కాళేశ్వ‌రం కాద‌ది కాసులు రాల్చేశ్వ‌రం!

కాళేశ్వ‌రం కాదు అది కూలేశ్వ‌రం అంటారు సీఎం  రేవంత్. కానీ ఇక్క‌డ సీన్ చూస్తే అది కొంద‌రు ఉన్న‌తాధికారుల పాలిట కాసుల క‌ల్ప‌వృక్షం అన్న‌ది తెలుస్తోంది. మొన్న హ‌రిరాం అనే ఈఎన్సీ ప‌ట్టుబ‌డితే అత‌డి అక్ర‌మాస్తుల విలువ వంద కోట్లు. అదే ఓపెన్ మార్కెట్లో రెండు వంద‌ల యాభై కోట్లు. త‌ర్వాత నూనె శ్రీధ‌ర్ అనే మ‌రో ఈఈ ప‌ట్టుబ‌డితే ఇత‌డి ఆస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు ఏసీబీ అధికారులు. అయితే దీని మార్కెట్ వాల్యూ 450 కోట్ల వ‌ర‌కూ ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ రావు అనే ఈ పెద్ద‌మ‌నిషి అక్ర‌మాస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు. దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 450 నుంచి ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుందని స‌మాచారం. ఈ ముగ్గురి అక్ర‌మాస్తుల విలువే వెయ్యికోట్ల పై మాట‌.

ఈ ముగ్గురి అక్ర‌మార్జ‌న క‌థ ఒక్కొక్కొరిదీ ఒక్కో ప్ర‌త్యేక అవినీతి అధ్యాయంగా చెబుతారు. శ్రీధ‌ర్ త‌న అక్ర‌మార్జ‌న ద్వారా వ‌చ్చిన డ‌బ్బు ఏం చేయాలో అర్ధం కాక కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్ లో చేశార‌ట‌. ఇక ముర‌ళీధ‌ర్ రావు త‌న కొడుకును ఒక కంపెనీలో బ‌ల‌వంతానా డైరెక్ట‌ర్ గా చేసి.. ఈ కంపెనీకి కాళేశ్వ‌రం స‌బ్ కాంట్రాక్టులు వ‌చ్చేలా చేసి.. త‌ద్వారా త‌న అవినీతి సొమ్ము ఏరులై పారించార‌ట‌.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ప‌ద‌వీకాలం పూర్త‌యిన ఈ ఈఎన్సీని అదే ప‌నిగా.. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ముర‌ళీధ‌ర‌రావు అనే ఈ ఈఎన్సీ అవినీతి స‌ర‌ళి ఎలా సాగిందంటే.. ప్ర‌తి సంత‌కానికి విలువ క‌ట్ట‌డం. బిల్లులు ఆపేస్తానంటూ  బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై త‌న బంధు మిత్రుల‌కు స‌బ్ కాంట్రాక్టులు ఇప్పించ‌డం.. ఇదీ ఈయ‌న‌గారి నిర్వాకం. దీంతో కుప్ప‌లు తెప్ప‌లుగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన  ఘ‌న‌త ఈయ‌న సొంతంగా చెబుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.

పై స్థాయి అధికారులే ఒక్క కాళేశ్వ‌రం పేరు చెప్పి వెయ్యి కోట్ల పైగా కూడేస్తే.. కింది స్థాయి అధికారుల మాటేంటి? ఆపై ఈ మొత్తం ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న చేసిన ఆ పై స్థాయి వారి మాటేంటి? అన్న‌దిప్పుడు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేద‌ట‌. 

ఈ ప్రాజుక్టును 80 వేల 500 కోట్ల‌తో మొద‌లు పెట్ట‌గా.. దాని అంచ‌నా వ్య‌యాల‌ను అంచ‌లంచ‌లుగా పెంచీ పెంచీ ల‌క్షా ముప్పై వేల కోట్ల‌కు చేర్చార‌ట‌. ఒక్క మేడిగ‌డ్డ ప్రాజెక్టునే వంద సార్ల‌కు పైగా.. రివైజ్ అంచ‌నాల‌ను పెంచి ప్రాజెక్టు కాస్ట్ పైపైకి ఎగ‌బాకేలా చేశార‌ట‌. దీన్నిబ‌ట్టీ ఈ ప్రాజెక్టు కూలేశ్వ‌ర‌మా.. లేక కాసులు రాల్చేశ్వ‌ర‌మా? అర్ధం చేసుకోవాలంటారు ఇరిగేష‌న్ నిపుణులు.