తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది

    దాదాపు ఏడు దశాబ్దాలపాటు తెలుగు సినిమాలో రారాజుగా వెలిగిన ఎవ్వర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వర రావు ఇక శలవంటూ వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిపోవడంతో తెలుగు సినిమా ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన నిష్క్రమణతో తెలుగు సినిమా చరిత్రలో ఏయన్ఆర్-యన్టీఆర్ శకం సమాప్తమయిపోయింది.   ప్రతీ తెలుగింట తరచూ వినబడుతుండే ‘ఏయన్ఆర్’ పేరు, ఆయనతో తెలుగు ప్రజలు ఎంతగా ఆత్మీయబందం పెనవేసుకొన్నారో తెలియజేస్తోంది. అందుకు కారణాలు అనేకం. కోట్లాది తెలుగు ప్రజలు ఆయన నటించిన ఆణిముత్యాలవంటి సినిమాలు చూస్తూనే పెరిగారు. నేటి తరంవారు ఆయన నటించిన పాత సినిమాలను చూడలేకపోయినా, గత రెండు దశాబ్దాలలో విడుదలయిన అనేక సినిమాలలో ఆయన నటనను చూసి ఆనందించారు.   అక్కినేని నట జీవితం ఒక ఎత్తయితే, ఆయన చూపిన ఆత్మవిశ్వాసం, తెలుగు ప్రజలతో ఆయనకున్న అనుబంధం మరొక ఎత్తని చెప్పవచ్చును. ఆయన తన నట జీవితంలో అనితరసాధ్యమయిన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. ఆయన నటించిన వందల కొద్దీ ఆణిముత్యాలవంటి సినిమాల గురించి, ఆయన అందుకొన్న అవార్డుల గురించి తెలుగు ప్రజలందరికీ సుపరిచితం. వాటి గురించి ఎంత చెప్పినా అది కొండను అద్దంలో చూపడమే అవుతుంది. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆయనొక తెలుగు సినిమా సజీవ చిత్రం.   తెలుగు సినిమా అంటే ఏయన్ఆర్. ఏయన్ఆర్ అంటే తెలుగు సినిమా. అలాగని తెలుగు సినిమాలో యన్టీఆర్, యస్వీఆర్, శోభన్ బాబు, గుమ్మడి, సత్యనారాయణ, అంజలీదేవి, సావిత్రి, కృష్ణ, జమున వంటి అనేక మహా నటులను విస్మరించలేము. కానీ, తెలుగు సినిమాకు ఏయన్ఆర్-యన్టీఆర్ మూల స్తంభాల వంటివారని చెప్పకతప్పదు. నేడు ఏయన్ఆర్ మృతితో తెలుగు సినిమాలో ఒక శకం ముగిసిపోయింది.   నేటి సమాజంలో చాల మంది ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కోలేక, సంతోషంగా జీవించలేక చాల చిన్న వయసులోనే జీవితం పట్ల ఒక వైరాగ్యం పెంచుకొంటున్నారు. కానీ, ఏయన్ఆర్ 90ఏళ్ల వయసులో కూడా అచంచలమయిన ఆత్మవిశ్వాసం, జీవితంపట్ల ఆశావాహక దృక్పధం కనబరిచారు. తనకు భయంకరమయిన క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలిసినప్పుడు, ఆయన ఏ మాత్రం కుమిలిపోలేదు. పైగా తనకు అనేక పరీక్షలు పెట్టి గెలిచే అవకాశం కల్పించిన భగవంతుడు ఈ 90 ఏళ్ల వయసులో మరొక పరీక్ష పెట్టాడు. ఇందులో కూడా నేనే విజయం సాదించి నిండు నూరేళ్ళు బ్రతికి నా చివరి శ్వాస వరకు సినిమాలలో నటిస్తానని నిబ్బరంగా చెప్పడం చూస్తే, జీవితాన్నిఎలా జీవించాలో ఆయన నుండి మనం తెలుసుకోవచ్చును.   ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కేవలం తన స్వయం కృషి, పట్టుదల, అచంచలమయిన ఆత్మవిశ్వాసంతోనే సమున్నత స్థాయికి ఎదిగి, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు, అంతకు మించి ప్రజల అభిమానం సంపాదించుకొన్నారు. ఆయన సినీపరిశ్రమలో వారికి ఒక ఎన్ సైక్లోపీడియాగా నిలిస్తే, వారితో బాటు యావత్ తెలుగు ప్రజలందరికీ జీవితం యొక్క విలువ, దానిపట్ల కలిగి ఉండాల్సిన ఆశావాహక దృక్పధం, సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనే పద్దతులను నేర్పిన ఒక గొప్ప కౌన్సిలర్ గా నిలుస్తారు.   ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ, ఆయన తెలుగు ప్రజలందరి మనసులలో శాశ్వితంగా నిలిచి ఉంటారు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కూడా మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు. ఆ మహా నటుడికి తెలుగు ప్రజలందరి తరపున తెలుగువన్ హృదయపూర్వక నివాళులు అర్పిస్తోంది.

రాష్ట్రపతి నిర్ణయంపై తెలంగాణా భవితవ్యం

  రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలంగాణా బిల్లుపై చర్చకు మరో నెలరోజులు కాకపోయినా పదిరోజులు గడువు ఇచ్చేందుకు హోంశాఖ అంగీకరిస్తూ ఆ మేరకు రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాసినట్లు సమాచారం. అయితే, రాష్ట్రపతి హోంశాఖ సూచనలకు కట్టుబడి కేవలం పదిరోజుల గడువే ఈయనవసరం లేదు. ఆయన తన విచక్షణాదికారాల మేరకు అవసరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు నెలరోజులు గడువు కూడా ఈయవచ్చును. ఒకవేళ ఆయన కేంద్రం సూచించినట్లు కేవలం పదిరోజులు మాత్రమె గడువు ఇచ్చినట్లయితే, తెలంగాణా బిల్లుని యూపీయే ప్రభుత్వ చిట్టచివరి పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది. అదే నెలరోజులు సమయం ఇచ్చినట్లయితే ఇక బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కుదరదు గనుక వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకపోవచ్చును.   రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ది పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో తలబొప్పి కట్టడంతో ముందుకు వెళ్ళలేక వెనక్కి కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గనుక, ఒకవేళ రాష్ట్రపతి తెలంగాణా బిల్లుపై చర్చించడానికి రాష్ట్ర శాసనసభ కు మరో నెల రోజులు గడువు ఇచ్చినట్లయితే ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడగలదు. అలాకాక రాష్ట్రపతి కేవలం పదిరోజులే గడువు ఇచ్చినట్లయితే, ఆ తరువాత పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేయలేక చతికిలపడితే, రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. అందువల్ల రాష్ట్రపతి నిర్ణయం కోసం సమైక్యవాదులే కాదు కాంగ్రెస్ కూడా ఆశగా ఎదురుచూస్తోందని భావించవచ్చును. కానీ, రాష్ట్రపతి నెలరోజులు గడువు ఇచ్చినట్లయితే, తెలంగాణాలో మళ్ళీ ఉద్యమాలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చును.

పక్కదారి పట్టిన అమాద్మీ

  దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను ఆవిష్కరిస్తామని, డిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిగద్దెనెక్కిన ఆమాద్మీపార్టీ ఇంకా నెల రోజులయినా పూర్తికాక మునుపే, స్వయంగా అనేక సమస్యలలో చిక్కుకోవడమే కాకుండా, అనేక కొత్త సమస్యలు సృష్టిస్తోంది కూడా.   ప్రభుత్వ పాలనపై దృష్టి కేంద్రీకరించవలసిన అరవింద్ కేజ్రీవాల్, విధినిర్వహణలో అలసత్వం చూపిన నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని ధర్నాకు సిద్దమయ్యారు. హోంశాఖ అధీనంలో ఉండే డిల్లీ పోలీసులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నేరుగా ఎటువంటి చర్య తీసుకోలేదు గనుక, ఆయన వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాసారు. ఆయన లేఖపై స్పందించిన హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ ఆ పోలీసులపై దర్యాప్తుకు ఆదేశించామని, దర్యాప్తులో వారు దోషులుగా తేలినట్లయితే వారిపై చర్యలు తీసుకొంటామని అన్నారు. కానీ, ఎటువంటి దర్యాప్తు జరపకుండా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం వలన చట్టపరమయిన సమస్యలు వస్తాయని, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ తన పది రోజుల ధర్నాఆలోచనను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన సహచర మంత్రులు కూడా ధర్నాకే సిద్దపడుతున్నట్లు తాజా సమాచారం.   మంచి ప్రజాదారణ కలిగి ఉన్నఅరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆకట్టుకోనేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనవసరం. తాము ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలుచేసేందుకు కృషి చేసినట్లయితే, అవే ఊహించనంత సత్ఫలితాలు ఇస్తాయి. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని ప్రయత్నించడం మంచిదే. కానీ, అందుకు ఇదే సరయిన పద్ధతి కాదని ఆయన గ్రహించడం అవసరం. ఈ రోజు నలుగురు పోలీసు అధికారుల కోసం ఆయన, ఆయన సహచర మంత్రులు నడిరోడ్డు మీద పదిరోజులు ధర్నాకు దిగినంత మాత్రాన్నసమస్య సమూలంగా పరిష్కారమయిపోదు. డిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తామని ఆమాద్మీ పార్టీ చేసిన ఎన్నికల హామీని నిలబెట్టుకొనేందుకు ఆయన కృషి చేసి ఉంటే, పోలీసు వ్యవస్థ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుంది. అప్పుడు ఇటువంటి సమస్యలు పునరావృతమవవు.   దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నడిల్లీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో అధికారులందరూ నిరంతరం పనిచేస్తూ ఉండాలి. కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు తమ పనులను పక్కనబెట్టి, ఈవిధంగా ధర్నాలు చేయడం వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగదు. అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజలు ఒక అపూర్వమయిన అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆమాద్మీ ప్రభుత్వానికి ఎన్నికలు సమీపించే వరకు, మహా అయితే మరో మూడు నెలల ఆయువు మిగిలి ఉంది. దేశ ప్రజలకి తమ ప్రభుత్వ పనితీరుని మచ్చు చూపించగల అపూర్వమయిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అమాద్మీ పార్టీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే అందుకు తగిన ప్రతిఫలం ఆశించవచ్చును. కానీ, ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు పనులకు పూనుకొంటే, వచ్చే ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా పోవచ్చును.   గుజరాత్ రాష్ట్రంలో సమర్ధమయిన పాలన అందించినందుకే నరేంద్ర మోడీ వైపు దేశ ప్రజలు మొగ్గుచూపుతున్నారనే సంగతిని అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీ సభ్యులు గ్రహించినట్లయితే, వారు ఇటువంటి అంశాలను పట్టుకొని వృధా కాలక్షేపం చేయరు.డిల్లీ ప్రజలు ఆమాద్మీ నుండి చాలా ఆశించి అధికారం కట్టబెట్టారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు విఫలమయినట్లయితే, దేశ ప్రజలు మళ్ళీ ఇక ఇటువంటి ప్రయోగానికి ఆసక్తి చూపరు. అప్పుడు దేశ ప్రజలకు మళ్ళీ అవే కాంగ్రెస్, బీజేపీలు గతవుతాయి.   

