చేయి చాస్తే మనసుని గెలవాల్సిందే!

కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడో లేక పాత పరిచయస్తుడే ఎక్కడన్నా తారసిల్లినప్పుడో కరచాలనం చేయడం సంప్రదాయం. వేల సంవత్సరాల ఈ ఆచారం బహుశా గ్రీసులో మొదలై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఇద్దరు సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, తమ చేతిలో ఏ ఆయుధమూ లేదనీ, తాము స్నేహానికి సిద్ధంగా ఉన్నామనీ తెలియచేసేందుకు మొదలైన అలవాటే కరచాలనంగా మారి ఉంటుందని భావిస్తున్నారు. చాలా ఆషామాషీగా చేసే ఈ కరచాలనం వెనుక ఒక శాస్త్రం ఉందనీ, మనం చేసే కరచాలనం మన స్వభావాన్ని బయటపెడుతుందనీ అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని పైకి ఎవ్వరూ చెప్పకపోయినా, మన కరచాలనం అవతలివారిలో మన మీద ఒక అభిప్రాయం ఏర్పడేందుకు దోహదపడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎదుటివారి మనసుని గెలుచుకోవాలంటే కరచాలనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...     * కరచాలనం చేసేటప్పుడు ఎటో చూస్తూ ఉంటే, మనం ఏదో మొక్కుబడిగా కరచాలనం చేసినట్లు ఉంటుంది. అందుకని చిరునవ్వుతో ఎదుటివారి కళ్లలోకి చూస్తూ కరచాలనం చేయాలి. * చాలా సందర్భాలలో అవతలి మనిషి కరచాలనానికి చేయిచాచగానే అసంకల్పితంగా మనం కూడా చేయి చాచేస్తాము. చేతులు చెమటతో తడిగా ఉన్నా, లేక చేతులకి ఆహారపదార్థం ఉన్నా పెద్దగా పట్టించుకోము. ఇలాంటి చేతులతో కరచాలనం చేస్తే అవతలి వ్యక్తికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందుగా అరచేతులని చటుక్కున ప్యాంటుకి తుడుచుకుని కరచాలనం చేయడంలో తప్పులేదు. * కరచాలనం ఎప్పుడూ నేరుగా, స్పష్టంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి చొరబడిపోయి కరచాలనం చేయడం, నడుము సందుల్లోంచి చేయి చాచడం మర్యాద అనిపించుకోదు. అవతలి మనిషి హడావుడిగా ఉన్నప్పుడు అతనితో కరచాలనం చేయాలి అనుకుంటే, ముందుగా అతన్ని పలకరించి, అతని దృష్టిని ఆకర్షించి తరువాత అతనితో కరచాలనం చేస్తే సరిపోతుంది. * కరచాలనం చేసేటప్పుడు అరచేయి మొత్తాన్నీ అవతలి వ్యక్తి అరచేతితో కలపాలి. మరీ గట్టిగానూ, అలాగని మరీ సున్నితంగానూ కాకుండా స్థిరంగా కరచాలనం చేయాలి. మరీ గట్టిగా కరచాలనం చేస్తే మీరు అతివిశ్వాసం ఉన్న మనిషన్న భావన అవతలివారిలో కలుగుతుంది. అలాకాకుండా మరీ సున్నితంగా కరచాలనం చేస్తే మీకు అవతలి వ్యక్తంటే చులకన్న అన్న భావం ఏర్పుడుతుంది. * కరచాలనం చేసేటప్పుడు చేతులను రెండుమూడుసార్లు ఊపితే సరిపోతుంది. అలా కాకుండా చేతిని వదలకుండా పట్టుకునే ఉంటే, అవతలి వ్యక్తిలో ఇబ్బంది మొదలవుతుంది. అలాగే కరచాలనం చేసేటప్పుడు అరచేయి పక్కకే ఉండాలి. కరచేలనం చేస్తూ అరచేతిని పైకి తిప్పితే అవతలి వ్యక్తి మీద మనం ఆధిపత్యం చెలాయిస్తున్నామన్న సూచనను అందించినట్లు అవుతుంది. చిన్నపాటి కరచాలనం వెనుక ఇన్నేసి సూత్రాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అందుకనే ఈ హడావుడి అంతా ఎందుకు! హాయిగా మన భారతీయ సంప్రదాయంలో నమస్కారం చేస్తే సరిపోలా అనుకుంటే ఏ బాధా లేదు. అది మరింత గౌరవంగానూ, హుందాగానూ ఉంటుంది. కాకపోతే అవతలి వ్యక్తి కరచాలనం చేసేందుకు సిద్ధపడినప్పుడు నమస్కారం పెడితే అసలుకే ఎసరు వస్తుంది. అందుకని కరచాలనం చేయాల్సిన సందర్భాలలో పై విషయాలను కాస్త గమనించుకుంటే సరి! - నిర్జర
Publish Date:May 14, 2021

అతిగా కూర్చు౦టే అన్ని ఇబ్బందులే!

ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చునే అలవాటు వుంటే వెంటనే ఆ అలవాటును మార్చుకోండి. అప్పుడప్పుడు అలా నడుస్తూ వుండండి అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు. లేకపోతే మీ అయ్యుష్హు ను మీరే తగ్గించుకున్న వాళ్ళవుతారు, అనికూడా చెబుతున్నారు మనలో చాలామంది మెలకువగా వున్నపుడు 95% సమయాన్ని కూర్చునే గడుపుతున్నమట, దీనివలన గుండె జబ్బులు,అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఉదాహరణకి కుర్చీలోంచి కదలకుండా 60 నిముషాలు టీవీ చూస్తున్న ప్రమాదమే అంటే అర్ధం చేసుకోండి స్థిరంగా ఓ చోట కూర్చోవడమనేది ఎంత ప్రమాదమో!   మనం కదలకుండా ఓ చోట కూర్చున్నపుడు మన శరీరంలో లైపో ప్రోటీన్ లైపేజ్ అంటే LPL  అనే ఎంజైమ్ పనితీరు మందగిస్తుందట! ఇది వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోనికి మారుస్తుంది. కదలకుండా కూర్చున్నప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పేరుకుపోయి చివరికి అది పొట్ట తదితర బాగాల్లోకి నిల్వగా చేరిపోతుంది. అలాగే ఎక్కువసేపు కదల పొతే కండరాలు మందకొడిగా తయారై బిగుసుకుపోతాయ్. మన వెన్నుకు కూడా కూర్చోవటం సరిపడదట, ఎందుకంటే మన వెన్నెముక నిలబడేందుకు వీలుగా రుపొందిందింది. గంటల వెన్నుని నిటారుగా ఉంచి కూర్చోవాలంటే వీపు లేకపోతె వెన్నెముక చాలా బలంగా వుండాలి. వెన్నెముక అలా ముందుకు వంగినపుడు,భుజాలు కిందకి వాలిపోతాయి. క్రమంగా అది భుజాలు, మెడ, నడుం నొప్పులకి దారి తీస్తుందట కాబట్టి అతిగా కూర్చుని వుండటం వలన అన్ని ఇబ్బందులే!                                                                            
Publish Date:May 13, 2021

అబద్ధాల గురించి కొన్ని నిజాలు...

ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? అన్నది సులువుగా గుర్తించవచ్చుట. ఎదుటివారి ప్రవర్తన, వారి కాళ్ళు, చేతుల కదలిక, మాట తీరు ఇవన్నీ వారి నిజాయితీని ఇట్టే పట్టిస్తాయిట. ఉదాహరణకి ఎవరైనా మన ఎదురుగా నుంచుని సూటిగా కళ్ళలోకి చూడకుండా అటు ఇటు చూసి మాట్లాడుతుంటే తప్పకుండా వాళ్ళు చెప్పేది నిజం మాత్రం కాదన్నమాటే. అలాగే ఒకటే పనిగా చెవి వెనక, ముఖం పైన చేతులతో రుద్దుతూ వున్నా వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం. గ్యాప్ తీసుకుంటే... మీరు ప్రస్తావించిన ఏ అంశం గురించి అయినా ఎదుటి వారు కొద్దిసేపు సమయం తీసుకుని ప్రతిస్పందించారనుకోండి... వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అర్థం. ఎందుకంటే అబద్ధం చెప్పేటప్పుడు ఎమోషనల్‌గా రెస్పాండ్ అవడానికి ఓ చిన్న పాజ్ తీసుకుంటామట ఎవరైనా. అలాగే మన మాటలకి, చేతలకి కూడా కొద్దిపాటి తేడా వుంటుందిట. మొదట మాటలతో రెస్పాండ్ అయి, ఆ తర్వాత మనం చేతలు కలుపుతాం అన్నమాట. ఉదాహరణకి ఎవరో నచ్చని మనిషి కనిపించగానే ‘‘అరె.. నిన్నిలా కలవటం భలే హ్యాపీగా వుంది’’ అని అంటాం. ఆ తర్వాత నెమ్మదిగా షేక్‌హ్యాండ్ ఇస్తాం. నిజానికి తనని అలా కలవటం ఇష్టం లేదన్న విషయం మన మాటలకి, చేతలకి మధ్య చిన్నపాటి తేడాని తెస్తుంది. భాషే తప్ప భావం లేకుంటే... అబద్ధం చెప్పేటప్పుడు మనకి తెలీకుండానే మన ఫీలింగ్స్‌ మన శారీరక కదలికలలో బయటపడతాయిట. ‘‘భలే ఆశ్చర్యంగా వుందే’’ అంటుంటే నిజానికి ఆ ఆశ్చర్యం మన మాటతోపాటు ముఖంలో కూడా కనిపించాలి. కానీ, మనం ఆశ్చర్యపోవడం నిజం కానప్పుడు అది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్ వుండదు. అలాగే బాధ, సంతోషం... ఇలా ఏదైనా సరే ఆ ఎమోషన్ మాటతోపాటు ముఖ కవళికల్లో కనిపిస్తేనే అది నిజమని అర్ధం చేసుకోవాలి. అలాగే నిజం చెప్పే మనిషి ఎప్పుడూ పోట్లాటకి దిగడు. ఎదురుతిరిగి పోట్లాడ్డం మొదలుపెడితే అర్థం... వాళ్ళు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలో డిఫెన్సివ్‌గా మనతో గొడవకి దిగుతున్నారని... కాబట్టి వాళ్ళు అలా గొడవకి దిగగానే అబద్ధం చెప్పారని తెలుసుకుని మని అప్పటికి ఆ విషయాన్ని వదిలేయడం మంచిది. ఇవీ అబద్ధాలకి సంకేతాలే... ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతూ వుండగా ఎదుటి వ్యక్తి మనతో ఏదో చెబుతూ మధ్యలో పక్కనున్న ఏ వస్తువులనో తీసి ఇద్దరి మధ్య పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ తీయడం చేయడం వాళ్ళు అబద్ధం చెబుతున్నారని, దానిని ఇలా వ్యక్తం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఏదో విషయాన్ని సీరియస్‌గా చెబుతూ అటు, ఇటు చూడటం, కూర్చున్న చోటులో కదలటం, తలని ముందుకు వెనక్కి అనడం ఇవన్నీ ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని ఇట్టే పట్టించే అంశాలు. అలాగే మనం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తల ఆడించడం, అవును - కాదు అని పొడిపొడిగా సమాధానాలు చెప్పడం వంటివి కూడా అబద్ధాలకి సంకేతాలే. టాపిక్ మార్చి చూడండి... ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నారేమో అనే అనుమానం వస్తే వెంటనే ఠక్కున మీరు మాట్లాడుతున్న టాపిక్‌ని మార్చేయండి. నిజం చెబుతున్నవాళ్ళు మీరు డైవర్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పే విషయంలోకే వస్తారు. అదే అబద్ధం చెప్పేవాళ్ళు హమ్మయ్య అనుకుని మారిన టాపిక్‌పై మాట్లాడ్డం మొదలుపెడతారు. ఇది ఒక చిన్న టెస్ట్ అన్నమాట. కొన్ని మినహాయింపులూ... అబద్ధాన్ని కనిపెట్టడం తెలుసుకున్నాం కదా అని అందరి చర్యలనీ ఈ దృష్టితో చూడకూడదు. వాళ్ళ మీద వీటిని ప్రయోగించకూడదు. ఎందుకంటే కొందరికి కొన్ని అలవాట్లు స్వభావసిద్ధంగా వుంటాయి. కాబట్టి అవసరమనుకున్నప్పుడు, మనకు అసలు విషయం తెలియడానికి ఈ ‘నాలెడ్జ్’ని వాడుకోవాలి... సరేనా...  
Publish Date:May 12, 2021

సాయం విలువ!

చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో... ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు. ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది. ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి. యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో. ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన. ‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి. ‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన. ‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
Publish Date:May 11, 2021

