విభజన చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ గట్టెక్కగలదా?
posted on Feb 18, 2014 6:53AM
కోట్లాది తెలుగు ప్రజల భవిష్యత్తుపై చిరకాలం పాటు తీవ్ర ప్రభావం చూపబోయే రాష్ట్ర విభజన బిల్లుపై ఈరోజు లోక్ సభలో కేవలం నాలుగు గంటల్లో చర్చ ముగించి ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్నపాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడా తెలుగువాడి ప్రమేయం లేకుండా సాగుతున్న ఈ తంతులో చివరి రోజున కూడా సభలో తెలుగువాడు లేకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందే జాగ్రత్తపడింది. ఉన్న కొద్ది మందిలో కొందరిని సోనియా గాంధీ తన కనుసైగతో అదుపు చేస్తుంటే మిగిలిన నలుగురైదుగురు ఆవేదన సభలో అరణ్యరోధనగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం తను ఇంత దిగజారిపోయినందుకు ఏ మాత్రం సిగ్గుపడకపోగా సభని, సీమాంధ్ర సభ్యులని ఇంత గొప్పగా మేనేజ్ చేయగలుగుతునందుకు గర్వపడుతోంది. గత పదేళ్లుగా రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతున్నా ఏనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ, మిగిలిన సీమాంధ్ర మంత్రులను కూడా మేనేజ్ చేసేందుకు నిన్న వారితో సమావేశమవడం చూస్తే, కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకొనేందుకు ఎంతకయినా దిగజారగలదని అర్ధమవుతుంది.
ఇక కేంద్రంలో ఈవిధంగా చక్రం తిప్పుతూనే, రాష్ట్రంలో ఆఖరి అధ్యాయం పూర్తి చేసేందుకు తన కనుసన్నలలో నడుచుకొనే బొత్ససత్యనారాయణను రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తన పదవికి రాజీనామా చేసి తప్పుకోబోతుండటంతో, ఆ స్థానంలో తను సర్దుకోవాలనే తాపత్రయపడుతున్న బొత్స, కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలురయిన శాసనసభ్యులను, మంత్రులందరినీ పోగేసి, ఒకవైపు ముఖ్యమంత్రి వర్గాన్ని నిందిస్తూ, మరోవైపు తన సారధ్యంలో సమైక్యపోరాటం చేసేందుకు కలిసిరమ్మని ప్రతిపక్షాలకి లేఖలు కూడా వ్రాసారు. ఈరోజు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందబోతుంటే, అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవాలని తపిస్తున్న బొత్స వర్గం దేనికోసం డిల్లీ వెళ్ళాలనుకొంటున్నారో, దేనికోసం పోరాడుతారో తేలికగానే ఊహించుకోవచ్చును.
ఇక ముందే చెప్పుకొన్నట్లుగా రేపటి నుండి కిరణ్ కాంగ్రెస్, బొత్స కాంగ్రెస్, వై.కాంగ్రెస్ మూడు ఒకదానితో మరొకటి కత్తులు దూసుకొంటూ సీమాంధ్ర ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు గట్టిగా కృషి చేస్తాయి. గత ఎన్నికలలో లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీని అడ్డుకోగా, ఈసారి కాంగ్రెస్ పార్టీయే మూడు పార్టీలుగా చీలి అడ్డుకోబోతోంది గనుక ఈమూడు పార్టీల మధ్య ప్రజల ఓట్లు చీలడం ఖాయం. (ఇవికాక మందకృష్ణ, బైరెడ్డి, ఆమాద్మీ పార్టీ, లోక్ సత్తాలు కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి) కాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు తగిన వ్యూహాలు తమ వద్ద సిద్దంగా ఉన్నాయని ఆరునెలల క్రితమే పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే అప్పుడు ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ వ్యూహం ఇదేనని క్రమంగా తేటతెల్లమవుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకుకాంగ్రెస్పార్టీ రాష్ట్రాన్నే కాదు తన స్వంత పార్టీని కూడా విభజించుకోగలదని రుజువు చేసుకొంది.
తెలంగాణా ఏర్పడుతున్నందుకు తెలంగాణా ప్రజలు సంతోషపడుతుంటే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొన్న సీమాంధ్ర ప్రజలు చాలా బాధపడుతున్నారు. అదిసరిపోదన్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టబోతున్న ఈ వికృత పైశాచిక రాజకీయ క్రీడలో బలవంతంగా పాలుపంచుకోవలసిరావడం మరో దురదృష్టం.