పొత్తులపై నోరు మెదపని తెదేపా-బీజేపీ
posted on Mar 1, 2014 8:56AM
బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొందామని భావించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు ఇవ్వడంతో, కనీసం ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా ఎత్తలేకపోతున్నారు. అలాగని ఆయన ఇంతవరకు బీజేపీకి దూరం జరుగుతున్నట్లు కానీ, బీజేపీని విమర్శించడం గానీ చేయలేదు. అదేవిధంగా యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా ఇటీవలే స్థాపించబడిన ‘థర్డ్ ఫ్రంట్’ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. అయితే బీజేపీ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించిన తరువాత ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్ర ప్రజలలో పెల్లుబికిన ఆగ్రహాన్ని ప్రతిఫలించేందుకేనన్నట్లు, కొందరు తెదేపా నేతలు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కానీ ఆ తరువాత వారు కూడా చల్లబడిపోయారు. అదే విధంగా బీజేపీ అగ్ర నేతలెవరూ కూడా తెదేపాను విమర్శలకు ప్రతిస్పందించక పోవడం గమనార్హం. ఇవన్నీ కలిపి చూస్తే నేటికీ తెదేపా-బీజేపీలు పొత్తులకి సానుకూలంగానే ఉన్నట్లు భావించవచ్చును.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు కుదుర్చుకొంటే కాంగ్రెస్, వైకాపాలు రెండూ కలిసి, తెదేపాపై దాడి చేసే అవకాశం ఉంది గనుకనే బహుశః రెండు పార్టీలు వెనక్కి తగ్గి ఉండవచ్చును. అయితే ఇదే అదునుగా తెదేపా స్థానంలోకి వైకాపా ప్రవేశించాలని ఆశిస్తోందని ఆ పార్టీ అధినేతకు చెందిన సాక్షి మీడియాలో మోడీ అనుకూల కధనాలు చూస్తే అర్ధమవుతుంది. అంటే తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఒకలాగా, తాము పెట్టుకొంటే మరోకలాగా వైకాపా ప్రచారం చేస్తుందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఒకవేళ తెదేపా తమతో పొత్తులకు నిరాకరిస్తే, వైకాపాతో పొత్తులు పెట్టుకోకపోయినా తప్పకుండా ఆ పార్టీకి దగ్గరయి ఎన్నికల తరువాత ఆ పార్టీ మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ తెదేపాతో పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పవచ్చును.
నిన్న కర్ణాటకలోని గుల్బర్గా, హూబ్లీ నగరాల్లో ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ "తెలంగాణ ఏర్పడాలని, ఆ ప్రాంతంతోపాటు, సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంది. కానీ.. ప్రసవ సమయంలో బిడ్డ (తెలంగాణ)కు జన్మనిచ్చి తల్లి (సీమాంధ్ర)ని చంపిన డాక్టర్‌లాగా కాంగ్రెస్‌పార్టీ వ్యవహరించింది. కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ప్రజలు కొట్టుకునేలా చేస్తారు. దేశాన్ని, రాష్ట్రాలను, హృదయాలను ముక్కలు చేయడానికి కూడా వెనుకాడరు. సీమాంధ్ర కూడా ఈ దేశంలో ఒక భాగమే. కానీ, కాంగ్రెస్ పక్షపాత వైఖరి అవలంబించి సీమాంధ్రను అనాథగా చేసింది. అక్కడ తమ పార్టీకి తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున ఈ ఎన్నికలలో గెలవడం కష్టమని గ్రహించినందునే ఈవిధంగా పక్షపాత ధోరణితో వ్యవహరించింది. తెలుగుజాతిని ఘోరంగా అవమానించి, సీమాంధ్రను అనాధను చేసింది. త్వరలోనే సీమాంధ్రలో పర్యటించి గాయపడిన ప్రజల హృదయాలను సేద తీర్చే ప్రయత్నం చేస్తాను. వారి ఆవేదనను, బాధను పంచుకుంటానని" సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు.
త్వరలోనే మోడీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభకు వస్తునందున, ఆయన ప్రభావంతో సీమాంధ్రలో బీజేపీపై వ్యతిరేఖత తగ్గవచ్చు గనుక, ఆయన మొదటి విడత ప్రచారం ముగియగానే ఆ రెండు పార్టీలు పొత్తులకు సిద్దపడవచ్చును.