అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఒకరి మృతి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ లో ఓ వ్యక్తి మరణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు స్నేహితులను, మరణానికి కారణమైన మరో నలుగురు నిందితులను పోలీసులు  అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి నిందితులను  ముందు హాజరు పరిచారు. ఆయన కథనం ప్రకారం ఈనెల 12  రాత్రి సుమారు 10 గంటలకు గండికోట సాంబయ్య తన ఇద్దరు స్నేహితులతో కలిసి గోపాల్ పూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వైపు పావురాల వేటకు వేళ్లారు.

అప్పటికే అక్కడ అడవి పందుల కోసం గ్రామానికి చెందిన చందర్ రావు ప్రోద్బలంతో మరో ముగ్గురు వ్యక్తులు అమర్చిన విద్యుత్ వైర్ కాలికి తగిలి సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.దీంతో భయంతో మృతుడు సాంబయ్య   స్నేహితులిద్దరూ అక్కడినుండి పారిపోయారు. అక్కడ విద్యుత్ వైర్లు అమర్చిన నిందితులు నేరం తమపై రాకుండా ఉంటుందని సాంబయ్య మృతదేహాన్ని పక్కనే   ఉన్న మరొక వ్యక్తి బావిలో పడేశారు.

 మృతుడు సాంబయ్య స్నేహితులు విషయాన్ని మరుసటి రోజు ఉదయం   గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కు తెలియజేశారు. వా వారి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ సాంబయ్య మృత దేహం కనిపించలేదు. గాలించగా పక్కనే ఓ వ్యవసాయ బావిలో సాంబయ్య మృతదేహం కనిపించింది.  దీంతో అడవి పందుల కోసం విద్యుత్ వైర్లు అమర్చిన నలుగురు నిందితులతో పాటు మృతుడు సాంబయ్య ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుకున్నారు.