కలలను కొట్టిపారేయొద్దు

అతను ఓ మామూలు కుర్రవాడు. అతని తండ్రి ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. తలదాచుకోవడానికి చిన్న ఇల్లు తప్ప వారికి మరో ఆస్తి లేదు. కడుపు నింపుకోవడం ఎలా అన్న ఆలోచన తప్ప తమ భవిష్యత్తు గురించి ఆశలు లేవు. పైగా ఒకోసారి ఇల్లు గడిచేందుకు కుర్రవాడు కూడా ఏదో ఒక పని చేయాల్సి వచ్చేది. దాంతో అతను బడికి వెళ్లడం కూడా తక్కువే! అలాంటి ఒక రోజున కుర్రవాడి బడిలో టీచర్‌, పిల్లలకి ఒక ప్రాజెక్టు వర్కు ఇచ్చారు. ‘నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు?’ అన్నదే ఆ ప్రాజెక్ట్‌.   ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, కుర్రవాడు తెగ ఆలోచించాడు. నిజంగా తను పెద్దయ్యాక ఏమయితే బాగుంటుంది. ఏమైతే తన మనసుకి తృప్తిగా ఉంటుంది అంటూ మధనపడ్డాడు. అతనికి అప్పుడు తన తండ్రి పనిచేసే ఫ్యాక్టరీ గుర్తుకువచ్చింది. పదిమందికీ అన్నం పెడుతూ, సమాజం అవసరాలు తీరుస్తూ ఉండే ఆ ఫ్యాక్టరీ అంటే అతని మనసులో తెలియని ఆరాధన. అందుకే తను కూడా పెద్దయ్యాక అలాంటి ఫ్యాక్టరీ ఒకదాన్ని స్థాపించాలని అనుకున్నాడు. అది ఏ ఫ్యాక్టరీ అయితే బాగుంటుంది? ఎంత విస్తీర్ణంలో ఉండాలి? దాని భవనాలు ఎలా ఉండాలి? ఎంతమంది కార్మికులు ఉండాలి?... లాంటి విషయాలన్నింటి గురించీ ఓ కాగితం మీద రాశాడు.   మర్నాడు తను రూపొందించిన ప్రణాళికను తీసుకుని గర్వంగా బడికి వెళ్లాడు. కానీ ఆ కాగితం చూసిన ఉపాధ్యాయుడు పెదవి విరిచేశాడు. ‘అబ్బే! నీ వెనక ఆస్తిపాస్తుల లేవు. సగం రోజులు బడి మానేసి పనికి వెళ్తే కానీ మీ ఇల్లు గడవదు. నీ చదువూ అంతంతమాత్రమే! మీ నాన్నగారి పరిస్థితీ అంతంతమాత్రమే! అలాంటిది ఇంతపెద్ద ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తావు. ఆశకి కూడా ఓ హద్దుండాలి. మనం ఏం సాధించగలమో ముందే తెలుసుకుని ఉండాలి,’ అంటూ దులిపేసి సున్నా మార్కులు వేశాడు.   కుర్రవాడు బిక్కమొగం వేసుకుని ఇంటికి తిరిగివచ్చాడు. జరిగిందంతా తండ్రితో చెప్పుకొని బాధపడ్డాడు- ‘నిజంగా ఓ ఫ్యాక్టరీని నిర్మించాలి అన్న కలే నీకుంటే దానిని నిజం చేసుకునేందుకు ప్రతిక్షణమూ కష్టపడు. ఉపాధ్యాయుడు చెప్పినట్లు నీకు లక్ష్యాన్ని సాధించే అర్హత లేదని మనసారా నమ్మితే ఊరుకో! నిర్ణయం మాత్రం నీదే! ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నీ కలని చిదిమివేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వవద్దు. నీ సత్తా ఏమిటో నువ్వే బేరీజు వేసుకో. నువ్వేం సాధించాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో,’ అంటూ ఓదార్చాడు.   తండ్రి మాటలు పిల్లవాడి మీద గట్టి ప్రభావాన్నే చూపాయి. తనకి ఫ్యాక్టరీ నిర్మించే సత్తా ఉందని నమ్మాడు. పాతికేళ్లపాటు ఆ దిశగానే ఒకో అడుగూ వేస్తూ పయనించాడు. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం రోజున అతని చిన్ననాటి ఉపాధ్యాయుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ‘నేను నిన్ను నిరుత్సాహపరచడానికి చూశాను. కానీ నువ్వు వెనక్కి తగ్గలేదు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది,’ అంటూ యజమానిగా ఎదిగిన కుర్రవాడని తెగ పొగిడేశాడు.   కానీ యజమాని మొహంలో మాత్రం ఏదో బాధ ‘సార్‌! మీరు నా లక్ష్యాన్ని మార్చాలని చూశారు. కానీ నేను చెదరలేదు. నిజమే! కానీ మీ వృత్తిలో ఇలా ఎంతమంది కలలని కొట్టిపారేసి ఉంటారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. అన్నీ కలిసిరాకపోవచ్చు. కానీ ఆశ మనిషిని ఎంతో ఎత్తుకు చేరవేస్తుంది. ఆ ఆశని మీరు మీ శిష్యులకి అందించలేకపోయారు. సాధించగలవు అంటూ భుజం తట్టే మీ ప్రోత్సాహమే ఉంటే ఎంతమంది నాలా విజయం సాధించగలిగేవారో కదా!’ అన్నాడు. ఆ మాటలకి గురువు దగ్గర జవాబు లేదు. ఆశ మనిషిని నడిపిస్తుంది. ప్రోత్సాహం ఆ ఆశని బతికిస్తుంది. ఆ విషయం గురువుగారికి చాలా ఆలస్యంగా అర్థమైంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
Publish Date:May 10, 2021

ఒత్తిడిని ఎదుర్కోవడం తేలికే!

కాలం మారిపోయింది. జీవన విధానాలూ మారిపోతున్నాయి. కానీ మన అవసరాలను తీర్చడం కోసం ఏర్పరుచుకున్న జీవనశైలే ఇప్పుడు మన ఒత్తిడికి కారణం అవుతోంది. ఇంట్లో గొడవల దగ్గర్నుంచీ, ఆఫీసులో చేరుకోవల్సిన లక్ష్యాల వరకూ... పొద్దున లేచిన దగ్గర్నుంచీ వేల సమస్యలు. మరి ఇన్ని సమస్యలనీ ప్రశాంతంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలంటే... ఒత్తిడిని ఎదుర్కోవలసిందే! అందుకోసం కొన్ని చిట్కాలు...   నిశ్చయం:  ఏదన్నా సమస్య ఏర్పడగానే ముందుగా కంగారుపడిపోవడం మనకు అలవాటు. కానీ నిజానికి సమస్య ఏమిటి, దాన్ని పరిష్కరించడం ఎలా అన్న విషయం మీద ఒక స్థిరాభిప్రాయానికి వచ్చి... ఆ అభిప్రాయానికే కట్టుబడి ఉందాము, ఏదైతే అదవుతుంది అనుకున్నప్పుడు ఒత్తిడి ఉండదు. చేయాల్సింది చేద్దాము, ఫలితం ఎలాగూ మన చేతుల్లో ఉండదు కదా అన్న ఎరుక ఉన్నప్పుడు ఎప్పుడో, ఏదో జరిగే ‘అవకాశం’ ఉందన్న భయం ఉండదు. దాంతోపాటు ఏర్పడే ఒత్తిడీ ఉండదు!   శరీరాన్ని గమనించండి: ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం మన అదుపులో ఉన్నట్లు కనిపించదు. భుజాలు జారిపోతాయి, ఊపిరి త్వరత్వరగా పీల్చుకుంటాము, భృకుటి ముడిపడుతుంది. ఇవన్నీ కూడా మనలోని ఒత్తిడిని పెంచేవే. ఈ విషవలయాన్ని ఛేదించడం చాలా ముఖ్యం. ఒత్తిడి సమయాలలో వీలైనంత నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల మన గుండెవేగం తగ్గుతుందనీ, రక్తానికి కూడా తగినంత ప్రాణవాయువు లభిస్తుందనీ తేలింది. తద్వారా మన మెదడులోని ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చేకూరుతుంది. భుజాలను నిటారుగా ఉంచడం వల్ల కూడా ఊపిరి గుండెల నిండా పీల్చుకునేందుకు, కండరాల మీద నుంచి ఒత్తిడి తగ్గించేందుకు దోహదపడుతుంది.   నవ్వు ఓ దివ్వౌషదం:  ఒత్తిడిలో ఉన్న మనిషి మొహంలో ఎక్కడలేని చిరాకూ తాండవిస్తూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే శరీరంలోని ఒత్తిడి అంతా మొహంలో కేంద్రీకృతమవుతుంది. ఆ చిరాకుని కనుక చిరునవ్వుతో తోలిపారేస్తే సగం ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాదు! నవ్వడం వల్ల మనం అంత ఒత్తిడితో ఉండాల్సిన అవసరం లేదన్న సూచన కూడా మెదడుకి చేరుతుంది. అలాగని మరీ తెచ్చిపెట్టుకుని పగలబడి... వింతగా నవ్వాలని కాదు కానీ మొహంలోని కండరాల బిగువు కాస్త సడలేలా చిన్న చిరునవ్వు వెల్లివిరిస్తే చాలు.   వ్యాయామం: వ్యామాయం చేసేవారిలో ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుందని తేలింది. నడక, ఈత, టెన్నిస్‌ వంటి ఆటలాడటం... ఇలా రోజూ ఏదో ఒక శారీరిక వ్యాయామం చేసేవారిలో మనసు కూడా దృఢంగా ఉంటుంది. అంతేకాదు! ఏదన్నా ఒత్తిడితో కూడిన పరిస్థితిలో ఉన్నప్పుడు కాసేపు అలా వాహ్యాలికి వెళ్లడమో, కనీసం ఆ వాతావరణం నుంచి బయటపడి ప్రకృతిని గమనించడమో చేసినప్పుడు ఒత్తిడి నుంచి చాలావరకూ ఉపశమనం లభించడాన్ని గమనించవచ్చు.   పరిమితులు గ్రహించడం:  అవసరానికి మించిన బాధ్యతలను నెత్తిన వేసుకోవడం, ‘కాదు, కుదరదు’ అని చెప్పడానికి భయపడి అదనపు బరువును మోయడమూ చాలా సందర్భాలలో ఒత్తిడికి కారణం అవుతుంది. ఇలాంటి పనుల మీద మనసు ఎలాగూ లగ్నం కాదు కాబట్టి.... లక్ష్యాలు మరింత భారంగా తోస్తాయి. ఒకో రోజూ గడిచే కొద్దీ మన గుండెల మీద కుంపట్లలాగా మారిపోతాయి. కొన్నాళ్లకి వాటిని వదిలించుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి బాధ్యతల విషయంలో భేషజాలకు పోకపోవడం అంటే... రాబోయే ఒత్తిడి నుంచి ముందుగానే తప్పుకోవడం అన్నమాట!   ఇవే కాకుండా ధ్యానం, యోగా, పోషకాహారం తీసుకోవడం, మత్తుపదార్థాలకు దూరంగా ఉండటం, సానుకూల దృక్పథం, తాత్విక చింతన, సామాజిక సంబంధాలు.... ఇవన్నీ కూడా ఒత్తిడి నుంచి దూరం చేసే సాధనాలే!
Publish Date:May 8, 2021

