బీజేపీకి చంద్రబాబు షాకిచ్చారా?
posted on Feb 19, 2014 @ 10:03PM
ఇచ్చిన మాటకు కట్టుబడి లోక్ సభలో తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చామని నిన్న సగర్వంగా చెప్పుకొన్న బీజేపీ, ఒక్కరోజులోనే మాట మార్చిసీమాంధ్రకు అన్యాయం జరిగితే సహకరించేదిలేదని నేడు హూంకరిస్తున్నారు. బీజేపీ రాజ్యసభలో కూడా బేషరతుగా బిల్లుకి మద్దతు ఇస్తుందని, బిల్లు ఆమోదం కేవలం లాంచనప్రాయమేనని, అందువల్ల ఈరోజే బిల్లు ఆమోదం పొందుతుందని అందరూ భావించారు. కానీ, హటాత్తుగా బీజేపీ ఆఖరు నిమిషంలో మెలిక పెట్టి బిల్లుని అడ్డుకొంది. ఆ పార్టీ నేతలు ముప్పై రెండు సవరణలు సూచించి వాటిని బిల్లులో చేర్చితేనే మద్దతు ఇస్తామని మెలికపెట్టారు. అయితే వాటిని చేర్చినట్లయితే బిల్లుని మళ్ళీ లోక్ సభకు పంపవలసి వస్తుంది. పార్లమెంటు సమావేశాలు ముగియడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నందున బీజేపీ పెట్టిన మెలికతో కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టాయి. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్ళీ చర్చల ప్రక్రియకు కూర్చోవడం, ఇంతవరకు సీమాంధ్ర గోడు పట్టించుకోని సోనియా గాంధీ సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని సూచించడం, మరి కొన్ని ఆర్ధిక ప్యాకేజీలపై రెండు పార్టీల మధ్య బేరసారాలు నడుస్తున్నట్లు సమాచారం.
అయితే, ఒక్కరోజులో బీజేపీలో ఇంత పెనుమార్పు రావడానికి కారణం సీమంధ్రలో ఆ పార్టీపై పెల్లుబుకిన ప్రజాగ్రహమా? లేకపోతే తెదేపా ఎన్నికల పొత్తులు పెట్టుకోబోమని హెచ్చరించిందా? కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొని రెండు ప్రాంతాలలో నష్టపోతానని అకస్మాత్తుగా జ్ఞానోదయం కలిగిందా? అని ఆలోచిస్తే సీమాంధ్రకు న్యాయం చేయకుండా బిల్లుకి గుడ్డిగా మద్దతు ఇస్తే ఎన్నికల పొత్తులు పెట్టుకోమని తెదేపా తెగేసి చెప్పడంవలననే వెనక్కి తగ్గి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొదటి నుండి సమన్యాయం కోరుతున్న తెదేపా, నరేంద్ర మోడీతో సహా బీజేపీ అగ్రనేతలు అందుకు అంగీకరించిన తరువాతనే చంద్రబాబు బీజేపీతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. లోపభూయిష్టంగా ఉన్న టీ-బిల్లుని ప్రస్తుతం అడ్డుకొని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరు ప్రాంతాలకి న్యాయం జరిగేలా రాష్ట్ర విభజన చేస్తామని సాక్షాత్ నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చారు కూడా. నిన్న లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టేవరకు కూడా బీజేపీ నేతలందరూ బిల్లుని అడ్డుకోబోతున్నారనే భావన కలిగేలా మాట్లాడారు. కానీ ఊహించని విధంగా బిల్లుకి మద్దతు పలికి సీమాంధ్ర ప్రజలను, తెదేపాను కూడా విస్మయపరిచారు. బీజేపీ ఆవిధంగా చేస్తుందని బహుశః చంద్రబాబు కూడా ఊహించి ఉండరేమో.
బహుశః అందుకే ఆయన కూడా బీజేపీ అగ్రనేతలకు, ముఖ్యంగా నరేంద్ర మోడీకి గట్టిగా హెచ్చరికలు చేసి ఉండవచ్చును. లేకుంటే లోక్ సభలో బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు లాంచన ప్రాయమనుకొన్న బిల్లుకి ఈరోజు మోకాలు అడ్డి ఉండేవారుకారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి తెదేపాతో పొత్తులు, చంద్రబాబు సహకారం అత్యవసరం. తెదేపాతో పొత్తులు లేకపోతే బీజేపీ సీమాంధ్రలో తనంతట తానుగా ఒక్క సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు కల చంద్రబాబు బీజేపీని కాదని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పూనుకొంటే, ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం చెప్పట్టాలని బీజేపీ కల కలగానే మిగిలిపోవచ్చును, నరేంద్ర మోడీకి ప్రధాన మంత్రి కావాలనే కల కూడా కలగానే మిగిలిపోవచ్చును.
అందువల్ల విభజన బిల్లుని ఆపలేకపోయినా, కనీసం సీమాంధ్రకు భారీ ప్యాకేజీ సాధించయినా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.