తెదేపా, వైకాపాలలో ఏది బెస్ట్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చనున్న కీలకమయిన ఎన్నికలు రేపు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పార్టీలు ఈ ఎన్నికలలో నామమాత్రపు పాత్ర పోషిస్తాయని దాదాపు స్పష్టమయింది. అందువల్ల ఇక ఈ యుద్ధం ప్రధానంగా అభివృద్ధి మంత్రం పటిస్తున్న తెదేపా, వైకాపాల మధ్యనే జరగనుంది. రెండు పార్టీలు కూడా తాము మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపగలమని, సుపరిపాలన అందించగలమని, పేదల సంక్షేమం కోసం పాటుపడగలమని, ప్రత్యర్ధపార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వాదించాయి. ప్రజలు కూడా వాటి వాదనలు ఆసాంతం విని వాటిని బేరీజు వేసుకొని రేపు తమ తీర్పు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆ రెండు ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలు మరొకసారి చూద్దాం.
తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలు:
1.చంద్రబాబు కార్యదక్షత, సమర్ధమయిన పాలన అందించగల శక్తి, అనుభవం. పార్టీలో సమర్ధులు, పరిపాలనానుభవం గల నేతలు, నిర్మాణరంగంలో ఆరితేరిన ప్రముఖ రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు కలిగిఉండటం.
2. రాష్ట్రానికి అంతులేని సంపద అందిస్తున్న అక్షయపాత్ర వంటి హై-టెక్ సిటీ నిర్మాణం చేసినందున ఇప్పుడు సీమాంద్రాకు కూడా అటువంటి సంస్థలు, పరిశ్రమలు, మౌలిక వసతులతో కూడిన నగరం నిర్మించగల అనుభవం, శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండటం.
3. విజయావకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కేంద్రానికి మద్దతు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తెచ్చుకోగల నేర్పుకలిగి ఉండటం. బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పటికీ దాని మతతత్వం మాత్రం తనకు అంటించుకోకుండా సెక్యులర్ విధానానికే కట్టుబడి ఉండటం. ముఖ్యంగా సమాజంలో అట్టడుగువర్గాలకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఈయడం.
ప్రతికూలాంశాలు:
1. సంక్షేమ పధకాలు, సబ్సీడీలు కొనసాగించడంలో అనాసక్తి. రాష్ట్రాభివృద్ధికి మూలమయిన వ్యవసాయం, కీలక పాత్ర పోషించే ప్రభుత్వోద్యోగులు పట్ల చిన్నచూపు.
2. అభివృద్దిని కేవలం పట్టణాలకే పరిమితం చేయడం. గ్రామీణాభివృద్ధి పట్ల అనాసక్తి.
3. ప్రాధమిక, మాధ్యమిక విద్యకంటే ఉన్నత విద్యలకే పెద్దపీట వేయడం. ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం. అయితే ఈ పొరపాట్లకు తెదేపా చాలా భారీ మూల్యం చెల్లించి ఇంతకాలం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది కనుక, బహుశః ఇకపై చంద్రబాబు అటువంటి పొరపాట్లు చేయరని ఆశించవచ్చును.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశాలు:
1. జగన్ యువనాయకత్వంలో సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో రాష్ట్రాన్నిత్వరితగతిన అభివృద్ధి చేయగల అవకాశం. అతని తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను కొనసాగిస్తూ, ఆయన మొదలుపెట్టిన అనేక నీటి ప్రాజెక్టులను తప్పకుండా పూర్తి చేస్తాడనే ప్రజలలో నమ్మకం.
2. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నందున ఆయా రంగాలలో త్వరితగతిన అభివృద్ధి అయ్యే అవకాశం.
3. నగరాలతో సమానంగా గ్రామీణాభివృద్ధి జరగాలనే తపన ఉన్నందున, మారుమూల పల్లెలకు అభివృద్ధి అయ్యే అవకాశాలు.
ప్రతికూలాంశాలు:
1. ఎటువంటి పరిపాలనానుభావం లేకపోవడం. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం. ఈ కారణంగా ప్రభుత్వాధికారులతో, ఉద్యోగులతో నిత్యం ఘర్షణ తప్పదు. తత్ఫలితంగా ప్రభుత్వ నిర్వహణలో వైఫల్యం చెందే అవకాశం.
2. ముఖ్యమంత్రి అయినప్పటికీ సీబీఐ కేసులు, చార్జ్ షీట్లు కారణంగా కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చును. అతని మద్దతు కేంద్రానికి అవసరం లేకపోయినట్లయితే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చును.
3. కేంద్రం ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు రాబట్టే బదులు మెడలు వంచి తీసుకు వస్తానని చెపుతున్నందున, నిత్యం ఘర్షణ పడితే కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోయే అవకాశం. తత్ఫలితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి.
4. జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే, అవినీతి, అక్రమాలు సర్వత్రా వ్యాప్తి చెందే ప్రమాదం.
సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిన సంగతి ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనంతరం ఎటువంటి ప్రధాన ఆర్ధిక వనరులు లేని ఈ పరిస్థితుల్లో కూడా లక్షల కోట్లు వ్యయమయ్యే కొత్త రాజధానిని తప్పనిసరిగా, వీలయినంత త్వరగా పునర్నిర్ముంచుకోవలసిన ఆగత్యం కూడా ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా నిత్యావసర సరుకులు ధరలు, విద్యుత్ చార్జీలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు దుర్బర జీవితం గడుపుతున్నారు. ఏవిధంగా చూసినా రాష్ట్రంలో పూర్తి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటువంటి క్లిష్టపరిస్థితులను చక్కబెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అన్నివిధాల సమర్ధుడు, అనుభవశాలి, కేంద్రంతో సత్సంబంధాలు గల వ్యక్తినే ప్రజలు ఎన్నుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలు తమ కష్టాలకు మరొక ఐదేళ్ళు పొడిగింపు కోరుకొన్నట్లే అవుతుంది. అందువల్ల ప్రజలు అన్నిటికంటే ప్రధానంగా ‘సమర్ధత’ కే ప్రాధాన్యం ఇచ్చి సరయిన వ్యక్తిని, పార్టీనే ఎన్నుకోవలసి ఉంటుంది. అలాకాకుండా కులం వంటి బలహీనతలకు లొంగి అసమర్దుడికి పట్టం కడితే అందుకు ప్రజలు భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు. అందువల్ల చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తపడటం మేలు.