సీమాంధ్రపై పట్టుకోసం కాంగ్రెస్, బీజేపీ తిప్పలు
posted on Feb 27, 2014 5:20AM
రాష్ట్ర విభజన వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నసీమాంధ్ర ప్రజలను త్వరలో జరగనున్న ఎన్నికలలోగాఏదోవిధంగా ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పదవులు, తమ కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు, కాంట్రాక్టుల కోసం కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వారికి వంతపాడుతున్నారు. వారందరూ కలిసి చాలా తెలివిగా ప్రజలకి ప్యాకేజీల గాలం విసిరి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరామ్ రమేష్ మరియు దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ సీమాంధ్రకు ఏమీమి ప్యాకేజీలు ఇవ్వబోతున్నారో కధకధలుగా వర్ణిస్తూ, ఇదంతా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుపట్టడం వలన, సోనియా గాంధీ దయ వలనే సాధ్యమవుతోందని, ఈ ప్యాకేజీల కోసం బీజేపీ చేసిందేమీ లేదని చెపుతూ రాష్ట్ర విభజన అంశాన్ని క్రమంగా పలుచన చేస్తూనే, ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారు.
విభజన కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోతుందనే వార్తలను కూడా ప్రత్యర్ధ రాజకీయ పార్టీల దుష్ప్రచారంగా అభివర్ణిస్తూ అసలు కాంగ్రెస్ పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత లేదని, రాష్ట్రంలో ఏమీ జరగలేదనట్లుగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టె యత్నం చేస్తున్నారు. సీమాంధ్రులను కరుణించిన సోనియా, రాహుల్ గాంధీలను త్వరలోనే రాష్ట్ర పర్యటనకు తీసుకువస్తామని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు.
రాష్ట్ర విభజన తరువాత బీజేపీ కూడా తన సీనియర్ నేత వెంకయ్య నాయుడిని విజయవాడకు పంపించినపుడు ఆయన కూడా ఇంచుమించుగా ఇదే విధంగా మాట్లాడి బీజేపీని, నరేంద్ర మోడీని గెలిపించుకొని సీమాంధ్రను అభివృద్ధి చేసుకొందామని అన్నారు. ఆయన కూడా త్వరలోనే నరేంద్ర మోడీని సీమాంధ్రలో పర్యటనకు ఒప్పిస్తానని చాలా ఉదారంగా ప్రజలకు హామీ ఇచ్చారు.
బద్ద శతృవులయిన ఈ రెండు జాతీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తమ రాజకీయ వైరం పక్కనబెట్టి చేతులు కలిపి ఏవిధంగా రాష్ట్ర విభజన చేసాయో ప్రజలందరూ చూసారు. కానీ ఇప్పుడు ఆవిషయాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో మళ్ళీ ఒకదానినొకటి నిందించుకొంటూ, ప్యాకేజీలు సాధించిన ఘనత తమదంటే తమదేనని వాదించుకొంటూ ప్రజలను ఏమార్చి ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పైగా సోనియా, రాహుల్, మోడీలను సీమాంధ్ర పర్యటనకు రావడం అంటే ప్రజల అదృష్టమన్నట్లు, పూర్వ జన్మ సుకృతమన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అసలు ఈ ఎన్నికలలో గెలుస్తుందో లేదో కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు వరాలు ప్రకటిస్తుండటం పెద్ద జోక్ అనుకొంటే, తన రాజకీయ ప్రత్యర్ధి ప్రకటించిన ఆ వరాలను తాము అధికారంలోకి వచ్చేక అమలు చేస్తానని బీజేపీ చెప్పడం మరో గొప్ప జోక్. పేరుకి ఆ రెండు జాతీయ పార్టీలే అయినా, అవి రాష్ట్ర విభజన వ్యవహారంలో తమ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి తప్ప జాతీయ దృక్పధం కనబరచలేదు. రెండు పార్టీలు కూడా ప్రజల మనోభావాలకు, వారి అభిప్రాయాలకు గానీ ఏ మాత్రం విలువీయకుండా తెలుగు ప్రజలతో చలగాటమాడాయి. అందువలన ప్రజాభిప్రాయానికి విలువీయకుండా డిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసే అటువంటి పేరు గొప్ప రాజకీయ పార్టీలను ఎన్నుకొని కష్టాలు కోరి తెచ్చుకోవడం కంటే, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకొనే ప్రాంతీయ పార్టీలనే ఎన్నుకోవడం మంచిదేమో ప్రజలు ఆలోచించాలి.