిపోతాన‌ని అంటున్నార‌ని కామెడీ చేస్తున్నారు.  అంత క్లియ‌ర్‌గా విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. అంత క్లియ‌ర్‌గా వెళ్లిన వాళ్లు సైతం తాము కొడాలి క‌న్వెన్ష‌న్‌లో ఫుల్ ఎంజాయ్ చేశామ‌ని చెబుతున్నారు. ఎంట్రీ ఫీజు 10వేలు క‌ట్టామ‌ని అంటున్నారు. లోప‌ల ఆదో లోకంలా ఉంద‌ని.. స‌ర్వ సుఖాలు ఉన్నాయ‌ని.. గొప్ప‌లు పోతున్నారు. కేసినోలో స‌ర్వం పోగొట్టుకున్న వాళ్లు తెగ తిడుతున్నారు. ఇంత క్లియ‌ర్‌గా మేట‌ర్ ఓపెన్ అయితే.. అంతా అయిపోయాక కొడాలి నాని మీడియా మైకుల ముందు.. అదంతా త‌న క‌న్వెన్ష‌న్‌లో జ‌ర‌గ‌లేద‌ని.. నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చ‌స్తానంటూ స‌వాల్ చేయ‌డం.. మ‌రో బండ్ల గ‌ణేశ్ య‌వ్వారంలా ఉందంటున్నారు. అయితే, బండ్ల గ‌ణేశ్ ఇంటికి బ్లేడులు తీసుకెళ్లిన ఔత్సాహికులు.. కొడాలి నాని ఇంటికి పెట్రోల్ సీసాల‌తో వెళ్లే సాహ‌సం చేస్తారా? అంత ద‌మ్ముందా..?
Publish Date: Jan 21, 2022 3:40PM

తిక‌మ‌క‌ బ‌దిలీలు.. త‌ప్పిదాల‌తో దిద్దుబాట్లు.. సీఎస్‌పై విమ‌ర్శ‌లు!

ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. రాష్ట్రంలోకే అత్యంత సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. బాగా స‌మ‌ర్థ‌వంతుడు, ప‌నిమంతుడినే సీఎస్ ప‌ద‌విలో కూర్చొబెడ‌తారు. కానీ, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ చ‌ర్య‌లు ప‌లుమార్లు విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. అసంబ‌ద్ద‌ నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వానికి త‌ల‌వొంపులు తీసుకొస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.... లేటెస్ట్‌గా 8మంది సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ జీవో రిలీజ్ చేశారు సీఎస్ సోమేశ్‌కుమార్‌. అందులో, ఐఏఎస్ అనితా రాజేంద్ర‌ను MCR HRDI కి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇక్క‌డే సీఎస్ ప‌ప్పులో కాలేశారు. ఈ ఆర్డ‌ర్‌తో ఆమె కంటే సీనియ‌ర్ అయిన హ‌ర్‌ప్రీత్‌సింగ్‌.. జూనియ‌ర్ అధికారి కింద ప‌ని చేయాల్సి ఉంటుంది. ఇది సివిల్ స‌ర్వెంట్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. ఇంత చిన్న లాజిక్ మ‌రిచిపోయారో.. లేక పొర‌బాటు ప‌డ్డారో గానీ.. సీఎస్ సోమేశ్‌కుమార్ చేసిన బ‌దిలీపై డిపార్ట్‌మెంట్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  ఆ విష‌యం సీఎస్ దృష్టికి రావ‌డంతో.. ఇచ్చిన‌ జీవోలో స‌వ‌ర‌ణ‌ చేశారు. చేసిన త‌ప్పిదాన్ని స‌రిచేసుకున్నారు. ఈసారి అనితా రాజేంద్ర‌ని.. జాయింట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, MCR HRDI గా పోస్టింగ్ ఇస్తూ ఆర్డ‌ర్ రిలీజ్ చేశారు. కేవ‌లం 8మంది ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫ‌ర్‌లోనే ఇలా త‌ప్పిదానికి పాల్ప‌డితే ఎలా బిగ్ బాస్ అంటూ ఐఏఎస్‌ల సర్కిల్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి.   ఇలా అనేక అంశాల్లో సీఎస్ తీరు విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చేలా ఉంటోంది. అప్ప‌ట్లో కొవిడ్ సోకినా మాస్కు లేకుండా రివ్యూలు నిర్వ‌హించి.. సీనియ‌ర్ ఉద్యోగుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అప్ప‌ట్లో వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్‌-ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చింది కూడా సీఎస్ సోమేశ్‌కుమారే అంటారు. ఆ ప‌థ‌కం అట్ట‌ర్‌ఫ్లాప్ అయి.. జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ మెజార్టీకి గండికొట్టగా.. కేసీఆర్ ప‌రువంతా పోయి.. సీఎస్‌కు చివాట్లు పెట్టి మ‌రీ.. ఓటీఎస్‌ను విత్‌డ్రా చేసుకున్నార‌ని అంటారు. అలాంటి సీఎస్‌.. మ‌రోసారి ప్ర‌భుత్వం అబాసుపాల‌య్యే ప‌ని చేశారు. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్‌ల బ‌దిలీల్లో తిక‌మ‌క‌, మ‌క‌తిక జీవోల‌తో.. న‌వ్వుల‌పాల‌య్యారు.  ఇక‌, ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) క్యాడర్‌ నిబంధనల మార్పుపై కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర వివాద‌మే జ‌రుగుతోంది. ఈ విష‌యంలోనూ సీఎస్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఇంత‌కీ ఆ వివాదం ఏంటంటే.... ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (క్యాడర్‌) రూల్స్‌-1954’లోని రూల్‌ నంబర్‌ 6 ప్రకారం ఒక ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారిని రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర సర్వీసులు లేదా ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్న అధికారులను మాత్రమే డిప్యూటేషన్‌పై పంపిస్తుంటారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా నేరుగా తానే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకొనేలా నిబంధనలను మార్చనుంది.  దీనిపై కేంద్ర అంతర్గత వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ ఈ నెల 12న లేఖలు రాసింది. ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆ లోగా రాష్ట్రాల‌ నుంచి సమాధానం రాకపోతే కేంద్రం నేరుగా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ స‌ర్కారు గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తోంది. ఐఏఎస్ కేడ‌ర్‌ నిబంధ‌న‌ల మార్పును అస‌లేమాత్రం ఆమోదించబోమంటూ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎస్ సోమేశ్‌కుమార్ బ‌ల‌మైన వాయిస్ విన‌పిస్తున్నారు. అంత‌బాగా రూల్స్ తెలిసిన ఆయ‌న‌.. ఐఏఎస్‌ల బ‌దిలీల్లో.. సీనియ‌ర్లు-జూనియ‌ర్ల అంశాన్ని ప‌ట్టించుకోకుండా హ‌డావుడిగా బ‌దిలీ జీవోలు ఇష్యూ చేయ‌డం.. ఆ త‌ర్వాత పోర‌బాటు జ‌రిగిందంటూ నాలుక క‌రుచుకొని ఇచ్చిన జీవోలు స‌వ‌రించ‌డం.. ఇదేం ప‌ని తీరు పెద్దాయ‌నా.. అంటూ ఐఏఎస్‌లు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుతున్నారు.
Publish Date: Jan 21, 2022 3:04PM

గుడివాడలో గ‌డ‌బిడ‌.. టీడీపీ నేత‌ల అరెస్టుతో తీవ్ర ఉద్రిక్త‌త‌..

