కామ్రేడ్స్ ని మట్టి కరిపించిన ఆడ సివంగులు

  దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా దేశంమంతటా వ్యాపించి ఉన్నమన ఎరెర్ర పార్టీలన్నీఇంతవరకు ఒక్కసారి కూడా ఎర్రకోట మీద తమ ఎర్రజెండా ఎగురవేయలేకపోయాయి. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతీ ఐదేళ్ళకీ ఓసారి దేశంలో చిన్న చితకా పార్టీలను భుజాన్నేసుకొని ఫ్రంట్ నిచ్చెన ఎక్కి ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాతో బాటు తమ ఎరెర్రజెండాను కూడా ఎగురవేయాలని కలలు కంటూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆయాసం తప్ప వారికి మరేమీ మిగలలేదు. ఎన్నికలు దగ్గిర పడుతుండటంతో ఈసారి కూడా మళ్ళీ ‘ఫ్రంట్ నిచ్చెన’ అటక మీద నుండి క్రిందకు దింపి అందరినీ ఆహ్వానించాయి.   ఎక్కడో ఉన్న తమిళనాడులో ఉన్న జయలలితమ్మను బొట్టు పెట్టి మరీ ఆహ్వానించిన కామ్రేడ్స్, ఊళ్లోనే తమ ఇంటి పక్కనే ఉన్న మమతమ్మను మాత్రం ఈ ఫ్రంట్ పేరంటానికి పిలవలేదు. కారణం ముపై ఏళ్లుగా బెంగాల్ కుర్చీలో తిష్టవేసుకొని కూర్చొన్న తమను మెడపట్టుకొని నిర్దాక్షిణ్యంగా బయటకి ఈడ్చేపడేసిందనే కోపమే తప్ప మరోటి కాదు!   అయితే కామ్రేడ్స్ చేత ఎర్రెర్ర బొట్టుపెట్టించుకొని, వారి ఫ్రంట్ పేరంటానికి వెళ్లి వారందించిన తాంబూలం కూడా స్వీకరించిన జయమ్మ, ఆ తరువాత వాళ్ళు తన వెనకే రెక్కలు కట్టుకొని పొత్తుల కోసం చెన్నైలో వాలినపుడు, వారిపై ఏమాత్రం కృతజ్ఞతా చూపకుండా “ఒక్కసీటు కూడా విదిలించేది లేదని,అయినా నా బరువుని మీ ఫ్రంట్ నిచ్చెన కాయలేదని” ఆమె తెగేసి చెప్పేయడంతో కామ్రేడ్స్ బిక్క చచ్చిపోయారు.   “మరి బొట్టు పెట్టించుకొని తాంబూలం కూడా స్వీకరించావు కదమ్మా? మరిదేమిటి...???” అని వారు మొహం చిన్నబుచ్చుకొని అడిగితే, “ఈసారి అదృష్టం బాగుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే సోనియమ్మ తన రాహుల్ బాబుని ప్రధాని చేయాలనుకొంటే మీరేమయినా అభ్యంతరం చెప్పారా? ఎక్కడో గుజరాత్ లో ఉన్న మోడీ డిల్లీకి ఊడిపడి ప్రధాని అయిపోతానని ఊగిపోతుంటే మీరేమయినా ఆయనను ఆపగలిగారా? అటువంటప్పుడు నేను ప్రధాన మంత్రిని అవుదామని అనుకొంటుంటే నా యంపీ సీట్లలో వాటా కావాలని అడగడం మీకేమయినా భావ్యంగా ఉందా డియర్ కామ్రేడ్స్? ఏదో బొట్టు పెట్టి పిలిచారు కదాని పేరంటానికి వస్తే,  తగుదునమ్మా అనుకొంటూ నా ప్లేన్లోనే సీట్లకోసం వచ్చేయడమే?” అని ఆమె ప్రశ్నించేసరికి వారి నోట జవాబు లేదు.   ఇక ఈ కధంతా విన్న మమతమ్మ ఆనందంతో గెంతులు వేసింది. తనను పేరంటానికి పిలవకుండా అవమానించిన కామ్రేడ్స్ కి భలే శాస్తి జరిగిందని పొంగిపోయింది. తన శత్రులకి అంతబాగా బుద్ధి చెప్పిన జయమ్మ పట్ల మమతానురాగం పొంగిపోర్లిపోయింది. ఆ ఆనందంలో తాను కూడా ప్రధాన మంత్రి రేసులో ఉన్నాననే సంగతిని మరిచిపోయి, “జయక్క ప్రధాన మంత్రి అవుతానంటే అందులో తప్పేముంది. అక్క కళ్ళల్లో ఆ ఆనందం చూసేందుకు నేను మద్దతు ఇవ్వడానికి రెడీ!” అన్నట్లుగా బెంగాలీ బాషలో ఏదేదో చెప్పెసరికి, అటు నుండి జయక్క కూడా అంతే ఇదిగా రియాక్టయిపోతూ వెంటనే ఫోనందుకొని ఆమెతో అరవంలో అరగంటకు పైగా ఏదేదో మాట్లాడేసింది. బాషలు వేరయినా (ప్రధాని కావాలనే) ఒకరి భావాలొకరికి పూర్తిగా అర్ధమయిపోయిన ఫీలింగ్!   వాళ్లిదరి దెబ్బకి విరిగిపోయిన తమ ఫ్రంట్ నిచ్చెన భుజానెత్తుకొని కామ్రేడ్స్ ఆంద్ర ఒరిస్సా సరిహద్దుల మీదుగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటికి చేరుకొన్నట్లు తాజా సమాచారం.

జగన్మోహన్ రెడ్డితో సీ.పీ.యం. ఎన్నికలల దోస్తీ

  అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నామని గర్వంగా చెప్పుకొనే సీ.పీ.యం. పార్టీ అనేక అవినీతి కేసులలో ఇరుకొన్న జగన్మోహన్ రెడ్డితో ఎన్నికల పొత్తులకి సిద్దం అవుతోంది. అందుకు ఆ పార్టీ నేతలు కనుగొన్న మంచి సాకు ఏమిటంటే వైకాపా కూడా తమ పార్టీలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడటమేనని చెపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతనెల డిల్లీ పర్యటనలోనే ఆ రెండు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తులపై ఒక అంగీకారం కుదిరిందని సమాచారం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి, ఎన్నికల ప్రకటన కూడా వెలువడినందున ఇక ఆ రెండు పార్టీలు బహుశః నేడో రేపో ఎన్నికల పొత్తుల ప్రకటన చేయవచ్చును. అయితే ఆ రెండు పార్టీలు ఇప్పటికే ఒకదానితో మరొకటి సహకరించుకొంటున్నాయని మొన్న జగన్మోహన్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన సభకు ఆ రెండు పార్టీలు కలిసి చేసిన భారీ జన సమీకరణం చూస్తేనే అర్ధమవుతుంది. ఇంతవరకు తెదేపాతో అంటకాగిన లెఫ్ట్ పార్టీలు ఒకటి వైకాపాతో మరొకటి(సీపీఐ) తెరాసతో ఈసారి జతకట్టేందుకు సిద్దమవుతున్నాయి.   సీ.పీ.యం., వైకాపాలు పొత్తులు పెట్టుకొని రానున్న ఎన్నికలలో ఒకదాని వల్ల మరొకటి ఆంధ్ర, తెలంగాణా మరియు జాతీయ స్థాయిలో కూడా ప్రయోజనం పొందాలని ఆశపడుతున్నాయి. సీమాంధ్రలో బలంగా ఉన్న వైకాపా వల్ల సీ.పీ.యం. లాభపడితే, మళ్ళీ తెలంగాణాలో పాగా వేయాలని భావిస్తున్న వైకాపాకు అక్కడ బలమయిన క్యాడర్ మరియు మంచి పట్టు ఉన్న సీ.పీ.యం.తో దోస్తీ చేసి లాభపడాలని ఆశిస్తోంది.   ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల లాంచన ప్రకటన కూడా వెలువడితే, కొద్ది రోజుల క్రితం యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా సీ.పీ.యం. చొరవతో ఏర్పాటు చేసిన ‘థర్డ్ ఫ్రంట్’ కూటమిలో వైకాపా కూడా భాగస్వామి అయినట్లే భావించవచ్చును. దేశవ్యాప్తంగా ఉన్న బలమయిన 11 ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తుకొన్న ఈ థర్డ్ ఫ్రంట్ కు వైకాపా కూడా తోడయితే అది మరింత బలపడుతుంది. అయితే, దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గాలి వీస్తున్నందున, థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా బీజేపీ విజయావకాశాలకు గండికొట్టగలదు.   ఒకవేళ థర్డ్ ఫ్రంట్ మెజార్టీ సాధించిన్నపటికీ అందులో అరడజను మంది వివిధ పార్టీలకి చెందిన నేతలు ప్రధానమంత్రి రేసులో ఉన్నందున అందరూ గొడవపడినపుడు థర్డ్ ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. ఒకవేళ ఎన్నికలలో మెజార్టీ సాధించలేక చతికిలపడినా, కాంగ్రెస్ వేసే ఎరలకు ఆశపడి కొన్ని పార్టీలు అటువైపు దూకితే ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. అందుకే థర్డ్ ఫ్రంట్ కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టించబడిందని నరేంద్ర మోడీ ఆరోపిస్తున్నారు. కానీ ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సరిపోయే మెజార్టీ సాధించలేకపోతే, అప్పుడు బీజేపీ కూడా తప్పనిసరిగా థర్డ్ ఫ్రంట్ వైపే చూడక తప్పదు. కనుక, ఏవిధంగా చూసినా థర్డ్ ఫ్రంటులో చేరడం వలన వైకాపాకు లాభమే తప్ప నష్టం ఉండదు గనుక ఫ్రంటులో చేరడం ఖాయం.   అయితే, ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని జైలు నుండి విడుదల చేసిందని అనేక మంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు గమనిస్తే, ప్రస్తుతానికి ఎన్నికలలో గెలిచేందుకు సీ.పీ.యం. మద్దతు అవసరం కనుక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొన్నపటికీ, ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంటులో కాంగ్రెస్ అనుకూల పార్టీలయిన సమాజ్ వాదీ వంటి పార్టీలతో కలిసి యూపీఏకే మద్దతు ఇవ్వవచ్చును. బహుశః సీపీయం అప్పుడు తాపీగా పశ్చాతాపపడుతుందేమో!

