కన్నడ నటికి ఏడాది జైలు శిక్ష

 

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు  బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే  హక్కును నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదు. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్‌జైన్‌లు సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. 

కాగా, బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌ఫోర్ట్‌లో దుబాయ్ నుంచి 14.3 కిలోల బంగారం (రూ. 12.56 కోట్ల విలువ) స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. నటి రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌లు ఈ స్మగ్లింగ్ రాకెట్‌‌లో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బెంగ‌ళూరు కోర్టు వెల్ల‌డించిన తీర్పు ప్ర‌కారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి విచార‌ణ‌లు జ‌రుగుతాయ‌ని కోర్టు పేర్కొంది. ఇలా ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది.