భళా శిష్యా భళా.. అంతా నీ చలవే గురువా!
posted on Jul 17, 2025 11:37AM

((ఫోటో చెప్పిన కథ)
సమర్ధుడి చెమట బిందువు కూడా పిల్లల్ని పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని అంటారు పెద్దలు. అలాంటి సమర్ధుడిగా చంద్రబాబు నాయుడ్ని అభివర్ణించకుండా ఉండలేమంటారు కొందరు. ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనాలనిపిస్తోందనీ చెబుతారు.
అప్పట్లో బాబు తీసుకున్న ఒకానొక నిర్ణయం తర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినా.. తర్వాత రాష్ట్రం రెండుగా చీలినా.. ఆయనకేం ఫరక్ పడలేదు. ఆయన నవ్యాంధ్రకూ తొలి ముఖ్యమంత్రి కాగలిగారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను తయారు చేసిన పేరు కూడా సాధించగలిగారు.
మొదట తన మంత్రి మండలిలోకి కొత్తగా పీజేఆర్ పై గెలిచిన విజయరామారావుకి మంత్రి పదవి ఇద్దామని భావించిన ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ని పక్కన పెట్టారు చంద్రబాబు. దీంతో అలిగిన కేసీఆర్.. తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకెళ్లి కొత్త పార్టీ పెట్టి ఆపై తెలంగాణ ఏర్పాటుకు కారణం కావడం మాత్రమే కాదు.. సీఎం కూడా అయ్యారు. పదేళ్లు కొత్త రాష్ట్రాన్ని పాలించారు.
దాంతో మరో దారి లేక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ ఎంపీ కావడం, ఆపై టీపీసీసీ చీఫ్ కావడం.. తర్వాతి కాలంలో తెలంగాణకు సీఎం కాగలిగారు. ఇప్పుడు చూస్తే తన గురువుతో సమానంగా తాను కూడా ఒక ముఖ్యమంత్రిగా సత్స మానమైన హోదాలో ఆయన్ను కలిసి అభివాదం చేశారు. చంద్రబాబు కూడా తన శిష్యుడ్ని అభినందించారు. ఎన్నో రకాల బహుమతులిచ్చారు.
ఇది కదా అసలు రాజకీయమంటే.. ఒక నాయకుడంటే కేసీఆర్ పరిభాషలో చెబితే.. తాను మాత్రమే నాయకుడిగా ఉండి.. ఇతరులను పనికిమాలిన చవట- దద్దమ్మ- సన్నాసులను చేయడం కాదు. తనతో సమానమైన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకోవడం. అదే బాబు చేసి చూపించారని అంటారు రాజకీయ విశ్లేషకులు.