సీమాంధ్ర ప్రజల విజ్ఞతకు పరీక్షగా ఎన్నికలు

  ఇంతవరకు దేశంలో ఏ పెద్ద రాష్ట్రానికి తీసిపోని విధంగా చాలా బలంగా ఉన్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాంగ్రెస్, బీజేపీ, సోనియమ్మల పుణ్యమాని రెండు చిన్న రాష్ట్రాలుగా కుచించుకుపోయింది. ఈ తరుణంలో ఉన్నఅరడజను పాత పార్టీలు సరిపోవన్నట్లు, కొత్తగా మరో అరడజను పార్టీలు వచ్చి చేరుతుండటంతో మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడుతుందనట్లు ప్రజల ఓట్లు ఈ పార్టీల మధ్య చీలితే ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ పార్టీలన్నీ కేవలం సీమాంద్రాలోనే ఎన్నికల బరిలోకి దిగాలనుకోవడం వలన ఆ ప్రాంతానికి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.   ప్రజల ఓట్లు సినిమా హీరోలు, కులాలు, మతాలు, సమైక్య, విభజన వాదాలు, రాజధాని తదితర అంశాల వారిగా చీలిపోవడం ఖాయం. రాష్ట్ర విభజన మొదలయిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి తిరగడంతో రాష్ట్రంలో తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలంగా సమైక్య ఉద్యమాలతో, ఇప్పుడు రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్రకు ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవలసిరావడం అదనపు భారమే అవుతుంది. ఇటువంటి కీలక సమయంలో ఒకేసారి ఇన్నిపాత,కొత్త పార్టీలు ఉన్న13జిల్లాల ప్రజల ఓట్ల కోసం పోటీలు పడి, వారిని రకరకాల వాదనలతో మభ్యపెట్టి వారి ఓట్లు చీల్చుకొంటే, రాష్ట్ర పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా అవుతుంది.   ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికలలో గెలిచినా, ఓడిపోయినా వాటికెటువంటి నష్టమూ ఉండదు. కానీ, ప్రజలే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు ఈ పాత కొత్త పార్టీల మధ్య ప్రజల ఓట్లు చీలడం అనివార్యంగా కనిపించడం చాల ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ఇప్పటికే దైన్య స్థితిలో ఉన్న రాష్ట్రం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటు కోసం యం.యల్యే.ల మద్దతు కోసం బేరసారాలు, తత్ఫలితంగా అస్తిరమయిన ప్రభుత్వం అన్నీ కలిపి సామాన్య ప్రజల బ్రతుకులు మరింత భారం చేయడం ఖాయం. అందువల్ల రానున్న ఎన్నికలు రాజకీయ పార్టీలకు జరిగే పరీక్షగా కాక, సీమాంధ్ర ప్రజల విజ్ఞతకి పెడుతున్న పరీక్షగా భావించి సరయిన పార్టీని, సమర్ధులు, నిజాయితీ పరులయిన నేతలని మాత్రమే ఎన్నుకోవలసి ఉంటుంది. అలాకాదని ఈ పాత కొత్త పార్టీల మధ్య ప్రజలు చీలిపోతే చివరికి నష్టపోయేది వారేనని గ్రహించాలి.

కాంగ్రెస్-జగన్ మధ్య అనైతిక బందం ఉంది: పురందేశ్వరి

    కాంగ్రెస్ అధిష్టానం కేవలం తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజనకు పూనుకొందని, అదేవిధంగా ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డిని బెయిలుపై బయటకి రప్పించి, సీబీఐ కేసుల స్పీడ్ పూర్తిగా తగ్గించి వేసిందని చంద్రబాబు ఆరోపిస్తుండటం అందరూ వింటున్నదే. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రతీ సభలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరగడం, ఆ తరువాత ప్రజలు తనకి ముప్పై యంపీ సీట్లిస్తే తనకు నచ్చిన వ్యక్తినే ప్రధానమంత్రిని చేస్తానని చెప్పడం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రహస్య ఒప్పందం చేసుకొందని చంద్రబాబు ఆరోపిస్తుంటే,జగన్మోహన్ రెడ్డి అంతకంటే గట్టిగా సోనియాగాంధీ ని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూండటంతో వీరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జగన్ మోహన్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎంత తీవ్రంగా విమరిస్తున్నపటికీ, ఏనాడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. పైగా దిగ్విజయ్ సింగ్ తమదీ, జగన్మోహన్ రెడ్డిది ఒకటే డీ.యన్,ఏ. అని, అతను తన కొడుకు వంటి వాడని మెచ్చుకొన్నారు. తనని చెంప దెబ్బ కొట్టమని జగన్ అన్నపటికీ, ఆయన 'జగన్ నా కొడుకు వంటి వాడే' అనే నా స్టాండులో మార్పు లేదని చెప్పడం విశేషం. అదే జేసీ దివాకర్ రెడ్డి సోనియమ్మను పదవిలో దిగిపోమని డిమాండ్ చేసినందుకే షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలన్నా, విమర్శలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడం వారి మధ్య ఉన్న రహస్య అనుబందానికి అద్దం పడుతుంది.         లగడపాటి, రాయాపాటి, ఉండవల్లి, జే.సి. దివాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్ వంటి వీరవిధేయ కాంగ్రెస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని విస్పష్టంగా ప్రకటించారు. లగడపాటి రాజగోపాల్ అయితే మరొక అడుగు ముందుకు వేసి పెంపుడు కొడుకు వంటి జగన్మోహన్ రెడ్డి కోసం సోనియాగాంధీ కన్న బిడ్డల వంటి తమని అన్యాయం చేసిందని ఆరోపించారు.   కాంగ్రెస్ యంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగిన సంగతి అందరికీ తెలుసు. ఆయన మరొకటి రెండు రోజుల్లో వైకాపాలో చేరేందుకు సిద్దమయిన సమయంలో వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏకి మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి మనసులో మాటని పొరపాటున బయటపెట్టినందుకు వైకాపాలో చెరక ముందే బహిష్కరింపబడిన సంగతి అందరికీ తెలుసు.   ఈరోజు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ యంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా లో కేసీఆర్ తో, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందాలు చేసుకొని వారిద్దరి కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడుకోందని, తమ అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయకుండా గోరంగా అవమానించిందని ఆమె ఆరోపించారు. తమకు గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీని వీడుతున్నామని తెలిపారు.   ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ తమ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి కి మధ్య రహస్య అవగాహన ఉందని గట్టిగా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలుగా, రాహుల్ గాంధీ టీంలో కీలక వ్యక్తిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే విషయం ద్రువీకరించడం గమనిస్తే, ఇంతకాలంగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమేనని అంగీకరించక తప్పదు.   అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన సభలలో కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీ ని ఆడిపోసుకోవడం కూడా అంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్పష్టమవుతోంది. ఇక ఆయన ప్రజలను ముప్పై యంపీ సీట్లు కోరడం, తనకు నచ్చిన వ్యక్తిని ప్రధాని పదవిలో కూర్చోబెడతానని చెప్పడం దేనికో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పురందేశ్వరి ఆరోపణలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు, అక్కడ కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ కలిసి 15యంపీ సీట్లు సాధించిపెడితే యువరాజవారికి పట్టాభిషేకం జరిగిపోతుందని స్పష్టమవుతోంది.   నోరు విప్పితే నీతి నిజాయితీ, విశ్వసనీయత, నైతిక విలువలు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో తన తండ్రిపై ఉన్న అభిమానాన్నే పెట్టుబడిగా భావిస్తూ వారి ఆ అభిమానాన్ని బలహీనతగా భావిస్తూ ప్రజలను ఎంత దారుణంగా మభ్యపెడుతున్నారో ఈ కరడు గట్టిన కాంగ్రెస్ నేతల ఆరోపణలు బట్టబయలు చేస్తున్నాయి.

కిరణ్ విఫలయత్నాలు

  మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి ‘లాస్ట్ బాల్స్’ ఇంకా చాలా మిగిలే ఉన్నాయంటూ గాలిలో బ్యాటు ఊపుతూ బాగానే చప్పట్లు కొట్టించుకొన్నారు. అయితే ఆయన మంచి ‘ఫాం’ లో ఉన్నపుడు రాజీనామా చేసి పార్టీ పెట్టకుండా పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందేవరకు పదవిని, పార్టీని పట్టుకొని వ్రేలాడటం ఒక పొరపాటని ఇప్పుడు అర్ధమవుతోంది. అదీగాక ఆయన తన పదవి నుండి దిగిపోయే ముందు ప్రతిపక్షాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తన నమ్మకస్తులకు కీలక పదవులలో నియామకాలు చేసి, చివరి మూడు నాలుగు రోజుల్లోనే వేలాది ఫైళ్ళను క్లియర్ చేసారు. వాటిని గవర్నర్ నరసింహన్ ఇప్పుడు వరుసగా రద్దు చేస్తుండటంతో కిరణ్ మరింత అప్రదిష్ట పాలయ్యారు.   ఆయన ఇంతవరకు కొత్తపార్టీ పెట్టే సాహసం కూడా చేయలేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కానీ, ఆయన కొత్త పార్టీపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వెంట ఎంతమంది వస్తారు? ఇంకా ఎంతమందిని ఆకర్షించగలరు? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. సరిగ్గా ఇదే సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెనుక లక్షలాది అభిమానులు వెళ్ళిపోగా, నందమూరి అభిమానులు తెదేపావైపు, రెడ్డి కులస్తులు, క్రీస్టియన్లు, వైయస్సార్, జగన్ అభిమానులు వైకాపా వైపు వెళ్ళిపోతే ఇక కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్తపార్టీకి అసలు జనాలు దొరుకుతారా?అనే మరో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అందువల్ల కిరణ్ ఒకవేళ కొత్త పార్టీ పెడితే అది ఆమాద్మీ, మందకృష్ణ, బైరెడ్డి తదితర పార్టీలతో బాటు ఓట్లు ఓట్లు చీల్చడానికి తప్ప మరి దేనికి ఉపయోగపడకపోవచ్చును.   కొత్తపార్టీ పెట్టేముందు సీమాంధ్ర ప్రజలలో మళ్ళీ కొంచెం పేరు సంపాదించుకోనేందుకేనేమో, కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేసారు. అయితే గతంలో అనేకసార్లు ఇటువంటి పిటిషన్లను నిర్ద్వందంగా తిరస్కరించిన జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డే బెంచీయే మళ్ళీ ఈ పిటిషన్ను కూడా చెప్పట్టబోతోంది. అంటే మళ్ళీ పిటిషన్ తిరస్కరింపబడే అవకాశాలే ఎక్కువని అర్ధమవుతోంది.   తెలంగాణా ఏర్పాటుకి రాష్ట్రపతి ఆమోదం ముద్ర కూడా పడి, గెజిట్ నోటిఫికేషన్, అప్పాయింటడ్ తేదీ కూడా ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు బెంచీ ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టి, విభజన వ్యవహారాన్ని మళ్ళీ తిరుగదోడుతుందని భావించలేము. కనుక కిరణ్ కుమార్ రెడ్డి కేవలం తానొక్కడినే రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్నాని నిరూపించుకోవడానికి తప్ప ఈ పిటిషన్ వేరెందుకు పనికి రాదు. కానీ సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ను తిరస్కరిస్తే, అది ఆయనకు మరింత అప్రదిష్టే తప్ప మేలు చేయదు. గనుక ఇది కూడా ఆయన తీసుకొన్న మరో తప్పుడు నిర్ణయమవుతుంది.

