తెదేపాకు వరంగా మారిన కాంగ్రెస్ వ్యూహం
posted on Feb 22, 2014 7:05AM
రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు నుండే నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది. అందుకోసం మరో సరికొత్త వ్యూహం రచించింది. ఈ వ్యూహంలో భాగంగా 1. సీమాంధ్ర నేతల ఒత్తిడి కారణంగానే భారీ ప్యాకేజి ఇచ్చేందుకు అంగీకరించడం. 2.తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం చేయడం.
సీమాంధ్ర ప్రజలకు ప్యాకేజీ తాయిలాలు ప్రకటించి, ‘గుడ్డిలో మెల్ల అన్నట్లు చివరికి కనీసం ఆమాత్రమయినా దక్కిందని’ వారే స్వయంగా భావించేలా చేసి తనపై ఏర్పడిన వ్యతిరేఖతను తెదేపా, వైకాపాలపైకి మళ్ళించడం ఈ వ్యూహం.
అందుకే ఇంత కాలంగా ఈ విభజన వ్యవహారంలో ఎన్నడూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధుల గోడు పట్టించుకోకుండా వారిని చాలా హీనంగా చూసిన కాంగ్రెస్ అధిష్టానం, సరిగ్గా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు అకస్మాత్తుగా వారి మీద ప్రేమ ఒలకబోస్తూ వారితో సమావేశమై “కేవలం వారి ఒత్తిడి కారణంగానే” సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వగైరా తాయిలాలు ఇస్తున్నట్లు ప్రకటించి చాలా సమయ స్ఫూర్తి, లౌక్యం ప్రదర్శించి ఆఖరు నిమిషంలో వారిని పూర్తిగా కట్టడి చేసింది.
సోనియా, రాహుల్ గాంధీలు చాలా దయతో సీమాంధ్రకు ప్యాకేజీలు విదిలించినందుకు కేంద్ర మంత్రి జేడీ.శీలం మీడియా ముందుకొచ్చి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా. మన సమస్యతో ఎటువంటి సంబంధమూ లేని పశ్చిమ బెంగాల్ కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సభలో ఆందోళన చేస్తుంటే, ఆయన ఈ వ్యవహారంతో అసలు తనకేమీ సంబంధమూ లేనట్లుగా నిసిగ్గుగా చూస్తూ కూర్చొన్నారు.
ఇక ‘సమైక్యాంధ్ర’ అంటూ గర్జించి తన పదవికి (ఒట్టొట్టి) రాజీనామా కూడా చేసిన మరో కాంగ్రెస్ జీవి చిరంజీవి, మొన్న సభలో ఏవిధంగా ‘మ్యావ్ మ్యావ్’ అన్నారో ప్రజలందరూ చూసారు. ఆ జీవి తన అధిష్టానం అమలుచేయబోయే వ్యూహంలో రెండో భాగానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర విభజన కేవలం తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని సభలోనే తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ అధిష్టానం రచించిన ఈ వ్యూహాన్ని ఇప్పుడు బొత్స, అనం, డొక్కా, రఘువీర వంటి వీర విదేయులందరూ భుజాలకెత్తుకొని సీమాంధ్రలో పార్టీని బ్రతికించుకొంటామని శపధాలు చేసి ప్రజలలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందని టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో చాటింపు వేసుకొని ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు కేవలం తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని చెప్పుకొంటూ, ప్రజలలో తమపై, తమ కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేఖతను తెలివిగా ఆ రెండు పార్టీల మీదకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు.
తమ పార్టీయే రాష్ట్ర విభజన చేసినప్పటికీ ఆవిషయాన్నిదాచిపెట్టి కేవలం తామే సీమంధ్రకు భారీ ప్యాకేజీలు ఇప్పించామని ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బహుశః ఇక నుండి వారందరూ ఈ ప్యాకేజీల వలన సీమాంధ్ర ఎంత లాభపడిపోతుందో, రాత్రికి రాత్రే ఎంతగా అభివృద్ధి చెందుతుందో కధలు కధలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టవచ్చును. ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ఇది గ్రహించలేని మూర్కులని కాంగ్రెస్ పార్టీ భావించడం చాలా విచిత్రమే.
అయితే, సీమాంధ్రలో నష్ట నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ అస్త్రాన్ని తెదేపా, వైకాపాల మీదకు ప్రయోగించిందో సరిగ్గా అదే అస్త్రం వారికి తెలంగాణాలో మళ్ళీ పుంజుకోనేందుకు గొప్ప ఆయుధంగా అందివచ్చింది. తెలంగాణా ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే స్వయంగా "కేవలం తెలుగుదేశం లేఖ కారణంగానే" తెలంగాణా ఇచ్చామని చెప్పుకోవడంతో ఈ విభజన అంశం కారణంగా తెలంగాణాలో డీలా పడిపోయిన తేదేపాకు అదొక ఊహించని వరంగా మారింది. అందువల్ల ఇప్పుడు తెదేపా-తెలంగాణా నేతలు కాంగ్రెస్ చెపుతున్న ఈ మాటలనే అందిపుచ్చుకొని, కేవలం తెలుగుదేశం పార్టీ వలననే తెలంగాణా రాష్ట్రం సాధ్యమయిందని దైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకొనేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణాకు అనుకూలమంటూ లేఖ ఇచ్చి తెదేపా వెనక్కి తగ్గిందని తెరాస చేసిన విమర్శలు కూడా తెదేపా వాదనను బలపరిచేవిగా ఉన్నాయి.
అందుకే చంద్రబాబు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ నిన్నమీడియా ముందుకు వచ్చి “తమ పార్టీ తెలంగాణాకు అనుకూలమని ఇచ్చిన లేఖను నేటికీ వెనక్కి తీసుకోలేదని, తాము రాష్ట్ర విభజన చేస్తున్న తీరుని వ్యతిరేఖించామే తప్ప, తెలంగాణాను కాదని" చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ప్యాకేజీపై బొత్స సత్యనారాయణే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినందున, చంద్రబాబు కూడా అదే విషయం ప్రస్తావిస్తూ "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమంటే ఏదో ఒక భవనం కట్టినంత తేలిక కాదు. ఆ సంగతి ఆ పార్టీ నేతలకీ తెలుసు. అది విదిలించే ప్యాకేజీ రాష్ట్రం అప్పులు తీర్చుకోవడానికి కూడా సరిపోవని" కాంగ్రెస్ వ్యూహాన్ని ఎండగట్టారు.