జగన్మోహన్ రెడ్డితో సీ.పీ.యం. ఎన్నికలల దోస్తీ
posted on Mar 8, 2014 @ 9:53AM
అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నామని గర్వంగా చెప్పుకొనే సీ.పీ.యం. పార్టీ అనేక అవినీతి కేసులలో ఇరుకొన్న జగన్మోహన్ రెడ్డితో ఎన్నికల పొత్తులకి సిద్దం అవుతోంది. అందుకు ఆ పార్టీ నేతలు కనుగొన్న మంచి సాకు ఏమిటంటే వైకాపా కూడా తమ పార్టీలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడటమేనని చెపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతనెల డిల్లీ పర్యటనలోనే ఆ రెండు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తులపై ఒక అంగీకారం కుదిరిందని సమాచారం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి, ఎన్నికల ప్రకటన కూడా వెలువడినందున ఇక ఆ రెండు పార్టీలు బహుశః నేడో రేపో ఎన్నికల పొత్తుల ప్రకటన చేయవచ్చును. అయితే ఆ రెండు పార్టీలు ఇప్పటికే ఒకదానితో మరొకటి సహకరించుకొంటున్నాయని మొన్న జగన్మోహన్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన సభకు ఆ రెండు పార్టీలు కలిసి చేసిన భారీ జన సమీకరణం చూస్తేనే అర్ధమవుతుంది. ఇంతవరకు తెదేపాతో అంటకాగిన లెఫ్ట్ పార్టీలు ఒకటి వైకాపాతో మరొకటి(సీపీఐ) తెరాసతో ఈసారి జతకట్టేందుకు సిద్దమవుతున్నాయి.
సీ.పీ.యం., వైకాపాలు పొత్తులు పెట్టుకొని రానున్న ఎన్నికలలో ఒకదాని వల్ల మరొకటి ఆంధ్ర, తెలంగాణా మరియు జాతీయ స్థాయిలో కూడా ప్రయోజనం పొందాలని ఆశపడుతున్నాయి. సీమాంధ్రలో బలంగా ఉన్న వైకాపా వల్ల సీ.పీ.యం. లాభపడితే, మళ్ళీ తెలంగాణాలో పాగా వేయాలని భావిస్తున్న వైకాపాకు అక్కడ బలమయిన క్యాడర్ మరియు మంచి పట్టు ఉన్న సీ.పీ.యం.తో దోస్తీ చేసి లాభపడాలని ఆశిస్తోంది.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల లాంచన ప్రకటన కూడా వెలువడితే, కొద్ది రోజుల క్రితం యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా సీ.పీ.యం. చొరవతో ఏర్పాటు చేసిన ‘థర్డ్ ఫ్రంట్’ కూటమిలో వైకాపా కూడా భాగస్వామి అయినట్లే భావించవచ్చును. దేశవ్యాప్తంగా ఉన్న బలమయిన 11 ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తుకొన్న ఈ థర్డ్ ఫ్రంట్ కు వైకాపా కూడా తోడయితే అది మరింత బలపడుతుంది. అయితే, దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గాలి వీస్తున్నందున, థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా బీజేపీ విజయావకాశాలకు గండికొట్టగలదు.
ఒకవేళ థర్డ్ ఫ్రంట్ మెజార్టీ సాధించిన్నపటికీ అందులో అరడజను మంది వివిధ పార్టీలకి చెందిన నేతలు ప్రధానమంత్రి రేసులో ఉన్నందున అందరూ గొడవపడినపుడు థర్డ్ ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. ఒకవేళ ఎన్నికలలో మెజార్టీ సాధించలేక చతికిలపడినా, కాంగ్రెస్ వేసే ఎరలకు ఆశపడి కొన్ని పార్టీలు అటువైపు దూకితే ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. అందుకే థర్డ్ ఫ్రంట్ కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టించబడిందని నరేంద్ర మోడీ ఆరోపిస్తున్నారు. కానీ ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సరిపోయే మెజార్టీ సాధించలేకపోతే, అప్పుడు బీజేపీ కూడా తప్పనిసరిగా థర్డ్ ఫ్రంట్ వైపే చూడక తప్పదు. కనుక, ఏవిధంగా చూసినా థర్డ్ ఫ్రంటులో చేరడం వలన వైకాపాకు లాభమే తప్ప నష్టం ఉండదు గనుక ఫ్రంటులో చేరడం ఖాయం.
అయితే, ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని జైలు నుండి విడుదల చేసిందని అనేక మంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు గమనిస్తే, ప్రస్తుతానికి ఎన్నికలలో గెలిచేందుకు సీ.పీ.యం. మద్దతు అవసరం కనుక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొన్నపటికీ, ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంటులో కాంగ్రెస్ అనుకూల పార్టీలయిన సమాజ్ వాదీ వంటి పార్టీలతో కలిసి యూపీఏకే మద్దతు ఇవ్వవచ్చును. బహుశః సీపీయం అప్పుడు తాపీగా పశ్చాతాపపడుతుందేమో!