గుడివాడలో క్యాషినో రగడ పెరిగిపోతూనే ఉంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాషినో ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతల నిజనిర్ధారణ కమిటీ క్యాషినో కథ నిగ్గు తేల్చేందుకు యత్నించింది. కే కన్వెన్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ,  బోండా ఉమ, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ఆచంట సునీత, తంగిరాల సౌమ్య సహా ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పామర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గుడివాడలో పరిస్థితులు మరింత తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి. కాగా.. టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. క్యాషినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలిపెట్టి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడమేంటని నిప్పులు చెరిగారు. మహానుభావులు పుట్టిన గుడివాడ గడ్డను గడ్డం గ్యాంగ్ భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు. మింగేందుకు ఏమీ మిగలలేదని చివరికి జనం వంటిపై ఉన్న గుడ్డలను కూడా లాగేసేందుకు క్యాషినో ఏర్పాటు చేశారంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వైసీపీ రంగులతో పోలీసుల కళ్లు మూసుకుపోయాయని, జూదానికి కే కన్వెన్షన్ అడ్డాగా మారినట్లు ప్రపంచమంతా తెలిసినా పోలీసులకు కనిపించడంలేదని లోకేశ్ విమర్శించారు. క్యాషినో వెనక ఉన్న అసలు సూత్రధారులను అరెస్ట్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. క్యాషినో నడిపినప్పుడు అడ్డు రాని కోవిడ్ రూల్స్ పేరుతో టీడీపీ నేతలను అడ్డుకోవడాన్ని వైసీపీ సర్కార్ దిగజారుడుతనానికి తార్కారణమని లోకేశ్ తూర్పారపట్టారు.
Publish Date: Jan 21, 2022 2:52PM

త‌గ్గేదేలే.. పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం.. ఉద్యోగుల స‌మ్మె సైర‌న్‌..

ప్ర‌భుత్వం పీఆర్సీ పంతం వీడ‌ట్లేదు. ఉద్యోగులు పీఆర్సీపై ప‌ట్టు వీడ‌ట్లేదు. ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అంటూ స‌త్తా చాటుతున్నారు. పీఆర్సీ జీవోల‌తో ఉద్యోగుల జీతాల‌కు భారీ చిల్లు ప‌డుతోంది. ఆ జీవోలు వెంట‌నే ర‌ద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కి పోరాడుతున్నారు. అయినా, పీఆర్సీలో ఎలాంటి మార్పు లేదంటూ.. ఆ జీవోల‌కు ఏపీ మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.  పీఆర్సీపై ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి.  సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌డం.. ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు.  మరోవైపు, ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని చేతులెత్తేసింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. కొత్త పీఆర్సీ ప్ర‌కారం బిల్లులు రెడీ చేయాల్సిన ట్రెజ‌రీ ఉద్యోగులే అందుకు నిరాక‌రించ‌డంతో ఏపీ స‌ర్కారు సందిగ్థంలో ప‌డింది. పీఆర్సీపై ఎలా ముందడుగు వేయాల‌ని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. 
Publish Date: Jan 21, 2022 1:55PM

ఓటీఎస్ అట్టర్‌ఫ్లాప్‌.. వసూళ్ల స్కీం ఫసక్.. ప్రజాస్పందన తుస్‌స్‌స్‌..!

