శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

  తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.  ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,  టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 8:50PM

భారత్‌కు చేరుకున్న పుతిన్...అపూర్వ స్వాగతం పలికిన మోదీ

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీ చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ  సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధాని ప్రోటోకాల్‌ను ప్రక్కకు పెట్టి పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.  ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్‌ గౌరవార్థం రాత్రి ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. మొత్తం 8 మంది మంత్రుల బృందంతో పుతిన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ట్వీట్ చేసింది. అత్యంత పటిష్ఠ భద్రత మధ్య పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది.
Publish Date: Dec 4, 2025 8:37PM

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం : డిప్యూటీ సీఎం పవన్

  “వర్షించని మేఘం... శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు.  ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే... ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది.   • మన ఐక్యతే రాష్ట్రానికి బలం   కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా... మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు " అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది.    •   కష్టపడితేనే... ప్రతిఫలం   నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు.  మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే... దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే... ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో  మనం అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలి. అవినీతిని అరికట్టి బలహీనుల  గొంతుగా మారాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన  చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారు.  గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాం. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం  సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం. ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం” అన్నారు.  స్వచ్ఛరథాలు పరిశీలన  స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు.  ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గురజాల జగన్మోహన్,  అరణి శ్రీనివాసులు,  కె. మురళీమోహన్,  అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్,  శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
Publish Date: Dec 4, 2025 7:15PM

సంధ్య థియేటర్ శ్రీ తేజ ఘటనపై దిల్ రాజు స్పందన

  ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా చూడడానికి చూడడానికి వచ్చిన ఓ కుటుంబ సభ్యుల్లో శ్రీ తేజ తల్లి  మరణించగా... శ్రీ తేజ తీవ్రస్థాయిలో గాయపడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ఈ ఘటనపై దిల్ రాజ్ స్పందిస్తూ శ్రీ తేజ తండ్రిని కలిసి మాట్లాడారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, నిర్మాత దిల్ రాజు ఆయన కుటుంబానికి అందిస్తున్న సహాయంపై వివరాలు వెల్లడించారు. శ్రీ తేజ భవిష్యత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఆయన మీడియాతో పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ మరియు అరవింద్ ఇద్దరు స్పందించడమే కాకుండా శ్రీ తేజ పేరుతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించానని చెప్పారు.  అయితే ఆ రెండు కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీ తేజ తండ్రికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఘటన అనంతరం ఆస్పత్రిలో జరిగిన చికిత్స కోసం అల్లు అర్జున్ మరియు అతని తండ్రి అరవింద్ దాదాపు రూ. 70 లక్షల వరకు చెల్లించినట్లు కూడా ఆయన వెల్లడించారు. అదే సమయంలో, శ్రీ తేజ పునరావాసానికి అవసరమైన రిహాబిలిటేషన్ ఖర్చులను పూర్తిగా అల్లు అర్జున్ భరిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. అల్లు అర్జున్ టీం ఘటన జరిగిన మొదటి రోజు నుంచే సమగ్రంగా స్పందించారని, అవసరమైన అన్ని సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం శ్రీ తేజ తండ్రి మాట్లాడుతూప్రమాదం జరిగిన తర్వాత నుంచి చిత్రపరిశ్రమ అనేక విధాలుగా తమకు అండగా నిలుస్తోందని,అల్లు అర్జున్ టీం నుంచి వచ్చిన సహాయం ముఖ్య భరోసాగా మారిందని తెలిపారు.ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమున్న నేపథ్యంలో దిల్ రాజుతో మాట్లాడగా, ఆయన అన్ని విధాల సహాయానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.శ్రీ తేజ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో, కుటుంబ సభ్యులు, పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Publish Date: Dec 4, 2025 6:01PM

తెలుగు వన్‌కు 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లు...ఘనంగా సంబరాలు

