రాష్ట్రంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే రాజ్యం కానుందా?
posted on Feb 24, 2014 6:47AM
మొన్న కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియా గాంధీని విమర్శిస్తూ ఇకపై మన రాష్ట్రంలో కూడా తమిళనాడు లాగే ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేస్తాయని జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్ళు నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలయినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేతులు కలిపి రాష్ట్ర విభజన చేయడంతో సీమాంధ్ర ప్రజలకి వాటిపై నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ప్రజాభిప్రాయానికి, ఏమాత్రం విలువీయకుండా అత్యంత నిరంకుశంగా అన్ని ప్రజాస్వామిక విధానాలను తుంగలో త్రొక్కి మరీ రాష్ట్రాన్ని విభజిస్తోందని విరుచుకు పడిన బీజేపీ మళ్ళీ అదే పార్టీ ప్రతిపాదించిన రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు పలకడంతో రెండు పార్టీలపై సీమాంధ్ర ప్రజలకు నమ్మకం పోయింది. అందువలన డిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసే ఇటువంటి జాతీయపార్టీలకి ఓటు వేసి నెత్తిన పెట్టుకోవడం కంటే, తమ అవసరాలకు అనుగుణంగా స్పందించే ప్రాంతీయ పార్టీలే మేలనే భావన ఆంధ్ర ప్రజలకు కలగడం సహజమే. అందువల్ల రానున్నఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలవైపే మొగ్గు చూపుతారు తప్ప తమను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని భావించరని ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః అదే అభిప్రాయం జేసీ మాటలలో వ్యక్తం అయిందని భావించవచ్చును.
ఇక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెరాస విలీనం లేదా పొత్తులకు అంగీకరించకపోయినట్లయితే, అక్కడా తనంతట తాను గెలిచే అవకాశం లేకపోవడంతో, 125 సం.ల తన ఘనచరిత్రను కూడా పక్కనబెట్టి “విలీనం కాకపోతే పోయే, కనీసం పొత్తులకయినా అంగీకరించు మహాప్రభో!” అని కేసీఆర్ కాళ్ళ మీద పడుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలి కలుగుతుంది.
కాంగ్రెస్ పేరుకి జాతీయపార్టీ అయినా జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల చేతిలో పరాజయం చవి చూస్తూ కేవలం ఒక ఐదారు రాష్ట్రాలకే పరిమితమయిన ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. అందుకే అది గత పదేళ్లుగా యూపీఏ కూటమిని ఏర్పాటు చేసుకొని తనవంటి అనేక చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని రాజ్యం ఏలుతోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ప్రభుత్వం నెట్టుకొస్తున్నప్పటికీ, నేటికీ జాతీయ పార్టీననే అతిశయం ఒలకబోస్తోంది. ఆ అతిశయం మరీ ఎక్కువవడం వలననే ప్రజాభిప్రాయాన్ని కాలరాసి ఇంత నిరంకుశంగా రాష్ట్ర విభజన చేసింది. నానాటికి కుచించుకుపోతున్న తన పార్టీ పరిస్థితిని గ్రహించి కాంగ్రెస్ అధిష్టానం మేల్కొనకపోగా, తెలివి తక్కువగానో లేక అతితెలివికిపోయో దక్షిణాదిన కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేజేతులా బ్రద్దలు కొట్టుకొంది. ఇంతవరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నకాంగ్రెస్ పార్టీ, ఇకపై ఆంధ్ర, తెలంగాణలలో కూడా స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితికి దిగజారడమే కాకుండా ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీగా మారబోతోంది.