ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్లపై చర్చ.. బాబు పంతం నెగ్గినట్లేగా?
posted on Jul 17, 2025 9:53AM
.webp)
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రధానంగా కర్నూలు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అయితే తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా.. నీటి కేటాయింపులు.. తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
బనకచర్ల అంశంపై చర్చించేది లేదని తేల్చేసింది. అయితే.. ఏపీ సీఎం పట్టుబట్టడంతో బనకచర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రెండు మూడు నిమిషాల పాటు మాత్రమే బనకచర్ల విషయం ప్రస్తావనకు వచ్చినా చంద్రబాబుదే పై చేయి అయ్యిందని చెప్పక తప్పదు. ఇక బనకచర్లపై తెలంగాణ సీఎం తన అభ్యంతరాలు తెలియజేశారనుకోండి అది వేరే విషయం. అసలు గోదావరిలో మిగులు జలాలు.. రెండు రాష్ట్రాలకూ వర్తిస్తాయని.. అలాంటప్పుడు ఏకపక్షంగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నించింది. ఇది కడితే.. తమ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
దీనిపై ఏపీ సీఎం అవసరమైతే.. రెండు తెలుగు రాష్ట్రాలూ కూడా నీటిని పంచుకునేందుకు సహకరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బనకచర్ల వివాదంపై చర్చించేందుకు ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పాటిల్ ప్రకటించారు. ఇంత వరకూ చూస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకునే బనకచర్లపై ముందుకు సాగాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసినట్లే భావించాల్సి ఉంటుంది. బనకచర్ల తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు సహా.. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై టెలీ మెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరు ఎంత నీటిని వాడుతున్నారన్న లెక్కలు కచ్చితంగా తేలనున్నాయి.
గతంలో కేసీఆర్ దీనిని వ్యతిరేకించగా.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. తద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఫుల్ స్టాప్ పడే దిశగా ఒక అడుగు పడిందని చెప్పవచ్చు. అలాగే కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజీ అంశాలపై కూడా చర్చ జరిగింది. నాగార్జున సాగర్ వివాదంపై కూడా ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.