మీ పర్యటనలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి?

జగన్ పై పోలీసుల ఆగ్రహం


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో గురువారం (జులై 17)  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. డీజీపీ స్థాయి అధికారులను మాఫియాడాన్ లతో పోల్చడం దారుణమన్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే పోలీసులు పని చేసిన విషయాన్ని ఆయన మరిచిపోయారా అని నిలదీశారు.  ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు పూర్తిగా అవాస్తవమన్నారు.  

పోలీసుల్ని బెదిరించ‌డం సరికాదనీ, పోలీసులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తారన్న శ్రీనివాసరావు. పోలీసుల తీరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలే గానీ ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం సమజసం కాదన్నారు. జగన్ పర్యటనలలో మాత్రమే పోలీసులపై భౌతిక దాడులు ఎందుకు జరుగుతున్నాయని, దీని వెనుక ఉన్న కారణమేంటో జగనే జప్పాలన్నారు. పోలీసులు, పోలీసు వ్యవస్థ ఏ రాజకీయపార్టీకీ తొత్తుగా వ్యవహరించదన్న శ్రీనివాసరావు.. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.