4 వేల కోట్ల ఓటీఎస్ లెక్క. స్పందన చూస్తే బొక్క. అందుకే, ఓటీఎస్ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఏదేదో అనుకుంటే.. ఇంకేదో జరుగుతోందంటూ జగనన్న దిగాలు పడుతున్నారు. మాట తప్పి.. మడిమ తిప్పి.. ఓటీఎస్ పేరుతో పేదలనే దోచుకోవాలని చూసిన జగన్ రెడ్డికి ప్రజలు దిమ్మతిరిగే ఝలక్ ఇస్తున్నారు. ఓటీఎస్ కట్టేదేలేదు... పో పొమ్మంటున్నారు. అధికారులు ఎంత ఒత్తిడి తెస్తున్నా.. ఎంతగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. జనాలు మాత్రం పదివేలు కాదుకదా.. పైసా కూడా కట్టమంటూ కమిటెడ్ గా ఉంటున్నారు. గతంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు నిర్మించుకున్న నిరుపేదలకు ఫ్రీగా క్రమబద్ధీకరణ చేస్తానన్న ఏపీ సీఎం జగన్ మాట తప్పారు.. 100 చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న పేదలకు ఒక్క రూపాయికే క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి సర్కార్ దాన్ని ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)లా మార్చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం గూడు కట్టుకుని కాలం వెళ్లదీస్తున్న నిరుపేదల నుంచి కూడా కోట్లాది రూపాయలు కొట్టేయాలని ఓటీఎస్ పథకం తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటీఎస్ పథకం పేరు చెప్పి ఏపీలో ఏకంగా 4 వేల కోట్ల రూపాయలు కొట్టేయాలనే సర్కార్ కుటిల యత్నానికి నిరుపేదల నుంచి స్పందన రాకపోవడం గమనించాల్సిన అంశం. ‘వసూళ్ల’ పథకాన్ని ‘మేలు’ చేసే పథకంగా చూపించేందుకు వైసీపీ సర్కార్ ఎంతగానో యత్నించింది. అయితే అది మంచి పథకం కాదు.. ముంచే పథకం అని జనం పసిగట్టేసినట్టున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ గత డిసెంబర్ 21న ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఓటీఎస్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు వరకు 15.4 కోట్ల రూపాయలు క్రమబద్ధీకరణ ఫీజుగా నిరుపేదలు సమర్పించుకున్నారు. అయితే.. జగన్ సభ తర్వాత ఓటీఎస్ కు పూర్తిగా స్పందన తగ్గిపోయింది. సభ తర్వాత 20 రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు కేవలం 5 లక్షల రూపాయలు రాబట్టేందుకు గ్రామ స్థాయి నుంచీ అధికారులు కిందా మీదా పడి పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చింది. ఓటీఎస్ కు స్పందన ఎంతలా తగ్గిపోయిందో అర్థం చేసుకోవనికి ఈ గణాంకాలే నిదర్శనం. జగన్ సర్కార్ కుటిల యత్నంపై నిరుపేదలు నీళ్లు చల్లేశారు. ఓటీఎస్ వసూళ్లు తగ్గిపోవడంతో నిధులు ఇంకే విధంగా సమీకరించుకోవాలో అంతు చిక్కక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో కాస్త గూడు కట్టుకున్న వారిని ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టాలని వెళుతున్న గ్రామస్థాయి అధికారులపై పలుచోట్ల నిరుపేదలు చిందులు తొక్కుతున్నారు. ఏనాడో తాళి కట్టి.. కాపురం