కాంగ్రెస్-జగన్ మధ్య అనైతిక బందం ఉంది: పురందేశ్వరి
posted on Mar 6, 2014 @ 3:21PM
కాంగ్రెస్ అధిష్టానం కేవలం తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజనకు పూనుకొందని, అదేవిధంగా ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డిని బెయిలుపై బయటకి రప్పించి, సీబీఐ కేసుల స్పీడ్ పూర్తిగా తగ్గించి వేసిందని చంద్రబాబు ఆరోపిస్తుండటం అందరూ వింటున్నదే. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రతీ సభలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరగడం, ఆ తరువాత ప్రజలు తనకి ముప్పై యంపీ సీట్లిస్తే తనకు నచ్చిన వ్యక్తినే ప్రధానమంత్రిని చేస్తానని చెప్పడం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రహస్య ఒప్పందం చేసుకొందని చంద్రబాబు ఆరోపిస్తుంటే,జగన్మోహన్ రెడ్డి అంతకంటే గట్టిగా సోనియాగాంధీ ని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూండటంతో వీరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
జగన్ మోహన్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎంత తీవ్రంగా విమరిస్తున్నపటికీ, ఏనాడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. పైగా దిగ్విజయ్ సింగ్ తమదీ, జగన్మోహన్ రెడ్డిది ఒకటే డీ.యన్,ఏ. అని, అతను తన కొడుకు వంటి వాడని మెచ్చుకొన్నారు. తనని చెంప దెబ్బ కొట్టమని జగన్ అన్నపటికీ, ఆయన 'జగన్ నా కొడుకు వంటి వాడే' అనే నా స్టాండులో మార్పు లేదని చెప్పడం విశేషం. అదే జేసీ దివాకర్ రెడ్డి సోనియమ్మను పదవిలో దిగిపోమని డిమాండ్ చేసినందుకే షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలన్నా, విమర్శలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడం వారి మధ్య ఉన్న రహస్య అనుబందానికి అద్దం పడుతుంది.
లగడపాటి, రాయాపాటి, ఉండవల్లి, జే.సి. దివాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్ వంటి వీరవిధేయ కాంగ్రెస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని విస్పష్టంగా ప్రకటించారు. లగడపాటి రాజగోపాల్ అయితే మరొక అడుగు ముందుకు వేసి పెంపుడు కొడుకు వంటి జగన్మోహన్ రెడ్డి కోసం సోనియాగాంధీ కన్న బిడ్డల వంటి తమని అన్యాయం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ యంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగిన సంగతి అందరికీ తెలుసు. ఆయన మరొకటి రెండు రోజుల్లో వైకాపాలో చేరేందుకు సిద్దమయిన సమయంలో వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏకి మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి మనసులో మాటని పొరపాటున బయటపెట్టినందుకు వైకాపాలో చెరక ముందే బహిష్కరింపబడిన సంగతి అందరికీ తెలుసు.
ఈరోజు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ యంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా లో కేసీఆర్ తో, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందాలు చేసుకొని వారిద్దరి కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడుకోందని, తమ అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయకుండా గోరంగా అవమానించిందని ఆమె ఆరోపించారు. తమకు గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీని వీడుతున్నామని తెలిపారు.
ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ తమ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి కి మధ్య రహస్య అవగాహన ఉందని గట్టిగా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలుగా, రాహుల్ గాంధీ టీంలో కీలక వ్యక్తిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే విషయం ద్రువీకరించడం గమనిస్తే, ఇంతకాలంగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమేనని అంగీకరించక తప్పదు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన సభలలో కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీ ని ఆడిపోసుకోవడం కూడా అంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్పష్టమవుతోంది. ఇక ఆయన ప్రజలను ముప్పై యంపీ సీట్లు కోరడం, తనకు నచ్చిన వ్యక్తిని ప్రధాని పదవిలో కూర్చోబెడతానని చెప్పడం దేనికో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పురందేశ్వరి ఆరోపణలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు, అక్కడ కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ కలిసి 15యంపీ సీట్లు సాధించిపెడితే యువరాజవారికి పట్టాభిషేకం జరిగిపోతుందని స్పష్టమవుతోంది.
నోరు విప్పితే నీతి నిజాయితీ, విశ్వసనీయత, నైతిక విలువలు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో తన తండ్రిపై ఉన్న అభిమానాన్నే పెట్టుబడిగా భావిస్తూ వారి ఆ అభిమానాన్ని బలహీనతగా భావిస్తూ ప్రజలను ఎంత దారుణంగా మభ్యపెడుతున్నారో ఈ కరడు గట్టిన కాంగ్రెస్ నేతల ఆరోపణలు బట్టబయలు చేస్తున్నాయి.