కాంగ్రెస్-తెరాసల యుద్ధం కూడా వ్యూహంలో భాగమేనా?
posted on Feb 28, 2014 7:22AM
కేసీఆర్ మొన్నసోనియమ్మ కాళ్ళకు మొక్కినంత పనిచేసి, తన కుటుంబ సభ్యులను వెంటేసుకొని ఆమెతో గ్రూప్ ఫోటోలు కూడా దిగి తామంత ఒకే కుటుంబసభ్యులమనట్లు వ్యవహరించారు. కానీ, ఆ మరునాడు నుండే ఆ రెండు పార్టీలు చాలా నాటకీయంగా దూరం కావడం ఆరంభించాయి. కేసీఆర్ డిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినపుడు ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో తెరాస ఘనస్వాగతం పలికింది. ఆ ఆర్భాటం చూస్తే కేవలం ఆయన ఒక్కడి వలనే తెలంగాణా ఏర్పడిందనే భావన కలిగించే విధంగా తెరాస దానిని నిర్వహించింది. ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ అని గర్వంగా చెప్పుకొన్న టీ-కాంగ్రెస్ నేతలు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడు వారివారి అనుచరులు తప్ప మరెవరూ వచ్చి స్వాగతం పలికిన దాఖలాలు లేవు. అంటే రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగా తెలంగాణా క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో జమా అయినట్లే భావించవచ్చును.
ఇక నేడో రేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనంఅయిపోతుందని అందరూ భావిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కూడా పనిగట్టుకొని కేసీఆర్ వెనుకే హైదరాబాద్ వచ్చి తరువాత అధ్యాయానికి తెర లేపారు. “తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెడితే ఇక తెలంగాణాలో దొరల రాజ్యం ఏర్పడి పరిస్థితులు దారుణంగా మారుతాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్ధమయిన పాలన అందించగలదని, జాతీయ దృక్పదం లేని తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు సమర్ధంగా పాలన చేయలేక చివరికి డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం లాగే మూన్నాళ్ళ ముచ్చటగా మారి చేతులేత్తేయవచ్చని” తెరాసపై యుద్ధం ప్రకటించారు.
ఆ రెండు పార్టీ అగ్రనేతలు (కుటుంబాలతో సహా) గ్రూప్ ఫోటోలు దిగేంత సహృద్భావ వాతావరణం ఏర్పడి ఉన్నపుడు, కాంగ్రెస్ కే చెందిన మరోనేత దిగ్విజయ్ సింగ్ తెరాస విలీనం ఇక లాంఛనమే అని చెపుతున్న తరుణంలో, రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో తెలుగు ప్రజలు ఎంత మొత్తుకొన్నా రాష్ట్రానికి రాని జైరాం రమేష్ అకస్మాత్తుగా పనిగట్టుకొని హైదరాబాద్ లో వాలి, రెండు పార్టీల మధ్య సంబంధాలు పెటాకులు అయ్యేలా తెరాసను కవ్వించడం చాలా నాటకీయంగా కనిపిస్తోంది. తమతో విలీనం లేదా పొత్తులు పెట్టుకోబోతున్న పార్టీని ఎవరయినా మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తారు తప్ప ఈవిధంగా పనిగట్టుకొని విమర్శలు చేసి రెచ్చగొట్టరని రాజకీయ అజ్ఞానులకయినా తెలుసు.
అదేవిధంగా తాము ఒక జాతీయ పార్టీతో విలీనం లేదా పొత్తులకు సిద్దం అవుతున్నపుడు తెరాస వంటి ప్రాంతీయ పార్టీ కూడా సౌమ్యంగా వ్యవహరిస్తుందని ఎవరయినా భావిస్తారు. కానీ, తెరాస నేత హరీష్ రావు మాట్లాడుతూ “తమ పార్టీని వీడిన అరవింద్ రెడ్డి, విజయశాంతిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చూస్తే కాంగ్రెస్ నోటితో పిలిచి నొసటితో వెక్కిరిస్తున్నట్లుందని, జైరాం రమేష్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన తమ పార్టీని ఆమాద్మీ పార్టీతో పోల్చడం తెలంగాణా ప్రజలని అవమానించినట్లేనని చాలా ఘాటుగా జవాబిచ్చారు. తమను కలుపుకోవాలనుకొంటున్న కాంగ్రెస్ ఈవిధంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహ్యం కలుగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈవిధంగా కేవలం ఒకటి రెండు రోజులలోనే కాంగ్రెస్-తెరాస నేతలు పరిస్థితిని నాటకీయంగా మార్చివేసి, స్నేహ సుమాలు విరుస్తాయనుకొన్న చోట యుద్దవాతవరణం సృష్టించి మాటలు తూటాలు పేల్చుకోవడం చూస్తే ఆ రెండు పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే గొడవపడుతున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో తెరాస విలీనం లేదా పొత్తులు పెట్టుకోదలుచుకోకపోతే, అదే మాటను చాలా సౌమ్యంగా చెప్పిఉండవచ్చును. కానీ అలా చేస్తే, కేసీఆర్, తెరాసలకు రావలసిన క్రెడిట్ రాదు. అందువల్ల తెలంగాణా ప్రజల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా ప్రజల దృష్టి బీజేపీ వైపు మరలకుండా తమ మీదనే నిలుపుకోనేందుకు కాంగ్రెస్-తెరాసలు ఇకపై బద్ధ శత్రువులులా నటిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటూ ఉంటుంది.
ఇదంతా చూస్తుంటే, మనకు అప్రయత్నంగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా గుర్తుకు రాకమానరు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో కూడా అచ్చు ఇదేవిధంగా నాటకమాడిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఈవిధంగా రెండు ప్రాంతాలలో తనకు అనుకూలమయిన పార్టీలు తప్ప మిగిలినవి బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి కల్పించి, ఎన్నికల తరువాత తెరాస, వైకాపా, కిరణ్ కాంగ్రెస్ పార్టీల మద్దతు పొండమే కాంగ్రెస్ వ్యూహం, అంతిమ లక్ష్యమని స్పష్టమవుతోంది. అయితే అది ప్రదర్శిస్తున్న ఈ అతి తెలివితేటలే కాంగ్రెస్ పార్టీ కొంపముంచి చివరికి రాహుల్ గాంధీ భవిష్యత్తుని కూడా నాశనం చేయడం తధ్యం.