ఇంతకీ సమైక్య పార్టీ ఎందుకు స్థాపిస్తునట్లు?

  కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అదేమి పట్టనట్లు, రాష్ట్ర విభజన వ్యవహారంలో తలమునకలవడం గమనిస్తే, బహుశః ఈ కొత్త పార్టీ స్థాపన కూడా దాని వ్యూహంలో భాగమేనని అనుమానం కలుగుతుంది. అదేవిధంగా వచ్చేఎన్నికలలోగా ఎలాగయినా రాష్ట్ర విభజన జరిపితీరుతామని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా చెపుతుంటే, ముఖ్యమంత్రి తదితరులు సమైక్యపార్టీ స్థాపనకు పూనుకోవడం రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం కాక, కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఎన్నికలలో పోటీ చేయడానికే బయటకి వచ్చినట్లుంది. కాంగ్రెస్ చెపుతున్నట్లు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగినా, జరగకున్నా ఈ కొత్త సమైక్యపార్టీ ఆవిర్భావం తధ్యమని తెలుస్తోంది గనుక, దాని ప్రదానోదేశ్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమో లేక రాష్ట్ర విభజనను అడ్డుకోవడమో ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది.   ఒకవేళ కొత్త పార్టీ పెట్టకుండా అందరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఎన్నికలకు వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్న వ్యతిరేఖత కారణంగా అందరూ ఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉంది. గనుకనే కాంగ్రెస్ తాత్కాలికంగా రెండుగా చీలిపోయి, ఒకదానితో మరొకటి విభేధిస్తున్నట్లు నటిస్తూ, ప్రజలలో ఉన్నకాంగ్రెస్ వ్యతిరేఖతను, సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలందరూ వచ్చేఎన్నికలలో గెలవాలని భారీ వ్యూహమే రచించినట్లు కనబడుతోంది. తద్వారా కాంగ్రెస్ ను వ్యతిరేఖిస్తున్న ప్రజలు మళ్ళీ అదే కాంగ్రెస్ నేతలకు ఓటువేసి గెలిపించేలా చేయాలనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. అదేదో సినిమాలో హీరో, విలన్ వెతుకుతున్నమనుషులను విలన్ కి అనుమానం కలగని విధంగా అతని ఇంట్లోనే సురక్షితంగా దాచిపెట్టినట్లుగా, కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర ప్రజల భారి నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, వారి కంటి ముందే రెండుగా చీల్చి ఒక సరికొత్త పార్టీగా వారి ముందుకు తీసుకు వచ్చిగండం గట్టెక్కాలనుకోవడం నిజంగా గొప్ప విషయమే. కానీ, సీమాంధ్ర ప్రజలు ఇది అర్ధం చేసుకోలేని తెలివి తక్కువవారని భావించడమే కూడా చాలా అవివేకమే.   కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైకాపా పెడితే, ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ.అని బల్లగుద్ది చెపుతున్నపుడు, కిరణ్ కుమార్ రెడ్డో మరో కాంగ్రెస్ నాయకుడో పార్టీ నుండి బయటకి వచ్చి సమైక్య పార్టీ పెడితే అది కాంగ్రెస్ డీ.యన్.ఏ. కాకుండా పోతుందా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కలిసిపోకుండా ఉంటుందా?   రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకయితే కొత్త పార్టీ స్థాపించనవసరం లేదు. ఆ పని కాంగ్రెస్ లో ఉంటూనే కూడా చేయవచ్చును. కానీ రాష్ట్ర విభజన జరుగబోతోందనే సంగతి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ చాలా ముందే తెలిసి ఉన్నపటికీ అధికారం కోసం, మంత్రి పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి అమ్ముడుబోయి, ఇంతవరకూ ప్రజలను మభ్య పెడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త పార్టీతో ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నించబోతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి లక్ష్యం తిరిగి అధికారం సంపాదించడమే తప్ప, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచడం మాత్రం కాదు. అందుకే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా ప్రజల మనోభావాలను బలహీనతలుగా భావించి సమైక్యమంటూ ఓట్లు నొల్లుకోవాలని వస్తున్నారు.   కాంగ్రెస్ వ్యతిరేఖతను తట్టుకొని స్వంత బలంతో గెలవగలమనే ధీమా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే, మరి కొందరు ఈ కొత్త సమైక్యపార్టీలోకి, మరి కొందరు వైకాపాలోకి దూకి ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తను గెలవలేనప్పుడు ప్రధాన ప్రతిపక్షం గెలవకుండా ఉండేందుకు ఎన్నికల సమయానికి ఇటువంటి కొత్త డమ్మీ పార్టీలను సృష్టించి ఓట్లు చీల్చడం అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. మంద కృష్ణ మాదిగ ఇటీవలే కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. అమాద్మీ పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తునట్లు ప్రకటించింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డో మరొక కాంగ్రెస్ నాయకుడో సమైక్య పార్టీ స్థాపించడమే మిగిలి ఉంది.

సవాళ్ళను ఎదుర్కోలేని వ్యక్తి ప్రధానిగానా?

  ఈ రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నకాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని సోనియాగాంధీని గట్టిగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేనందున ఆమె తిరస్కరించినట్లు, ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది మీడియాకు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యంలోనే వచ్చేఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల రేపు జరుగబోయే ఏఐసిసి సమావేశంలో అందరూ ఊహించినట్లుగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించబోవడం లేదని స్పష్టమయింది.   దేశమంతా మోడీ గాలులు బలంగా వీస్తున్నఈ తరుణంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి, ఎన్నికలలో ఓడి అప్రదిష్ట మూటకట్టుకోవడం కంటే, ఒకవేళ ఎన్నికలలో గెలిస్తే అప్పుడే రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవచ్చుననే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లు కనబడుతోంది. అంతే గాక ఆయనని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవలసిన భారం కూడా ఆయనపైనే పడుతుంది. అది ఆయన నాయకత్వ లక్షణాలకి అగ్నిపరీక్షగా కూడా మారుతుంది. అటువంటి అగ్నిపరీక్షకు నరేంద్ర మోడీ స్వయంగా సంతోషంగా సిద్దపడితే, కాంగ్రెస్ మాత్రం తమ యువరాజు అంత పెద్ద పరీక్ష తట్టుకోలేడని భావించడమే, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అంగీకరించినట్లయింది.   ఇంతవరకు రాహుల్ గాంధీ నేతృత్వం వహించిన ఏ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అందువల్ల రాహుల్ గాంధీ పార్టీకి సారధ్యం వహిస్తారని చెపుతున్నపటికీ, ఆయనపైనే పూర్తి భారం వేయకుండా, ఒక ఎన్నికల కమిటీని నియమించి దానికి ఆయన నేతృత్వం వహించే ఏర్పాటు చేయవచ్చును. తద్వారా ఒకవేళ వచ్చేఎన్నికలలో పార్టీ ఓడిపోయినా అందుకు ఆయన పూర్తి బాధ్యత వహించనవసరం లేకుండా ఎటువంటి అపఖ్యాతి కలగకుండా తప్పుకోవచ్చును. ఒకవేళ గెలిస్తే మాత్రం ఆ ఖ్యాతి యావత్తు ఆయన ఖాతాలోనే జమా చేయబడుతుంది గనుక, అప్పుడు ఆయనను ప్రధానిగా ప్రతిపాదించడం, ప్రధాని కుర్చీలో ప్రతిష్టించడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాబోదు.   ఇక కాంగ్రెస్ వెనుకంజ వేయడానికి మరో కారణం ఏమిటంటే, ఒకవేళ అతనిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, రేపటి నుండే నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు మూకుమ్మడిగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని దాడి తీవ్రతరం చేస్తే, అప్పుడు యావత్ దేశ ప్రజలంరూ కూడా రాహుల్ గాంధీ వారినందరినీ ఏవిధంగా ఎదుర్కొని నెగ్గుకొస్తారని చూస్తారు. అంతేగాక మొట్ట మొదటిసారిగా ఇద్దరు ప్రధాని అభ్యర్ధులు ఒకరితో మరొకరు డ్డీకొంటునప్పుడు ప్రజలు వారిద్దరి బలాబలాలను, శక్తి సామర్ధ్యాలను, తెలివితేటలను, వివిధ అంశాలపై వారికున్న అవగాహనను బేరీజు వేసుకొని చూడటం మొదలుపెడతారు. అదే జరిగితే, ప్రజల తూకంలో రాహుల్ గాంధీ తేలిపోవడం ఖాయం. అది నేరుగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపితే విజయావకాశాలు మరింత సన్నగిల్లుతాయి. ఇప్పటికే వరుస ఓటములతో తీరని అపఖ్యాతి మూటగట్టుకొన్న రాహుల్ గాంధీపై మరింత ఒత్తిడి పెరిగితే, ఎన్నికలకు ముందే ఓటమి ఖాయమయిపోతుంది. అందుకే రాహుల్ గాంధీకి పూర్తి బాధ్యత అప్పగిస్తూనే, ఆయనపై ఈగ కూడా వాలకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతోంది.   సర్వోనతమయిన ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నరాహుల్ గాంధీ అందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకొనే ప్రయత్నంలో పోరాడి ఓడిపోయినా గౌరవంగా ఉండేది. ఆయన తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొని, పార్టీని గెలిపించుకొని ప్రధాని పదవి చెప్పటినా హుందాగా ఉండేది. కానీ ఈవిధంగా కర్ర విరగకుండా, పాము చావకుండా లోపాయికారిగా ప్రధాని పదవి చేపడితే దానివల్ల ఆయనకు పదవి వస్తుందేమో కానీ గౌరవం మాత్రం రాదు.  

