అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం సుమా
posted on Feb 24, 2014 @ 7:18PM
బల్లి తన ప్రాణానికి అపాయం ఏర్పడితే తన తోకలో చిన్న ముక్కని తెంపుకొని గిలగిలా కొట్టుకొనేలా చేసి దానిని శత్రువుకి ఎరగా వేసి తప్పించుకొంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తరువాత తోక పెరుగుతుంది గనుక బల్లికి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది.
కాంగ్రెస్ అధిష్టానం కూడా సరిగ్గా ఇదే టెక్నిక్ ప్రయోగించి, తన రాజకీయ శత్రువులను, సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్నితప్పించుకొని అవలీలగా వ్యవహారం చక్క బెట్టేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ తెగిన తోక పాత్రని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోషించారు. మళ్ళీ ఆ తోకకి మరో ఉపతోక పాత్రని అశోక్ బాబు పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్ బాబు కలిసి ప్రజాందోళలని పూర్తిగా తమ అదుపులో ఉండేలా చూసుకొంటూ బిల్లుకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఏవిధంగా త్రిప్పి పంపించేసారో ప్రజలందరికీ తెలుసు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోనీయకుండా వారి తరపున వారిద్దరే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ చివరి వరకు కూడా పరిస్థితులను పూర్తి నియంత్రణలో ఉంచుతూ చాలా సమర్ధంగా తమ తోక పాత్రలను నిర్వహించారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల చేతనే తమకు జై కొట్టేలా చేసుకొన్నారు. పైగా రాష్ట్ర విభజనకు ఇంతగా సహకరించినప్పటికీ తోక పాత్రని బాగా రక్తి కట్టించడంతో సమైక్య చాంపియన్, సమైక్య సింహం వగైరా బిరుదులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి స్వంతం చేసుకొన్నారు. ఆ ఖ్యాతిని కూడా ఇప్పుడు ఓట్ల రూపంలో మలుచుకోవడానికి త్వరలో కొత్త పార్టీ పెట్టబెట్టేందుకు కూడా సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కడుపు కాల్చుకొని నిరాహార దీక్షలు చేసినా రాని ఖ్యాతిని కిరణ్ కుమార్ రెడ్డి ఈ పాత్రతో అవలీలగా సంపాదించుకోగలగడం విశేషం.
ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయి, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి గనుక, దిగ్విజయ్ సింగ్ ఇక ఆ తోకని కూడా మళ్ళీ అతికించేసుకొనేందుకు సిద్దమని ఈ రోజు ప్రకటించారు. ఇటువంటి వ్యవహారంలో తోకలు తెంచుకోక తప్పలేదని, కానీ వాటన్నిటినీ మళ్ళీ అతికించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. పనిలోపనిగా ఈ యావత్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన చాలా మెచ్చుకొన్నారు కూడా. ఆయన, సహచరులు అందరూ తిరిగి పార్టీలోకి వస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. కాంగ్రెస్ నేతలందరూ సమైక్యంగా ఆడిన డ్రామా చూసిన ప్రజలు ఇప్పుడు ఆయన మరో సరికొత్త ‘తోక డ్రామా’కు తెర తీస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి తెగిన తోక మరో బల్లిగా రూపాంతరం చెందుతుందో లేక తిరిగి వెళ్లి తన కాంగ్రెస్ శరీరానికే అతుకొంటుందో చూడాలి మరి.