కుర్రవాళ్లకి నిద్ర ఎందుకు పట్టదు!

పిల్లలు చీకటిపడితే చాలు, బుద్ధిగా పడుకుంటారు. కానీ ఇలా టీనేజిలోకి అడుగుపెడతారే లేదో... రాత్రిళ్లు వీలైనంత మేలుకునే అలవాటు మొదలవుతుంది. ఇంతకీ కుర్రకారుకి రాత్రివేళలు ఎందుకు నిద్రపట్టదు. పగలు పుస్తకమే ముట్టుకోనివారు రాత్రిళ్లు నైట్‌ అవుట్ చేయాలనీ, బండి మీద చక్కర్లు కొట్టాలనీ ఎందుకు ఉవ్విళ్లూరుతారు... అంటే ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో జవాబు దొరికినట్లే కనిపిస్తుంది.   వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాట్లే, మనం వేర్వేరు సమయాలలో నిద్రపోవడానికి కారణం అవుతున్నాయా! అనే అనుమానంతో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన మొదలుపెట్టారు. ఇందుకోసం టాంజానియాలో ఆటవిక జీవితాన్ని గడుపుతున్న హజ్డా అనే తెగలోని వారిని పరిశీలించారు. వీరు 20 లేదా 30 మంది కలిసి ఓ గుంపుగా ఉంటారు. ఉదయాన్నే లేచి ఆడామగా ఆహారం కోసం బయల్దేరతారు. కొందరు దుంపలు, కాయలు తీసుకువస్తే.... మరికొందరు జంతువులని వేటాడి తీసుకువస్తారు. సాయంత్రం వేళకి అందరూ ఒక చోటకి చేరి, తాము తెచ్చుకున్నది శుభ్రంగా తిని హాయిగా పడుకుంటారు. గడ్డి, కొమ్మలతో నేసిన గుడిసెలలో ఎలాంటి ఫ్యాన్లూ, లైట్లూ లేకుండా హాయిగా నిద్రపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే- వేల సంవత్సరాల క్రితం మప పూర్వీకులు ఎలా జీవించేవారో, హెజ్డా ప్రజలు అదే తీరున జీవిస్తున్నారు.   ఈ హెజ్డాతెగలో 20 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఓ 33 మందిని పరిశోధన కోసం ఎన్నుకొన్నారు. వారి నిద్రను గమనించేందుకు, అభ్యర్థులందరికీ ఓ వాచిలాంటి పరికరాన్ని అమర్చారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తల దిమ్మ తిరిగిపోయింది. వీళ్లలో రాత్రి ఒకో సమయంలో ఒకొక్కరు మెలకువగా ఉన్నారట! మొత్తమ్మీద 33 మందీ ఒకేసారి గాఢంగా నిద్రపోయిన సమయం పట్టుమని 20 నిమిషాలు కూడా లేదు. మెలకువగా ఉండటమో, పొగ తాగేందుకు లేవడమో, లేచి పిల్లలని చూసుకోవడమో, మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవడమో... ఇలా ఏదో ఒక చర్యతో గుంపులో ఎవరో ఒకరు జాగరూకతతో కనిపించారు.   అడవులలో జీవించేవారు రకరకాల ప్రమాదాలకి సిద్ధంగా ఉండాల్సిందే! ఏ వైపు నుంచి పులి వస్తుందో, ఏ దిక్కు నుంచి మబ్బులు కమ్ముకువస్తాయో, ఏ పొదలోంచి పాములు చొరబడతాయో తెలియదు. కాబట్టి.... ఎవరో ఒకరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రకృతి ఈ ఏర్పాటు చేసిందన్నమాట. ఏ ఇద్దరి నిద్రతీరు ఒకేలా లేకపోవడంతో, గుంపు సురక్షితంగా ఉంటుంది. అది సరే! ఇంతకీ నిద్రకీ వయసుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా! ఒక గుంపులో కుర్రవాళ్లు, వృద్ధులు సరిసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుర్రవాళ్లు ఒక సమయంలో, వృద్ధులు మరో సమయంలో పడుకుంటే సరి! అందుకనే మీరు గమనించారో లేదో.... కుర్రవాళ్లకి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచే అలవాటు ఉంటే, ముసలివారు త్వరగా పడుకుని తెల్లవారేసరికల్లా లేస్తారు. కుర్రవాళ్లు ఆలస్యంగా పడుకున్నా వారి ఆరోగ్యం మీద అంతగా ప్రభావం చూపదు కదా! అలా మొదలైన అలవాటు ఇప్పటికీ కుర్రకారుని వదిలిపెట్టడం లేదన్నమాట! - నిర్జర.
Publish Date:May 7, 2021

ప్రమాదాలను కొనితెచ్చుకునే మనస్తత్వం!

కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
Publish Date:May 6, 2021

పరాజయం తర్వాత పశ్చాత్తాపం మంచిదే!

  జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. ఎత్తుపల్లాలు రెండూ ఎదురుపడతాయి. కానీ పరాజయం ఎదురైనప్పుడు ఒకో మనిషి తీరు ఒకోలా ఉంటుంది. ఆ పరాజయాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడనే విషయమే అతని భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడీ కబుర్లన్నీ ఎందుకంటే... వైఫల్యంలో మనిషి ఎలా ఆలోచిస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఓ పరిశోధన జరిగింది కనుక. ఓటమి ఎదురైనప్పుడు, మనిషిలో రకరకాల భావోద్వేగాలు మొదలవుతాయి. బాధ, పశ్చాత్తాపం, న్యూనత, తన మీద తనకి కోపం లాంటి భావాలు చోటు చేసుకుంటాయి. వాటితో పాటుగానే ఈసారి ఆ పని చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రాక్టికల్‌ ఆలోచనలూ మొదలవుతాయి. అంటే! అటు మెదడు, ఇటు మనసు రెండూ కూడా మరోసారి సమస్యని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతాయన్నమాట. చాలామంది మనసులోని భావాలను తొక్కిపెట్టేసి, కేవలం మెదడు చెప్పే మాటలే వినాలనుకుంటారు. అలా చేయడమే ప్రాక్టికల్‌ అనుకుంటారు. పరాజయం తర్వాత మనసులో మెదిలే భావాలన్నీ ఏమాత్రం ఉపయోగపడవని భావిస్తారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. దానికోసం కొందరు విద్యార్థులను ఎన్నుకొన్నారు. పరిశోధన కోసం ఎన్నుకొన్న విద్యార్థులందరికీ ఒక పరీక్ష పెట్టారు. ఇంటర్నెట్‌ అంతా వెతికి, అతి చవకగా దొరికే మిక్సీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడమే ఆ పరీక్ష. ఒకవేళ ఆ పరీక్షలో విజయవంతం అయితే ఓ 50 డాలర్ల బహుమతి ఉంటుందని ఊరించారు. విద్యార్థులంతా ఆ పరీక్షలో విఫలమైపోయారు. ఈ పరాజయం తర్వాత విద్యార్థులకి మరో అవకాశం కూడా ఇచ్చారు. అయితే ఈసారి తమ మెదడు సూచించే ఉపాయాల మీద దృష్టి పెట్టమని కొందరికీ, తమ మనసులోని భావాలకి ప్రాధాన్యత ఇవ్వమని కొందరికీ సూచించారు. ఆశ్చర్యంగా మనసుని విన్నవారు మరింత మెరుగైన ఫలితాలను సాధించడం కనిపించింది. మెదడు మీదే దృష్టి పెట్టినవారు ఈసారి పరాజయం పొందకుండా ఉండేందుకు చిత్రమైన ఉపాయాలను పన్నారట. దాంతో మొదటికే మోసం వచ్చేసింది. కానీ తమ భావోద్వేగాలని గమనించినవారు, మరింత జాగ్రత్తగా ఆటని ఆడే ప్రయత్నం చేశారు. క్రితంసారి తాము ఎక్కడ, ఎందుకు పరాజయం పొందామో వారికి తెలిసొచ్చింది. అది మేలైన ఫలితాలను అందించింది. వ్యక్తిత్వ వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈరోజుల్లో పరాజయం తర్వాత మనసుని పట్టించుకోవద్ద అన్న మాటలు బాగా వినిపిస్తున్నాయి. కానీ అదేమంత మంచి పద్ధతి కాదని పై పరిశోధన తేల్చి చెబుతోంది. మనసుని కూడా కాస్త పట్టించుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు! ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు... పరాజయం పొందిన పిల్లలకి ఎలాంటి సూచనలు అందించాలో కూడా తెలియచేస్తోంది. - నిర్జర.  
Publish Date:May 5, 2021

కొందరిలో కృతజ్ఞత ఎందుకు ఉండదు?

మనకి ఎవరన్నా సాయం చేసినా, మంచి బహుమతిని అందించినా వారి అభిమానం పట్ల సంతోషం కలుగుతుంది. ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనిపిస్తుంది. బహుశా కృతజ్ఞత అంటే అదేనేమో! కానీ కొందరిలో ఈ తరహా భావనలు మచ్చుకైనా కనిపించవు. కారణం!   కృతజ్ఞత – ఆత్మస్థైర్యం తన మీద తనకి నమ్మకం ఉండి ఇంకొకరి మీద ఆధారపడని స్వభావం వ్యక్తులలో కృతజ్ఞత పాళ్లు తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 500 మంది అభ్యర్థులను ఆహ్వానించారు. ‘మీరు మీ స్నేహితుల దగ్గర నుంచి ఏదన్నా బహుమతి కానీ, సాయం కానీ పొందినప్పుడు మీలో ఎలాంటి భావనలు కలుగుతాయి,’ అంటూ వారిని అడిగారు. అలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉన్న అభ్యర్థులు- ‘అలాంటి సాయాలు, బహుమతులూ తమ మీద ఏమంత సానుకూల ప్రభావాన్ని చూపవని’ పెదవి విరిచారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు మూడుసార్లు అడిగినా ఇలాంటి జవాబులే లభించాయి.   వ్యక్తిత్వమే అడ్డంకి ఆత్మస్థైర్యం మరీ ఎక్కువగా ఉన్నవారు తమ విలువని ఎలా పెంచుకోవాలి అన్న తాపత్రయంలో ఉంటారే కానీ... బంధంలోని అవతలి వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే తపన వారిలో కనిపించదు. పైగా కృతజ్ఞత అనే లక్షణం వల్ల తాము బలహీనురం అయిపోతామన్న భయం కూడా వారిలో ఉంటుంది. అంతేకాదు! ఇలాంటి వ్యక్తులకు ఎవరన్నా సాయం చేయడానికి ముందుకు వస్తే... తమ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారన్న అపోహకి లోనయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.   కృతజ్ఞత ఉండాలా! వద్దా! మానవ విలువలు మారిపోతున్న ఈ కాలంలో కృతజ్ఞత అనేది కేవలం మన బలహీనతకు చిహ్నమా! అంటే కానే కాదంటున్నారు పరిశోధకులు. నిజానికి మానవ సంబంధాలలో కృతజ్ఞత ప్రాధాన్యత గురించి చాలా పరిశోధనలే జరిగాయి. కృతజ్ఞత అనే లక్షణం బంధాలను నిర్మించుకునేందుకు, నిలిపి ఉంచుకునేందుకు చాలా అవసరం అని మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చేశారు. దాని వలన మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నారు. ఇక ఆత్మస్థైర్యం మరీ ఎక్కువగా ఉన్నవారిలో, కష్టసుఖాలను ఇతరులతో పంచుకునే అలవాటు లేకపోవడం వల్ల క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలు పెట్రేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరుల అభిప్రాయాలనీ, బంధాలనీ బలిపెట్టే స్థాయిలో అది ఉండకూడదు. అప్పుడు ఆత్మస్థైర్యం కాస్తా అహంకారానికీ, ఒంటరితనానికి దారితీస్తుంది. అయితే ఈ ఉరుకులపరుగుల జీవితంలో ఆత్మస్థైర్యం మీద ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారని పరిశోధకులు వాపోతున్నారు. అమెరికా వంటి దేశ సంస్కృతిలో బంధాలకంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అందుకని ఇప్పుడు సంస్కృతికీ, కృతజ్ఞతకీ మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే దిశలో మరో పరిశోధనకు పూనుకొంటున్నారు.   - నిర్జర.
Publish Date:May 4, 2021

విలువైన సంపద – మానవత్వమే!