పదవి విషం వంటిది! కానీ పుచ్చుకోక తప్పదు: రాహుల్

  కాంగ్రెస్ అధిష్టానం ప్రధాని మన్మోహన్ సింగ్ చేత వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటన చేయించడం పూర్తయింది. ఇక ఇంతకాలం వైరాగ్యం ప్రదర్శించిన రాహుల్ యువరాజవారు కూడా “క్రమశిక్షణ గల కార్యకర్తగా తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని” పద్ధతి ప్రకారం చెప్పవలసిన ఆ నాలుగు ముక్కలు కూడా చెప్పేసి తన కాంగ్రెస్ భక్త కోటిని సంతోషబెట్టారు. అందువల్ల ఇక యువరాజవారికి శాస్త్రోక్తంగా పట్టాభిషేక మహోత్సవం జరుపవలసి ఉంది. అందుకు (కాంగ్రెస్) పెద్దలు జనవరి17 సుమూహూర్తంగా నిశ్చయించారు. గనుక ఇక సోనియా రాహుల్ నామ స్మరణతోనే జీవితాలను పునీతం చేసుకొంటున్న కాంగ్రెస్ భక్తకోటి, ఆ వేడుకను చూసి తరించేందుకు మరో మూడు యుగాలు (రోజులు) ఓపిక పట్టక తప్పదు.   రాహుల్ గాంధీ తన అంగీకారం తెలిపేటప్పుడు దేశ ప్రజలెవరికీ తెలియని కొన్ని గొప్ప సత్యాలు కూడా తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. 'తమ వంశంలో ఎవరికీ కూడా అధికార లాలస అనేది లేనేలేదని, కానీ ఏదో అలా జరిగిపోతోంది అంతే'నని శలవిచ్చారు. తనకి కూడా ప్రధాన మంత్రి పదవి విషంతో సమానమని కానీ, అలనాడు ఆ గరళకంటుడు (శివుడు) ప్రజలను రక్షించేందుకు హాలహలం త్రాగినట్లే తాను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈ హాలాహలం (ప్రధాన మంత్రి పదవి)పుచ్చుకొనేందుకు సిద్దపడుతున్నానని శలవిచ్చారు. ఆయన ఈ మాట చెప్పకపోయినా ‘కాంగ్రెస్ అంటేనే త్యాగాల పుట్ట’ అని జనాలందరికీ తెలుసు గనుక తన కోసమే మన్మోహన్ సింగ్ ను బలవంతంగా కుర్చీలో నుండి దింపేసినట్లు ఫీలయిపోతూ ఆయన ఇంతగా సంజాయిషీ ఇవ్వనవసరం లేదు. ప్రజలు ఆ మాత్రం అర్ధం చేసుకోగలరు. ఇక ఇంతకాలం తన ప్రధాని పదవీ వైరాగ్యం చూసి తానేదో అందుకు పనికిరానని ఎవరూ అనుకోవద్దని బీజేపీకి సూచించారు. ఈవిషయం గట్టిగా నొక్కి చెప్పడం మాత్రం చాలా అవసరమే. ఎందుకంటే, ఆయన వైరాగ్యానికి ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తప్పుగా అర్ధం చేసుకొని ఎవరికీ తోచిన, అనువయిన భాష్యాలు వారు చెప్పుకొంటున్నారు.   ఆయన ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొనేందుకు ఇప్పటికయినా దైర్యం చేసి ముందుకు రావడమే కాకుండా, అందుకు తను అన్ని విధాల తగిన వాడినని గుండెల మీద చెయ్యి వేసుకొని తనంతట తాను చెప్పుకోవడం చూసి కాంగ్రెస్ జనాల కళ్ళు ఆనందంతో చమర్చిఉంటాయి. అయితే, పట్టాభిషేకం వరకు అంతా కాంగ్రెస్ చేతిలో పనే గనుక ఎటువంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా జరిగిపోవచ్చును. కానీ తన నేతృత్వంలో ఇంతవరకు ఏడు రాష్ట్రాలలో వరుస పరాజయాలు స్వంతం చేసుకొని ఒక అరుదయిన రికార్డు స్వంతం చేసుకొన్నరాహుల్ గాంధీ, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తన రికార్డులు తానే బ్రద్దలు కొడతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి తను కూడా ప్రధాని కుర్చీలో పడతారా? అనేది కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి.   ఒకవేళ అదృష్టవశాతు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయన సింహాసనం అధిష్టిస్తే, ఆయన ఎలాగూ ‘కాంగ్రెసేతర అవినీతి’ని కడిగిపారేసేందుకు సంకల్పం చెప్పుకొన్నారు గనుక ఇక దేశానికి మంచి రోజులు వస్తాయని ఎదురుచూడవచ్చును. ఒకవేళ నరేంద్ర మోడీ యువరాజవారి కోసమే కేటాయింపబడ్డ ప్రధాని కుర్చీని కాంగ్రెస్ చేతిలోనుండి బలవంతంగా లాకొంటే, ఆయన కూడా అభివృద్ధి మంత్రం గట్టిగా పటిస్తున్నారు గనుక దేశానికి డోకా ఉండదు. అందువలన కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకున్న ప్రజలందరూ ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని ఎవరి బాషలో వారు హాయిగా పాడుకోవచ్చును.

రాహుల్ పట్టాభిషేకంతో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తునట్లేనా

  ఈనెల 17న ఢిల్లీలోని తోల్‌కతోరా స్టేడియంలో ఏఐసిసి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశ ప్రధాన అజెండా బహుశః రాహుల్ గాంధీకి పట్టాభిషేకం, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఆయన పేరును ప్రకటించడమే కావచ్చును. అదే జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తన 125సం.ల చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఎన్నికలకు ముందు తన ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తున్నట్లవుతుంది. కాంగ్రెస్ తన సాంప్రదాయాన్ని పక్కనబెట్టి రాహుల్ గాంధీ పేరు ప్రకటించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని చూసి ఎంతగా భయపడుతోందో స్వయంగా చాటి చెప్పినట్లవుతుంది. అంతేగాక ఇంకా ఎన్నికల గంట కూడా మ్రోగక మునుపే, మోడీ చేతిలో సగం ఓటమిని అంగీకరించినట్లేనని భావించవచ్చును.   కానీ, ఇటువంటి ఆరోపణల నుండి బయటపడేందుకు కాంగ్రెస్ వద్ద చాలా ఉపాయాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సోనియా, రాహుల్ భజన సంఘాలు తమ అమ్మగారి మనసులో ఆలోచనలు కనిపెట్టేయో లేక అమ్మని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలోనో రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించమని కోరుతూ ఇప్పటికే అధిష్టానానికి కోకొల్లలుగా ఉత్తరాలు, ఈ-మెయిల్స్ గుప్పిస్తున్నారు. అందువల్ల తాము మోడీని చూసి భయపడుతున్నట్లు కాక తమ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తున్నామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, రాహుల్ మోడీకి సమ ఉజ్జీయేనా కాదా అనేది కాంగ్రెస్ నేతలే చెప్పాలి. గాంధీ-నెహ్రూ వారసత్వం తప్ప వేరే ఏ ప్రత్యేకత లేని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ, తన మంద బలంతో దేశ ప్రజల మీద రుద్దాలని ప్రయత్నిస్తే, బహుశః అది కూడా మోడీకి లబ్ది చేకూర్చే అంశంగా మారవచ్చును.   ఈ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో బాటు, ఆయన సోదరి ప్రియాంక వాద్రాకు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టాభిషేకం జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టిన తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని ఎలాగు భావిస్తున్నారు గనుక, తన స్థానంలో తన కూతురినే కూర్చోబెడితే రాహుల్ గాంధీకి ఆమె అన్ని విధాల అండగా నిలబడతారు. రాహుల్ గాంధీ తను నేతృత్వం వహించిన ప్రతీ ఎన్నికలలో పరాజయమే తప్ప పార్టీకి పట్టం కట్టిన సందర్భం ఒక్కటీ లేనందున, కీలకమయిన వచ్చేసార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై భారం వేసి రిస్క్ తీసుకోలేదు. గనుక ప్రియాంకాకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టం కట్టి, రానున్నఎన్నికలలో యువరాజవారికి తోడుగా పంపినా ఆశ్చర్యం లేదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపోటముల సంగతి ఎలా ఉన్నపటికీ, ఈ సమావేశంలో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసినట్లయితే, అది కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తూ ఇస్తున్న ప్రధమ సంకేతంగా భావించవచ్చును.

తెలంగాణా బిల్లులో అంతిమ ఘట్టమే కీలకం

  ఎట్టకేలకు శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై కొంత అర్ధవంతమయిన చర్చమొదలయ్యే సమయానికి, పండగ సందర్భంగా సభ జనవరి17కి వాయిదాపడింది. వచ్చే సమావేశాల తరువాత బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పి పంపవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లుని అడ్డుకొని తీరుతానని పదేపదే చెపుతునందున, ఆయన తన సహచర మంత్రులతో కలిసి బిల్లుపై తీవ్రంగా వాదించినపుడు, ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా వారందరినీ ఎదుర్కోవచ్చును. గనుక ఈసారి సమావేశాలు మరింత ఉద్రిక్త వాతావరణంలో సాగవచ్చును. అందువల్ల బిల్లుపై అర్ధవంతమయిన చర్చకంటే సభలో వాయిదాలపర్వమే ఎక్కువ కొనసాగవచ్చును.   సభలో బిల్లుపై ఎంత లోతుగా చర్చ జరిగితే అన్ని అభ్యంతరాలు, లోపాలు బయటపడే అవకాశం ఉంది. అదే జరిగితే, బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళినప్పుడు వాటిపై ఆయన వివరణ, సవరణలు కోరినట్లయితే బిల్లుని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రవేశ పెట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చుగనుక ఈసారి తెలంగాణావాదులు కూడా చర్చకు అడ్డుతగులుతూ, సభను స్తంభింపజేయవచ్చు. ఇంతకాలం బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్న వైకాపా వచ్చే సమావేశాలలో కూడా పాల్గొనకపోయినట్లయితే, ఆ పార్టీ చేస్తున్నసమైక్యవాదం భూటకమని స్పష్టం అవుతుంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి “తాను కేవలం సమైక్యనినాదం చేయదలచుకోలేదని, తన విధానమే సమైక్యవాదమని” పరోక్షంగా వైకాపాను దెప్పి పొడుస్తున్నారు.   అయితే, బిల్లుపై సభలో అర్ధవంతమయిన చర్చ జరిగినా జరగకున్నాదానిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేదు గనుక, బిల్లుపై శాసనసభ సభ్యులందరూ లికిత పూర్వకంగా ప్రతిపాదిస్తున్నవివిధ సవరణలే కీలకం కానున్నాయి. సవరణలు ప్రతిపాదించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొదట జనవరి10 గడువు విదించినప్పటికీ, అదనంగా మరో రెండు రోజులు సమయం ఇచ్చారు. ఇంతవరకు టీ-కాంగ్రెస్, తెరాస, ఇతర తెలంగాణా సభ్యులు అందరూ కలిసి స్పీకర్ కు సవరణ ప్రతిపాదనలు అందజేశారు. మజ్లిస్ సభ్యులు 31సవరణలు అందజేయగా, సీమాంధ్రకు చెందిన 44మంది తెలుగుదేశం సభ్యులు అత్యధికంగా 492 సవరణలు ప్రతిపాదిస్తూ, అంతిమంగా తాము ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేఖిస్తున్నామని తెలియజేసారు. రాష్ట్ర విభజనను సమర్ధిస్తున్న బీజేపీ మరియు సీపీఐ పార్టీలు కూడా కొన్ని సవరణలను సమర్పించాయి. లోక్‌సత్తా కూడా కొన్ని సవరణలను ప్రతిపాదించింది.   రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న వైకాపా బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తాము బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పీకర్‌కు ఒక లేఖ వ్రాసింది. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత బిల్లులో ప్రతీ క్లాజుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బిల్లును పూర్తిగా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపాదించవచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు చేయబోయే సవరణలకు అధనంగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున లేదా ముఖ్యమంత్రి హోదాలో బిల్లులో లోపాలను ఎత్తి చూపుతూ లోప భూయిష్టమయిన ఆ బిల్లును మొత్తంగా తిరస్కరిస్తున్నట్లు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   రాష్ట్రపతి రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తే బిల్లుపై తనకు వచ్చిన అన్నిసవరణలు, అభిప్రాయాలపై కేంద్రం నుండి సంజాయిషీ కోరవచ్చును. అందువల్ల ఆయన వద్ద కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా, కేంద్రం రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తానని చాలా గట్టిగా చెపుతున్నపటికీ, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు పొందడం అనుమానాస్పదంగా ఉన్నందున, తెలంగాణాలో తను తక్కువ నష్టంతో బయటపడేందుకు సిద్దపడితే, ఈవంకతో బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కి పెట్టించి, ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చును. లేకుంటే, ఆయన మాట ప్రకారం మోక్కుబడిగా కొన్ని సవరణలు, హామీలు ఇచ్చి బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చును. అందువల్ల బిల్లు డిల్లీకి చేరుకోగానే మరో సరికొత్త అధ్యాయం, జాతీయ పార్టీల మధ్య డ్రామా మొదలవనుంది.

జగన్ ఐడియా మళ్ళీ బెడిసి కొట్టిందా?

  జగన్మోహన్ రెడ్డి తీసుకొన్నదుందుడుకు నిర్ణయాల వలన వైకాపాకు చాలాసార్లు భంగపాటు ఎదురయింది. అయినా కూడా అతని ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయనిదే బిల్లుపై చర్చ జరగనీయకూడదని జగన్ తీసుకొన్ననిర్ణయం కూడా ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది. బిల్లుపై చర్చలో పాల్గొంటే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైకాపా కనిపెట్టిన సిద్ధాంతాన్నిఖండిస్తూ చర్చలో పాల్గొనని వారే విభజన కోరుకొంటున్నట్లేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సిద్దాంతం ప్రతిపాదించారు. దానిని తన మరో అనుచరుడు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు చేత ద్రువీకరింపజేయడమే కాకుండా, ఆయన ద్వారా బిల్లుపై చర్చకు అడ్డుతగిలేవారికి ఉద్యోగులు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరికలు కూడా జారీ చేయించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలనీ బిల్లుపై చర్చజరగాలని కోరుకొంటుంటే, ఒక్క వైకాపా మాత్రం చర్చకు సిద్దపడకపోవడంతో రాజకీయంగా ఒంటరయిపోయింది.   నిజానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్నవైకాపా, బిల్లుపై చర్చలో పాల్గొని, బిల్లుపై లోపాలను ఎత్తి చూపి, రాష్ట్ర విభజనను తమ పార్టీ ఎందువల్ల వ్యతిరేఖిస్తోందో తెలియజేసి ఉంటే అది సహజంగా ఉండేది. కానీ, సమైక్య తీర్మానం చేయాలనే ఒక వెర్రివాదనతో సభలో బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా త్రిప్పి పంపేందుకు సహకరిస్తూ, సమైక్యవాదం ముసుగులో విభజన కోసం కృషి చేస్తున్నట్లు బట్టబయలయింది.   ఇంతకాలం చల్లగా కూర్చొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు అందరూ కలిసి సభను తమ అధీనంలోకి తెచ్చుకొని, ఉభయసభలలో వైకాపాను దోషిగా నిలబెట్టి బహిష్కరించడం, ఆ వెంటనే సభలో బిల్లుపై చర్చ మొదలుపెట్టి దానికి వ్యతిరేఖంగా వాదనలు వినిపించడం ద్వారా కేవలం తాము మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లు ఒక భావనను ప్రజలలో కలిగించగలిగారు. ఉభయసభలలో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ వాదనలు జరుగుతున్నసమయంలో వైకాపా సభలో లేకుండా చేసి, వైకాపా చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని బయటపడిందనే భావన కలిగించగలిగారు. ఊహించని ఈ ఎత్తుకి కంగు తిన్న వైకాపా, సభలోనే ఉన్న తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ద్వారా తాము బిల్లుపై చర్చకు వ్యతిరేఖం కాదని సంజాయిషీ ఇప్పించుకోవలసి వచ్చింది. బహుశః వైకాపా సభ్యులు ఇక సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టకుండా, రేపటి నుండి వారు కూడా బిల్లుపై చర్చలో పాల్గొని, టీ-కాంగ్రెస్, తెరాసలను బలంగా డ్డీ కొంటూ తద్వారా సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపాల కంటే తామే గట్టిగా పోరాడుతున్నామనే భావన కలిగించేందుకు తిప్పలు పడవచ్చును.   ఇప్పటికయినా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నసీనియర్ రాజకీయ నాయకులను సంప్రదించుతూ వారి సలహాల ప్రకారం నడుచుకొంటే, ఇక ముందయినా ఇటువంటి భంగపాటు ఎదురు కాకుండా తప్పించుకోవచ్చును. లేకుంటే వైకాపా నేతలకు ఇటువంటి పరాభావాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

ప్రతిపక్షాలను ఉచ్చులోకి లాగుతున్న కిరణ్

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన బిల్లుపై అన్ని పార్టీలు చర్చకు రావాలని కోరారు. మొదటి నుండి గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నఆయన ఇంతవరకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు తానేమి చేసారో, చేయబోతున్నారో చెప్పకుండా, “నా ప్రతాపం సభలో చూద్దురుగాని” అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసి, వైకాపా, తెదేపాల వైఖరి ఏమిటో తెలియజేయాలని కాంగ్రెస్ మార్క్ తెలివితేటలు ప్రదర్శించారు. తమది జాతీయ పార్టీ గనుక అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని, కానీ ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలు ఎవరినీ సంప్రదించనవసరం లేదు గనుక ఏ నిర్ణయమయినా తీసుకోగలవని ఒక గొప్ప ‘లా పాయింటు’ కూడా చెప్పారు. అందువల్ల తాము రాష్ట్ర విభజనకు అనుకూలమో వ్యతిరేఖమో సభలో తేల్చి చెప్పాలని ఆయన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలను కోరారు.   బిల్లుపై చర్చలోపాల్గొంటే అది విభజనకు అంగీకరించినట్లేనన్నవాదనను ఆయన త్రోసిపుచ్చుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గొంతు చించుకొని అరిచేబదులు, బిల్లుపై చర్చలో పాల్గొని దానిని గట్టిగా వ్యతిరేఖిస్తే ప్రయోజనం ఉంటుందని వైకాపాను ఉద్దేశ్యించి ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తానని రచ్చబండపై నిలబడి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభకు బిల్లు వచ్చిఅప్పుడే నెలరోజులయిపోయినప్పటికీ ఇంతవరకు దానిపై ఒక్క ముక్క మాట్లాడింది లేదు. మరో పదిరోజుల్లో బిల్లు రాష్ట్రపతికి త్రిప్పి పంపబడుతుందని తెలిసి ఉన్నపటికీ కనీసం ఇంతవరకు దానిపై సభలో చర్చమొదలయ్యేలా కూడా చేయలేకపోయారు.   తను చేస్తానని చెప్పిన పని చేయకుండా, తాపీగా మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్షాలను నిందిస్తున్నారు. కానీ, బిల్లుపై చర్చజరగకపోవడానికి ప్రతిపక్షాలనే కాదు ఆయననీ, కాంగ్రెస్ పార్టీనీ, కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. ఇంతవరకు ప్రతిపక్షాలు ఏవిధంగా ఈ నిందను తమ ప్రత్యర్దులపైకి నెట్టి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయో, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే చేసారు. ఆయన ఇంతవరకు బిల్లుపై తన వాదనలు వినిపించకపోయినా, ప్రతిపక్షాలు చర్చలో పాల్గొని తమ వైఖరి స్పష్టం చేయాలని కోరడం కేవలం ఆ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును. బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా రాష్ట్రపతికి తిరిగి వెళ్ళిపోతే, అప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ‘సభలో బిల్లును అడ్డుకొంటానని ప్రగల్భాలు పలికి కనీసం చర్చ కూడా మొదలవకుండా ఎందుకు త్రిప్పి పంపారని’ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తనని నిలదీయస్తారనే ఆలోచనతోనే ముందు జాగ్రతగా కిరణ్ కుమార్ రెడ్డి ఈవిధంగా మాట్లాడుతున్నారు.   నిజానికి ఆయన మొదటి నుండి కూడా రాష్ట్ర విభజన వ్యవహారంలో అధిష్టానానికి పరోక్షంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తన పార్టీ సభ్యులతో కలిసి బిల్లుపై చర్చ జరగనీయకుండా అదే విధంగా సహకరిస్తున్నారు. అందుకే సభలో వాదనలు చేసే బదులు, జనవరి23వ తేదీ తరువాత తదుపరి కార్యాచరణ గురించి కూడా మాట్లాడుతున్నారు.

ప్రియాంక గాంధీ చేతికి కాంగ్రెస్ పగ్గాలు!

  రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ మానసికంగా ఎన్నడో సిద్దమయింది. ఇటీవల ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటనను రాహుల్ గాంధీ పట్టాభిషేక ప్రకటనగా భావించవచ్చును. ఈ నెల 17 నుండి మొదలయ్యే ఏఐసీసీ సమావేశాలలో శాస్త్రోక్తంగా రాహుల్ యువరాజవారి పట్టాభిషేకం కూడా జరిగిపోవచ్చును.   కానీ, ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ ఆ పదవి చెప్పటేందుకు తాను అన్నివిధాల సమర్దుడనని నిరూపించుకోలేకపోయారు. నరేంద్ర మోడీ వరుసగా మూడుసార్లు గుజరాత్ రాష్ట్రంలో ఘన విజయం సాధించి, ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడితే, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం పాలయిన తరువాత కూడా ఆయనే పార్టీలో అందరి కంటే అత్యత్తమ ప్రధాని అభ్యర్ధిగా కనబడటం ఆ పార్టీ దురదృష్టమేనని చెప్పకతప్పదు. అదే అయన స్థానంలో వేరేవరయినా ఉండి, పార్టీకి ఇంత ఘోరపరాజయం కలిగించి ఉంటే, ఆ వ్యక్తికి వెంటనే ఉద్వాసన అయిపోయేది. కానీ, పార్టీలో వేరేవరికే లేని ప్రత్యేక అర్హత కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది గనుక, ఆ ప్రత్యేక అర్హతతోనే ఆయన తను ప్రధాని పదవికి అన్ని విధాల అర్హుడనని భావిస్తున్నారు.   అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంత దైర్యం చేసి ఆయన శల్యసారధ్యానికి అంగీకరిస్తున్నప్పటికీ, ఆయన సారధ్యంలో వచ్చే ఎన్నికలలో గెలవగమనే భ్రమలలో మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీలా తన స్వశక్తితో ప్రధానమంత్రి అవగలరని ఎవరికీ నమ్మకం లేదు. అటువంటప్పుడు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేప్పట్టి వచ్చే ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టగలడని ఎవరూ ఆశించరు. అందువల్ల ఆయనను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆయన సోదరి ప్రియాంకా వాద్రను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావచ్చని ఊహించినట్లుగానే ఆమె ఈ రోజు రంగప్రవేశం చేసారు.   ఆమె పార్టీలో ఎటువంటి ప్రత్యేక పదవి నిర్వహించకపోయినప్పటికీ, ఆమె ఈరోజు తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవడం విశేషం. కేవలం రాహుల్ గాంధీ పట్టాభిషేక మహోత్సవానికి అవసరమయిన ఏర్పాట్ల కోసమే అయితే, ఆమె కలుగజేసుకోనవసరం లేదు. కానీ, పార్టీ ముఖ్యనేతలతో సమావేశంవడం గమనిస్తే, త్వరలో ఆమె కూడా తన తల్లి సోనియాగాంధీ స్థానంలో పార్టీ అధ్యక్షురాలిగా పట్టాభిషేకం చేసుకొనేందుకు సిద్దం అవుతున్నారేమోనని భావించక తప్పదు.   జేసి దివాకర్ రెడ్డో మరొకరో సోనియాగాంధీ ఆరోగ్యం బాగోనందున పదవి నుండి తప్పుకొని వేరొకరికి బాధ్యతలు అప్పగించమని సూచిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన క్రిందకు వస్తుంది. కానీ, ఇప్పుడు అవే కారణాలతో ప్రియాంకా గాంధీకి పార్టీ బాధ్యతలు స్వీకరించినట్లయితే, పార్టీలో ఎవరికీ ఎవరూ సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు, ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కూడా.   ఇక రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో సోనియాగాంధీ బాధ్యతా తీరిపోదు. ఆ కుర్చీలో ఆయనను కూర్చోబెట్టవలసిన బాధ్యతా కూడా ఆమెదే. నరేంద్ర మోడీ ప్రవేశంతో దేశ రాజకీయాలలో వచ్చిన మార్పులతో, కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నతరుణంలో రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని శాసించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ పోరాటం వంటివేనని చెప్పక తప్పదు. వాటిని ఎదుర్కోవాలంటే పార్టీకి మరింత సమర్ధమయిన నాయకత్వం చాలా అవసరం. అందువల్ల త్వరలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక మునుపే, ప్రియంకా వాద్రను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నట్లు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. నిజానికి రాహుల్ గాంధీ ప్రధాని కుర్చీలో కూర్చో బెట్టాలంటే ఇంతకంటే మంచి ఉపాయం ఉండదు కూడా.

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించతరమా

  రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు అడ్డుకొంటానని చెపుతూ, ఇంత కాలం కాలక్షేపం చేసేసిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ‘ఆ బిల్లు శాసనసభ గడపదాటేవరకు ఆగండి, రాష్ట్ర విభజనను వ్యతికిస్తూ అందరం కలిసి పోరాటం చేద్దామని’ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్రం ఇన్నినెలలుగా రాష్ట్ర విభజన ప్రక్రియ చేసుకుపోతునప్పుడు, ఆయన ఏవిధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను కట్టడి చేసేరో, ఇప్పుడు కూడా సభకు వచ్చిన బిల్లుకి ఎటువంటి ఆటంకమూ కలగకుండా కట్టడి చేస్తున్నటు స్పష్టమవుతోంది. అదేవిధంగా ఆయన మాట మీద భారం వేసి, ఆయన పెట్టబోయే కొత్త పార్టీ గురించి మాట్లాడుతున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర విభజన బిల్లు శాసనసభ గుమ్మం దాటేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టమవుతోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, యంపీలు రాష్ట్ర విభజన జరగబోతున్నసంగతి చాలా ముందుగా తెలిసి ఉన్నపటికీ, అందరూ కలిసి రాజీనామాల డ్రామాలతో ఏవిధంగా ప్రజలను మభ్యపెడుతూ తమ అధిష్టానానికి సహకరించారో, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన అనుచరులు కూడా సహకరిస్తున్నారని అర్ధం అవుతోంది.   సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీజీవోలు రెండున్నర నెలలపాటు విజయవంతంగా సమ్మె, ఉద్యమాలు చేసినప్పుడు, రాజకీయ నాయకులను నమ్ముకోవడంకంటే, వారికి నేతృత్వం వహించిన అశోక్ బాబే మేలనే భావన సీమాంధ్ర ప్రజలందరిలో ఏర్పడింది. అయితే రెండున్నర నెలల రాజకీయ నేతల సహవాసంతో, అశోక్ బాబు, అతని అనుచరులలో కూడా చాలా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశంతో కావచ్చు లేదా ఉద్యోగుల ఒత్తిడి వల్లకావచ్చు, కారణాలు ఎవయితేనేమి రెండున్నర నెలలపాటు చాలా ఉదృతంగా సాగిన ఉద్యమాలు, సమ్మెలు అన్నీకూడా స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆరిపోయినట్లు హటాత్తుగా ఆగిపోయాయి. అప్పుడు అశోక్ బాబు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విభజన బిల్లు శాసనసభకు వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ప్రకటించేసి విభజన ప్రక్రియకు ఉడతా భక్తిగా తోడ్పడ్డారు. నేటికీ ముఖ్యమంత్రి దర్శకత్వంలోనే నడుస్తూ, ఏవో మొక్కుబడిగా కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తూ ఆయన కూడా జనవరి 23కొరకు ఎదురు చూస్తున్నారు.   వీరందరూ కలిసి విభజన బిల్లుని శాసనసభ గుమ్మం వరకు సాగనంపిన తరువాత, అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా వేరొకరి నేతృత్వంలో కొత్త పార్టీ పెట్టుకొని ప్రజల ముందుకు వస్తారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కనుసన్నలలో నడుచుకొంటూ, ఆయన సహకారంతో విజయవంతంగా సమ్మెలు, ఉద్యమాలు, సభలు నిర్వహించి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన అశోక్ బాబు, మొన్న జరిగిన ఏపీఎన్జీజీవోల ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచారు గనుక, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీకి తగిన సహకారం అందించవలసి ఉంటుంది. తనకు రాజకీయాలలోకి రావాలనే ఆసక్తి ఉందని కూడా అశోక్ బాబు ఇదివరకే ప్రకటించారు గనుక ఆయన ఆ పార్టీలో చేరినా చేరవచ్చు. లేదా అవ్వ పేరే ముసలమ్మన్నట్లు తనే ఒక పార్టీని స్థాపించి రాష్ట్ర విభజనను వ్యతిరేఖించే వారు (సీమాంధ్ర కాంగ్రెస్)వారిని ఆహ్వానించవచ్చును. ఈ రెంటిలో ఏది గ్యారంటీ హిట్ అవుతుందో లెక్కలు చూసుకొన్న తరువాత కార్యాచరణకు దిగవచ్చును. రాష్ట్ర విభజనకు తెలంగాణా నేతలకంటే ఎక్కువ సహకారం అందిస్తున్న వీరందరూ, ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకొని వచ్చేఎన్నికలలో రాజకీయ లబ్ది పొందేందుకు సమైక్య(అ)జెండాతో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాటాలు మొదలుపెట్టబోతున్నారు.   ఇదంతా కలిపిచూసినట్లయితే, రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖతను ఎదుర్కొంటూ రాష్ట్రంలో పార్టీని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత పకడ్బందీ వ్యూహం పన్నిందో అర్ధమవుతోంది. దాని అంతిమ లక్ష్యం రాష్ట్రంలో పార్టీని కాపాడుకొంటూ తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొని తిరిగి అధికారంలోకి రావడం. అందుకు అవసరమయితే ఎన్ని కొత్త(పార్టీలు) వేషాలయినా వేస్తుంది.

అమాద్మీ అత్యుత్సాహం

  డిల్లీలో ఆమాద్మీ పార్టీ అపూర్వ ప్రజాదారణతో ఘన విజయం సాధించి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో డిల్లీ ప్రభుత్వ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఏర్పాటు జరిగిన వారం రోజులలోనే ఆమాద్మీపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రెండు ప్రధాన హామీలయిన ఉచిత నీరు సరఫరా మరియు విద్యుత్ ధరలు సగానికి తగ్గించడంతో చేయడంతో దేశవ్యాప్తంగా ఆమాద్మీ పార్టీ గురించి చర్చజరుగుతోంది. ఈ వేడిలోనే దేశంలో అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించి, వచ్చే ఎన్నికలలో వీలయినన్ని ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని పార్టీ నిర్ణయించుకొంది. రాష్ట్రంలో తెలంగాణాలో కొన్నిజిల్లాలలో, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలలో కూడా అమాద్మీ శాఖలు తెరుచుకొంటున్నాయి.   కానీ, డిల్లీ వంటి మెట్రోనగరంలో ఉండే పరిస్థితులకి, రాష్ట్రంలో రాజకీయ, సామాజిక పరిస్థితులకీ చాలా తేడా ఉంది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా, తెరాస పార్టీలు ఆర్ధికంగా, రాజకీయంగా, క్యాడర్ పరంగా కూడా చాలా బలంగా ఉన్నాయి. వాటిని జాతీయ పార్టీలయిన బీజేపీ, లెఫ్ట్ పార్టీలే డీకొనలేక వాటితో పొత్తులు పెట్టుకోక తప్పనిసరి పరిస్థితులున్నప్పుడు, ఎన్నికలకి ఇంకా కేవలం మూడు నాలుగు నెలలే మిగిలి ఉన్నఈ సమయంలో ఆమాద్మీ వచ్చి నిలద్రోక్కుకొని, ఈ రాజకీయ దిగ్గజాలను డ్డీకొని గెలవగలదా? అంటే అనుమానమే.   డబ్బు, మద్యం, కుల సమీకరణల నేపధ్యంలోసాగే ఎన్నికలలో కేవలం నీతి, నిజాయితీలనే తన ఆయుధాలుగా చేసుకొని అమాద్మీ గెలవగలదా? అని తెలుగు ఆమాద్మీ (సామన్యుడు) కూడా సందేహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక తెదేపా, తెరాస, వైకాపాలకు జీవన్మరణ పోరాటంగా సాగనున్న ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఆమాద్మీ పార్టీ లేగదూడ వంటిదని చెప్పక తప్పదు.   గత ఎన్నికలలో లోక్ సత్తాపార్టీ కూడా ఇంచుమించు అమాద్మీ సిద్ధాంతాలతోనే పోటీ చేస్తే, ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తప్ప మరెవరూ గెలవలేకపోయారు. ఇక భారీ అంచనాలతో, భారీ స్థాయిలో, భారీ ప్రజామద్దతుతో రంగ ప్రవేశం చేసిన చిరంజీవి కూడా నిరుడు ఎన్నికలలో బోర్లా పడ్డారు. లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు రెండూ కలిసి తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చి దాని విజయానికి గండి కొట్టగలిగాయి. ఇప్పుడు అమాద్మీ కూడా తెదేపా, వైకాపా ఓట్లకు గండి కొట్టడం తప్ప పెద్దగా ఏమీ సాధించలేకపోవచ్చును.   రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని, జవాబుదారీ విధానాన్ని తీసుకు వచ్చి దేశంలో అవినీతిని రూపుమాపాలని అమాద్మీ భావించడంలో తప్పులేదు. కానీ, వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో ఉన్న వైవిధ్యతను అర్ధం చేసుకోకుండా, తన శక్తిని అతిగా ఊహించుకొని భంగపడే కంటే, ముందుగా డిల్లీలో తన సామర్ద్యం నిరూపించుకొంటే ప్రజలే పిలిచి పట్టం కడతారు. "ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపడానికే తాము రంగ ప్రవేశం చేసాము తప్ప పదవులు, అధికారం పొందడమో, డబ్బు సంపాదించడమో ఆమాద్మీ ఉద్దేశ్యం కాదని" ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. అందువల్ల అమాద్మీ అసలు సిసలయిన ప్రభుత్వం ఏవిధంగా ఉండాలనే విషయాన్ని తన డిల్లీ ప్రభుత్వం ద్వారా ఆచరణలో చేసి చూపితే, దానికి వస్తున్నవిశేష ప్రజా స్పందన చూసి, కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ తీరు మార్చుకొనేలా చేయగలిగితే అదే నిజమయిన విజయమవుతుంది తప్ప ఎన్ని యంపీ సీట్లకు పోటీ చేసామనేది ముఖ్యం కాదు.   రాత్రికి రాత్రి సమాజంలో, ప్రభుత్వంలో, రాజకీయ పార్టీలలో, ఇతర వ్యవస్థలలో మార్పు తీసుకు రావడం సాధ్యం కాదు. సమాజంలో చెడు అగ్నిలా విస్తరిస్తే, మంచి అనేది నీళ్ళలా మెల్లగా విస్తరించగలదు. కానీ, అగ్ని ప్రభావం ఎంత ఎక్కువో అంత త్వరగానే చల్లారిపోతుంది. కానీ నీరు తనకి దారి దొరుకుతున్నంత సేపు ఆ దిశలో ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆమాద్మీ కూడా ముందు డిల్లీలో నిలద్రోక్కుకొని, క్రమంగా దేశమంతా విస్తరించే ప్రయత్నం చేస్తే సత్ఫలితం పొందగలదు. వచ్చేఎన్నికలలో అమాద్మీ దేశమంతటా పోటీ చేసినా ఏవో కొన్ని సీట్లు గెలుచుకోగలదు తప్ప, డిల్లీలోలాగ తొలి ప్రయత్నంలోనే విజయడంకా మొగించలేదు.

చిరంజీవి విందులో కుండలు బ్రద్దలు

  సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాజీవి కావచ్చును కానీ రాజకీయాలలో, అదీ కాంగ్రెస్ రాజకీయాలలో చాలా అల్పజీవని చెప్పకతప్పదు. ఎన్నోకలలతో స్థాపించిన తన ప్రజారాజ్యాన్నికాంగ్రెస్ కండువా కప్పేసి అధికారిక రాజ లాంఛనాలతో చాలా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి తను, తన అనుచరులు పుచ్చుకొన్న మంత్రి పదవులు అన్నీకూడా ఏడాది తిరగకుండానే ఊడుతున్నాయి. పైగా వారిలో గంటావారు బొత్సావారితో కయ్యం అందుకోవడంతో త్వరలో షోకాజ్ నోటీసులతో గంటావారిని ఘనంగా సన్మానించి పార్టీ నుండి వీడ్కోలు పలికేందుకు రంగం సిద్దం అయినట్లు మీడియా వాళ్ళు చెవులు కొరుకొంటున్నారు. ఇక మెగామంత్రిగారు తన రాజ్యంలో మిగిలిన యం.యల్.ఏ.ల మొహాలు చూసి చాలా కాలమే అయ్యింది. ఏ జీవి అండా లేని వారందరూ రాష్ట్ర విభజన దెబ్బకి చెట్టుకొకరు, పుట్టకొకరు లెక్కన చెల్లా చెదురయిపోతున్నారు పాపం.   ఇటువంటి పరిస్థితుల్లో బహుశః అధిష్టానమే ఆదేశించిందో లేక తానే హనుమంతులవారిలా స్వయంగా రంగంలోకి దూకేరో తెలియదు, కానీ మెగామంత్రిగారు తన రాజ్యంలో మిగిలున్నయం.యల్.ఏ.లందరినీ తన ఇంటికి పిలిచి వారికి స్వయంగా నవరసాలు కొసరికొసారి వడ్డిస్తూ, “మీరందరూ అధిష్టానం చెప్పినట్లు బుద్ధిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కడదాకా ఉండాలని” నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. తన ఈ చిట్టచివరి కోరిక తీర్చమని వారిని ప్రాధేయపడ్డారు. వారికి తను పార్టీ టికెట్స్ ఇప్పించగల సమర్దుడనని చెప్పి చూసారు కూడా. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఆయన అమృత హస్తాలతో ఇచ్చేకాంగ్రెస్ టికెట్స్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు.   కాంగ్రెస్ టికెట్స్ పై పోటీచేయడం, అందునా మెగా మంత్రిగారి నీడలో పోటీ చేయడం అంటే రాజకీయంగా ఆత్మహత్యతో సమానమని కుండలు బ్రద్దలు కొట్టేసారు. వారిలో రామచంద్రయ్యగారు దేవాదాయశాఖా మంత్రిగా ఉన్నపటికీ, ఏనాడు ఏదేవుడి పేరు తలచుకోకపోయినా నిత్యం నూటొక్కసార్లు చిరంజీవ నామ స్మరణ చేస్తే వెయ్యి దేవుళ్ళ పెట్టు అని దృడంగా భావించేవారు. చివరికి ఆయన కూడా తన ఆరాధ్యజీవికి కమిట్ అవలేదు. ఇక మరో అనుంగు చెలికాడు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ “మీరు పార్టీలో ఉండమన్నారని మేము ఉంటే మాత్రం, మాకు పొగపెడుతున్నబొత్స మమ్మల్నిపార్టీలో ఉండనిస్తారా? అందుకే తెలుగుదేశంలో టికెట్స్ ఖరారు చేసేసుకొన్నామని కుండ బ్రద్దలు కొట్టేసారు.   మెగా రాజ్యంలో మిగిలున్నయం.యల్.ఏ.లలో ఈలి వెంకట మధు సూధన రావు (తాడేపల్లి గూడెం), గ్రంధి మోహన్ (పెద్దాపురం), కన్నబాబు (కాకినాడ రూరల్) తదితరులు కూడా తాము తెదేపాలోకో మరో దానిలోకో జంప్ అయిపోవడం ఖాయమని కుండలు బ్రద్దలు కొట్టేసారు. ఇంతమంది ఇన్నికుండలు బ్రద్దలు కొట్టిన తరువాత మెగాజీవిగారు విందు సమావేశం ఎంత ముచ్చటగా ఉంటుందో ఎవరయినా ఊహించుకోవచ్చును.   అందువల్ల ఆయన వారినందరినీ ఆపేందుకు శ్రమపడటం కంటే, తను కూడా వారితో కలిసి ఏ తెదేపాలోనో జేరిపోతే గంటావారు తన పలుకుబడితో ఆయనకీ ఒక టికెట్ ఇప్పించినా ఇప్పించగలడు. ఎంత కేంద్ర మంత్రయినా మునిగిపోయే కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో సోనియా, రాహుల్ గాంధీలను నమ్ముకొని బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం కంటే, నమ్మకస్తులయిన తన అనుచరులతో కలిసి ఆయన కూడా ఏ తెదేపాలోకో దూకేసి టికెట్ కాపాడుకొని పొరపాటున గెలిస్తే ఏదో ఒక మంత్రి పదవి సంపాదించుకోవచ్చుకదా!

టీ-బిల్లుపై చర్చలేకుండా గ్రీన్ సిగ్నల్

  కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ లబ్దికోసం రాష్ట్ర విభజనపై ఏవిధంగా వ్యవహరించినప్పటికీ, రాష్ట్రపతి బిల్లుపై చర్చకు రాష్ట్ర శాసనసభకు 40రోజులు గడువు ఇచ్చి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించారు. కానీ మన ప్రజా ప్రతినిధులు తమ పార్టీ ప్రయోజనాల కోసం సభ జరగనీయకుండా అడ్డుపడుతూ ఆయనిచ్చిన ఈ అమూల్యమయిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే కాకుండా, బిల్లులో ఉన్న అనేక లోపాలను క్షుణ్ణంగా చర్చించి, వాటికి పరిష్కారం చూపకుండా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ, వారు సభ సజావుగా జరిగేందుకు సహకరించకపోయినా, మీడియా ముందుకు వచ్చి సభలో బిల్లుపై చర్చ జరగాలని గట్టిగా కోరుకొంటునట్లు చెపుతుంటారు. అయితే అందుకు సభలో మిగిలినవారు సహకరించడం లేదని, స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఇతరులను నిందిస్తూ సభలో తాము మాత్రమే చాలా బాధ్యాతాయుతంగా వ్యవహరించినట్లు భుజాలు చరుచుకోవడం కూడా మరిచిపోరు.   మొత్తం మీద ఉభయ సభలలో రాష్ట్ర విభజన బిల్లుపై మొదటి మూడు నాలుగు రోజుల్లో చర్చ జరగడం అనుమానమే. ఆ తరువాతయినా జరుగుతుందని గ్యారంటీ ఏమీ లేదు కూడా. సమావేశాలు మొదలయిన తరువాత మారే పరిస్థితులను బట్టి, ఎప్పటికప్పుడు పార్టీలు తమ వ్యూహాలు కూడా మార్చుకొంటూ జనవరి23వరకు రోజులు దొర్లించేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉభయసభలలో ప్రజాప్రతినిధులు తమకూ, తమ పార్టీకి లబ్ది చేకూరేవిధంగా మాత్రమే వ్యవహరిస్తారు. ఒకవేళ బిల్లుపై చర్చ జరిగే పరిస్థితి ఏర్పడితే, దానిని నేతలు గంటల కొద్దీ ఉపన్యాసాలు చేసి విలువయిన ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా హరించివేస్తారు. తద్వారా అనేక కీలక అంశాలపై తమ పార్టీ అభిప్రాయాలు చెప్పకుండా తప్పించుకొనే వీలు కలుగుతుంది.   బిల్లుపై చర్చ జరిగినా, జరుగకపోయినా రాష్ట్రపతి ఇచ్చిన గడువు-జనవరి23నే శాసనసభ సమావేశాలు కూడా ముగుస్తాయి గనుక, ఆరోజున బిల్లు రాష్ట్రపతికి తిరిగి వెళ్ళిపోవడం ఖాయం. బిల్లుపై ఎటువంటి చర్చ జరుగకపోతే, దానిపై ఎటువంటి అభ్యంతరాలు కూడా ఉండవు గనుక, దానిపై రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి కేంద్ర క్యాబినెట్ కు పంపేస్తారు.   రాష్ట్ర శాసనసభలో టీ-బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా చేసి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయడానికి బహుశః కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రి మరియు టీ-కాంగ్రెస్ నేతల ద్వారా సభలో ఈ గందరగోళ పరిస్థితులు సృష్టించి కధనడిపించి ఉన్నాఆశ్చర్యం లేదు. బహుశః అందుకేనెమో కాంగ్రెస్ అధిష్టానం అసలు ఈ బిల్లు గురించి ఈమధ్య కాలంలో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా చాలా ధీమాగా వేరే వ్యవహారాలలో తలమునకలయి ఉంది. ఇక్కడ రాష్ట్రంలో టీ-బిల్లు కధ ఏవిధంగా ముగియబోతోందో దాదాపు స్పష్టమయింది. ఇక పార్లమెంటుకి చేరుకొన్న తరువాత కొత్త డ్రామా మొదలవుతుంది. దాని గురించి మాట్లాడుకొనేందుకు ఇంకా చాలా సమయం ఉంది.

