సీమాంధ్ర ప్రజలను వంచి౦చిన కాంగ్రెస్ పార్టీ
posted on Feb 18, 2014 @ 4:11PM
కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభలో టీ-బిల్లుని మూజువాణి ఓటుతోనే ఆమోదింపజేసి తన పంతం నెగ్గించుకొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని జనాలు చ్చీ కొట్టినా, ఇంతకాలంగా ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసిన తెలుగు ప్రజల అభిప్రాయాలకు పూచికపులెత్తు విలువీయకుండా రాష్ట్ర విభజన చేసింది. కోట్లాది తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే బిల్లుపై కనీసం అర్ధ గంటసేపు కూడా చర్చించకుండానే ఆమోదించింది. అంతకు ముందు అనేక బిల్లులను సభలో ఆమోదించిన స్పీకర్, కాంగ్రెస్ అధిష్టానం పన్నిన వ్యూహం ప్రకారమే సభను వాయిదాలు వేసుకొంటూ వచ్చి హటాత్తుగా మూజువాణి తంతు నిర్వహించేసి బిల్లు ఆమోదం పొందేలా చేసారు. ఈ విషయం బయటకి పొక్కకుండా గోప్యంగా నిర్వహించేందుకు అకస్మాత్తుగా లోక్ సభ ప్రసారాలు నిలిపివేయడం కాంగ్రెస్ తన తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నమే.
తెలంగాణా ఏర్పాటయినందుకు టీ-కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ పాదాలకు మొక్కవచ్చును. కానీ, సీమాంధ్ర ప్రజల హృదయాలలో ఆమె శాస్వితంగా తన స్థానం కోల్పోయారు. ఆమెనే కాదు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని కూడా ఇక ఆంధ్ర ప్రజలు ద్వేషించవచ్చును. ఆంధ్ర రాష్ట్రం గురించి, తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమాత్రం అవగాహన లేని ఆమె, అసమర్ధుడు, రాజకీయ పరిణతిలేని వాడు అయిన తన కుమారుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడం కోసం తెలుగుజాతిని చిద్రం చేసేందుకు కూడా వెనుకాడలేదు. తెలుగు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకొన్నారు. విదేశీ వనితని కూడా చూడకుండా ఆమెను ఇంటి ఆడపడచుగా ఆదరించి నెత్తిన పెట్టుకొన్నందుకు, ఆమె కాలితో వారి నెత్తిన తన్ని సన్మానించారు. అయినప్పటికీ సిగ్గు, లజ్జ, రోషం ఏమాత్రం లేని కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పదవుల కోసం నేటికీ ఆమె పాదాలు నాకేందుకు సిద్దంగా ఉండటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యమే. అటువంటి వారిని ప్రజలు పేరుపేరునా గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా రాకుండా ఓడించినపుడే విజ్ఞులనిపించుకొంటారు.
లోక్ సభ ప్రసారాలు అకస్మాత్తుగా నిలిపివేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించిందో ఇంకా తెలియవలసి ఉంది. బీజేపీ కూడా బిల్లుకి మద్దతు పలికిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజమని దృవీకరించుకోవలసి ఉంది. ఏమయినప్పటికీ, ఈ రాష్ట్ర విభజన కు కర్త, కర్మ క్రియ అన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానమే. దాని వ్యూహంలో భాగంగానే కొందరు వ్యతిరేఖిస్తూ, మరి కొందరు సమర్దిస్తూ, మరి కొందరు కలహించుకొంటూ ప్రజలను ఏమార్చి కధ ముగించారు.
తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తెలుగు ప్రజలను చీల్చడానికి కూడా వెనుకాడని కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర ప్రజలని అడుగడున అవమానిస్తూనే ఉంది. అడుగడునా వంచిస్తూనే ఉంది. ఆ వంచంతోనే చివరికి బిల్లుని ఆమోదింపజేసింది కూడా. అటువంటి పార్టీ, ఇక ఎన్నికల తరువాత మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో గుప్పిస్తున్న హామీలకు ఏమి విలువ ఉంటుంది? ఏవిధంగా నమ్మగలము? ఇదివరకు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ఆటలాడుకొన్నపుడు అన్ననందమూరి దేవుడిలా వచ్చి ఆదుకొన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడింది. దెబ్బతిన్న సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మళ్ళీ అటువంటి మహానుభావుడు రావాలని కోరుకొందాము.