తెరాస కోసం టీ-కాంగ్రెస్ బలి?

  కారణాలేవయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోమని తెరాస అధ్యక్షుడు కుండ బ్రద్దలు కొట్టేసారు గనుక, ఇక ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ కారణంగానే ఆ రెండు పార్టీల మధ్య ఇక ఎన్నికల పొత్తులు కూడా పెట్టుకొనే అవకాశాలు కూడా మాయమవుతాయి. అప్పుడు రానున్న ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్-తెరాస-తెదేపా-బీజేపీల మధ్య చతుర్ముఖ పోటీ అనివార్యమవుతుంది. దీనివలన కాంగ్రెస్-తెరాసలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండవచ్చును. ఒకవేళ తెదేపా-బీజేపీలు కనుక ఎన్నికల పొత్తులు కుదుర్చుకొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలగడం తధ్యం.   కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, కేసీఆర్ మరియు తెరాస నేతలు తెలంగాణా తామే సాధించామనే విషయాన్నిబలంగా నొక్కి చెపుతూ అందుకు తగ్గట్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు త్రిప్పుకోగలిగారు. కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి భరించలేక టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో కృతజ్ఞత సభలు, విజయోత్సవ సభలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నప్పటికీ, వారి దృష్టి అంతా పీసీసీ అధ్యక్ష పీటంపైనే ఉంది. పైరవీలు చేసుకోకపోతే దానిని వేరెవరో తన్నుకు పోతారనే భయంతో అందరూ దానిపైనే శ్రద్ధ చూపుతుండటంతో తెరాస పని మరింత సులువయింది. టీ-కాంగ్రెస్ నేతలు ఈ పదవుల ప్రాకులాట నుండి బయటపడేలోగానే తెరాస తెలంగాణా ప్రజలను తనవైపు త్రిప్పుకొంటే, ఇంక సీమాంధ్రతో బాటు తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.   అయితే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టి తెలంగాణాలో యంపీ సీట్లపైనే తప్ప యం.యల్యే.సీట్లపై లేదు గనుక అది అంత దిగులుపడబోదు. పోతే కాంగ్రెస్ టికెట్ పై శాసనసభకు పోటీ చేసే నేతలే కొట్టుకుపోతారు కానీ, యంపీలకు ఎటువంటి డోకా ఉండదు. అదీగాక తెరాసలో యంపీ స్థానాలకు పోటీ చేసి గెలిచే సత్తా, వనరులు ఉన్ననేతలు కూడా లేరు గనుకనే ఆ సత్తా ఉన్న కాంగ్రెస్ యంపీకు గాలం వేసేందుకు కేసీఆర్ గతంలో గట్టి ప్రయత్నాలు చేసారు. అయితే, డిల్లీలో కాంగ్రెస్-తెరాసల మధ్య ఏదయినా రహస్య ఒప్పందం జరిగి ఉన్నట్లయితే ఇక కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు చేయకపోవచ్చును. అదీగాక ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైనే ఉంది. గనుక కాంగ్రెస్ పార్టీకి యంపీ సీట్లు, తెరాసకు యం.యల్యే.సీట్లు అనే లోపాయికారీ ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య జరిగి ఉండి ఉండవచ్చును.   అదే నిజమయితే, సీమాంధ్రలో కాంగ్రెస్ తన నేతల భవిష్యత్తుని నాశనం చేసినట్లుగానే, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధిష్టానం తన యం.యల్యే.ల భవిష్యత్తుని తెరాస కోసం బలిచేయబోతోందని భావించవచ్చును. యువరాజు రాహుల్ గాంధీ వారిని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు, కాంగ్రెస్ నేతలు ఆ మాత్రం త్యాగం చేసేందుకు వెనుకాడరని ఆశించడం అత్యాసే అయినా వారికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.  

ముగ్గురు అపరిచితులు

  తెలంగాణా ఏర్పాటుకాగానే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని పదేపదే చెప్పిన కేసీఆర్, ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీతో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులతో కాంగ్రెస్ పార్టీకే ‘హ్యాండ్’ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా వారికి అంతే దీటుగా, ఘాటుగా బదులిస్తున్నారు. నికృష్ట రాజకీయాలు చేయడంలో తలపండిన కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను గుడ్డిగా నమ్మి వారికి తెలంగాణా, బెయిలు ఇచ్చిందని భావించలేము. బెయిలు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ఏర్పడిన తరువాత కేసీఆర్ ఒకే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడం గమనిస్తే ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమేననే అనుమానం కలుగకపోదు.   కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్ర, తెలంగాణాలలో అధికారంలోకి రావడం ప్రధానం కాదు. కేంద్రంలో అధికారం కైవసం చేసుకొని రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడమే దాని ప్రధాన లక్ష్యం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లక్ష్యం ఆంధ్ర, తెలంగాణాలలో అధికారం చెప్పట్టడమే కానీ కేంద్రంలో అధికారం చెప్పట్టడం కాదు. అంటే వారు ఒకరి పరిధిలోకి మరొకరు ప్రవేశించే ఆసక్తి, ఉద్దేశ్యం లేవని స్పష్టమవుతోంది. అదేవిధంగా ఆ మూడు పార్టీల ప్రధాన రాజకీయ శత్రువు తెలుగుదేశం పార్టీయే. అందువల్లనే ఆ మూడు పార్టీల మధ్య చక్కగా అవగాహనకు అవకాశం ఏర్పడింది.   అయితే, ప్రజలను, తమ రాజకీయ ప్రత్యర్ధులను ఏమార్చడం కోసమే ఈ మూడు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నాయని భావించవచ్చును. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం యొక్క హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తూ తెరాస కాంగ్రెస్ పార్టీతో కత్తులు దూస్తే, రాష్ట్రాన్ని విభజించిందనే సాకుతో వైకాపా కాంగ్రెస్ పై కత్తులు దూస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్-తెరాసలు కలిసి తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీయే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిందని తెలంగాణాలో ప్రచారంచేస్తుంటే, సీమాంధ్రలో అందుకు పూర్తి విరుద్దంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వలననే రాష్ట్ర విభజన జరిగిందని ఆ రెండు పార్టీలు కలిసి ప్రచారం చేస్తూ రెండు చోట్ల తెదేపాను భూస్థాపితం చేయాలనే ఆలోచనతోనే పూర్తి విభిన్నమయిన ఈ ‘అపరిచితుడి పాత్రలు’ పోషిస్తున్నాయి. ఎన్నికల దగ్గరపడే కొద్దీ ఈ మూడు పార్టీలు మరింత తీవ్రంగా యుద్ధం చేసుకోవచ్చును. కానీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే తెరాస, వైకాపాలు దానికే మద్దతు ఈయవచ్చును.   అయితే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనవలసి ఉంది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల నైజం పూర్తిగా తెలిసినపటికీ వారినే నమ్ముకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ వారిరువురూ నిజంగానే తన చేతిలో నుండి జారిపోయేమాటయితే వారిని ఏవిధంగా కట్టడి చేయాలనుకొంది?   కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల వరకు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంటుంది గనుక, ఈలోగా అవసరమనుకొంటే వారిపై తన సీబీఐ చిలుకలనో మరొకటో ప్రయోగించి లొంగ దీసుకోవచ్చును. కానీ, ఎన్నికల తరువాత తిరిగి అధికారంలోకి రావాలంటే మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు తెరాస, వైకాపాలు కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి మద్దతు ఇస్తే వాటిని కట్టడి చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణాలలో తన పార్టీని పణంగా పెట్టి మరీ వారిరువురినీ ఇంత గుడ్డిగా నమ్మి ముందుకు వెళుతుందని భావించలేము. కనుక, ఈ మూడు పార్టీలు మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉందని భావించవలసి ఉంటుంది.

పొత్తులపై నోరు మెదపని తెదేపా-బీజేపీ

  బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొందామని భావించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు ఇవ్వడంతో, కనీసం ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా ఎత్తలేకపోతున్నారు. అలాగని ఆయన ఇంతవరకు బీజేపీకి దూరం జరుగుతున్నట్లు కానీ, బీజేపీని విమర్శించడం గానీ చేయలేదు. అదేవిధంగా యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా ఇటీవలే స్థాపించబడిన ‘థర్డ్ ఫ్రంట్’ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. అయితే బీజేపీ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించిన తరువాత ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్ర ప్రజలలో పెల్లుబికిన ఆగ్రహాన్ని ప్రతిఫలించేందుకేనన్నట్లు, కొందరు తెదేపా నేతలు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కానీ ఆ తరువాత వారు కూడా చల్లబడిపోయారు. అదే విధంగా బీజేపీ అగ్ర నేతలెవరూ కూడా తెదేపాను విమర్శలకు ప్రతిస్పందించక పోవడం గమనార్హం. ఇవన్నీ కలిపి చూస్తే నేటికీ తెదేపా-బీజేపీలు పొత్తులకి సానుకూలంగానే ఉన్నట్లు భావించవచ్చును.   అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు కుదుర్చుకొంటే కాంగ్రెస్, వైకాపాలు రెండూ కలిసి, తెదేపాపై దాడి చేసే అవకాశం ఉంది గనుకనే బహుశః రెండు పార్టీలు వెనక్కి తగ్గి ఉండవచ్చును. అయితే ఇదే అదునుగా తెదేపా స్థానంలోకి వైకాపా ప్రవేశించాలని ఆశిస్తోందని ఆ పార్టీ అధినేతకు చెందిన సాక్షి మీడియాలో మోడీ అనుకూల కధనాలు చూస్తే అర్ధమవుతుంది. అంటే తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఒకలాగా, తాము పెట్టుకొంటే మరోకలాగా వైకాపా ప్రచారం చేస్తుందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఒకవేళ తెదేపా తమతో పొత్తులకు నిరాకరిస్తే, వైకాపాతో పొత్తులు పెట్టుకోకపోయినా తప్పకుండా ఆ పార్టీకి దగ్గరయి ఎన్నికల తరువాత ఆ పార్టీ మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ తెదేపాతో పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పవచ్చును.   నిన్న కర్ణాటకలోని గుల్బర్గా, హూబ్లీ నగరాల్లో ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ "తెలంగాణ ఏర్పడాలని, ఆ ప్రాంతంతోపాటు, సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంది. కానీ.. ప్రసవ సమయంలో బిడ్డ (తెలంగాణ)కు జన్మనిచ్చి తల్లి (సీమాంధ్ర)ని చంపిన డాక్టర్‌లాగా కాంగ్రెస్‌పార్టీ వ్యవహరించింది. కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ప్రజలు కొట్టుకునేలా చేస్తారు. దేశాన్ని, రాష్ట్రాలను, హృదయాలను ముక్కలు చేయడానికి కూడా వెనుకాడరు. సీమాంధ్ర కూడా ఈ దేశంలో ఒక భాగమే. కానీ, కాంగ్రెస్ పక్షపాత వైఖరి అవలంబించి సీమాంధ్రను అనాథగా చేసింది. అక్కడ తమ పార్టీకి తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున ఈ ఎన్నికలలో గెలవడం కష్టమని గ్రహించినందునే ఈవిధంగా పక్షపాత ధోరణితో వ్యవహరించింది. తెలుగుజాతిని ఘోరంగా అవమానించి, సీమాంధ్రను అనాధను చేసింది. త్వరలోనే సీమాంధ్రలో పర్యటించి గాయపడిన ప్రజల హృదయాలను సేద తీర్చే ప్రయత్నం చేస్తాను. వారి ఆవేదనను, బాధను పంచుకుంటానని" సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు.   త్వరలోనే మోడీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభకు వస్తునందున, ఆయన ప్రభావంతో సీమాంధ్రలో బీజేపీపై వ్యతిరేఖత తగ్గవచ్చు గనుక, ఆయన మొదటి విడత ప్రచారం ముగియగానే ఆ రెండు పార్టీలు పొత్తులకు సిద్దపడవచ్చును.

కాంగ్రెస్-తెరాసల యుద్ధం కూడా వ్యూహంలో భాగమేనా?

  కేసీఆర్ మొన్నసోనియమ్మ కాళ్ళకు మొక్కినంత పనిచేసి, తన కుటుంబ సభ్యులను వెంటేసుకొని ఆమెతో గ్రూప్ ఫోటోలు కూడా దిగి తామంత ఒకే కుటుంబసభ్యులమనట్లు వ్యవహరించారు. కానీ, ఆ మరునాడు నుండే ఆ రెండు పార్టీలు చాలా నాటకీయంగా దూరం కావడం ఆరంభించాయి. కేసీఆర్ డిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినపుడు ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో తెరాస ఘనస్వాగతం పలికింది. ఆ ఆర్భాటం చూస్తే కేవలం ఆయన ఒక్కడి వలనే తెలంగాణా ఏర్పడిందనే భావన కలిగించే విధంగా తెరాస దానిని నిర్వహించింది. ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ అని గర్వంగా చెప్పుకొన్న టీ-కాంగ్రెస్ నేతలు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడు వారివారి అనుచరులు తప్ప మరెవరూ వచ్చి స్వాగతం పలికిన దాఖలాలు లేవు. అంటే రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగా తెలంగాణా క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో జమా అయినట్లే భావించవచ్చును.   ఇక నేడో రేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనంఅయిపోతుందని అందరూ భావిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కూడా పనిగట్టుకొని కేసీఆర్ వెనుకే హైదరాబాద్ వచ్చి తరువాత అధ్యాయానికి తెర లేపారు. “తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెడితే ఇక తెలంగాణాలో దొరల రాజ్యం ఏర్పడి పరిస్థితులు దారుణంగా మారుతాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్ధమయిన పాలన అందించగలదని, జాతీయ దృక్పదం లేని తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు సమర్ధంగా పాలన చేయలేక చివరికి డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం లాగే మూన్నాళ్ళ ముచ్చటగా మారి చేతులేత్తేయవచ్చని” తెరాసపై యుద్ధం ప్రకటించారు.   ఆ రెండు పార్టీ అగ్రనేతలు (కుటుంబాలతో సహా) గ్రూప్ ఫోటోలు దిగేంత సహృద్భావ వాతావరణం ఏర్పడి ఉన్నపుడు, కాంగ్రెస్ కే చెందిన మరోనేత దిగ్విజయ్ సింగ్ తెరాస విలీనం ఇక లాంఛనమే అని చెపుతున్న తరుణంలో, రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో తెలుగు ప్రజలు ఎంత మొత్తుకొన్నా రాష్ట్రానికి రాని జైరాం రమేష్ అకస్మాత్తుగా పనిగట్టుకొని హైదరాబాద్ లో వాలి, రెండు పార్టీల మధ్య సంబంధాలు పెటాకులు అయ్యేలా తెరాసను కవ్వించడం చాలా నాటకీయంగా కనిపిస్తోంది. తమతో విలీనం లేదా పొత్తులు పెట్టుకోబోతున్న పార్టీని ఎవరయినా మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తారు తప్ప ఈవిధంగా పనిగట్టుకొని విమర్శలు చేసి రెచ్చగొట్టరని రాజకీయ అజ్ఞానులకయినా తెలుసు.   అదేవిధంగా తాము ఒక జాతీయ పార్టీతో విలీనం లేదా పొత్తులకు సిద్దం అవుతున్నపుడు తెరాస వంటి ప్రాంతీయ పార్టీ కూడా సౌమ్యంగా వ్యవహరిస్తుందని ఎవరయినా భావిస్తారు. కానీ, తెరాస నేత హరీష్ రావు మాట్లాడుతూ “తమ పార్టీని వీడిన అరవింద్ రెడ్డి, విజయశాంతిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చూస్తే కాంగ్రెస్ నోటితో పిలిచి నొసటితో వెక్కిరిస్తున్నట్లుందని, జైరాం రమేష్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన తమ పార్టీని ఆమాద్మీ పార్టీతో పోల్చడం తెలంగాణా ప్రజలని అవమానించినట్లేనని చాలా ఘాటుగా జవాబిచ్చారు. తమను కలుపుకోవాలనుకొంటున్న కాంగ్రెస్ ఈవిధంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహ్యం కలుగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.   ఈవిధంగా కేవలం ఒకటి రెండు రోజులలోనే కాంగ్రెస్-తెరాస నేతలు పరిస్థితిని నాటకీయంగా మార్చివేసి, స్నేహ సుమాలు విరుస్తాయనుకొన్న చోట యుద్దవాతవరణం సృష్టించి మాటలు తూటాలు పేల్చుకోవడం చూస్తే ఆ రెండు పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే గొడవపడుతున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో తెరాస విలీనం లేదా పొత్తులు పెట్టుకోదలుచుకోకపోతే, అదే మాటను చాలా సౌమ్యంగా చెప్పిఉండవచ్చును. కానీ అలా చేస్తే, కేసీఆర్, తెరాసలకు రావలసిన క్రెడిట్ రాదు. అందువల్ల తెలంగాణా ప్రజల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా ప్రజల దృష్టి బీజేపీ వైపు మరలకుండా తమ మీదనే నిలుపుకోనేందుకు కాంగ్రెస్-తెరాసలు ఇకపై బద్ధ శత్రువులులా నటిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటూ ఉంటుంది.   ఇదంతా చూస్తుంటే, మనకు అప్రయత్నంగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా గుర్తుకు రాకమానరు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో కూడా అచ్చు ఇదేవిధంగా నాటకమాడిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఈవిధంగా రెండు ప్రాంతాలలో తనకు అనుకూలమయిన పార్టీలు తప్ప మిగిలినవి బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి కల్పించి, ఎన్నికల తరువాత తెరాస, వైకాపా, కిరణ్ కాంగ్రెస్ పార్టీల మద్దతు పొండమే కాంగ్రెస్ వ్యూహం, అంతిమ లక్ష్యమని స్పష్టమవుతోంది. అయితే అది ప్రదర్శిస్తున్న ఈ అతి తెలివితేటలే కాంగ్రెస్ పార్టీ కొంపముంచి చివరికి రాహుల్ గాంధీ భవిష్యత్తుని కూడా నాశనం చేయడం తధ్యం.

సీమాంధ్రపై పట్టుకోసం కాంగ్రెస్, బీజేపీ తిప్పలు

  రాష్ట్ర విభజన వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నసీమాంధ్ర ప్రజలను త్వరలో జరగనున్న ఎన్నికలలోగాఏదోవిధంగా ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పదవులు, తమ కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు, కాంట్రాక్టుల కోసం కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వారికి వంతపాడుతున్నారు. వారందరూ కలిసి చాలా తెలివిగా ప్రజలకి ప్యాకేజీల గాలం విసిరి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరామ్ రమేష్ మరియు దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ సీమాంధ్రకు ఏమీమి ప్యాకేజీలు ఇవ్వబోతున్నారో కధకధలుగా వర్ణిస్తూ, ఇదంతా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుపట్టడం వలన, సోనియా గాంధీ దయ వలనే సాధ్యమవుతోందని, ఈ ప్యాకేజీల కోసం బీజేపీ చేసిందేమీ లేదని చెపుతూ రాష్ట్ర విభజన అంశాన్ని క్రమంగా పలుచన చేస్తూనే, ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారు.   విభజన కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోతుందనే వార్తలను కూడా ప్రత్యర్ధ రాజకీయ పార్టీల దుష్ప్రచారంగా అభివర్ణిస్తూ అసలు కాంగ్రెస్ పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత లేదని, రాష్ట్రంలో ఏమీ జరగలేదనట్లుగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టె యత్నం చేస్తున్నారు. సీమాంధ్రులను కరుణించిన సోనియా, రాహుల్ గాంధీలను త్వరలోనే రాష్ట్ర పర్యటనకు తీసుకువస్తామని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు.   రాష్ట్ర విభజన తరువాత బీజేపీ కూడా తన సీనియర్ నేత వెంకయ్య నాయుడిని విజయవాడకు పంపించినపుడు ఆయన కూడా ఇంచుమించుగా ఇదే విధంగా మాట్లాడి బీజేపీని, నరేంద్ర మోడీని గెలిపించుకొని సీమాంధ్రను అభివృద్ధి చేసుకొందామని అన్నారు. ఆయన కూడా త్వరలోనే నరేంద్ర మోడీని సీమాంధ్రలో పర్యటనకు ఒప్పిస్తానని చాలా ఉదారంగా ప్రజలకు హామీ ఇచ్చారు.   బద్ద శతృవులయిన ఈ రెండు జాతీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తమ రాజకీయ వైరం పక్కనబెట్టి చేతులు కలిపి ఏవిధంగా రాష్ట్ర విభజన చేసాయో ప్రజలందరూ చూసారు. కానీ ఇప్పుడు ఆవిషయాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో మళ్ళీ ఒకదానినొకటి నిందించుకొంటూ, ప్యాకేజీలు సాధించిన ఘనత తమదంటే తమదేనని వాదించుకొంటూ ప్రజలను ఏమార్చి ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పైగా సోనియా, రాహుల్, మోడీలను సీమాంధ్ర పర్యటనకు రావడం అంటే ప్రజల అదృష్టమన్నట్లు, పూర్వ జన్మ సుకృతమన్నట్లుగా మాట్లాడుతున్నారు.   అసలు ఈ ఎన్నికలలో గెలుస్తుందో లేదో కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు వరాలు ప్రకటిస్తుండటం పెద్ద జోక్ అనుకొంటే, తన రాజకీయ ప్రత్యర్ధి ప్రకటించిన ఆ వరాలను తాము అధికారంలోకి వచ్చేక అమలు చేస్తానని బీజేపీ చెప్పడం మరో గొప్ప జోక్. పేరుకి ఆ రెండు జాతీయ పార్టీలే అయినా, అవి రాష్ట్ర విభజన వ్యవహారంలో తమ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి తప్ప జాతీయ దృక్పధం కనబరచలేదు. రెండు పార్టీలు కూడా ప్రజల మనోభావాలకు, వారి అభిప్రాయాలకు గానీ ఏ మాత్రం విలువీయకుండా తెలుగు ప్రజలతో చలగాటమాడాయి. అందువలన ప్రజాభిప్రాయానికి విలువీయకుండా డిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసే అటువంటి పేరు గొప్ప రాజకీయ పార్టీలను ఎన్నుకొని కష్టాలు కోరి తెచ్చుకోవడం కంటే, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకొనే ప్రాంతీయ పార్టీలనే ఎన్నుకోవడం మంచిదేమో ప్రజలు ఆలోచించాలి.

ఇక చిరంజీవి శల్యసారధ్యం చేయనున్నారా

  స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగం నుండి రాజకీయాలలోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే తన పార్టీని తిరుగులేని మెజార్టీతో ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తెలుగువాడి పౌరుషం డిల్లీ పెద్దలకు రుచి చూపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడి, యావత్ ప్రపంచమూ తెలుగుజాతిని గుర్తించేలా చేసారు. తెలుగుజాతికి నిలువెత్తు ప్రతీకగా నందమూరి నిలిచారు. అదేవిధంగా తన కటోర పరిశ్రమతో సినీ రంగంలో సమున్నత స్థానానికి ఎదిగి, మెగా స్టార్ గా ప్రజల చేత నీరాజనాలు అందుకొన్న చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోదామని ప్రయత్నించారు. కానీ, అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లయింది. తన స్వగ్రామంలో కూడా గెలవలేని దుస్థితి. ఆ తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.   ఆయన పదవీ పరంగా పైకి ఎదుగుతుంటే, గత రెండేళ్లుగా ఆయన వేసే ప్రతీ అడుగుతో ఆయనకున్న ప్రజాభిమానం అదఃపాతాళానికి పడిపోతోంది. ప్రజలు ఊహించిన చిరంజీవి వేరు. కంటికెదురుగా కనబడుతున్న చిరంజీవి వేరు అన్నట్లు తయారయ్యారు ఆయన. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతిని, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు డిల్లీ పెద్దలతో డ్డీకొంటే, చిరంజీవి మంత్రి పదవి కోసం, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ళ ముందు పెట్టేశారు. ఈ విషయంలో కేవలం ఆయనొక్కడినే తప్పు పట్టనవసరం లేదు. ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు అనేక మంది ఆపని ఎప్పుడో చేసారు. ఇంకా చేస్తున్నారు కూడా. వారిలో చిరంజీవి కూడా ఒక్కరు.   ఒకప్పుడు మెగా స్టార్ గా కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకొని, ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను శాసించిన చిరంజీవి, కాంగ్రెస్ పట్ల, సోనియా, రాహుల్ గాంధీల పట్ల చూపిన వినయ విదేయతలకు మెచ్చి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియమ్మ అనుగ్రహించినట్లు తాజా సమాచారం. ఆయనకున్న ప్రజాకర్షణను ఉపయోగించుకొని ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను అధిగమించి ఎన్నికల గండం గట్టెక్కాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఎన్నికలలో కాపు కులస్థుల ఓట్లు అన్ని గంపగుత్తగా తమకే పడిపోతాయని కాంగ్రెస్ అడియాసకు పోతోంది. అయితే గతంలో ఆయన పార్టీ పెట్టిన్నపుడు ఆయనను నమ్ముకొని వెళ్ళిన వారందరి పరిస్థితి ఏమయిందో, ఆ తరువాత ఆయన తను రాజకీయంగా ఏవిధంగా పైకెదిగేరో, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర విభజన వ్యవహారంలో కోట్లాది సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని ఏవిధంగా సోనియమ్మ పాదాల చెంతపెట్టారో కళ్ళార చూసిన తరువాత కూడా ప్రజలు, ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు కులస్తులు ఆయనని చూసి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించడం అడియాసే అవుతుంది.   కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమాత్రమయిన ప్రజాకర్షణ గల నేత మరొకరు లేకపోవడంతో ఆయనకి అదృష్టం కలిసివచ్చిందని అనుకోకతప్పదు. అయితే, గత ఎన్నికలలో స్వంత పార్టీనే గెలిపించుకోలేక చతికిలపడిన ఆయన చేతిలో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పెట్టాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః ఆయన విదేయతకు మెచ్చి కేవలం మిగిలిన ఈ మూడు నెలల కోసం మాత్రమే ఆయనను ‘తీన్ మైనే కా సుల్తాన్’గా చేసి, కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిస్తే అప్పుడు శాశ్విత ముఖ్యమంత్రిగా సమర్డుడైన మరొక నేతని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందేమో. ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవిలో నుండి తప్పుకొనేందుకు సిద్దంగా ఉండే మన్మోహన్ సింగుని ప్రధానమంత్రిగా నియమించుకొని రాహుల్ గాంధీ కోసం ప్రధాని కుర్చీని రిజర్వ్ చేసుకొన్నట్లే, ఇప్పుడు చిరంజీవిని కూడా ఎంపిక చేసి ఉండవచ్చును. ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కరోజయినా కూర్చోవాలని తపించిపోతున్న చిరంజీవికి ఊహించని ఈ పరిణామాలు ఒక వరంగా మారడంతో “అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా శిరసావహించేందుకు సిద్దంగా ఉన్నానని” ఒక స్టాండర్డ్ రాజకీయ డైలాగు పలికి, “కుర్చీలో కూర్చొనేందుకు తన రెడీ” అని ఆయన కూడా ప్రకటించేశారు.   ఏమయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ ఆయననే ముఖ్యమంత్రిగా ఎంచుకొంటే అది ప్రతిపక్షాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో తప్పకుండా కలిసివస్తుంది.

అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం సుమా

  బల్లి తన ప్రాణానికి అపాయం ఏర్పడితే తన తోకలో చిన్న ముక్కని తెంపుకొని గిలగిలా కొట్టుకొనేలా చేసి దానిని శత్రువుకి ఎరగా వేసి తప్పించుకొంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తరువాత తోక పెరుగుతుంది గనుక బల్లికి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది.   కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా ఇదే టెక్నిక్ ప్రయోగించి, తన రాజకీయ శత్రువులను, సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్నితప్పించుకొని అవలీలగా వ్యవహారం చక్క బెట్టేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ తెగిన తోక పాత్రని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోషించారు. మళ్ళీ ఆ తోకకి మరో ఉపతోక పాత్రని అశోక్ బాబు పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్ బాబు కలిసి ప్రజాందోళలని పూర్తిగా తమ అదుపులో ఉండేలా చూసుకొంటూ బిల్లుకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఏవిధంగా త్రిప్పి పంపించేసారో ప్రజలందరికీ తెలుసు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోనీయకుండా వారి తరపున వారిద్దరే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ చివరి వరకు కూడా పరిస్థితులను పూర్తి నియంత్రణలో ఉంచుతూ చాలా సమర్ధంగా తమ తోక పాత్రలను నిర్వహించారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల చేతనే తమకు జై కొట్టేలా చేసుకొన్నారు. పైగా రాష్ట్ర విభజనకు ఇంతగా సహకరించినప్పటికీ తోక పాత్రని బాగా రక్తి కట్టించడంతో సమైక్య చాంపియన్, సమైక్య సింహం వగైరా బిరుదులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి స్వంతం చేసుకొన్నారు. ఆ ఖ్యాతిని కూడా ఇప్పుడు ఓట్ల రూపంలో మలుచుకోవడానికి త్వరలో కొత్త పార్టీ పెట్టబెట్టేందుకు కూడా సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కడుపు కాల్చుకొని నిరాహార దీక్షలు చేసినా రాని ఖ్యాతిని కిరణ్ కుమార్ రెడ్డి ఈ పాత్రతో అవలీలగా సంపాదించుకోగలగడం విశేషం.   ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయి, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి గనుక, దిగ్విజయ్ సింగ్ ఇక ఆ తోకని కూడా మళ్ళీ అతికించేసుకొనేందుకు సిద్దమని ఈ రోజు ప్రకటించారు. ఇటువంటి వ్యవహారంలో తోకలు తెంచుకోక తప్పలేదని, కానీ వాటన్నిటినీ మళ్ళీ అతికించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. పనిలోపనిగా ఈ యావత్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన చాలా మెచ్చుకొన్నారు కూడా. ఆయన, సహచరులు అందరూ తిరిగి పార్టీలోకి వస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలందరూ సమైక్యంగా ఆడిన డ్రామా చూసిన ప్రజలు ఇప్పుడు ఆయన మరో సరికొత్త ‘తోక డ్రామా’కు తెర తీస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి తెగిన తోక మరో బల్లిగా రూపాంతరం చెందుతుందో లేక తిరిగి వెళ్లి తన కాంగ్రెస్ శరీరానికే అతుకొంటుందో చూడాలి మరి.