మా ప్రేమను కోపంగానో..మా ప్రేమను ద్వేషంగానో..ఫీల్ అవర్ లవ్

  వచ్చేఎన్నికలలో అదృష్టవశాత్తు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా పట్టాభిషేకం చేసేసి, ఆయన ఆ కుర్చీలో కాలుమీద కాలేసుకొని టీవిగా కూర్చొంటే చూసి తరించాలని యావత్ కాంగ్రెస్ భక్త కోటి ఒకటే ఆరాటపడిపోతోంది. స్వచ్చమయిన కాంగ్రెస్ డీ.యన్.యే.గల ప్రతీ కాంగ్రెస్ వాది కూడా తమ యువరాజావారికి ప్రధాని కాగల అన్నిఅర్హతలు ఉన్నాయని ఏకగ్రీవంగా కన్ఫర్మ్ చేసేసారు కూడా.   కానీ, నగదు బదిలీ పధకం ద్వారా నెలనెలా పదో పాతికో రూపాయలు తీసుకొంటున్నామనే విశ్వాసం కూడా లేని చాలా మంది జనాలు మాత్రం ఆ కాంగ్రెస్ వాదుల అభిప్రాయాలతో ఏకీభవించక పోవడం చాలా విచారకరం. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడో కాదో చెప్పడానికి వారేమయినా మొయిలీ, షిండే, గులాం, దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబాల్, మనీష్ తివారీల కంటే తెలివయినవారా? అంటే అదీ కాదు. జస్ట్ ఆమాద్మీలు అంతే! అయినా కూడా మాకు ఓ బ్రెయిను, దానికో అభిప్రాయం ఉంటుందని ఒకటే విర్రవీగుతున్నారు. ఆ అహంకారంతోనే యువరాజవారు, రాజమాత స్వయంగా తరలివచ్చి జనాలకి ఎంత నచ్చజెప్పినా వినకుండా నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని చీపురుపట్టుకొని ఊడ్చిపారేసారు.   ఇప్పుడు ఆ పెద్దాయన మన్మమోహనులవారు వయసు మీద పడటంతో ప్రధాని కుర్చీలో నిలకడగా కూర్చోలేకపోతున్నారని జాలిపడి, ఈ కాంగ్రెస్ భక్తుల మాట కాదనలేక పోనీ ఆ కుర్చీలో కూర్చొనేందుకు యువరాజవారు దయతో అంగీకరిస్తే, అందుకు ఈ జనాలు సంతోషించకపోగా “అసలు ఆయనకేమి తెలుసని అందులో కూర్చొనేందుకు రెడీ అయిపోతున్నారు? తొమ్మిదేళ్లుగా తల్లి కొంగు చాటునే రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఏనాడయినా ఏ సమస్యనయినా పరిష్కరించారా? కనీసం మాట్లాడారా?” అంటూ అర్ధం పర్ధం ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.   “పోనీ ప్రభుత్వాన్ని, దేశాన్ని ఆయన ఉద్దరించలేకపోయినా కనీసం స్వంత పార్టీనయినా చక్కదిద్దుకొన్నారా? ఆయనకు పార్టీ కిరీటం పెట్టిన తరువాత నుండి ఇంత వరకు నీతి, అవినీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచడం తప్ప వాటిలో ఒక్కటయినా అమలు చేయగలిగారా? కనీసం ఒక వ్యక్తికి జోడు పదవులు ఉండకూడదని రూల్స్ మాట్లాడిన ఆయన కనీసం దానిని కూడా నేటికీ అమలుచేయలేనప్పుడు ఇక దేశాన్ని ఎలా గాడిన పెడతాడు? అయినా ఏదో ఒకరోజు తను కూడా బామ్మలాగే ఎవరి చేతిలోనో చచ్చిపోతానని మైకు చించుకొని చెపుతున్నఆయనకీ పట్టాభిషేకం మాత్రం ఎందుకట?” అని సన్నాయి నొక్కులొకటి పైగా.   కళ్ళుండి కూడా చూడలేదీ పాడులోకం. ఆయన చొరవ తీసుకోబట్టే ఈ జనాలు లోక్ పాల్ బిల్లు, భూ సేకరణ బిల్లు వంటి కనీవినీ ఎరుగని అనేక బిల్లులను చూడగలిగారు. ఆయన దయతలచబట్టే ఈ జనాలకి ఈ నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా పధకం, పన్నెండు సబ్సిడీ సిలిండర్లకు బదులు తొమ్మిదేసి సిలిండర్లు పొందగలుగుతున్నారు. అయినా కూడా ఈ జనాలు తమకు ఇంకా ఏదో తక్కువయిందని వాపోవడం ఓ ఫేషన్ అయిపోయింది.   యువరాజవారు ఇంకా ప్రధాని పదవి చెప్పట్టకుండానే ఇన్నేసి పనులు ఎడమ చేత్తో చేసి పడేస్తున్నాఅవేవీ పట్టించుకోకుండా, “దేశం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు” అంటూ ఆ మోడీ చెప్పే తియ్యతియ్యటి మాటలనే గుడ్డిగా నమ్ముతూ, ఆయనకే ప్రదాని కుర్చీ బాగా సూట్ అవుతుందని సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారు.   “పదేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో దేశంలో కుంభకోణాలు తప్ప ఏమి కనబడుతున్నాయి? రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడితే, ఆయన వల్ల దేశానికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయనకి పట్టాభిషేకం జరిగితే మాకేంటి?” అని గిట్టనివారు నిలదీస్తుంటే, చంద్రబాబు వంటి చెడ్డవాళ్ళు కొందరయితే “మీరు మాపాలిట అనకొండలు” అంటూ కాంగ్రెస్ గురించి మరీ నీచంగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. “మీ యువరాజుకి పట్టాభిషేకం చేసుకోవాలంటే అందుకు మా రాష్ట్రమే దొరికిందా విడగొట్టడానికి?” అంటూ జగన్ బాబు కూడా అవేశపడిపోతున్నాడు. ఇక, తామంతా గొప్ప రామ భక్తులమని గొప్పలు చెప్పుకొనే బీజేపీ వాళ్ళకయితే మరో పనిలేనట్లు తెల్లారిలేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఎప్పడూ ఆ సోనియా రాహుల్ గాంధీల నిత్యనామపారయణమే తప్ప ఏనాడు ఎవరూ కూడా నోరారా “రామ” అని పలికింది లేదు.   ఈవిధంగా దేశంలో యావత్ ప్రజానీకం, ప్రత్యర్ధ రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా “మా ప్రేమను కోపంగానో, మా ప్రేమను ద్వేషంగానో.. ఫీల్ అవర్ లవ్” అంటూ సోనియా రాహుల్ గాంధీల గురించే పాడుకొంటున్నారు, మాట్లాడుకొంటున్నారు. ఎవరికయినా ఇంతకంటే ఏమి కావాలి? వారు కురిపిస్తున్న అపారమయిన ప్రేమ కోసం ప్రధాని మంత్రి కుర్చీ ఏమిటి.. అవసరమయితే ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేసెయోచ్చు.