చేసుకుంటున్న తన భార్యతో జగన్ సర్కార్ మళ్లీ పెళ్లి చేస్తానన్న చందంగా ఉందంటూ ఒక పెద్దాయన నిప్పులు చెరిగిన వైనం మీడియాలో వైరల్ అయింది. ఓటీఎస్ కట్టాలంటూ గ్రామ స్థాయిలో అధికారులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. వృద్ధులు, వికలాంగులు అని కూడా చూడకుండా ఓటీఎస్ అంటూ నిరుపేదలను సతాయిస్తున్న సంఘటనలు ప్రతిరోజూ మీడియాలో వస్తున్నాయి. చివరికి ఓ వృద్ధురాలు అయితే.. ఓటీఎస్ కట్టాలంటూ ఇబ్బంది పెట్టిన అధికారులపై శివతాండవమే చేసింది. ‘ఎన్నికలకు ముందు ఓటీఎస్ విషయం చెప్పారా? వాడొచ్చి అడిగినా తాను ఇలాగే చెబుతా’ అంటూ ఆ వృద్ధురాలు నిప్పులు తొక్కడంలో  వాస్తవం ఉందనిపిస్తోంది. ఓటీఎస్ తుస్ అనడానికి మరో రీజన్ కూడా ఉంది. జగన్ సభకు ముందు గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది పూర్తి స్థాయిలో విధుల్లో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను క్రమబద్ధీకరించడం లేదు సరికదా.. కనీసం ప్రొబేషన్ అయినా ప్రకటించకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఫిట్ మెంట్ ప్రకటించిన జగన్ రెడ్డి సర్కార్ తమను అస్సలు పట్టించుకోకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో ఓటీఎస్ డబ్బుల వసూలులో కీలక పాత్ర పోషించే గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కూడా ఓటీఎస్ తుస్సుమనడానికి కారణం అని విశ్లేషణలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీఓ 225 ప్రకారం డిమాండ్ నోటీసులు అందుకున్న నిరుపేదలు ఫీజులు కడితే ఖజానాకు దాదాపు 4 వేల కోట్లు వస్తాయనేది అధికారులు చెబుతున్న మాట. ఇలా పట్టణ శివారు ప్రాంతాలు, మురికివాడలు, సుదూర ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి డిమాండ్ నోటీసులు పంపింది. ఉచిత క్రమబద్ధీకరణ అర్హతను 100 చదరపు గజాల నుంచి 75 చదరపు గజాలకు తగ్గించేసి ఫ్రీ రెగ్యులేషన్ జాబితాలోకి వేలాది మందికి ఛాన్స్ లేకుండా చేయడం జగన్ సర్కార్ కే చెల్లిందనే విమర్శలు రావడం గమనార్హం. ఉచిత క్రమబద్ధీకరణ జాబితాలోకి రాని వారంతా స్థానిక మార్కెట్ రేట్ ప్రకారమే ఫీజు చెల్లించాలని వైసీపీ సర్కార్ పెట్టిన కండిషన్ ఎందరో నిరుపేదలకు తలకు మించిన భారంగా మారింది. ఓటీఎస్ ఫీజుల నెపంతో నిరుపేదల నుంచి కూడా నిధులు పిండేయాలన్న వైసీపీ సర్కార్ కుటిలయత్నానికి పెద్ద గండే పడడానికి మరో కారణం కూడా ఉంది. పేదల వద్ద లక్షలాది రూపాయలే ఉంటే ప్రభుత్వ భూముల్లో ఎందుకు గూడుకట్టుకుంటారు? ఓటీఎస్ పేరుతో నిరుపేదల్ని సర్కార్ సతాయిస్తే.. లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారనే ప్రాథమిక అవగాహన కూడా ఈ సర్కార్ కు లేదా? అని పలువురు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఓటీఎస్ అమలయ్యే పనేనా? అనే పెద్ద ప్రశ్న తెర మీదకు వస్తోంది.
Publish Date: Jan 21, 2022 12:06PM

