తెదేపా వల్ల తెరాస అభద్రతాభావానికి గురవుతోందా?
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఎన్నికల ప్రసంగాలలో తరచూ మనకి ‘అంద్రోళ్ళ పార్టీల’ పెత్తనం అక్కరలేదని చెపుతుండటం అందరూ గమనించే ఉంటారు. కానీ డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీల పట్ల గానీ ఆయన అటువంటి వ్యతిరేఖత ప్రదర్శించడం ఎన్నడూ చూడలేదు.
తెరాస పార్టీ ఇంతవరకు అవసరమయినప్పుడల్లా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొడుతూ నెట్టుకొస్తోంది తప్ప తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలలాగ పార్టీని గ్రామస్థాయి నుండి నిర్మించుకొని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయలేదు. అందువల్ల బలమయిన నేతలు విస్తృతమయిన క్యాడర్ కలిగి ఉన్న తెదేపాను చూసి తెరాస అభద్రతా భావానికి గురవడం సహజమే. అందుకే తనకు బలమయిన పోటీ ఇస్తున్న తెదేపా మీద ‘ఆంద్రోళ్ళ పార్టీ’ అని బలంగా ముద్ర వేసేందుకు కేసీఆర్ తరచూ ప్రయత్నిస్తుంటారు. ఆ పార్టీ నేత హరీష్ రావు “ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే తెలంగాణాలో తెదేపా దుఖాణం కట్టేసి వెళ్ళిపోతారా?” అని చంద్రబాబుని అడిగిన ప్రశ్నలో కూడా అదే రకమయిన అభద్రతా భావం కనబడుతోంది. తెరాస తాను అధికారంలోకి రావడం ఖాయమని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నపుడు, తెదేపాను చూసి ఎందుకు అంత కలవరపడుతున్నట్లు? కాంగ్రెస్, బీజేపీలను చూసి ఎందుకు భయపడటం లేదు? అని ప్రశ్నించుకొంటే చంద్రబాబు మరియు తెదేపా శక్తియుక్తుల మీద వారికి ఉన్న అపార నమ్మకమేనని చెప్పక తప్పదు.
తమ దెబ్బకి తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని విర్రవీగుతున్న తెరాస నేతలకి ఇటీవల తెలంగాణాలో తెదేపా నిర్వహించిన మూడు ప్రజాగర్జన సభలు విజయవంతం కావడం, చంద్రబాబు బీసి మంత్రానికి తమ వద్ద సరయిన జవాబు లేకపోవడం చాలా కలవరపరిచే అంశాలేనని చెప్పవచ్చును. రాష్ట్ర విభజనతో తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణా నుండి బిచాణా ఎత్తేస్తుందని, ఇక తమకు తిరుగే ఉండదని భావిస్తే, అందుకు విరుద్దంగా తెదేపా ఊహించనంత వేగంగా మళ్ళీ తెలంగాణాలో బలం పుంజుకోవడమే కాక తమ విజయావకాశాలను కూడా గండి కొట్టే స్థాయికి ఎదగడం తెరాస జీర్ణించుకోవడం కష్టమే.
ఇక కేసీఆర్ దురాశకు పోయి తన వెంటపడుతున్న కాంగ్రెస్ పార్టీని చ్చీ కొడుతూ దూరంగా పెడితే, అసలు తెదేపాతో పొత్తులకే అంగీకరించని బీజేపీ తెలంగాణా నేతలు పార్టీ జాతీయ అవసరాల దృష్ట్యా తెదేపాతో సర్దుకుపోయేందుకు అంగీకరించడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారు అయ్యాయి. దీనితో తెలంగాణాలో కూడా పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. తెదేపా-బీజేపీలు చేతులు కలిపి బలపడితే, కాంగ్రెస్, తెరాసలు విడిపోయి బలహీనపడ్డాయి. తెరాస నేతల అభద్రతా భావానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పవచ్చును.
ఇక తమవంటి ఒక ప్రాంతీయ పార్టీ తెదేపాని చూసి భయపడుతున్న తెరాస నేతలు తమకంటే ఎన్నో రెట్లు బలమయిన జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చూసి ఎందుకు భయపడటం లేదు అంటే, నేటికీ బీజేపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని, కనీసం తమకు గట్టి పోటీ కూడా ఇవ్వలేదనే భావనే తెరాస అలుసుకి కారణం. కానీ అది ఇప్పుడు తెదేపాతో చేతులు కలుపుతోంది గనుక ఇప్పుడు దానిని కూడా కేసీఆర్ తన లెక్కలోకి తీసుకోక తప్పదు.
ఇక టీ-కాంగ్రెస్ నేతలకు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రావాలనే తపన కంటే, తమకు తమ కుటుంబ సభ్యులకు టికెట్స్ సాధించుకోవడం పైనా, అధికారంలోకి రాలేమని తెలిసినా ముఖ్యమంత్రి కుర్చీకోసం తోటి నేతలతో సిగపట్లు పట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గనుక వారిని వారే ఓడించుకొంటారనే ధీమా కేసీఆర్ కి ఉన్నందునే ఆయన కాంగ్రెస్ ను చూసి కూడా ఎన్నడూ భయపడలేదు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు అందరూ మళ్ళీ ఒక్క త్రాటిపైకి తమను డ్డీ కొనాలని చూసినా వారిపై ప్రయోగించడానికి “తెలంగాణా సెంటిమెంటు” అనే బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మీద దివ్యంగా పనిచేసే ఆ బ్రహ్మాస్త్రం ‘ఆంధ్రోళ్ళ తెదేపా’ మీద ఎందుకు పనిచేయడం లేదు? అంటే తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెపుతున్న మాయమాటలను నమ్మకపోవడమేనని అనుకోవచ్చును. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మొదలు కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల వరకు కేసీఆర్ చేస్తున్న మాటల గారడీని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నిర్ద్వందంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వకపోయినా, ఆయన ఇప్పుడు తెలంగాణాలో తన పార్టీని పూర్తిగా బీసీలకే అప్పజెప్పడం, వారికే అధికారమని విస్పష్టంగా ప్రకటించడం, ముఖ్యంగా తాను కల్పించిన ఉపాధి, చేసిన అభివృద్ధి పనులు గురించి ప్రజలకు సమర్ధంగా చెప్పుకోవడం వలన తేదేపాకు ప్రజలలో క్రమంగా ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది.
కేసీఆర్ చేస్తున్న వేర్పాటు తెలంగాణావాదం వలన ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని వారికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో నయినా తెలంగాణాలో అయినా ప్రజలకు కావలసింది సుస్థిరమయిన పాలన, వేగంగా అభివృద్ధి, ఉపాధి, భద్రత, శాంతి వంటివే కోరుకొంటున్నారు కనుకనే వాటిని ఇవ్వగల నేతలకు, పార్టీలకే ప్రజలు పట్టం గడతారు తప్ప మాటల గారడీలు చేసే అనుభవం లేని నేతలకు కాదు. బహుశః ఈ అంశమే తేదేపాకు రెండు ప్రాంతాలలో కలిసి వస్తోంది. కానీ దీనిని తెదేపా ఎంత సమర్ధంగా వినియోగించుకొంటుందో తెలుసుకొనేందుకు ఎన్నికల ఫలితాలే గీటురాయిగా నిలుస్తాయి.