  తెలుగు డిజిటల్‌ ప్రపంచంలో మరో గర్వకారణమైన మైలురాయిని తెలుగు వన్ ఛానల్ అందుకుంది. 12 మిలియన్ సబ్‌స్క్రైబర్లను చేరుకోవడంతో, హైదారాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛానల్ ఎండీ రవిశంకర్ కంఠమనేని ప్రత్యేకంగా హాజరై సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రవిశంకర్ కేక్ కట్ చేసి అందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి టీమ్ మొత్తం పెట్టిన కృషి, నిబద్ధత కారణమని పేర్కొన్నారు. “ఈ రోజు మనం జరుపుకుంటున్నది కేవలం ఒక మైలురాయి కాదు… మనపై ప్రేక్షకులు ఉంచిన విశ్వాసానికి ప్రతీక” అని చెప్పారు. ఇటీవలి సిల్వర్ జూబ్లీ వేడుకలతో తెలుగు వన్ తాను సాగించిన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా గుర్తుచేసుకున్నామని, ఇప్పుడు ఈ కొత్త విజయంతో మరొక మెట్టు ఎక్కినట్టేనని అన్నారు. సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడే కంటెంట్ అందించడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “మన తదుపరి లక్ష్యం 20 మిలియన్లు కాదు… నేరుగా 34 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు. తెలుగు వన్‌కి దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నాం” అని రవిశంకర్ అన్నారు.సంస్థలో కష్టపడి పనిచేస్తే ఉద్యోగులకు మరింత మంచి భవిష్యత్తు సిద్ధంగా ఉంటుందని సిబ్బందిని ఉత్సాహపరిచారు. “25 ఏళ్ల క్రితం తెలుగు వన్‌కు వేసిన ఫౌండేషన్‌… ఇప్పుడు కోట్లాది మంది ప్రేమతో మహా వృక్షంగా మారింది. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం” అని ఎండీ రవిశంకర్ తెలిపారు
Publish Date: Dec 4, 2025 5:42PM

రెండేళ్లుగా ఒక గంట కూడా రెస్ట్ తీసుకోలేదు : సీఎం రేవంత్‌

  గత రెండేళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చూట్టారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఆతర్వాత అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.  ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నట్లు రేవంత్ అన్నారు. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రజలు బీఆర్‌ఎస్ పాలనకు చమర గీతం పాడారని సీఎం అన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాతో అన్నారు.  ఇదే విషయం నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీతో మాట్లాడాను అని సీఎం అన్నారు. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని రేవంత్ అన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్ బస్సు తీసుకొచ్చి నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా అని తెలిపారు.
Publish Date: Dec 4, 2025 4:09PM

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో కీరవాణి కచేరీ

  భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక, కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈవేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి తన అద్బుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. కీరవాణి 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు. ప్రముఖ వీణా విద్యాంసురాలు పి.జయలక్ష్మీ వీణా కార్యక్రమం, కళా కృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సంప్రదాయ కళా రూపాలు సందడి చేయనున్నాయి.  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబించేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గు డోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు పాటు జరిగే కార్యక్రమాల్లో రోజంతా సాంస్కృతిక కళారూపాలతో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.
Publish Date: Dec 4, 2025 3:17PM

పంచాయతీ పంచాయితీ!.. గ్రామాల్లో ఉద్రిక్తతలు.. విషాదాలు!

తెలంగాణలో పంచాయతీల పంచాయితీ జోరుగా ఉంది. స్థానిక ఎన్నికల సందర్బంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ వేడి పెచ్చరిల్లింది. పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగకపోయినా.. పొలిటికల్ యాక్టివిటీ మాత్రం రసకందాయంలో పడింది. అదలా ఉంచితే.. తెలంగాణలో   పంచాయతీ ఎన్నికల పంచాయితీ పలు గ్రామాలలో ఉద్రిక్తతలకు, మరికొన్ని గ్రామాలలో విషాదాలకూ దారి తీశాయి.  నామినేషన్ల విషయంలో తలెత్తిన విభేదాలతో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, కొన్ని కుటుంబాలలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.  అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై అంటే సై అంటున్న ఉదంతాలూ  ఉన్నాయి.  నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు. ఈ విషయమై ఇంట్లో  ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  తల్లి మందుల లక్ష్మమ్మ (40) ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. అయితే ఆమె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త చెబుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోవార్డు మెంబర్‌గా నామినేషన్ వేసినందుకు భర్త మంద లించడంతో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.   
Publish Date: Dec 4, 2025 3:13PM

