చిరంజీవికి షాకిస్తున్న ప్రభాస్.. వార్ తప్పదా..?
on Jul 16, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'. ఈ హారర్ కామెడీ సినిమాకి మారుతి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారబోతుందని, 2026 సంక్రాంతికి వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. చిరంజీవి, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ చూడనున్నాం.
నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'తో చిరంజీవి, 'రాజా సాబ్'తో ప్రభాస్ బాక్సాఫీస్ వార్ కి దిగాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. 'విశ్వంభర' అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముండగా, 'రాజా సాబ్'ను డిసెంబర్ కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఈ డిసెంబర్ కూడా కాదని.. 2026 జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారట. దీంతో 2025 సంక్రాంతికి మిస్ అయిన చిరంజీవి-ప్రభాస్ బాక్సాఫీస్ వార్.. 2026 సంక్రాంతికి ఉండేలా ఉంది.
2026 సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే చిరంజీవి కర్చీఫ్ వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న తన 157వ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే సీజన్ పై 'రాజాసాబ్' కన్ను పడినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి, మధ్య పొంగల్ పోరు తప్పేలా లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