దేశంలో మోడీ శకం మొదలవనుందా

  ఈ కొత్త సం.లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సుదీర్గమయిన గాంధీ నెహ్రూల శకం అంతమయ్యి, మోడీ శకం మొదలవుతుంది. దేశ పునర్నిర్మాణం, భవిష్యత్ గురించి ఆయన చెపుతున్నమాటలు వింటుంటే మన దేశానికి మళ్ళీ మంచి రోజులు మొదలవబోతున్నాయనే ఆశ, నమ్మకం ప్రజలలో కలుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే ఆయనపట్ల ప్రజలలో నమ్మకం పెంచుకోనేలా చేస్తోంది.   మాటలకంటే చేతలకే నరేంద్రమోడీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని గుజరాత్ లో జరిగిన అభివృద్ధి తెలియజెపుతోంది. కాంగ్రెస్ పార్టీలాగే ఒకవేళ మోడీ కూడా ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేసి ఉండి ఉంటే వ్యాపారంలో అందెవేసిన గుజరాతీలు ఆయనను ఎప్పుడో తిరస్కరించేవారు. కానీ వారు ఆయనకు వరుసగా మూడుసార్లు పట్టం కట్టారు. అంటే మోడీ వారి గీటురాయి పరీక్షలో నెగ్గినట్లు స్పష్టం అవుతోంది.   అందువల్ల అధికారంలోకి కొనసాగడానికి లేదా రావడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి అభాసుపాల్లయ్యే కంటే, ఆ కష్టమేదో అభివృద్ధి కోసం పెడితే తగిన ఫలితాలు వస్తాయని నరేంద్ర మోడీ భావించుతున్నందునే, ప్రజాకర్షక పధకాల గురించి కాక, కేవలం అభివృద్దినే నమ్ముకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేటికీ నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా పధకం, బంగారు తల్లి, ఇందిరమ్మకలలు వంటి ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటే, నరేంద్ర మోడీ కేవలం అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.   ప్రజలు ఏదీ ఆయాచితంగా పొందాలని కోరుకోవడం లేదు. తమ జీవితాలను చక్కదిద్ధుకొనే మార్గం, వెసులుబాటు చూపితే చాలని వారు కోరుకొంటున్నారు. ఆ సంగతిని మోడీ గ్రహించగలిగారు, గనుకనే ప్రజలను తనవైపు ఆకర్షించగలుగుతున్నారు. ఆయన బీజేపీ ప్రచార భాద్యతలు చెప్పటిన తరువాత దేశంలో విద్య, వైద్య, ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేయాలని అన్నారు. అందువల్ల ఒకవేళ మోడీ ప్రధాని అయినట్లయితే, మౌలిక వసతులు, విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలకు పెద్ద పీట వేయవచ్చును. అదే జరిగితే దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి, నిరుద్యోగం తగ్గు ముఖం పట్టవచ్చును.   ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పెనుమార్పులు రావాలని కోరుకొంటున్నారు. అది మొన్న డిల్లీ ఎన్నికలతో స్పష్టమయింది. కాంగ్రెస్ వల్ల దేశంలో అభివృద్ధి సాధ్యం కాదనే సంగతి కూడా స్పష్టం అయిపోయింది. కనుక అభివృద్ధికి భరోసా ఇస్తున్న నరేంద్ర మోడీవైపు ప్రజలందరూ చూస్తున్నారు. అందువల్ల ఆయన జపిస్తున్నఅభివృద్ధి మంత్రం ఫలిస్తే, అది ఆయనను అందలం ఎక్కించవచ్చును. ఆ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని మోడీ దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళగలిగితే ఆయన పేరు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. లేకుంటే చరిత్రలో ఆయన కూడా మరొక అనామక, అసమర్ధ ప్రధానిగా మిగిలిపోతారు అంతే.

జగన్మోహన్ రెడ్డికి 2014లో అధికారమా? గడ్డు కాలమా?

  వచ్చేఎన్నికలు యూపీయే, ఎన్డీయే కూటములకు ఎంత కీలకమయినవో, అదేవిధంగా రాష్ట్రంలో తెదేపా, వైకాపాల కూడా జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. కనుక చంద్రబాబు ఈసారి ఎలాగయినా తెదేపాను గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇక వైకాపాకి కూడా ఈ ఎన్నికలు నిజంగానే జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. ఎన్నికలలో గెలిస్తే పరువాలేదు. కానీ ఓడిపోతే మాత్రం అంతవరకు నిద్రావస్థలో ఉంచబడిన చార్జ్ షీట్లు, కేసులు అన్నీఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి జైలుకి తీసుకుపోవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కాకపోయినా కనీసం కేసులనుండి బయటపడేందుకయినా వైకాపా తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది.   తమకూ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అక్రమ సంబంధమూ లేదని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డి, నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాలేనట్లయితే చాలా చిక్కుల్లోపడతారు. అందువల్ల ఇక్కడ రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో యూపీయే గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికార పగ్గాలు చేపడితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం మొదలయినట్లే. జగన్ తన పార్టీని గెలిపించుకొని కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకి మద్దతు ఇవ్వడం అత్యంత అవసరం. అప్పుడే అతను కేసుల నుండి బయటపడగలరు. ఈ సంగతి జగన్ కంటే కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు గనుకనే జగన్ పట్ల అంత నమ్మకం పెట్టుకొని స్వంత పార్టీ నేతలకు కూడా హ్యాండిస్తోంది.   ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ నిజంగా ఎన్నికల సమాయానికి రాష్ట్ర విభజన గనుక జరుగకపోయినట్లయితే తెలంగాణా వదులుకొని బయటకి వచ్చినందుకు వైకాపాకు తీరని నష్టం కలగడం తధ్యం. అదీగాక సమైక్య రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో సమైక్యాంధ్ర సెంటిమెంటు వాడుకొని లబ్దిపొండడం కష్టం. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తీవ్రమయిన పోటీ ఉంటుంది గనుక, ఎవరికీ మెజార్టీ రానట్లయితే అది వైకాపాకు ఓటమితో సమానమే అవుతుంది.    ఇక రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డికి గడ్డు రోజులు ముంచుకు వచ్చినట్లే. చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ ఇంచుమించు ఒకేరకమయిన ఆలోచనా ధోరణి కలవారు. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తనపై సీబీఐని ఉసిగొల్పి కక్ష సాధినందుకు, మోడీ ప్రధాని పదవి చెప్పటిన తరువాత, అదే సీబీఐని కాంగ్రెస్ పై ప్రయోగించడం ఖాయం.తెదేపా, బీజేపీలు ఇప్పటికే సూత్రప్రాయంగా ఎన్నికల పొత్తులకు అంగీకరించ్నట్లు కనబడుతున్నాయి. అందువల్ల ఎన్నికల ముందు తరువాత కూడా వైకాపాను బీజేపీ దూరంగా ఉంచడం సహజమే. ఇక బ్రదర్ అనిల్ పై రాష్ట్ర బీజేపీ నేతలు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. అందువల్ల వారు కూడా వైకాపాను దూరంగా ఉంచే ప్రయత్నం చేయడమే కాక, ఎన్నికల అనంతరం అనిల్, జగన్మోహన్ రెడ్డిలపై చర్యలకు పూర్తి మద్దతు ఈయవచ్చును.   అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నఅన్ని కేసులను వేగవంతం చేయవచ్చును. చంద్రబాబు మోడీతో తనకున్నసాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డిపై ఈడీ గతంలో నమోదు చేసిన కేసులను కూడా బయటకు తీయించి విచారణ చేప్పట్టేలా చేయవచ్చును. అందువల్ల వచ్చేఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యవంటివేనని చెప్పవచ్చును.    రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. అంటే రాష్ట్ర విభజనకు పూనుకొన్నకాంగ్రెస్ పార్టీతోనే ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి చేతులు కలపబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇదంతా కలిపి చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం, రాష్ట్ర విభజనను జగన్ వ్యతిరేఖిస్తూ సీమాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం అన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ లబ్ధికోసం ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నదేనని అర్ధం అవుతోంది. ఏమయినప్పటికీ, వచ్చే ఎన్నికలలో వైకాపా పూర్తి మెజార్టీతో గెలిస్తే పరిమిత కష్టాలు, ఓడిపోయినట్లయితే మళ్ళీ గడ్డు కాలం తప్పకపోవచ్చును.

చంద్రబాబు విమర్శలకు కాంగ్రెస్ పార్టీలో జవాబు చెప్పేవారున్నారా?

  తెలుగుదేశం పార్టీ తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు. ఆమెను ఆదరించిన దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను చివరికి స్వంత పార్టీ నేతలను కూడా ఆమె వంచించారని, సోనియాగాంధీని ప్రజలు ఆదరిస్తే, ఆమె పెద్దపెద్ద అనకొండ పాముల వంటి కాంగ్రెస్ నాయకులను తయారుచేసి దేశం మీదకి వదిలిపెట్టిందని, వాటిలో ఒకటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కాగా, ఆయన కూడా పోతూపోతూ తన ఇంట్లో మరొక అనకొండవంటి జగన్మోహన్ రెడ్డిని తయారుచేసి రాష్ట్రం మీదకు వదిలాడని ఎద్దేవా చేసారు.   తన హయంలో చేసిన అభివృద్ధి ఫలాలను ఈ కాంగ్రెస్ అనకొండలన్నీ స్వాహా చేసేస్తున్నాయని వాటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు ఒక బొబ్బిలి పులిగా, ఒక మేజర్ చంద్రకాంత్‌గా, కొండవీటి సింహాలుగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.” చంద్రబాబు ఆవిధంగా స్వర్గీయ నందమూరి వారి సినిమాల పేర్లను పలకడంతో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.   చంద్రబాబు ప్రసంగాలలో రాన్రాను కాంగ్రెస్, సోనియాగాంధీ, జగన్మోహన్ రెడ్డిలపై విమర్శలు పదునెక్కుతున్నాయి. బహుశః ఎన్నికల సమాయం దగ్గిర పడుతున్న కొద్దీ అవి మరింత వాడివేడిగా ఉండవచ్చును. డిల్లీలో అమాద్మీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడాన్నిఆయన ప్రస్తావిస్తూ, ప్రజలు అవినీతికి మారుపేరయిని కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని, ఇప్పుడు దేశంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికేందుకు ఎదురుచూస్తున్నారని ఆన్నారు.   గత తొమ్మిదేళ్లుగా దేశంలో నానాటి పెరుగుతున్నఅవినీతి కానీ, అధిక ధరలు గానీ రాహుల్ గాంధీకి గుర్తుకు రాలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన కూడా వాటి గురించి మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్నారని నిశితంగా విమర్శించారు.   కాంగ్రెస్ పార్టీ ప్రతీసారి తన ప్రతిపక్ష పార్టీలకోసం గొయ్యి త్రవ్వడం, అందులో మళ్ళీ తానే పడుతుండటం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయిందని, తెదేపాను దెబ్బతీయాలనే దురాలోచనతో రాష్ట్ర విభజనకు పూనుకొని ఇప్పుడు తనే ఘోరంగా దెబ్బ తినబోతోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలే కాక, స్వయంగా కాంగ్రెస్ నేతలే పార్టీని వ్యతిరేఖిస్తున్నారని, ఓటమి భయంతో అందరూ చల్లాచెదురయిపోతున్నారని ఆయన ఎద్దేవా చేసారు.   తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పరిస్థితి చక్కబడాలంటే, మళ్ళీ తేదేపాకు ఓటేసి గెలిపించాలని, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఈ పరిస్థితిని చక్కదిద్దడమే కాకుండా మళ్ళీ రాష్ట్రాని పునర్వైభవం తప్పక తీసుకువస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన తన ప్రసంగంలో ఒకపక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏవిధంగా నాశనం చేసింది సోదాహరణంగా వివరిస్తూనే, తమ హయాంలో చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో, కాంగ్రెస్-తెదేపా- పాలనలోగల తేడాను స్పష్టంగా ప్రజల కళ్ళకు కట్టినట్లు చూపగలిగారు.   గతంలో ఎవరయినా కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీపై ఇంత తీవ్ర విమర్శలు చేసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ వారిపై మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగేవారు. కానీ ఇప్పుడు ఆ విమర్శలను ఎదుర్కొనే వారే లేకుండాపోయారు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ దయనీయమయిన పరిస్థితికి అద్దం పడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తను తీసుకొన్నగోతిలో తనే పడిందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. బహుశః నేడో, రేపో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, సోనియాగాంధీకి నిత్యం భజనచేసే వీ.హనుమంత రావు వంటి వారో ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి ఖండిస్తారేమో!