ముగ్గురు అపరిచితులు
posted on Mar 3, 2014 @ 10:06AM
తెలంగాణా ఏర్పాటుకాగానే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని పదేపదే చెప్పిన కేసీఆర్, ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీతో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులతో కాంగ్రెస్ పార్టీకే ‘హ్యాండ్’ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా వారికి అంతే దీటుగా, ఘాటుగా బదులిస్తున్నారు. నికృష్ట రాజకీయాలు చేయడంలో తలపండిన కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను గుడ్డిగా నమ్మి వారికి తెలంగాణా, బెయిలు ఇచ్చిందని భావించలేము. బెయిలు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ఏర్పడిన తరువాత కేసీఆర్ ఒకే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడం గమనిస్తే ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమేననే అనుమానం కలుగకపోదు.
కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్ర, తెలంగాణాలలో అధికారంలోకి రావడం ప్రధానం కాదు. కేంద్రంలో అధికారం కైవసం చేసుకొని రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడమే దాని ప్రధాన లక్ష్యం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లక్ష్యం ఆంధ్ర, తెలంగాణాలలో అధికారం చెప్పట్టడమే కానీ కేంద్రంలో అధికారం చెప్పట్టడం కాదు. అంటే వారు ఒకరి పరిధిలోకి మరొకరు ప్రవేశించే ఆసక్తి, ఉద్దేశ్యం లేవని స్పష్టమవుతోంది. అదేవిధంగా ఆ మూడు పార్టీల ప్రధాన రాజకీయ శత్రువు తెలుగుదేశం పార్టీయే. అందువల్లనే ఆ మూడు పార్టీల మధ్య చక్కగా అవగాహనకు అవకాశం ఏర్పడింది.
అయితే, ప్రజలను, తమ రాజకీయ ప్రత్యర్ధులను ఏమార్చడం కోసమే ఈ మూడు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నాయని భావించవచ్చును. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం యొక్క హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తూ తెరాస కాంగ్రెస్ పార్టీతో కత్తులు దూస్తే, రాష్ట్రాన్ని విభజించిందనే సాకుతో వైకాపా కాంగ్రెస్ పై కత్తులు దూస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్-తెరాసలు కలిసి తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీయే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడిందని తెలంగాణాలో ప్రచారంచేస్తుంటే, సీమాంధ్రలో అందుకు పూర్తి విరుద్దంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వలననే రాష్ట్ర విభజన జరిగిందని ఆ రెండు పార్టీలు కలిసి ప్రచారం చేస్తూ రెండు చోట్ల తెదేపాను భూస్థాపితం చేయాలనే ఆలోచనతోనే పూర్తి విభిన్నమయిన ఈ ‘అపరిచితుడి పాత్రలు’ పోషిస్తున్నాయి. ఎన్నికల దగ్గరపడే కొద్దీ ఈ మూడు పార్టీలు మరింత తీవ్రంగా యుద్ధం చేసుకోవచ్చును. కానీ, ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే తెరాస, వైకాపాలు దానికే మద్దతు ఈయవచ్చును.
అయితే ఒకే ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనవలసి ఉంది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల నైజం పూర్తిగా తెలిసినపటికీ వారినే నమ్ముకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ వారిరువురూ నిజంగానే తన చేతిలో నుండి జారిపోయేమాటయితే వారిని ఏవిధంగా కట్టడి చేయాలనుకొంది?
కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల వరకు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంటుంది గనుక, ఈలోగా అవసరమనుకొంటే వారిపై తన సీబీఐ చిలుకలనో మరొకటో ప్రయోగించి లొంగ దీసుకోవచ్చును. కానీ, ఎన్నికల తరువాత తిరిగి అధికారంలోకి రావాలంటే మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు తెరాస, వైకాపాలు కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి మద్దతు ఇస్తే వాటిని కట్టడి చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణాలలో తన పార్టీని పణంగా పెట్టి మరీ వారిరువురినీ ఇంత గుడ్డిగా నమ్మి ముందుకు వెళుతుందని భావించలేము. కనుక, ఈ మూడు పార్టీలు మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉందని భావించవలసి ఉంటుంది.