కిరణ్ విఫలయత్నాలు
posted on Mar 5, 2014 @ 10:51AM
మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి ‘లాస్ట్ బాల్స్’ ఇంకా చాలా మిగిలే ఉన్నాయంటూ గాలిలో బ్యాటు ఊపుతూ బాగానే చప్పట్లు కొట్టించుకొన్నారు. అయితే ఆయన మంచి ‘ఫాం’ లో ఉన్నపుడు రాజీనామా చేసి పార్టీ పెట్టకుండా పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందేవరకు పదవిని, పార్టీని పట్టుకొని వ్రేలాడటం ఒక పొరపాటని ఇప్పుడు అర్ధమవుతోంది. అదీగాక ఆయన తన పదవి నుండి దిగిపోయే ముందు ప్రతిపక్షాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తన నమ్మకస్తులకు కీలక పదవులలో నియామకాలు చేసి, చివరి మూడు నాలుగు రోజుల్లోనే వేలాది ఫైళ్ళను క్లియర్ చేసారు. వాటిని గవర్నర్ నరసింహన్ ఇప్పుడు వరుసగా రద్దు చేస్తుండటంతో కిరణ్ మరింత అప్రదిష్ట పాలయ్యారు.
ఆయన ఇంతవరకు కొత్తపార్టీ పెట్టే సాహసం కూడా చేయలేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కానీ, ఆయన కొత్త పార్టీపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వెంట ఎంతమంది వస్తారు? ఇంకా ఎంతమందిని ఆకర్షించగలరు? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. సరిగ్గా ఇదే సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెనుక లక్షలాది అభిమానులు వెళ్ళిపోగా, నందమూరి అభిమానులు తెదేపావైపు, రెడ్డి కులస్తులు, క్రీస్టియన్లు, వైయస్సార్, జగన్ అభిమానులు వైకాపా వైపు వెళ్ళిపోతే ఇక కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్తపార్టీకి అసలు జనాలు దొరుకుతారా?అనే మరో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అందువల్ల కిరణ్ ఒకవేళ కొత్త పార్టీ పెడితే అది ఆమాద్మీ, మందకృష్ణ, బైరెడ్డి తదితర పార్టీలతో బాటు ఓట్లు ఓట్లు చీల్చడానికి తప్ప మరి దేనికి ఉపయోగపడకపోవచ్చును.
కొత్తపార్టీ పెట్టేముందు సీమాంధ్ర ప్రజలలో మళ్ళీ కొంచెం పేరు సంపాదించుకోనేందుకేనేమో, కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేసారు. అయితే గతంలో అనేకసార్లు ఇటువంటి పిటిషన్లను నిర్ద్వందంగా తిరస్కరించిన జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డే బెంచీయే మళ్ళీ ఈ పిటిషన్ను కూడా చెప్పట్టబోతోంది. అంటే మళ్ళీ పిటిషన్ తిరస్కరింపబడే అవకాశాలే ఎక్కువని అర్ధమవుతోంది.
తెలంగాణా ఏర్పాటుకి రాష్ట్రపతి ఆమోదం ముద్ర కూడా పడి, గెజిట్ నోటిఫికేషన్, అప్పాయింటడ్ తేదీ కూడా ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు బెంచీ ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టి, విభజన వ్యవహారాన్ని మళ్ళీ తిరుగదోడుతుందని భావించలేము. కనుక కిరణ్ కుమార్ రెడ్డి కేవలం తానొక్కడినే రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్నాని నిరూపించుకోవడానికి తప్ప ఈ పిటిషన్ వేరెందుకు పనికి రాదు. కానీ సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ను తిరస్కరిస్తే, అది ఆయనకు మరింత అప్రదిష్టే తప్ప మేలు చేయదు. గనుక ఇది కూడా ఆయన తీసుకొన్న మరో తప్పుడు నిర్ణయమవుతుంది.