ఇక చిరంజీవి శల్యసారధ్యం చేయనున్నారా
posted on Feb 26, 2014 6:57AM
స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగం నుండి రాజకీయాలలోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే తన పార్టీని తిరుగులేని మెజార్టీతో ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తెలుగువాడి పౌరుషం డిల్లీ పెద్దలకు రుచి చూపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడి, యావత్ ప్రపంచమూ తెలుగుజాతిని గుర్తించేలా చేసారు. తెలుగుజాతికి నిలువెత్తు ప్రతీకగా నందమూరి నిలిచారు. అదేవిధంగా తన కటోర పరిశ్రమతో సినీ రంగంలో సమున్నత స్థానానికి ఎదిగి, మెగా స్టార్ గా ప్రజల చేత నీరాజనాలు అందుకొన్న చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోదామని ప్రయత్నించారు. కానీ, అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లయింది. తన స్వగ్రామంలో కూడా గెలవలేని దుస్థితి. ఆ తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.
ఆయన పదవీ పరంగా పైకి ఎదుగుతుంటే, గత రెండేళ్లుగా ఆయన వేసే ప్రతీ అడుగుతో ఆయనకున్న ప్రజాభిమానం అదఃపాతాళానికి పడిపోతోంది. ప్రజలు ఊహించిన చిరంజీవి వేరు. కంటికెదురుగా కనబడుతున్న చిరంజీవి వేరు అన్నట్లు తయారయ్యారు ఆయన. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతిని, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు డిల్లీ పెద్దలతో డ్డీకొంటే, చిరంజీవి మంత్రి పదవి కోసం, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ళ ముందు పెట్టేశారు. ఈ విషయంలో కేవలం ఆయనొక్కడినే తప్పు పట్టనవసరం లేదు. ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు అనేక మంది ఆపని ఎప్పుడో చేసారు. ఇంకా చేస్తున్నారు కూడా. వారిలో చిరంజీవి కూడా ఒక్కరు.
ఒకప్పుడు మెగా స్టార్ గా కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకొని, ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను శాసించిన చిరంజీవి, కాంగ్రెస్ పట్ల, సోనియా, రాహుల్ గాంధీల పట్ల చూపిన వినయ విదేయతలకు మెచ్చి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియమ్మ అనుగ్రహించినట్లు తాజా సమాచారం. ఆయనకున్న ప్రజాకర్షణను ఉపయోగించుకొని ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను అధిగమించి ఎన్నికల గండం గట్టెక్కాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఎన్నికలలో కాపు కులస్థుల ఓట్లు అన్ని గంపగుత్తగా తమకే పడిపోతాయని కాంగ్రెస్ అడియాసకు పోతోంది. అయితే గతంలో ఆయన పార్టీ పెట్టిన్నపుడు ఆయనను నమ్ముకొని వెళ్ళిన వారందరి పరిస్థితి ఏమయిందో, ఆ తరువాత ఆయన తను రాజకీయంగా ఏవిధంగా పైకెదిగేరో, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర విభజన వ్యవహారంలో కోట్లాది సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని ఏవిధంగా సోనియమ్మ పాదాల చెంతపెట్టారో కళ్ళార చూసిన తరువాత కూడా ప్రజలు, ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు కులస్తులు ఆయనని చూసి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించడం అడియాసే అవుతుంది.
కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమాత్రమయిన ప్రజాకర్షణ గల నేత మరొకరు లేకపోవడంతో ఆయనకి అదృష్టం కలిసివచ్చిందని అనుకోకతప్పదు. అయితే, గత ఎన్నికలలో స్వంత పార్టీనే గెలిపించుకోలేక చతికిలపడిన ఆయన చేతిలో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పెట్టాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః ఆయన విదేయతకు మెచ్చి కేవలం మిగిలిన ఈ మూడు నెలల కోసం మాత్రమే ఆయనను ‘తీన్ మైనే కా సుల్తాన్’గా చేసి, కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిస్తే అప్పుడు శాశ్విత ముఖ్యమంత్రిగా సమర్డుడైన మరొక నేతని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందేమో. ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవిలో నుండి తప్పుకొనేందుకు సిద్దంగా ఉండే మన్మోహన్ సింగుని ప్రధానమంత్రిగా నియమించుకొని రాహుల్ గాంధీ కోసం ప్రధాని కుర్చీని రిజర్వ్ చేసుకొన్నట్లే, ఇప్పుడు చిరంజీవిని కూడా ఎంపిక చేసి ఉండవచ్చును. ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కరోజయినా కూర్చోవాలని తపించిపోతున్న చిరంజీవికి ఊహించని ఈ పరిణామాలు ఒక వరంగా మారడంతో “అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా శిరసావహించేందుకు సిద్దంగా ఉన్నానని” ఒక స్టాండర్డ్ రాజకీయ డైలాగు పలికి, “కుర్చీలో కూర్చొనేందుకు తన రెడీ” అని ఆయన కూడా ప్రకటించేశారు.
ఏమయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ ఆయననే ముఖ్యమంత్రిగా ఎంచుకొంటే అది ప్రతిపక్షాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో తప్పకుండా కలిసివస్తుంది.