ఉట్టికెగరలేనమ్మ...
ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి ఎగురుతానన్నట్లు, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ‘మెరుపు సమ్మెలు చేస్తాం, లక్షల మందితో శాసనసభను దిగ్బందిస్తాం’ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన ఏపీ ఎన్జీవో ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు, ఇప్పుడు ఫిబ్రవరి 11, 12, 13 తేదిల్లో ఛలోడిల్లీ అంటూ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
ఏపీఎన్జీవో ఉద్యోగులు మొదట నిరవధిక సమ్మె మొదలుపెట్టినప్పుడు ఎవరూ ఆయన చిత్తశుద్ధిని శంఖించలేదు. ఆయన హైదరాబాదులో లక్షమందికి పైగా ఉద్యోగులతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించినప్పుడు, అందరూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. ఈ ఉద్యమం సందర్భంగా ఆయన అనేక మంది మంత్రులను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, జాతీయ నాయకులను తరచూ కలుస్తుండటంతో క్రమంగా ఆయన ఆలోచన ధోరణిలో మార్పు రాసాగింది. వారి సహకారంతో ఆయన అనేక సభలు, సమావేశాలు అవలీలగా నిర్వహించిన తరువాత అధికారంలో ఉన్నరుచి, శక్తి ఏమిటో ఆయనకు బాగా అర్ధమయినట్లుంది. అప్పుడే తాను కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే కోరికను ఆయన బయటపెట్టుకొన్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ, లక్షలాది ఉద్యోగులు చేసిన త్యాగాలకి, పడిన కష్ట నష్టాలకి ఆయన వ్యక్తిగతంగా ప్రతిఫలం ఆశించడమే అక్షేపనీయం.
ఇక ఆయన ఉద్యమానికి బ్రేకులు వేసి నడుపుతున్నతీరు కూడా ఆయన చిత్తశుద్దిని శంకించేదిగానే ఉంది. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొంటానని లక్షలాది మంది ఉద్యోగులను సమ్మెబాట పట్టించి, రాష్ట్రాన్ని దాదాపు స్థంభింపజేసిన అశోక్ బాబు, అకస్మాత్తుగా ఉద్యోగుల సమ్మెను విరమింపజేసి, అంతకాలంగా ఉద్యోగులు చేసిన ఉద్యమానికి విలువ లేకుండా చేసారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు దాని అంతు తేల్చుతానని చెపుతూ డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియను సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరించారు. ఆ తరువాత బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ముందు చెప్పినట్లుగా ఏ మెరుపు సమ్మెలు చేయలేదు పైగా శాసనసభ్యులందరూ బిల్లుపై చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన హుకుంలు కూడా జారీ చేసారు. ఇక త్వరలో బిల్లు తిరిగి సజావుగా డిల్లీకి వెళ్ళిపోతోంది గనుక, ఇంతవరకు దానికి సహకరించిన తాము డిల్లీ వరకు దానిని సాగనంపి వస్తామని ముహూర్తాలు కూడా ప్రకటిస్తున్నారిప్పుడు. అయితే బిల్లు రాష్ట్రంలో ఉండగా ఏమీ చేయలేని ఆయన, డిల్లీ వెళ్లి ఏవిధంగా అడ్డుకొంటారో ఆయనే చెప్పాలి. ఇదెలా ఉందంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.
ప్రొఫెసర్.కోదండ రామ్, స్వామీ గౌడ్ వంటి ఉద్యోగులు తెలంగాణా పోరాటాలను, ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఏవిధంగా రాజకీయంగా పైకి ఎదిగారో అదేవిధంగా అశోక్ బాబు కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికీ అశోక్ బాబుకి ఉన్నతేడా ఏమిటంటే, నేడు కాకపోతే రేపయినా వారి పోరాటాల వలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడవచ్చును. కానీ, టీ-బిల్లు పార్లమెంటు గుమ్మం ఎక్కిన తరువాత కూడా ఇంకా సమైక్యాంధ్ర కోసం పోరాడతామని చెపుతూ ఆయన ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో ప్రజలకు, ఉద్యోగులకు కూడా బాగా తెలుసు. ఆయనకు రాజకీయంగా పైకి ఎదగాలనే కోరికే ఉంటే, అందుకు ఎన్నికలు రానే వస్తున్నాయి. ఆయన నిరభ్యంతరంగా అందులో పోటీ చేసుకోవచ్చును. గెలిస్తే మంత్రో, ముఖ్యమంత్రో కావచ్చును కూడా. అప్పుడు ఆయనను ఈవిధంగా విమర్శించేవారు కూడా ఉండరు. కానీ, ఇంకా సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని ప్రజల, ఉద్యోగుల భావోద్వేగాలతో ఆడుకొందామని ప్రయత్నిస్తే, ఏదో ఒకరోజు వారి చేతిలోనే భంగపాటు తప్పదు. ప్రజలలో రాజకీయ చైతన్యం ఇంతగా పెరిగిన తరువాత, ప్రసార మాధ్యమాలలో ప్రతీ రాజకీయ అంశంపై సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు రాజకీయ పరిశీలకులు, నిపుణులు విశ్లేషించి చెపుతున్నపుడు కూడా, ప్రజలకు, ఉద్యోగులకు ఈ రాజకీయాలు, తమ ఆలోచనలు అర్ధం కావని అశోక్ బాబు వంటి వారు భావిస్తే అది వారికే నష్టం.