చాలా రోజుల క్రితం అరబ్‌ దేశంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడి దగ్గర ఉన్న గుర్రం చుట్టుపక్కలలోకెల్లా అద్భుతమైనది చెప్పుకొనేవారు. దాని అందానికి కానీ, వేగానికి కానీ సాటి వచ్చే గుర్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి గుర్రాన్ని చేజిక్కించుకోవాలని చుట్టుపక్కల ధనవంతులంతా తెగ ఉబలాటపడేవారు. వారిలో ఒమర్‌ ఒకడు. వర్తకుడి గుర్రం కోసం ఒమర్ ఎంత ధనం ఇవ్వచూపినా, బదులుగా ఎన్ని ఒంటెలను ఇస్తానన్నా వర్తకుడు ఏమాత్రం లొంగలేదు. తన గుర్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికీ ఇవ్వబోనని తేల్చి చెప్పేశాడు.   వర్తకుడు తన డబ్బుకి లొంగకపోయేసరికి ఒమర్ అహంకారం దెబ్బతిన్నది. పైగా అంత అద్భుతమైన గుర్రం తన దగ్గరే ఉండాలన్నా పట్టుదలా పెరిగిపోయింది. దాంతో- మోసం చేసైనా సరే ఆ గుర్రాన్ని చేజిక్కించుకోవాలని ఒమర్‌ పథకం వేశాడు. ఒక బిచ్చగాడి వేషం వేసుకుని వర్తకుడు వెళ్లే దారిలో పడుకున్నాడు. ఒమర్‌ కాసేపు ఎదురుచూసిన తరువాత అటుగా వర్తకుడు రానే వచ్చాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌ని చూసి జాలిపడ్డాడు. తన గుర్రం మీద నుంచి దిగివచ్చి అతని చేతిలో కాసిని దీనార్లు ఉంచాడు. తన సంచిలో ఉన్న రొట్టె ముక్కలని అందించాడు. ఇంత చేసినా అతని తృప్తి తీరలేదు ‘నీ కోసం నేను ఏమన్నా చేయగలనా!’ అని అడిగాడు. ‘దయచేసి నన్ను మీ గుర్రం మీద ఎక్కించుకుని మీతో పాటు పట్నానికి తీసుకుపోగలరా! అక్కడ నేను ఏమన్నా జీవనోపాధి చూసుకుంటాను,’ అని అర్థించాడు బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌.   ఒమర్‌ మాటలకు వర్తకుడు కరిగిపోయాడు. వెంటనే తనతో పాటుగా పట్నానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అందుకోసం బిచ్చగాడిని ముందుగా తన గుర్రం మీదకు ఎక్కించాడు. ఒమర్‌కు కావల్సింది అదే! గుర్రం మీదకు ఎక్కిన వెంటనే దాని జీనుని అందుకుని ఒక్కసారిగా దౌడు తీయించాడు. జరిగిన దానికి వర్తకుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అయినా వెంటనే తేరుకుని... ‘గుర్రాన్ని తీసుకుపోతే పోయావు! కానీ ఒక్కమాట విని వెళ్లు!’ అని అరిచాడు. వర్తకుడు ఏం చెబుతాడా అని ఆసక్తిగా ఆగాడు ఒమర్. ‘నువ్వు నా గుర్రాన్ని ఇలా చేజిక్కించుకున్న విషయాన్ని దయచేసి ఎవరితోనూ చెప్పవద్దు,’ అన్నాడు కళ్లనీరు పెట్టుకుంటూ వర్తకుడు.   ‘ఏం నీ పరువు పోతుందా!’ చిద్విలాసంగా అడిగాడు ఒమర్. ‘అహా పరువు గురించి కాదు. ఈ విషయం కనుక నలుగురికీ తెలిస్తే... ఇక మీదట ఎవ్వరూ దారి పక్కన పడి ఉన్న పేదవాడికి సాయం చేసేందుకు ఆగరు. మానవత్వం మీద పేదల మీద జనానికి నమ్మకమే పోతుంది,’ అన్నాడు వర్తకుడు. వర్తకుడి మాటలకి ఏం సమాధానం చెప్పాలో ఒమర్‌కు పాలుపోలేదు. వెంటనే గుర్రం దిగి అక్కడి నుంచి వడివడిగా నడిచి వెళ్లిపోయాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
Publish Date:May 3, 2021

ఇంటర్నెట్ ఓ అందమైన వ్యసనం

ఇప్పుడు ఇంటర్నెట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. బ్రాడ్బ్యాండ్, 4G లాంటి సాంకేతికతత పుణ్యమా అని గంటల తరబడి వందలకొద్దీ సైట్లను చూడవచ్చు. కానీ ఇంటర్నెట్ వాడకం తర్వాత మన రక్తపోటు, గుండెవేగంలో కూడా మార్పులు వస్తాయని సూచిస్తున్నారు.   ఇంగ్లండుకి చెందిన Swansea University పరిశోధకులు ఇంటర్నెట్ వాడిన వెంటనే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసున్న ఓ 144 మందిని ఎన్నుకొన్నారు. కాసేపు ఇంటర్నెట్ చూసిన తర్వాత వీరందరిలోనూ గుండెవేగం, రక్తపోటు కనీసం 4 శాతం పెరిగినట్లు గమనించారు. తమలో ఉద్వేగపు స్థాయి కూడా మరీ ఎక్కువైనట్లు వీరంతా పేర్కొన్నారు.   రక్తపోటు, గుండెవేగంలో ఓ నాలుగు శాతం మార్పు వల్ల అప్పటికప్పుడు వచ్చే ప్రాణహాని ఏమీ లేకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. పైగా వీటికి ఉద్వేగం కూడా తోడవ్వడం వల్ల హార్మోనులలో మార్పు వస్తుందనీ, అది ఏకంగా మన రోగనిరోధకశక్తి మీదే ప్రభావం చూపుతుందనీ హెచ్చరిస్తున్నారు.   ఒక అలవాటు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్యంలో వచ్చే మార్పులని withdrawal symptoms అంటారు. మద్యపానం, సిగిరెట్, డ్రగ్స్లాంటి వ్యసనాలు ఉన్నప్పుడు ఈ withdrawal symptoms కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యసనం కొనసాగితే కానీ సదరు లక్షణాలు తగ్గవు. ఆ వ్యసనం వైపుగా మళ్లీ మళ్లీ పరుగులు తీసేందుకు అవి దోహదం చేస్తాయి. అలాగే ఇంటర్నెట్ ఆపిన తర్వాత పెరిగిన ఉద్వేగం, తిరిగి అందులో మునిగిపోయిన తర్వాత కానీ తీరలేదట.   ఇంతాచేసి తమ ప్రయోగంలో పాల్గొన్నవారంతా కూడా ఇంటర్నెట్ను అదుపుగా వాడేవారే అంటున్నారు పరిశోధకులు. ఇక ఇంటర్నెట్లో గేమ్స్, షాపింగ్, సోషల్ మీడియా వంటి సైట్లకి అలవాటు పడినవారిలో ఈ ‘వ్యసనం’ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ వల్ల మన ఆరోగ్యంలోనూ ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయన్న హెచ్చరికలు కొత్తేమీ కాదు. ఇలాంటి సమస్యలకు digital-behaviour problems అని ఓ పేరు కూడా పెట్టేశారు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే సుదీర్ఘకాలం ఇంటర్నెట్ వాడటం వల్ల డిప్రెషన్, ఒంటరితనం లాంటి సమస్యలు వస్తాయనీ... మెదడు పనితీరే మారిపోతుందని ఇప్పటికే పరిశోధనలు నిరూపించాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు ఊరికే అన్నారా! - నిర్జర.
Publish Date:May 1, 2021

సమస్యను పరిష్కరించాలంటే!