రాష్ట్రంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే రాజ్యం కానుందా?

  మొన్న కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియా గాంధీని విమర్శిస్తూ ఇకపై మన రాష్ట్రంలో కూడా తమిళనాడు లాగే ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేస్తాయని జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్ళు నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలయినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేతులు కలిపి రాష్ట్ర విభజన చేయడంతో సీమాంధ్ర ప్రజలకి వాటిపై నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ప్రజాభిప్రాయానికి, ఏమాత్రం విలువీయకుండా అత్యంత నిరంకుశంగా అన్ని ప్రజాస్వామిక విధానాలను తుంగలో త్రొక్కి మరీ రాష్ట్రాన్ని విభజిస్తోందని విరుచుకు పడిన బీజేపీ మళ్ళీ అదే పార్టీ ప్రతిపాదించిన రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు పలకడంతో రెండు పార్టీలపై సీమాంధ్ర ప్రజలకు నమ్మకం పోయింది. అందువలన డిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసే ఇటువంటి జాతీయపార్టీలకి ఓటు వేసి నెత్తిన పెట్టుకోవడం కంటే, తమ అవసరాలకు అనుగుణంగా స్పందించే ప్రాంతీయ పార్టీలే మేలనే భావన ఆంధ్ర ప్రజలకు కలగడం సహజమే. అందువల్ల రానున్నఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలవైపే మొగ్గు చూపుతారు తప్ప తమను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని భావించరని ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః అదే అభిప్రాయం జేసీ మాటలలో వ్యక్తం అయిందని భావించవచ్చును.   ఇక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెరాస విలీనం లేదా పొత్తులకు అంగీకరించకపోయినట్లయితే, అక్కడా తనంతట తాను గెలిచే అవకాశం లేకపోవడంతో, 125 సం.ల తన ఘనచరిత్రను కూడా పక్కనబెట్టి “విలీనం కాకపోతే పోయే, కనీసం పొత్తులకయినా అంగీకరించు మహాప్రభో!” అని కేసీఆర్ కాళ్ళ మీద పడుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలి కలుగుతుంది.   కాంగ్రెస్ పేరుకి జాతీయపార్టీ అయినా జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల చేతిలో పరాజయం చవి చూస్తూ కేవలం ఒక ఐదారు రాష్ట్రాలకే పరిమితమయిన ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. అందుకే అది గత పదేళ్లుగా యూపీఏ కూటమిని ఏర్పాటు చేసుకొని తనవంటి అనేక చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని రాజ్యం ఏలుతోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ప్రభుత్వం నెట్టుకొస్తున్నప్పటికీ, నేటికీ జాతీయ పార్టీననే అతిశయం ఒలకబోస్తోంది. ఆ అతిశయం మరీ ఎక్కువవడం వలననే ప్రజాభిప్రాయాన్ని కాలరాసి ఇంత నిరంకుశంగా రాష్ట్ర విభజన చేసింది. నానాటికి కుచించుకుపోతున్న తన పార్టీ పరిస్థితిని గ్రహించి కాంగ్రెస్ అధిష్టానం మేల్కొనకపోగా, తెలివి తక్కువగానో లేక అతితెలివికిపోయో దక్షిణాదిన కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేజేతులా బ్రద్దలు కొట్టుకొంది. ఇంతవరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నకాంగ్రెస్ పార్టీ, ఇకపై ఆంధ్ర, తెలంగాణలలో కూడా  స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితికి దిగజారడమే కాకుండా ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీగా మారబోతోంది.  

తెదేపాకు వరంగా మారిన కాంగ్రెస్ వ్యూహం

  రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు నుండే నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది. అందుకోసం మరో సరికొత్త వ్యూహం రచించింది. ఈ వ్యూహంలో భాగంగా 1. సీమాంధ్ర నేతల ఒత్తిడి కారణంగానే భారీ ప్యాకేజి ఇచ్చేందుకు అంగీకరించడం. 2.తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం చేయడం.   సీమాంధ్ర ప్రజలకు ప్యాకేజీ తాయిలాలు ప్రకటించి, ‘గుడ్డిలో మెల్ల అన్నట్లు చివరికి కనీసం ఆమాత్రమయినా దక్కిందని’ వారే స్వయంగా భావించేలా చేసి తనపై ఏర్పడిన వ్యతిరేఖతను తెదేపా, వైకాపాలపైకి మళ్ళించడం ఈ వ్యూహం.   అందుకే ఇంత కాలంగా ఈ విభజన వ్యవహారంలో ఎన్నడూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధుల గోడు పట్టించుకోకుండా వారిని చాలా హీనంగా చూసిన కాంగ్రెస్ అధిష్టానం, సరిగ్గా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు అకస్మాత్తుగా వారి మీద ప్రేమ ఒలకబోస్తూ వారితో సమావేశమై “కేవలం వారి ఒత్తిడి కారణంగానే” సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వగైరా తాయిలాలు ఇస్తున్నట్లు ప్రకటించి చాలా సమయ స్ఫూర్తి, లౌక్యం ప్రదర్శించి ఆఖరు నిమిషంలో వారిని పూర్తిగా కట్టడి చేసింది.   సోనియా, రాహుల్ గాంధీలు చాలా దయతో సీమాంధ్రకు ప్యాకేజీలు విదిలించినందుకు కేంద్ర మంత్రి జేడీ.శీలం మీడియా ముందుకొచ్చి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా. మన సమస్యతో ఎటువంటి సంబంధమూ లేని పశ్చిమ బెంగాల్ కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సభలో ఆందోళన చేస్తుంటే, ఆయన ఈ వ్యవహారంతో అసలు తనకేమీ సంబంధమూ లేనట్లుగా నిసిగ్గుగా చూస్తూ కూర్చొన్నారు.   ఇక ‘సమైక్యాంధ్ర’ అంటూ గర్జించి తన పదవికి (ఒట్టొట్టి) రాజీనామా కూడా చేసిన మరో కాంగ్రెస్ జీవి చిరంజీవి, మొన్న సభలో ఏవిధంగా ‘మ్యావ్ మ్యావ్’ అన్నారో ప్రజలందరూ చూసారు. ఆ జీవి తన అధిష్టానం అమలుచేయబోయే వ్యూహంలో రెండో భాగానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర విభజన కేవలం తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని సభలోనే తేల్చి చెప్పారు.   కాంగ్రెస్ అధిష్టానం రచించిన ఈ వ్యూహాన్ని ఇప్పుడు బొత్స, అనం, డొక్కా, రఘువీర వంటి వీర విదేయులందరూ భుజాలకెత్తుకొని సీమాంధ్రలో పార్టీని బ్రతికించుకొంటామని శపధాలు చేసి ప్రజలలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందని టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో చాటింపు వేసుకొని ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు కేవలం తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని చెప్పుకొంటూ, ప్రజలలో తమపై, తమ కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేఖతను తెలివిగా ఆ రెండు పార్టీల మీదకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు.   తమ పార్టీయే రాష్ట్ర విభజన చేసినప్పటికీ ఆవిషయాన్నిదాచిపెట్టి కేవలం తామే సీమంధ్రకు భారీ ప్యాకేజీలు ఇప్పించామని ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బహుశః ఇక నుండి వారందరూ ఈ ప్యాకేజీల వలన సీమాంధ్ర ఎంత లాభపడిపోతుందో, రాత్రికి రాత్రే ఎంతగా అభివృద్ధి చెందుతుందో కధలు కధలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టవచ్చును. ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ఇది గ్రహించలేని మూర్కులని కాంగ్రెస్ పార్టీ భావించడం చాలా విచిత్రమే.   అయితే, సీమాంధ్రలో నష్ట నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ అస్త్రాన్ని తెదేపా, వైకాపాల మీదకు ప్రయోగించిందో సరిగ్గా అదే అస్త్రం వారికి తెలంగాణాలో మళ్ళీ పుంజుకోనేందుకు గొప్ప ఆయుధంగా అందివచ్చింది.  తెలంగాణా ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే స్వయంగా "కేవలం తెలుగుదేశం లేఖ కారణంగానే" తెలంగాణా ఇచ్చామని చెప్పుకోవడంతో ఈ విభజన అంశం కారణంగా తెలంగాణాలో డీలా పడిపోయిన తేదేపాకు అదొక ఊహించని వరంగా మారింది. అందువల్ల ఇప్పుడు తెదేపా-తెలంగాణా నేతలు కాంగ్రెస్ చెపుతున్న ఈ మాటలనే అందిపుచ్చుకొని, కేవలం తెలుగుదేశం పార్టీ వలననే తెలంగాణా రాష్ట్రం సాధ్యమయిందని దైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకొనేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణాకు అనుకూలమంటూ లేఖ ఇచ్చి తెదేపా వెనక్కి తగ్గిందని తెరాస చేసిన విమర్శలు కూడా తెదేపా వాదనను బలపరిచేవిగా ఉన్నాయి.   అందుకే చంద్రబాబు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ  నిన్నమీడియా ముందుకు వచ్చి “తమ పార్టీ తెలంగాణాకు అనుకూలమని ఇచ్చిన లేఖను నేటికీ వెనక్కి తీసుకోలేదని, తాము రాష్ట్ర విభజన చేస్తున్న తీరుని వ్యతిరేఖించామే తప్ప, తెలంగాణాను కాదని" చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ప్యాకేజీపై బొత్స సత్యనారాయణే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినందున, చంద్రబాబు కూడా అదే విషయం ప్రస్తావిస్తూ "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమంటే ఏదో ఒక భవనం కట్టినంత తేలిక కాదు. ఆ సంగతి ఆ పార్టీ నేతలకీ తెలుసు. అది విదిలించే ప్యాకేజీ రాష్ట్రం అప్పులు తీర్చుకోవడానికి కూడా సరిపోవని" కాంగ్రెస్ వ్యూహాన్ని ఎండగట్టారు.