తెలంగాణలో స్తంభించిన రవాణా శాఖ సేవలు

  తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు సంబంధించిన వాహన్-సారధి సేవలు మళ్లీ మొరయిస్తున్నాయి. తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నేమ్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ వంటి కీలక సేవల కోసం ఉపయోగించే వాహన్–సారథి సెంట్రల్ సర్వర్ మరోసారి పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి జంటనగరాలతో సహా అన్ని జిల్లాల్లోని ఆర్‌టిఓ కార్యాలయాలకు చేరుకున్న వాహనదారులు  క్యూ లైన్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.  సెంట్రల్ సర్వర్ కనెక్టివిటీ సమస్యలతో ఏ పని ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు. సెంట్రల్ సర్వర్ స్పందించడం లేదని అధికారులు స్పష్టం వ్యక్తం చేశారు మా చేతుల్లో లేదు ఢిల్లీ లెవెల్ లో సమస్య ఉంది.. దానిని ఢిల్లీ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందని మాత్రమే అధికారులు చెబుతున్నారు.  దీంతో కార్యాలయాల్లో వాహనదారులు, స్టాఫ్ అందరూ నిరాశతో గడిపే పరిస్థితి ఏర్పడింది.కాగా, వాహన్–సారథి వ్యవస్థలో ఇదే తరహా అంతరాయాలు గత కొంతకాలంగా పునరావృతం అవుతుండటం ప్రజా సేవలపై ప్రభావం చూపుతున్నట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, సేవలను నిరాటంకంగా అందించేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. రవాణా శాఖ సారధిలో తలెత్తిన సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కరమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో సాంకేతిక సమస్యలపై మంత్రి అధికారులతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు 3 గంటల్లో పూర్తిగా పరిష్కరమవుతాయని పొన్నం తెలిపారు.  
Publish Date: Dec 4, 2025 2:44PM

అమ్మకానికి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్!

పాకిస్థాన్  ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ ఆర్థిక సహాయం తప్పని సరి. అయితే పాకిస్థాన్ ఆర్థిక అరాచకత్వంపై ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన ఐఎంఎఫ్ పాక్ ను ఆదుకోవడానికి విధిస్తున్న ప్రతి షరతుకూ పాకిస్థాన్ తలొగ్గక తప్పడం లేదు. ఆ క్రమంలోనే ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ) ఒత్తిడికి తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అంగడి సరుకుగా మార్చేసింది. ఔను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఇందు కోసం ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని వాటాలను పూర్తిగా అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈ బిడ్డంగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని కూడా సెలవిచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థలోని 51శాతం నుంచి వంద శాతం షేర్లు అమ్మేయడానికి ఈ బిడ్డింగ్ జరగనుంది. పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకు వచ్చిన ఐఎంఎఫ్.. ఆ ప్యాకేజీ అందించాలంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలంటూ విధించిన షరతు మేరకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అన్నిటి కంటే ఆశ్చర్యం ఏమిటంటే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ కోసం బిడ్డింగ్ కు అర్హత సాధించిన నాలుగు కంపెనీలలో ఒకటి పాకిస్థాన్ నియంత్రణలో ఉండే ఫౌజీ ఫౌండేషన్ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి కావడమే. మొత్తంగా పాకిస్థాన్ ఆర్థిక సుడిగుండంలోంచి బయటపడేందుకు ప్రభుత్వ సంస్థలను అయిన కాడికి అమ్మేయాల్సిన దృస్థితికి దిగజారింది. 
Publish Date: Dec 4, 2025 2:18PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి? : టీపీసీసీ చీఫ్

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశ సంపద అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాంటి ఎస్పీ బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేంటని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో  లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు  దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. నగరం కూడా కాలుష్యరహితంగా మారుతుందని మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఏం చేసినా కేసీఆర్ కుటుంబానికి అవినీతి మాదిరిగా కనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేయిల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date: Dec 4, 2025 2:17PM

