కిరణ్ కొత్త పార్టీ పెట్టకపోతే...
posted on Feb 16, 2014 @ 8:47PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో జరిపిన సమావేశంలో తన రాజీనామా, కొత్తపార్టీ స్థాపనపై ఏదో ఒక ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవచ్చునని అందరూ భావించారు. కానీ బీజేపీ నేతలు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టలేదని వాదిస్తునందున, ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా బిల్లుని సభలో ప్రవేశపెట్టినట్లు అంగీకరించినట్లవుతుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం బిల్లుని అధికారికంగా ప్రవేశపెట్టినప్పుడే రాజీనామా చేస్తారని మంత్రులు టీజీ వెంకటేష్ మీడియాకు తెలిపారు. అయితే ఆయన రాజినామా చేసేందుకే నిశ్చయించుకొన్నపుడు ఇంకా బీజేపీ వాదనను సాకుగా చూపి మరొకట్రోండు రోజులు ఆగినంతమాత్రన్న కేంద్రం బిల్లుని ఆమోదించకుండా ఆగిపోదు. బీజేపీ మద్దతు ఈయకపోయినా మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేస్తుందని కాంగ్రెస్ అధిష్టానంతో మంచి టచ్చులో ఉన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. మరి అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుని సభలో ప్రవేశపెట్టిన తరువాతనే రాజీనామా చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో ఆయనకీ, ఆయన సహచరులకే తెలియాలి.
ఇక ఆయన కొత్త పార్టీ పెడతారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి తెలియజేసారు. అయితే ఎప్పుడు స్థాపిస్తారో, ఎవరెవరు ఆ పార్టీలో చేరుతారో తెలియదని చెప్పారు. అయితే కొత్తపార్టీలో చేరేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపలేదని సమాచారం. అదే నిజమయితే, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం మారుతుంది. ఎందుకంటే, ఇంతగా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తరువాత ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగడం చాలా కష్టం, అవమానకరం కూడా. అయితే, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఆయన వేరే ఏ ఇతర పార్టీలోకి వెళ్లి వేరొకరి క్రింద పంచిచేయడం కూడా ఊహించలేము.
అయితే రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ ఆయనను రహస్యంగా కలిసి వెళ్ళారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే మాటయితే పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఈయబోదనే హామీ ఏమయినా ఆయన ఇచ్చిఉంటే, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడమే మేలు. ఆయన ఒకవేళ కొత్తపార్టీ పెట్టలేని పరిస్థితి ఉంటే, అవమానకర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా రాజకీయ సన్యాసం చేయడం కంటే సీమాంధ్రలో బలమయిన నాయకుడులేని బీజేపీ పగ్గాలు చెప్పట్టి తన చేతి మీదుగానే పార్టీని నడిపించుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీ లో చేరినట్లయితే ఆయన సహచరులు కూడా చేరే అవకాశం ఉంటుంది. పైగా అది ఆయనకీ, బీజేపీకి కూడా చాలా లభాదాయకం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అన్ని సర్వే నివేదికలు స్పష్టం చేస్తునందున, ఆయన బీజేపీలో చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది గనుక ఆయనకు ఏ కేంద్ర మంత్రి పదవో ఇవ్వవచ్చును కూడా.
అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టలేకపోయినా లేదా పెట్టి చేతులు కాల్చుకోకూడదనుకొన్నా, కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ అయిన బీజేపీలో చేరడమే మంచిది. ఇది రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన ముందున్న ఆఖరి అస్త్రంగా కూడా మారుతుంది.
కానీ, అయన నేడు కాకపోతే రేపయినా రాజీనామా చేసి కొత్తపార్టీ స్థాపించావచ్చని ఆయన సహచరులు చెపుతున్నారు గనుక ఆయనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని అర్ధమవుతోంది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడదలిస్తే, ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండకపోవచ్చును.