కామ్రేడ్స్ ని మట్టి కరిపించిన ఆడ సివంగులు
posted on Mar 10, 2014 @ 3:41PM
దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా దేశంమంతటా వ్యాపించి ఉన్నమన ఎరెర్ర పార్టీలన్నీఇంతవరకు ఒక్కసారి కూడా ఎర్రకోట మీద తమ ఎర్రజెండా ఎగురవేయలేకపోయాయి. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతీ ఐదేళ్ళకీ ఓసారి దేశంలో చిన్న చితకా పార్టీలను భుజాన్నేసుకొని ఫ్రంట్ నిచ్చెన ఎక్కి ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాతో బాటు తమ ఎరెర్రజెండాను కూడా ఎగురవేయాలని కలలు కంటూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆయాసం తప్ప వారికి మరేమీ మిగలలేదు. ఎన్నికలు దగ్గిర పడుతుండటంతో ఈసారి కూడా మళ్ళీ ‘ఫ్రంట్ నిచ్చెన’ అటక మీద నుండి క్రిందకు దింపి అందరినీ ఆహ్వానించాయి.
ఎక్కడో ఉన్న తమిళనాడులో ఉన్న జయలలితమ్మను బొట్టు పెట్టి మరీ ఆహ్వానించిన కామ్రేడ్స్, ఊళ్లోనే తమ ఇంటి పక్కనే ఉన్న మమతమ్మను మాత్రం ఈ ఫ్రంట్ పేరంటానికి పిలవలేదు. కారణం ముపై ఏళ్లుగా బెంగాల్ కుర్చీలో తిష్టవేసుకొని కూర్చొన్న తమను మెడపట్టుకొని నిర్దాక్షిణ్యంగా బయటకి ఈడ్చేపడేసిందనే కోపమే తప్ప మరోటి కాదు!
అయితే కామ్రేడ్స్ చేత ఎర్రెర్ర బొట్టుపెట్టించుకొని, వారి ఫ్రంట్ పేరంటానికి వెళ్లి వారందించిన తాంబూలం కూడా స్వీకరించిన జయమ్మ, ఆ తరువాత వాళ్ళు తన వెనకే రెక్కలు కట్టుకొని పొత్తుల కోసం చెన్నైలో వాలినపుడు, వారిపై ఏమాత్రం కృతజ్ఞతా చూపకుండా “ఒక్కసీటు కూడా విదిలించేది లేదని,అయినా నా బరువుని మీ ఫ్రంట్ నిచ్చెన కాయలేదని” ఆమె తెగేసి చెప్పేయడంతో కామ్రేడ్స్ బిక్క చచ్చిపోయారు.
“మరి బొట్టు పెట్టించుకొని తాంబూలం కూడా స్వీకరించావు కదమ్మా? మరిదేమిటి...???” అని వారు మొహం చిన్నబుచ్చుకొని అడిగితే, “ఈసారి అదృష్టం బాగుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిస్తే సోనియమ్మ తన రాహుల్ బాబుని ప్రధాని చేయాలనుకొంటే మీరేమయినా అభ్యంతరం చెప్పారా? ఎక్కడో గుజరాత్ లో ఉన్న మోడీ డిల్లీకి ఊడిపడి ప్రధాని అయిపోతానని ఊగిపోతుంటే మీరేమయినా ఆయనను ఆపగలిగారా? అటువంటప్పుడు నేను ప్రధాన మంత్రిని అవుదామని అనుకొంటుంటే నా యంపీ సీట్లలో వాటా కావాలని అడగడం మీకేమయినా భావ్యంగా ఉందా డియర్ కామ్రేడ్స్? ఏదో బొట్టు పెట్టి పిలిచారు కదాని పేరంటానికి వస్తే, తగుదునమ్మా అనుకొంటూ నా ప్లేన్లోనే సీట్లకోసం వచ్చేయడమే?” అని ఆమె ప్రశ్నించేసరికి వారి నోట జవాబు లేదు.
ఇక ఈ కధంతా విన్న మమతమ్మ ఆనందంతో గెంతులు వేసింది. తనను పేరంటానికి పిలవకుండా అవమానించిన కామ్రేడ్స్ కి భలే శాస్తి జరిగిందని పొంగిపోయింది. తన శత్రులకి అంతబాగా బుద్ధి చెప్పిన జయమ్మ పట్ల మమతానురాగం పొంగిపోర్లిపోయింది. ఆ ఆనందంలో తాను కూడా ప్రధాన మంత్రి రేసులో ఉన్నాననే సంగతిని మరిచిపోయి, “జయక్క ప్రధాన మంత్రి అవుతానంటే అందులో తప్పేముంది. అక్క కళ్ళల్లో ఆ ఆనందం చూసేందుకు నేను మద్దతు ఇవ్వడానికి రెడీ!” అన్నట్లుగా బెంగాలీ బాషలో ఏదేదో చెప్పెసరికి, అటు నుండి జయక్క కూడా అంతే ఇదిగా రియాక్టయిపోతూ వెంటనే ఫోనందుకొని ఆమెతో అరవంలో అరగంటకు పైగా ఏదేదో మాట్లాడేసింది. బాషలు వేరయినా (ప్రధాని కావాలనే) ఒకరి భావాలొకరికి పూర్తిగా అర్ధమయిపోయిన ఫీలింగ్!
వాళ్లిదరి దెబ్బకి విరిగిపోయిన తమ ఫ్రంట్ నిచ్చెన భుజానెత్తుకొని కామ్రేడ్స్ ఆంద్ర ఒరిస్సా సరిహద్దుల మీదుగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటికి చేరుకొన్నట్లు తాజా సమాచారం.