అనగనగా ఓ జమీందారు. ఆయనకి యాభై గదులున్న ఓ ఐదంతస్తుల మేడ ఉంది. జమీందారుగారికి వింత వస్తువులంటే మహా మోజు. దేశవిదేశాల నుంచి సేకరించిన అరుదైన, వింతైన వస్తువులతో ఆయన యాభై గదులూ నిండిపోయాయి. ఇన్ని వస్తువులున్నా కూడా ఆయనకు వాళ్ల నాన్నగారు ఇచ్చిన గడియారం అంటే చాలా ఇష్టంగా ఉండేది. అది లేనిదే ఆయనకు రోజు గడిచేది కాదు. తను ఎక్కడికి వెళ్లినా ఆ గడియారం ఆయన జేబులో ఉండాల్సిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఆ గడియారంలో సమయాన్ని చూసుకుంటూ ఉండాల్సిందే! ఒక రోజు ఆ గడియారం కనిపించకుండా పోయింది. జమీందారుగారు ఉండే యాభై గదులలో ఎక్కడని వెతికేది. ఎంతని వెతికేది. అయినా కూడా జమీందారుగారి నౌకర్లందరూ ప్రతి గదినీ క్షుణ్నంగా గాలించారు. మేడలోని ప్రతి అడుగునీ శోధించారు. అయినా గడియారం కనిపించనేలేదయ్యే. జమీందారుగారి మొహం డీలాపడిపోయింది. ఆ గడియారంలో సమయాన్ని చూసుకుంటుంటే, తన తండ్రే తనని నిర్దేశిస్తున్నట్లు తోచేది. సాయంకాలమైంది. గడియారాన్ని వెతికేందుకు నౌకర్లు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆ సమయంలో జమీందారుకి తన గురువుగారు గుర్తుకువచ్చారు. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా ఆయన దగ్గర తప్పకుండా సమాధానం దొరికేది. మరి ఈ సమస్యకి ఆయన ఏమన్నా పరిష్కారం సూచించగలడేమో అన్న ఆశ మొదలైంది. గడియారం కనిపించడం లేదా లేకపోతే ఎవరన్నా దానిని దొంగిలించారా? దొంగిలిస్తే ఎవరు దొంగిలించి ఉంటారు? అన్న సందేహాలతో సతమతమవుతూ... జమీందారు తన గురువుగారిని తన మేడకి రప్పించుకున్నారు. విషయం అంతా విన్న గురువుగారు ‘నేను మేడలోని గదులన్నింటిలోనూ కాసేపు గడిపి వస్తాను!’ అన్నారు. ‘అయ్యా! మా నౌకర్లంతా ఈపాటికే గదులన్నింటినీ జల్లెడ పట్టేశారు. మీరు మళ్లీ వెతకడం వృధా శ్రమ అవుతుంది’ అన్నారు జమీందారు ఒకింత అసహనంగా. అయినా కూడా గురువుగారు పట్టుపట్టి ఒంటరిగా గదులన్నింటినీ చూసివచ్చేందుకు బయల్దేరారు. గంట గడిచింది, రెండు గంటలు గడిచాయి, మూడు గంటలు గడిచాయి... మేడ దిగువున ఉన్న గదిలో గురువుగారి కోసం వేచి ఉన్న జమీందారులో అసహనం పెరిగిపోసాగింది. ఇంతలో గురువుగారి చిరునవ్వుతో ఆ గదిలోకి అడుగుపెట్టడం చూశారు. గురువుగారి చేతిలో తళతళ్లాడుతున్న గడియారం. ‘నాకూ, ఇంతమంది నౌకర్లకూ సాధ్యం కానిది మీరెలా సాధించారు!’ అంటూ నోరువెళ్లబెట్టారు జమీందారుగారు. ‘చాలా తేలిక! నేను ప్రతి గదిలోకీ వెళ్లి కాసేపు ప్రశాంతంగా నిల్చొన్నాను. గడియారానికి ఉన్న లక్షణం చిన్నపాటి శబ్దం చేస్తూ తిరగడం కదా! ఈ రాత్రివేళ నిశబ్దానికి నా ప్రశాంతత తోడైనప్పుడు... ఆ శబ్దం వినిపించకపోతుందా అని ప్రతి గదిలోనూ వేచిచూశాను. చివరికి మీరు రోజూ పడుకునే మంచం కింద ఉన్న ఓ బుట్టిలోంచి తన శబ్దం వినిపించసాగింది. మన సమస్యలు చాలావరకూ ఇలాగే ఉంటాయి నాయనా! సమస్యని ప్రశాంతమైన మనసుతో పరిష్కరించాల్సిన చోట తెగ హడావుడి పడిపోతాము. ఫలితం! మనకి సమీపంలో ఉన్న పరిష్కారం కూడా కనిపించకుండా పోతుంది,’ అంటూ గడియారాన్ని జమీందారుగారి చేతిలో ఉంచి బయల్దేరారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   -నిర్జర
Publish Date:Apr 30, 2021