రెండుగా చీలిన తెలుగుజాతి

  దాదాపు పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుంటే, దానిని సత్వరమే పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కమిటీలతో కాలక్షేపం చేసిన కాంగ్రెస్ పార్టీ, సరిగ్గా ఎన్నికల ముందు ఈ అంశాన్ని పరిష్కరించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసింది. చివరికి ఈరోజు రాజ్యసభలో బిల్లుకి తనదైన శైలిలో ఆమోదముద్ర వేయించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మార్గం సుగమం చేసింది. అయితే అందుకు తెలంగాణా ప్రజలు చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. వారు అనేక పోరాటాలు చేసి, అనేకమంది యువకులు బలిదానాలు చేసిన తరువాత కానీ తెలంగాణా ఏర్పాటు చేయాలనే తలంపు కాంగ్రెస్ పార్టీకి కలుగలేదు. ఏమయినప్పటికీ తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది గనుక ఇక ఇంతకాలంగా ఈ విభజన చిచ్చుతో తెలుగు ప్రజల మధ్య పతాక స్థాయికి చేరిన తీవ్ర విద్వేషాలు, విభేదాలు, అనుమానాలు, అసూయలకు ముగింపుపలికి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పూర్వ సత్సంభందాలు వీలయినంత త్వరగా పునరుద్దరించే విధంగా రాజకీయ నేతలు, పార్టీలే చొరవ తీసుకొని ప్రయత్నించవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోవచ్చును. కానీ, అది అపరిష్కృతంగా విడిచిపెట్టిన అనేక సమస్యలు మున్ముందు తలెత్తినప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు సామరస్యదోరణిలో వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. లేకపోతే ఈ వైషమ్యాలు శాశ్వితంగా నిలిచిపోయినట్లయితే అవి ఇరు ప్రాంతాల అభివృద్ధికి, శాంతికి ఆటంకంగా మారుతాయి.   ఇంతకాలంగా సీమాంధ్ర పాలకుల చెరలో మగ్గినందునే తెలంగాణాలో అభివృద్ధి జరుగలేదని వాదిస్తువచ్చిన తెలంగాణా నేతల చేతికే ఇప్పుడు పగ్గాలు వచ్చాయి గనుక, ఇకనయినా వారు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య, కరీంనగర్ బీడీ కార్మికులు, గల్ఫ్ బాధితుల సమస్యలు, సిరిసిల్లా నేతన్నల సమస్యలు, తెలంగాణా రైతన్నల సమస్యలు, లక్షలాది యువత ఎదుర్కొంటున్న విద్యా, ఉపాది సమస్యలను చిత్తశుద్దితో తీర్చేప్రయత్నం చేసి తెలంగాణాను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకొందాము.   ఇక సీమాంధ్ర పునర్నిర్మాణం పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఈతరం ప్రజలు పూర్తిగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడగలరా? అని తలచుకొన్నపుడు ఎవరికయినా మనస్సు బాధతో కలుక్కుమంటుంది. కానీ, రాజకీయ పార్టీలు, వాటి నేతలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, పట్టుదలగా కృషిచేస్తే తప్పకుండా ఒక దశాబ్దకాలంలోనే మళ్ళీ పూర్తిగా అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు. అణుబాంబులు పడిన హిరోషిమా, నాగసాకీలే మళ్ళీ లేచి నిలబడగలిగినప్పుడు, అనేక సహజవనరులు, నదులు, సముద్రాలు, ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలతో చాలా దృడంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబివృద్ధి సాధించి పూర్వ వైభవం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.   గత మూడు నాలుగు దశాబ్దాలుగా పాలకులందరూ కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపానికి, ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. కనుక మళ్ళీ అటువంటి పొరపాటు పునారావృతం చేయకుండా రాష్ట్రంలో 13జిల్లాలు సరిసమానంగా అభివృద్ధి చెందేలా జాగ్రత్త పడాలి. తద్వారా అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందడమే కాకుండా, మళ్ళీ ఇటువంటి సమస్యలు పునరావుతం కాకుండా నివారించవచ్చును.   ఇంతకాలంగా అన్నదమ్ములవలె కలిసిమెలిసి జీవించిన తెలుగు ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టుకొని విడిపోవలసిరావడం చాలా బాధాకరంగా ఉన్నపటికీ, విడిపోతేనే సంతోషంగా ఉండగలమని తెలంగాణా ప్రజలు దృడంగా భావిస్తునందున, అందుకు అంగీకరించి వారందరికీ సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకొందాము. అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా అనతికాలంలోనే ఈ బాధ, భావోద్వేగాల నుండి బయటపడి రాష్ట్ర పునర్నిర్మాణంలో తమతమ పాత్రలు పోషించి ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు పరుచుకోవాలని మనస్పూర్తిగా ఆశిద్దాము. సర్వేజన సుకినో భవంతు.

బీజేపీకి చంద్రబాబు షాకిచ్చారా?

  ఇచ్చిన మాటకు కట్టుబడి లోక్ సభలో తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చామని నిన్న సగర్వంగా చెప్పుకొన్న బీజేపీ, ఒక్కరోజులోనే మాట మార్చిసీమాంధ్రకు అన్యాయం జరిగితే సహకరించేదిలేదని నేడు హూంకరిస్తున్నారు. బీజేపీ రాజ్యసభలో కూడా బేషరతుగా బిల్లుకి మద్దతు ఇస్తుందని, బిల్లు ఆమోదం కేవలం లాంచనప్రాయమేనని, అందువల్ల ఈరోజే బిల్లు ఆమోదం పొందుతుందని అందరూ భావించారు. కానీ, హటాత్తుగా బీజేపీ ఆఖరు నిమిషంలో మెలిక పెట్టి బిల్లుని అడ్డుకొంది. ఆ పార్టీ నేతలు ముప్పై రెండు సవరణలు సూచించి వాటిని బిల్లులో చేర్చితేనే మద్దతు ఇస్తామని మెలికపెట్టారు. అయితే వాటిని చేర్చినట్లయితే బిల్లుని మళ్ళీ లోక్ సభకు పంపవలసి వస్తుంది. పార్లమెంటు సమావేశాలు ముగియడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నందున బీజేపీ పెట్టిన మెలికతో కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టాయి. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్ళీ చర్చల ప్రక్రియకు కూర్చోవడం, ఇంతవరకు సీమాంధ్ర గోడు పట్టించుకోని సోనియా గాంధీ సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని సూచించడం, మరి కొన్ని ఆర్ధిక ప్యాకేజీలపై రెండు పార్టీల మధ్య బేరసారాలు నడుస్తున్నట్లు సమాచారం.   అయితే, ఒక్కరోజులో బీజేపీలో ఇంత పెనుమార్పు రావడానికి కారణం సీమంధ్రలో ఆ పార్టీపై పెల్లుబుకిన ప్రజాగ్రహమా? లేకపోతే తెదేపా ఎన్నికల పొత్తులు పెట్టుకోబోమని హెచ్చరించిందా? కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొని రెండు ప్రాంతాలలో నష్టపోతానని అకస్మాత్తుగా జ్ఞానోదయం కలిగిందా? అని ఆలోచిస్తే సీమాంధ్రకు న్యాయం చేయకుండా బిల్లుకి గుడ్డిగా మద్దతు ఇస్తే ఎన్నికల పొత్తులు పెట్టుకోమని తెదేపా తెగేసి చెప్పడంవలననే వెనక్కి తగ్గి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   మొదటి నుండి సమన్యాయం కోరుతున్న తెదేపా, నరేంద్ర మోడీతో సహా బీజేపీ అగ్రనేతలు అందుకు అంగీకరించిన తరువాతనే చంద్రబాబు బీజేపీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. లోపభూయిష్టంగా ఉన్న టీ-బిల్లుని ప్రస్తుతం అడ్డుకొని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరు ప్రాంతాలకి న్యాయం జరిగేలా రాష్ట్ర విభజన చేస్తామని సాక్షాత్ నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చారు కూడా. నిన్న లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టేవరకు కూడా బీజేపీ నేతలందరూ బిల్లుని అడ్డుకోబోతున్నారనే భావన కలిగేలా మాట్లాడారు. కానీ ఊహించని విధంగా బిల్లుకి మద్దతు పలికి సీమాంధ్ర ప్రజలను, తెదేపాను కూడా విస్మయపరిచారు. బీజేపీ ఆవిధంగా చేస్తుందని బహుశః చంద్రబాబు కూడా ఊహించి ఉండరేమో.   బహుశః అందుకే ఆయన కూడా బీజేపీ అగ్రనేతలకు, ముఖ్యంగా నరేంద్ర మోడీకి గట్టిగా హెచ్చరికలు చేసి ఉండవచ్చును. లేకుంటే లోక్ సభలో బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు లాంచన ప్రాయమనుకొన్న బిల్లుకి ఈరోజు మోకాలు అడ్డి ఉండేవారుకారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి తెదేపాతో పొత్తులు, చంద్రబాబు సహకారం అత్యవసరం. తెదేపాతో పొత్తులు లేకపోతే బీజేపీ సీమాంధ్రలో తనంతట తానుగా ఒక్క సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు కల చంద్రబాబు బీజేపీని కాదని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పూనుకొంటే, ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం చెప్పట్టాలని బీజేపీ కల కలగానే మిగిలిపోవచ్చును, నరేంద్ర మోడీకి ప్రధాన మంత్రి కావాలనే కల కూడా కలగానే మిగిలిపోవచ్చును.   అందువల్ల విభజన బిల్లుని ఆపలేకపోయినా, కనీసం సీమాంధ్రకు భారీ ప్యాకేజీ సాధించయినా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీమాంధ్ర ప్రజలను వంచి౦చిన కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభలో టీ-బిల్లుని మూజువాణి ఓటుతోనే ఆమోదింపజేసి తన పంతం నెగ్గించుకొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని జనాలు చ్చీ కొట్టినా, ఇంతకాలంగా ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసిన తెలుగు ప్రజల అభిప్రాయాలకు పూచికపులెత్తు విలువీయకుండా రాష్ట్ర విభజన చేసింది. కోట్లాది తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే బిల్లుపై కనీసం అర్ధ గంటసేపు కూడా చర్చించకుండానే ఆమోదించింది. అంతకు ముందు అనేక బిల్లులను సభలో ఆమోదించిన స్పీకర్, కాంగ్రెస్ అధిష్టానం పన్నిన వ్యూహం ప్రకారమే సభను వాయిదాలు వేసుకొంటూ వచ్చి హటాత్తుగా మూజువాణి తంతు నిర్వహించేసి బిల్లు ఆమోదం పొందేలా చేసారు. ఈ విషయం బయటకి పొక్కకుండా గోప్యంగా నిర్వహించేందుకు అకస్మాత్తుగా లోక్ సభ ప్రసారాలు నిలిపివేయడం కాంగ్రెస్ తన తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నమే.   తెలంగాణా ఏర్పాటయినందుకు టీ-కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ పాదాలకు మొక్కవచ్చును. కానీ, సీమాంధ్ర ప్రజల హృదయాలలో ఆమె శాస్వితంగా తన స్థానం కోల్పోయారు. ఆమెనే కాదు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కూడా ఇక ఆంధ్ర ప్రజలు ద్వేషించవచ్చును. ఆంధ్ర రాష్ట్రం గురించి, తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమాత్రం అవగాహన లేని ఆమె, అసమర్ధుడు, రాజకీయ పరిణతిలేని వాడు అయిన తన కుమారుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడం కోసం తెలుగుజాతిని చిద్రం చేసేందుకు కూడా వెనుకాడలేదు. తెలుగు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకొన్నారు. విదేశీ వనితని కూడా చూడకుండా ఆమెను ఇంటి ఆడపడచుగా ఆదరించి నెత్తిన పెట్టుకొన్నందుకు, ఆమె కాలితో వారి నెత్తిన తన్ని సన్మానించారు. అయినప్పటికీ సిగ్గు, లజ్జ, రోషం ఏమాత్రం లేని కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పదవుల కోసం నేటికీ ఆమె పాదాలు నాకేందుకు సిద్దంగా ఉండటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యమే. అటువంటి వారిని ప్రజలు పేరుపేరునా గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా రాకుండా ఓడించినపుడే విజ్ఞులనిపించుకొంటారు.   లోక్ సభ ప్రసారాలు అకస్మాత్తుగా నిలిపివేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించిందో ఇంకా తెలియవలసి ఉంది. బీజేపీ కూడా బిల్లుకి మద్దతు పలికిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజమని దృవీకరించుకోవలసి ఉంది. ఏమయినప్పటికీ, ఈ రాష్ట్ర విభజన కు కర్త, కర్మ క్రియ అన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానమే. దాని వ్యూహంలో భాగంగానే కొందరు వ్యతిరేఖిస్తూ, మరి కొందరు సమర్దిస్తూ, మరి కొందరు కలహించుకొంటూ ప్రజలను ఏమార్చి కధ ముగించారు.   తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తెలుగు ప్రజలను చీల్చడానికి కూడా వెనుకాడని కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర ప్రజలని అడుగడున అవమానిస్తూనే ఉంది. అడుగడునా వంచిస్తూనే ఉంది. ఆ వంచంతోనే చివరికి బిల్లుని ఆమోదింపజేసింది కూడా. అటువంటి పార్టీ, ఇక ఎన్నికల తరువాత మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో గుప్పిస్తున్న హామీలకు ఏమి విలువ ఉంటుంది? ఏవిధంగా నమ్మగలము? ఇదివరకు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ఆటలాడుకొన్నపుడు అన్ననందమూరి దేవుడిలా వచ్చి ఆదుకొన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడింది. దెబ్బతిన్న సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మళ్ళీ అటువంటి మహానుభావుడు రావాలని కోరుకొందాము.