వాస్తవ వేదిక.. ప్రజాభిప్రాయాల గొంతుక

ఏపీ టు తెలంగాణ, అమలాపురం టు అమెరికా, ఆమాటకొస్తే ఈ భూమ్యాకాశాల మధ్య ఎక్కడి నుంచి ఎందాకైనా.. విషయం ఏదైనా.. వాస్తవాలను నిగ్గు తేల్చే నిఖార్సయిన వేదిక.. వాస్తవ వేదిక!  జమీన్ రైతు, తెలుగు వన్  సంయుక్త నిర్వహణలో.. జరుగుతోందీ చర్చా వేదిక. ఈ వేదిక ద్వారా అంశమేదైనా... సమాజ హితకరమైన వాడీ వేడీ చర్చ జరుగుతోంది.  జమీన్ రైతు 95 ఏళ్ల నాటి సుదీర్ఘ జర్నలిస్టిక్ అనుభవం గల పత్రిక. ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న ఏ పత్రికకూ ఈ స్థాయిలో అనుభవం లేదన్న విషయం నాటి పాఠకులకు సుపరిచితమే. నేటి కాలానికి తగ్గట్టుగా తమ వాణి వినిపిస్తున్న పత్రిక జమీన్ రైతు. ఇక తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తెలుగు వారి మధ్య వారధిగా.. వారి వారి అభిప్రాయాలకు గొంతుకగా, వేదికగా కొనసాగుతోంది. అలాంటి తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ..మధ్య ముఖా ముఖీ.. అది సమాజ హితానికి ఓ దిక్సూచి. మార్గనిర్దేశకత్వంలో సవ్యసాచి.  ప్రస్తుతం దేశంలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన వారే. అలాంటి విద్యార్ధులకు సంబంధించి ఉద్యమాలు ఎలాంటివి? అవిప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు కాలేజీ రాజకీయాల నుంచే రాజకీయాలను మొదలు పెట్టిన హుషారైన కుర్రకారుకూ నేటి యువతకూ గల తేడాలేంటి? వారి ఉడుకురక్తంతో కూడిన ఉద్యమం ఏమై పోయింది? అన్న అంశంపై రెండు భిన్న పార్శ్వాలు ఒకే వేదికపై నుంచి వినిపించే గొంతుక.. ప్రజాభిప్రాయ దీపికగా మారనుందనడంలో సందేహం లేదు. కాబట్టి విజ్ఞులైన పాఠక, ప్రేక్షకులందరూ వాస్తవ వేదిక సెకండ్ ఎడిషన్ గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం విడుదలవుతుంది … చూసి అభిప్రాయ వ్యక్తీకరణ చేయాలని ఆశిస్తూ..  మీ తెలుగు వన్, జమీన్ రైతు.
Publish Date: Dec 4, 2025 1:02PM

హిడ్మాది ఎన్ కౌంటర్ కాదు ముమ్మాటికీ హత్యే.. మావోయిస్టుల లేఖ

మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మాది ఎన్ కౌంటర్ కాదనీ, అది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని సంచలన ఆరోపణ చేసింది   ఈ మేరకు వికల్ప్ పేరుతో  విడుదల చేసిన లేఖలో హిడ్మాను విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత హత్య చేశారని ఆరోపించింది. అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను  అదే రోజు పోలీసులు అదుపులోనికి తీసుకుని.. మూడు రోజుల తరువాత అంటే నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి  తీసుకెళ్లి హత్య చేశారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.   హిడ్మా కదలికల సమాచారాన్ని లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని పేర్కొంది.  హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను మావోయిస్టు పార్టీ దండకారణ్య జోనల్ కమిటీ ఖండించింది. మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమే ఆ ఆరోపణలు అని పేర్కొంది.  ఆపరేషన్ కగార్‌ ను వెంటనే నిలిపివేయాలని,హడ్మా హత్య సహా ఎన్ కౌంటర్ లపై  న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో డిమాండ్ చేసింది.  
Publish Date: Dec 4, 2025 11:59AM

ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం!

విరాట్ కోహ్లీ.. క్రీడలతో సంబంధం ఉన్నవారికీ, లేని వారికీ, అసలామాటకొస్తే అందరికీ చిరపరిచితమైన పేరు. దశాబ్దాలుగా భారత క్రికెట్ వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ పరుగుల దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఇండియన్ క్రికెట్  అన్నంతగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీపై ఇటీవల కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు, ఇక ఆటకు గుడ్ బై చేప్పేయడమే బెటర్ అంటూ కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ విమర్శలకు, విమర్శకులకూ కోహ్లీ నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానం చెప్పారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ అద్భుత సెంచరీలు సాధించి తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చాటాడు. తొలి వన్డేలో 135 పరుగులతో చెలరేగిన కోహ్లీ, బుధవారం (డిసెంబర్ 30 జరిగిన రెండో వన్డేలో  కూడా శతకబాదాడు. ఈ రెండు మ్యాచ్ లలో విరాట్ బ్యాటింగ్ చూసిన వారంతా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వింటేజ్ కోహ్లీని చూస్తున్నామని అంటున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు కెప్టెన్ గా నాడు కోహ్లీలో కనిపించిన ఫైర్ మళ్లీ కనిపిస్తోందనీ, అలాగే బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగితే సెంచరీ చేయకుండా తిరిగి రాకూడదన్న పట్టుదల కోహ్లీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్నారు.  కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం అంటున్నారు.   విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ వన్డేలలో ఇప్పటి వరకూ 53 సెంచరీలు చేశాడు.    35 ఏళ్ల కోహ్లీ ఇప్పటికీ యాక్యురెసీ, యగ్రసివ్ నెస్, ఫిట్ నెస్ విషయంలో కొత్త వారికి ఒక మోడల్ గా నిలుస్తున్నాడనడంలో సందేహం లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ ఇప్పటికీ సింగిల్ రన్ కోసం వికెట్ల మధ్య చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతాడు. ఆ ఫిట్ నెస్ కొత్త కుర్రాళ్లలో కూడా కనిపించదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.   
Publish Date: Dec 4, 2025 10:24AM