విజయసాయి వ‌ర్సెస్‌ రఘురామ.. ట్విట‌ర్ ఫైట్‌.. ర‌చ్చ రంబోలా...

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఉన్న‌ట్టుండి నిద్ర లేచారు. త‌మ పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌పై ట్వీట్ ఫైట్‌కి దిగారు. ఈయ‌నేదో నిఖార్సైన లీడ‌ర్‌గా.. ఆయ‌న్ను ఏదో గిల్లాల‌ని చూశారు. గిల్లితే గిల్లించుకునే ర‌కం కాదుగా ర‌ఘురామా. అందుకే, లెక్క‌కు లెక్క స‌రి చేశారు. ట్వీట్‌కు ట్వీట్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. విజ‌య‌సాయి, ర‌ఘురామ‌ల మ‌ధ్య జ‌రిగిన ఆ ట్విట‌ర్ వార్‌.. ర‌చ్చ రంబోలాగా మారింది.  మొద‌ట‌.. విజ‌య‌సాయినే మొద‌లుపెట్టారు. జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా!.. అంటూ ఏదేదో అన్నారు. పెయిడ్‌ మైక్‌.. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు.. నీచపు జీవితం.. ప్రజలను తాకట్టు.. ఇలా ఏదేదో అనేశారు విజ‌య‌సాయి. ర‌ఘురామ ఊరుకుంటారా? స్ట్రాంగ్ రిటార్డ్ ఇచ్చారు. అవునా? ఏ1కు భారంగా ఉందనే కదా నన్ను కడతేర్చాలనుకున్నారు. పాపం వివేకానందరెడ్డిలా! మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్‌ ఏ2..! అంటూ ర‌ఘురామ ఘాటు రిప్లై... ఇక్క‌డితో ఆగ‌లేదు వారిద్ద‌రి ట్విట‌ర్ వార్‌. విజ‌య‌సాయి మ‌రింత రెచ్చిపోయారు.. ఎవ‌రి మెప్పు కోస‌మో విప్పుకు తిరుగున్నారు.. ప‌క్క‌వాళ్ల‌కు ప్రేమ‌బాణాలు.. ఢిల్లీలో కూర్చొని కాక‌మ్మ‌ క‌బుర్లు.. రాళ్ల‌తో కొడ‌తారు.. అంటూ సాయిరెడ్డి మ‌రింత రెచ్చగొట్టారు. అందుకు త‌గ్గ‌ట్టే ర‌ఘురామ సైతం రెచ్చిపోయారు. రాజ్య‌స‌భ రెన్యువ‌ల్‌.. ఏ1 చేతిలో త‌న్నులు తిన‌డం ఖాయం అంటూ ర‌ఘురామ విజ‌య‌సాయిరెడ్డికి ట్విట‌ర్‌లో టిట్ ఫ‌ర్ టాట్ ఇచ్చారు. వీరిద్ద‌రి డైలాగ్ వార్‌ మ‌ధ్య‌లో నెటిజ‌న్లూ ఎంట‌రై.. విజ‌య‌సాయికి మ‌రిన్ని వాత‌లు పెట్టారు.  
Publish Date: Jan 21, 2022 11:36AM

చ‌లో గుడివాడ.. తీవ్ర ఉత్కంఠ‌.. కొడాలి క‌న్వెన్ష‌న్‌పై టీడీపీ పోరుబాట‌...

గుడివాడ‌లో గ‌డ‌బిడ మొద‌లైంది. సంక్రాంతి వేడుక‌ల పేరుతో ఏకంగా క్యాషినోలే ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌జ‌లంతా మండిప‌డుతున్నారు. గుడివాడ‌కు గోవా క‌ల్చ‌ర్ తీసుకురావ‌డంపై ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌జాప‌క్షాన టీడీపీ పోరుబాట ప‌ట్టింది. చ‌లో గుడివాడ అంటూ నిజ‌నిర్థార‌న క‌మిటీ రంగంలోకి దిగింది.  అయితే, కె క‌న్వెన్ష‌న్‌లో మందు, విందు, చిందు, పేకాట‌, క్యాషినోల‌ను అడ్డుకోని పోలీసులు.. టీడీపీ వాళ్లు వ‌స్తుంటే మాత్రం ఖాకీలు రంగంలోకి దిగిపోయారు. మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ బృందం రాక విషయాన్ని తెలుసుకుని.. వైసీపీ శ్రేణులు సైతం కన్వెన్షన్‌ సెంటర్ ద‌గ్గ‌ర‌కు భారీగా చేరుకున్నాయి.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. రోప్‌పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ నెహ్రూ చౌక్‌, నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ద‌గ్గ‌ర‌ ప్రత్యేక బలగాలను మోహరించారు. దీంతో.. టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటనపై ఉత్కంఠ నెల‌కొంది.  క్యాసినో నిర్వహణపై టీడీపీ ముఖ్య నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గుడివాడలో పర్యటించి క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు సమాయత్తమైంది.  త‌న‌కు చెందిన కె కన్వెన్షన్‌ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా? ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిని తప్పిస్తే న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు. 
Publish Date: Jan 21, 2022 11:16AM