విభజన చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ గట్టెక్కగలదా?

  కోట్లాది తెలుగు ప్రజల భవిష్యత్తుపై చిరకాలం పాటు తీవ్ర ప్రభావం చూపబోయే రాష్ట్ర విభజన బిల్లుపై ఈరోజు లోక్ సభలో కేవలం నాలుగు గంటల్లో చర్చ ముగించి ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్నపాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడా తెలుగువాడి ప్రమేయం లేకుండా సాగుతున్న ఈ తంతులో చివరి రోజున కూడా సభలో తెలుగువాడు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందే జాగ్రత్తపడింది. ఉన్న కొద్ది మందిలో కొందరిని సోనియా గాంధీ తన కనుసైగతో అదుపు చేస్తుంటే మిగిలిన నలుగురైదుగురు ఆవేదన సభలో అరణ్యరోధనగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం తను ఇంత దిగజారిపోయినందుకు ఏ మాత్రం సిగ్గుపడకపోగా సభని, సీమాంధ్ర సభ్యులని ఇంత గొప్పగా మేనేజ్ చేయగలుగుతునందుకు గర్వపడుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతున్నా ఏనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ, మిగిలిన సీమాంధ్ర మంత్రులను కూడా మేనేజ్ చేసేందుకు నిన్న వారితో సమావేశమవడం చూస్తే, కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకొనేందుకు ఎంతకయినా దిగజారగలదని అర్ధమవుతుంది.   ఇక కేంద్రంలో ఈవిధంగా చక్రం తిప్పుతూనే, రాష్ట్రంలో ఆఖరి అధ్యాయం పూర్తి చేసేందుకు తన కనుసన్నలలో నడుచుకొనే బొత్ససత్యనారాయణను రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తన పదవికి రాజీనామా చేసి తప్పుకోబోతుండటంతో, ఆ స్థానంలో తను సర్దుకోవాలనే తాపత్రయపడుతున్న బొత్స, కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలురయిన శాసనసభ్యులను, మంత్రులందరినీ పోగేసి, ఒకవైపు ముఖ్యమంత్రి వర్గాన్ని నిందిస్తూ, మరోవైపు తన సారధ్యంలో సమైక్యపోరాటం చేసేందుకు కలిసిరమ్మని ప్రతిపక్షాలకి లేఖలు కూడా వ్రాసారు. ఈరోజు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందబోతుంటే, అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవాలని తపిస్తున్న బొత్స వర్గం దేనికోసం డిల్లీ వెళ్ళాలనుకొంటున్నారో, దేనికోసం పోరాడుతారో తేలికగానే ఊహించుకోవచ్చును.   ఇక ముందే చెప్పుకొన్నట్లుగా రేపటి నుండి కిరణ్ కాంగ్రెస్, బొత్స కాంగ్రెస్, వై.కాంగ్రెస్ మూడు ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటూ సీమాంధ్ర ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు గట్టిగా కృషి చేస్తాయి. గత ఎన్నికలలో లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీని అడ్డుకోగా, ఈసారి కాంగ్రెస్ పార్టీయే మూడు పార్టీలుగా చీలి అడ్డుకోబోతోంది గనుక ఈమూడు పార్టీల మధ్య ప్రజల ఓట్లు చీలడం ఖాయం. (ఇవికాక మందకృష్ణ, బైరెడ్డి, ఆమాద్మీ పార్టీ, లోక్ సత్తాలు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి)  కాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు తగిన వ్యూహాలు తమ వద్ద సిద్దంగా ఉన్నాయని ఆరునెలల క్రితమే పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యూహం ఇదేనని క్రమంగా తేటతెల్లమవుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకుకాంగ్రెస్పార్టీ రాష్ట్రాన్నే కాదు తన స్వంత పార్టీని కూడా విభజించుకోగలదని రుజువు చేసుకొంది.   తెలంగాణా ఏర్పడుతున్నందుకు తెలంగాణా ప్రజలు సంతోషపడుతుంటే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీమాంధ్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు. అదిసరిపోదన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టబోతున్న ఈ వికృత పైశాచిక రాజకీయ క్రీడలో బలవంతంగా పాలుపంచుకోవలసిరావడం మరో దురదృష్టం.

కిరణ్ కొత్త పార్టీ పెట్టకపోతే...

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో జరిపిన సమావేశంలో తన రాజీనామా, కొత్తపార్టీ స్థాపనపై ఏదో ఒక ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవచ్చునని అందరూ భావించారు. కానీ బీజేపీ నేతలు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టలేదని వాదిస్తునందున, ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా బిల్లుని సభలో ప్రవేశపెట్టినట్లు అంగీకరించినట్లవుతుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం బిల్లుని అధికారికంగా ప్రవేశపెట్టినప్పుడే రాజీనామా చేస్తారని మంత్రులు టీజీ వెంకటేష్ మీడియాకు తెలిపారు. అయితే ఆయన రాజినామా చేసేందుకే నిశ్చయించుకొన్నపుడు ఇంకా బీజేపీ వాదనను సాకుగా చూపి మరొకట్రోండు రోజులు ఆగినంతమాత్రన్న కేంద్రం బిల్లుని ఆమోదించకుండా ఆగిపోదు. బీజేపీ మద్దతు ఈయకపోయినా మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేస్తుందని కాంగ్రెస్ అధిష్టానంతో మంచి టచ్చులో ఉన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. మరి అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుని సభలో ప్రవేశపెట్టిన తరువాతనే రాజీనామా చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో ఆయనకీ, ఆయన సహచరులకే తెలియాలి.   ఇక ఆయన కొత్త పార్టీ పెడతారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి తెలియజేసారు. అయితే ఎప్పుడు స్థాపిస్తారో, ఎవరెవరు ఆ పార్టీలో చేరుతారో తెలియదని చెప్పారు. అయితే కొత్తపార్టీలో చేరేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపలేదని సమాచారం. అదే నిజమయితే, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం మారుతుంది. ఎందుకంటే, ఇంతగా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తరువాత ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగడం చాలా కష్టం, అవమానకరం కూడా. అయితే, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఆయన వేరే ఏ ఇతర పార్టీలోకి వెళ్లి వేరొకరి క్రింద పంచిచేయడం కూడా ఊహించలేము.   అయితే రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ ఆయనను రహస్యంగా కలిసి వెళ్ళారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే మాటయితే పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఈయబోదనే హామీ ఏమయినా ఆయన ఇచ్చిఉంటే, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడమే మేలు. ఆయన ఒకవేళ కొత్తపార్టీ పెట్టలేని పరిస్థితి ఉంటే, అవమానకర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా రాజకీయ సన్యాసం చేయడం కంటే సీమాంధ్రలో బలమయిన నాయకుడులేని బీజేపీ పగ్గాలు చెప్పట్టి తన చేతి మీదుగానే పార్టీని నడిపించుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీ లో చేరినట్లయితే ఆయన సహచరులు కూడా చేరే అవకాశం ఉంటుంది. పైగా అది ఆయనకీ, బీజేపీకి కూడా చాలా లభాదాయకం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అన్ని సర్వే నివేదికలు స్పష్టం చేస్తునందున, ఆయన బీజేపీలో చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది గనుక ఆయనకు ఏ కేంద్ర మంత్రి పదవో ఇవ్వవచ్చును కూడా.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టలేకపోయినా లేదా పెట్టి చేతులు కాల్చుకోకూడదనుకొన్నా, కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ అయిన బీజేపీలో చేరడమే మంచిది. ఇది రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన ముందున్న ఆఖరి అస్త్రంగా కూడా మారుతుంది.    కానీ, అయన నేడు కాకపోతే రేపయినా రాజీనామా చేసి కొత్తపార్టీ స్థాపించావచ్చని ఆయన సహచరులు చెపుతున్నారు గనుక ఆయనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని అర్ధమవుతోంది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడదలిస్తే, ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండకపోవచ్చును.