పుతిన్ భారత పర్యటన.. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ బంధాలు మరింత బలోపేతం!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. పుతిన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం (డిసెంబర్ 4)న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో పుతిన్, మోడీల మధ్య కీలక చర్చలు జరగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వాణిజ్యం,  వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై ఇరువురి మధ్యా జరిగే ద్వైపాక్షిక చర్చలలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాక్స్ టెర్రర్ యావత్ ప్రపంచాన్నీ కుదిపి వేస్తున్న నేపథ్యంలో మోడీ, పుతిన్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    రష్యా నుంచి భారత్ చమురుకొనుగోలును ఆపేయాలంటూ తాను జారీ చేసిన హుకుంను భారత్ లెక్క చేయకపోవడంతో ఉక్రోషంతో రగిలిపోతున్న ట్రంప్ సుంకాలను పెంచేసి భారత్ ను లొంగదీసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్ ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడి భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే పుతిన్ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమౌతుండటమే కాకుండా.. ఈ పర్యటన విజయవంతం కావాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.  ఇలా ఉండగా పుతిన్ బారత్ లో పర్యటించడానికి ముందే.. భారత్ లో రష్యా సంబంధాల పట్ల సానుకూల ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య లోటు విషయంలో భారత ఆందోళనలు తమకు తెలుసంటూనే.. దాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామనీ, ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ మధ్య చర్చలు ఉంటాయనీ పుతిన్ పేర్కొన్నారు.   ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్లు పుతిన్ చెప్పారు.   
Publish Date: Dec 4, 2025 9:56AM

గాన గంధర్వుడికి ప్రాంతీయత అంటగడతారా?

హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉండే  ర‌వీంద్ర భార‌తిలో గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న పై జరుగుతున్న రగడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు శుభ‌లేఖ సుధాక‌ర్ అధ్వ‌ర్యంలో ఎస్పీ బాలు విగ్ర‌హం ఇక్క‌డ  ఏర్పాటు చేసే విష‌యంలో కొందరు అనవసర వివాదానికి తెరలేపారు.   ఆంధ్రప్రదేశ్ కు చెందిన  ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హం తెలంగాణ‌లో స్థాపించడమేంటన్న చర్చను తెరపైకి తీసుకువచ్చి రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకించడం ద్వారా కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికీ, ఆంధ్రా, తెలంగాణ మధ్య విభేదాల సృష్టికీ, తెలంగాణ సెంటిమెంట్ ను ప్రేరేపించడానికి ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు బాలు అభిమానులు. ప్రజలు. ఆ మాట‌కొస్తే ఈ సాంస్కృతిక భ‌వ‌నానికి  పెట్టిన ర‌వీంద్ర భార‌తి అనే పేరు ఇక్క‌డ పుట్టిన వ్యక్తిది ఎంత మాత్రం కాదనీ,  బెంగాల్లో పుట్టిన రీవీంద్ర నాథ్ ఠాగూర్ పేరు మీద ఇక్కడ రవీంద్రభారతి వెలిసిందన్న సంగతని గుర్తు చేస్తూ, జాతీయగీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కీ ప్రాంతీయత అంటగడతారా అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా జనం అందరూ మైమరిచి ఆలకించి పరవశించిపోయే మధుర గీతాలను పాడారనీ, ఆ గీతాలకు, మన చెవుల్లో అమృతం పోసిన ఆ గొంతుకకు ప్రాంతీయత అంటగట్టడం సరికాదనీ అంటున్నారు.    ఎస్పీ బాలు పాడిన పాట‌లు ఆంధ్ర, తెలంగాణ తేడా లేకుండా అంద‌రూ చెవులప్పగించి విన్నారు. వింటున్నారు.  ఆస్వాదించారు. ఆస్వాదించారు. పైగా బాలు పాటలంటే చెవికోసుకునే వారు  తెలంగాణలో కూడా అత్యధికంగా ఉన్నారు. మరి ఇంత కాలం బాలూ గానామృతాన్ని గ్రోలిన తెలంగాణ వాదులు  ఇప్పుడా ఆస్వాద‌న మొత్తం తిరిగిచ్చేస్తారా?  ఇవ్వగలరా? అని  నిలదీస్తున్నారు బాలు అభిమానులు.  క‌ళ‌కు ఎల్ల‌ల్లేవు. క‌ళాకారుల‌కు త‌ర‌త‌మ బేధాలే  కాదు ప్రాంతీయ భాషాభిమానాలు కూడా  ఉండవు. ప్రాంతీయత పేరుతో బాలూ వంటి గాన గాంధర్వుడి ప్రతిభను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఎవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదు.  తెలంగాణకు చెందిన పైడిజ‌య‌రాజ్  ముంబై వెళ్లి అక్క‌డి హిందీ సినిమాల్లో రాణించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు ఆనాడు తెలుగు సినిమాలో ఒక వెలుగు వెలిగారు. ఇక్కడి వారికి అంత‌టి ప్రాంతీయాభిమానం ఉంటే వారిద్ద‌రి విగ్ర‌హాలిక్క‌డ ఇప్పటి వరకూ ఎందుకు ప్ర‌తిష్టించ‌లేదు?   ఎక్క‌డో బీహార్ కి చెందిన కేసీఆర్ పూర్వీకులు ఆంధ్ర‌ప్రాంతంలోని బొబ్బిలికి వ‌చ్చి అటు పిమ్మ‌ట తెలంగాణ‌లోని చింత‌మ‌డ‌క‌కు వ‌ల‌స వ‌చ్చారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం పోరాడారు.  బీహారీ కేసీఆర్ సాధించిన‌  తెలంగాణ తిరిగి ఆంధ్ర‌లో క‌లిపేస్తారా?  కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదంటూ ఆయనను డిజ్ ఓన్ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు.   ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సాయుధ  పోరాటంలో పాల్గొన్న చాక‌లి  ఐల‌మ్మ విగ్ర‌హాలున్నాయి. ఆ విగ్ర‌హాల‌నేమీ ఇక్క‌డి వారు వ‌ద్ద‌న‌డం లేదు. అంతెందుకు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుంద‌ర‌య్య వంటి ఎంద‌రో క‌మ్యూనిస్టు పోరాట యుధులు అండ‌గా నిలిచారు. మ‌రి వారి త్యాగాల‌ను తిరిగిచ్చేయ‌గ‌ల‌రా? అని కూడా నిలదీస్తున్నారు.  మొన్న‌టికి మొన్న జూబ్లీహిల్స్ ఉప  ఎన్నిక‌ల్లో న‌వీన్ యాద‌వ్  గెలిస్తే మైత్రీవ‌నం ప్రాంతంలో .. ఎన్టీఆర్ విగ్ర‌హ స్థాప‌న చేస్తామ‌ని సాక్షాత్ సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఆ విగ్ర‌హ ఏర్పాటును కూడా ఇలాగే వ్య‌తిరేకిస్తారా?  అంతెందుకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు ఎన్టీఆర్ పేరునే తన కుమారుడు కేటీఆర్ కు పెట్టానని స్వయంగా కేసీఆరే చెప్పారు. అలాంటిది.. తన పాటల మాధుర్యాన్ని ప్రాంతాలకు అతీతంగా అందరికీ పంచారు. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను అడ్డుకోవడం ఎంతమాత్రం సమజసం కాదు.    రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసుందాం అంటూ చంద్రబాబు, కేసీఆర్ సహా రాజకీయాలకు అతీతంగా నేతలందరూ విభజన సందర్భంగా ఉద్ఘాటించారు. అటువంటిది రాష్ట్ర విభజన జరిగి పదిహేనేళ్లు దాటిపోయిన తరువాత కుచ్ఛితమైన స్వార్థ రాజకీయాల కోసం మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలను వివాదం చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు.    ఎస్పీబీకి భార‌త ర‌త్న ఇవ్వాల‌ని త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి అభ్య‌ర్ధ‌న‌లు వెళ్లాయి.  ఎస్పీబీ త‌మిళుడు కాదు,  మ‌ల‌యాళీ కాదు అంటూ ప్రాంతీయ విభేదాలను చూపలేదు. మన తెలుగువారికి ఎందుకీ తెగులు అన్న ఆవేదన ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తం అవుతోంది.  
Publish Date: Dec 4, 2025 9:33AM