ఆలోచన మీద అదుపు లేకపోతే

అనగనగా ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. ఒకరు తన పొలాని చూసుకుంటూ ఊరిలో జీవనాన్ని సాగిస్తుంటే, వేరొకరు రాజధానిలో ఉద్యోగాన్ని పొందారు. రాజధానిలో ఉన్న ఉద్యోగి ఓసారి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. రాకరాక వచ్చిన నేస్తాన్ని చూసి అతనికి సకల మర్యాదలూ చేశాడు పల్లెటూరి మిత్రుడు. పల్లెటూరి స్నేహితుడు మహా ఉదారమైన మనిషి. ‘చూడూ! నా దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి. నాకేమో ఒక్క గుర్రం చాలయ్యే! నీకు ఉద్యోగరీత్యా తెగ తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా! హాయిగా నా రెండో గుర్రాన్ని తీసుకుని వెళ్లి వాడుకో,’ అన్నాడు.   పల్లెటూరి నేస్తం పెద్ద మనసు చూసి రాజధాని నేస్తం గుండె నిండిపోయింది. వందలసార్లు కృతజ్ఞతలు చెబుతూ ఆ గుర్రాన్ని బహుమతిగా అందుకున్నాడు. ఇలా ఓ పది రోజులు గడిచాయో లేదో... రాజధాని నేస్తం మళ్లీ పల్లెటూరికి తిరిగివచ్చాడు. ‘నేస్తం ఎలా ఉన్నావు. నువ్వు మళ్లీ రావడం సంతోషంగా ఉంది. ఏదన్నా పని మీద వచ్చావా లేకపోతే నన్ను చూసిపోదామని వచ్చావా?’ అని అడిగాడు పల్లెటూరి నేస్తం.   ‘నిన్ను చూసి నాకు కూడా సంతోషంగా ఉంది. కాకపోతే నేను అనుకోకుండా ఇక్కడికి రావల్సి వచ్చింది. నువ్వు నాకిచ్చిన గుర్రం ఉంది చూశావూ? అది మా గొప్పగా నాకు సాయపడుతోంది. కానీ నిన్న రాత్రి దాన్ని ఎక్కగానే, దానికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో! ఎంత వారిస్తున్నా వినకుండా మీ ఊరి వైపుకి దూసుకువచ్చేసింది,’ అని వాపోయాడు రాజధాని మిత్రడు. ‘చిన్నప్పటి నుంచీ పుట్టి పెరిగిన ఊరు కదా! అందుకనే దాని మనసు ఇటు మళ్లి ఉంటుంది. ఎలాగూ వచ్చారు కదా! ఓ రెండు రోజులు ఉండి వెళ్లండి,’ అంటూ మరోసారి తన చిన్ననాటి మిత్రునికి ఆతిథ్యాన్ని అందించాడు పల్లెటూరి నేస్తం.   ఇది జరిగి ఓ పదిరోజులు గడిచాయి. పది రోజుల తర్వాత మళ్లీ గుర్రంతో ప్రత్యక్షం అయ్యాడు రాజధాని మిత్రడు. ‘రావోయ్‌ నేస్తం! నీ గుర్రం గాలి మళ్లీ ఇటువైపు మళ్లిందా ఏమిటి?’ అని అడిగాడు పల్లెటూరి స్నేహితుడు. ‘అవును ఇవాళ ఉదయం దీన్ని ఎక్కి కూర్చున్నానా! ఎంత ప్రయత్నించినా ఆగకుండా పరుగుపరుగున మీ ఊరి వైపుగా దూసుకువచ్చింది,’ అని బిక్కమొగంతో చెప్పాడు రాజధాని ఉద్యోగి.   ‘మరేం ఫర్వాలేదు! ఓ రెండు రోజులు నా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి,’ అంటూ ఆహ్వానించాడు పల్లెటూరి నేస్తం. అది మొదలు ప్రతి పది రోజులకి ఓసారి ఆ గుర్రం యజమానితో సహా తను పుట్టిపెరిగిన పల్లెటూరికి చేరుకోవడం మొదలుపెట్టింది. పల్లెటూరి నేస్తం చిరునవ్వు చెదరకుండా తన రాజధాని మిత్రుడికి ఆతిథ్యం ఇవ్వసాగాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ‘చూడు నేస్తం. నీ మనసు ఎంత ఉదారమైందో నాకు తెలియంది కాదు. కానీ ఇలా మాటిమాటికీ నీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పైగా అకస్మాత్తుగా ఇలా రెండేసి రోజులు మాయమైపోవడం వల్ల నా ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీనికేమన్నా ఉపాయం చూడు,’ అని ప్రాథేయపడ్డాడు రాజధాని ఉద్యోగి.   పల్లెటూరి నేస్తం కాసేపు ఆలోచించి ‘ఈసారి నువ్వు ఓ నెలరోజుల పాటు నా దగ్గరే ఉండు. ఈ నెల రోజుల్లోనూ గుర్రం మీద పూర్తిగా పట్టు సాధించేందుకు అవసరమయ్యే మెలకువలన్నీ నేర్పుతాను. గుర్రం పూర్తిగా నీ చెప్పుచేతల్లోకి వచ్చేలా తగిన శిక్షణ ఇస్తాను,’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఆ నెల రోజుల్లోనూ గుర్రం పూర్తిగా రాజధాని మిత్రుని మాట వినేలా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ గుర్రం తిరిగి పల్లెటూరి వైపు పరుగులెత్తలేదు.   మన జీవితం కూడా ఆ గుర్రం లాంటిదే! దాని మీద అదుపులేకపోతే తనకి కావల్సిన చోటుకి బలవంతంగా లాక్కుపోతుంది. బలహీనతల్లోకి జారిపోతుంది. వ్యసనాల వైపుగా ఈడ్చుకుపోతుంది. మన దారికి వచ్చిందిలే అనుకునేలోగా చేజారిపోతుంటుంది. అలా కాకుండా దాని మీద పూర్తిగా అదుపు తెచ్చుకున్న రోజున మన చెప్పుచేతల్లోనే ఉండిపోతుంది. దేవుడు మనిషికి ఆలోచన అనే బహుమతిని ఇచ్చాడు. ఆ బహుమతి మీద అదుపు లేకపోతే... దారి తప్పిన గుర్రంలా మారిపోతుంది. అదుపు సాధిస్తే అద్భుతాలకి దారి చూపిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
Publish Date:Apr 29, 2021

సంతోషం కావాలా - దానం చేయండి!

మనిషి సంఘజీవి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, ఒకరి బాధను వేరొకరు గమనించుకుంటూ సాగినప్పుడే ఆ జీవితానికి పరమార్థం. అందుకే మతాలన్నీ కూడా దానగుణానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే ఇలా దానం చేసినప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తుంది అన్న అనుమానం వచ్చింది కొందరు పరిశోధకులకి. తనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మన మనసుకి కష్టం కలుగుతుందా, తృప్తి లభిస్తుందా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అలా చేపట్టిన ఓ పరిశోధన ఇచ్చిన ఫలితం ఇదిగో...   స్విట్జర్లాండ్లోని జూరిచ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనని చేపట్టారు. ఇందుకోసం వారు ఓ 50 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరికీ కూడా కొంత డబ్బు ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇలా ఇచ్చిన డబ్బుని స్వంతానికి వాడుకోవచ్చునని కొంతమందికి చెప్పారు. ఆ డబ్బుని వేరొకరికి బహుమతి ఇచ్చేందుకు ఉపయోగించవచ్చని మరికొందరికి చెప్పారు. ఈ రెండురకాల వ్యక్తుల మెదడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో గ్రహించే ప్రయత్నం చేశారు.   దానంతో అభ్యర్థుల మెదడులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మార్పు కనిపించింది. మన సామాజిక ప్రవర్తనను నియంత్రించే temporoparietal junction, మనలోని సంతోషాన్ని సూచించే ventral striatum, మనం నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే orbitofrontal cortex... ఈ మూడింటిలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయట! అభ్యర్థులలో ఎంత డబ్బు దానం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచనలు మొదలవడంతోనే ఈ మార్పులు కనిపించాయి.   మనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎనలేని తృప్తి లభిస్తుందని సామాజికవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. పాశ్చాత్యదేశాలలో కొందరు ధనవంతులు తమ సంపదను దానం చేసేయడం వెనుక కూడా ఇదే కారణం కనిపిస్తుంది. ప్రతిదీ మనకే కావాలి, చేతిలో ఉన్నదాన్ని మనమే దాచుకోవాలి అనే స్వార్థం మన మెదడు మీద ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. అయితే పరిశోధకులు దానగుణం మంచిది అన్నారు కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేయాల్సిన అవసరం ఏమీ లేదట! ఇతరులకి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఆలోచనే చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. - నిర్జర.
Publish Date:Apr 28, 2021