తెరాస కోసం టీ-కాంగ్రెస్ బలి?
posted on Mar 4, 2014 8:15AM
కారణాలేవయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోమని తెరాస అధ్యక్షుడు కుండ బ్రద్దలు కొట్టేసారు గనుక, ఇక ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ కారణంగానే ఆ రెండు పార్టీల మధ్య ఇక ఎన్నికల పొత్తులు కూడా పెట్టుకొనే అవకాశాలు కూడా మాయమవుతాయి. అప్పుడు రానున్న ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్-తెరాస-తెదేపా-బీజేపీల మధ్య చతుర్ముఖ పోటీ అనివార్యమవుతుంది. దీనివలన కాంగ్రెస్-తెరాసలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండవచ్చును. ఒకవేళ తెదేపా-బీజేపీలు కనుక ఎన్నికల పొత్తులు కుదుర్చుకొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలగడం తధ్యం.
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, కేసీఆర్ మరియు తెరాస నేతలు తెలంగాణా తామే సాధించామనే విషయాన్నిబలంగా నొక్కి చెపుతూ అందుకు తగ్గట్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు త్రిప్పుకోగలిగారు. కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి భరించలేక టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో కృతజ్ఞత సభలు, విజయోత్సవ సభలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నప్పటికీ, వారి దృష్టి అంతా పీసీసీ అధ్యక్ష పీటంపైనే ఉంది. పైరవీలు చేసుకోకపోతే దానిని వేరెవరో తన్నుకు పోతారనే భయంతో అందరూ దానిపైనే శ్రద్ధ చూపుతుండటంతో తెరాస పని మరింత సులువయింది. టీ-కాంగ్రెస్ నేతలు ఈ పదవుల ప్రాకులాట నుండి బయటపడేలోగానే తెరాస తెలంగాణా ప్రజలను తనవైపు త్రిప్పుకొంటే, ఇంక సీమాంధ్రతో బాటు తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.
అయితే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టి తెలంగాణాలో యంపీ సీట్లపైనే తప్ప యం.యల్యే.సీట్లపై లేదు గనుక అది అంత దిగులుపడబోదు. పోతే కాంగ్రెస్ టికెట్ పై శాసనసభకు పోటీ చేసే నేతలే కొట్టుకుపోతారు కానీ, యంపీలకు ఎటువంటి డోకా ఉండదు. అదీగాక తెరాసలో యంపీ స్థానాలకు పోటీ చేసి గెలిచే సత్తా, వనరులు ఉన్ననేతలు కూడా లేరు గనుకనే ఆ సత్తా ఉన్న కాంగ్రెస్ యంపీకు గాలం వేసేందుకు కేసీఆర్ గతంలో గట్టి ప్రయత్నాలు చేసారు. అయితే, డిల్లీలో కాంగ్రెస్-తెరాసల మధ్య ఏదయినా రహస్య ఒప్పందం జరిగి ఉన్నట్లయితే ఇక కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు చేయకపోవచ్చును. అదీగాక ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైనే ఉంది. గనుక కాంగ్రెస్ పార్టీకి యంపీ సీట్లు, తెరాసకు యం.యల్యే.సీట్లు అనే లోపాయికారీ ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య జరిగి ఉండి ఉండవచ్చును.
అదే నిజమయితే, సీమాంధ్రలో కాంగ్రెస్ తన నేతల భవిష్యత్తుని నాశనం చేసినట్లుగానే, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధిష్టానం తన యం.యల్యే.ల భవిష్యత్తుని తెరాస కోసం బలిచేయబోతోందని భావించవచ్చును. యువరాజు రాహుల్ గాంధీ వారిని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు, కాంగ్రెస్ నేతలు ఆ మాత్రం త్యాగం చేసేందుకు వెనుకాడరని ఆశించడం అత్యాసే అయినా వారికి అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.