ఇక అందరి కళ్ళు చంద్రుడి పైనే

  కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయిపోవడంతో ఇక అందరి దృష్టి చంద్రబాబుపై పడింది. జూన్ 8న గుంటూరు సమీపంలో గల నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చచకా జరిగిపోతున్నాయి. నిన్న తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కేసీఆర్ ని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, ఇతర పార్టీల నేతలను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రితో సహా కేంద్రమంత్రులను ఆయనే స్వయంగా తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తున్నారు.   ఇక చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది, ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే అంశంపై చాలా జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా యం.యల్యేల సంఖ్య సగానికి సగం తగ్గిపోయినందున, ఆ నిష్పత్తిలోనే మంత్రుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కనుక, మంత్రి పదవుల కోసం పోటీ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. అందువల్ల చంద్రబాబుకు మంత్రివర్గం కూర్పు కత్తిమీద సామువంటిదేనని చెప్పవచ్చును. ఇక ఇల్లలకగానే పండగ కాదన్నట్లు,ఎన్నికలలో గెలిచి ప్రభుత్వపగ్గాలు చెప్పట్టగానే సంబరాపడేందుకు ఏమీ లేదు.   ప్రభుత్వ నిర్వహణకు కనీసం సరయిన కార్యాలయం కూడా లేని దుస్థితిలో వేలకోట్ల లోటు బడ్జెట్ తో ఆయన పరిపాలన మొదలుపెట్టబోతున్నారు. పైగా కొత్త రాజధాని నిర్మాణం, రుణాల మాఫీ హామీలు, సంక్షేమ పధకాలు, ఎన్నికలలో వివిధ వర్గాల ప్రజలకు పెన్షన్ల విషయంలో ఇచ్చిన హామీలు అన్నిటికీ ఆయన భారీగా నిధులు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు ఆయన మోడీ ప్రబుత్వంపైనే చాలా ఆశపెట్టుకొన్నారు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడే కొత్తగా అధికారం చెప్పటింది గనుక నిధుల విడుదలలో ఆలస్యమయితే అంతవరకు చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. అయితే గతంలో కూడా చంద్రబాబు అధికారం చేప్పట్టినపుడు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ ఆయన నెగ్గుకు రాగలిగారు. కనుక ఈసారి మరి కొంచెం కష్టమయినా తప్పకుండా నెగ్గుకు రాగాలరనే నమ్మకం ఉంది.   ఆదాయం లేనప్పుడు ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చును. కనుక చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుండే పొదుపు మంత్రం పాటించడం మేలు. అది తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంతోనే మొదలుపెట్టవచ్చును. ఇక కొన్ని విషయాలలో ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోవడం మంచిది. నరేంద్ర మోడీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టక మునుపే కొన్ని మంత్రిత్వ శాఖలను విలీనం చేయించి తన మంత్రి వర్గం సైజు కుదించుకొన్నారు. తద్వారా అదనపు భారం తగ్గించుకొన్నారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే విదేశాలలో మూలుగుతున్న నల్లదనం వెనక్కి రప్పించేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి నేతృత్వంలో ‘సిట్’ ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక పనికిమాలిన జీ.ఓ.యం.లను రద్దు చేసి అనవసర భారం తగ్గించుకొన్నారు. దేశంలోకి కొత్తగా భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు రావాలంటే వివిధ ప్రభుత్వ శాఖలలో ఫైళ్ళు వేగంగా కదిలి అనుమతులు వేగంగా మంజూరు అవ్వాలి. అందుకే ప్రభుత్వ శాఖలలో ఫైళ్ళకు స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్న అధికారులను, నియమావళిని ఒకటొకటిగా సరిచేస్తున్నారు.   అందువల్ల చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం మంచిదే. మంచి పరిపాలనా దక్షుడని పేరుగాంచిన చంద్రబాబు ముందు రాష్ట్ర ప్రభుత్వశాఖలనన్నిటి మధ్య సమన్వయ పరిచి వాటిని నూటికి నూరు శాతం సమర్ధంగా పనిచేయించగలిగితే చాలా వరకు సమస్యలు అధిగమించవచ్చును. అదేవిధంగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను, ముఖ్యంగా అతితక్కువ కాలంలోనే స్థాపించి, యువతకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం సృష్టించగల సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించే ప్రయత్నాలు చేస్తే మేలు.

తెలంగాణా ప్రజల కలలు నెరవేరిన శుభవేళ...

  ఈరోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించడంతో తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. వారి పోరాటాలకు, బలిదానాలకు, ఆశలకు ప్రతీకగా ఏర్పడుతున్న రాష్ట్రం ఇది. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలిసిన అనేక కారణాల వలన, అవి అర్ధాంతరంగా ముగిసిపోయాయి. కానీ, తెలంగాణా ప్రజలలో ఆ ఆకాంక్ష మాత్రం నివురు గప్పిన నిప్పులా మిగిలే ఉంది. దానిని గుర్తించిన కేసీఆర్ 2001 సం.లో తెరాసను స్థాపించి, మళ్ళీ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. అయితే అప్పుడెవరూ ఆయన ఇంతవరకు పోరాడగలరని కానీ, ఆయన తెలంగాణా సాధించగలరని గానీ నమ్మలేదు.   కానీ కేసీఆర్ తన పోరాటం ఆపకుండా కొనసాగించడంతో, క్రమంగా ఆయన నాయకత్వ లక్షణాలపై తెలంగాణా ప్రజలకు నమ్మకం కలగింది. దానితో ఆయన పోరాటాలు ప్రజా ఉద్యమ రూపం సంతరించుకొన్నాయి. కానీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవి కొంచెం చల్లబడిపోయినట్లు కనిపించినా, ఆయన మరణాంతరం మళ్ళీ తీవ్రతరం అయ్యాయి. కేసీఆర్ 2009లో ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో అవి పతాక స్థాయికి చేరుకొన్నాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది.   ఆ తరువాత నుండి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు ఆడిన రాజకీయ చదరంగాన్ని తెలుగు ప్రజలందరూ కనులారా చూసారు. చివరికి అత్యంత నాటకీయంగా 2014, ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది. దానితో తెలంగాణా ప్రజల పోరాటాలకు, బలిదానాలకు ఒక అర్ధం, పరమార్ధం ఏర్పడినట్లయింది. ఈరోజు అధికారికంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణా ప్రజలెన్నుకొన్న కొత్త ప్రభుత్వం కూడా ఈరోజే ఏర్పడుతోంది.   ఇంతవరకు పరాయిపాలనలో మగ్గుతున్నామనే భావనతో ఉన్న తెలంగాణా ప్రజలు, నేడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంగా ఉన్నారు. ఇకపై తమకు అన్నీ మంచి రోజులేననే గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం ప్రజలందరిలో కనబడుతున్నాయి. అందుకే తెలంగాణా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలలో మునిగితేలుతున్నారు. వారి కళ్ళలో ఈ సంతోషం, హృదయాలలో ఆనందం కలకాలం నిలిపే బాధ్యత ఈరోజు తెలంగాణా మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పైనే ఉంది.   గత పదేళ్లుగా ఆయన తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటాలు ఒక ఎత్తయితే, తనపై పూర్తి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, వారు తనపై పెట్టుకొన్న ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తెలంగాణాను త్వరితగతిన ప్రగతిపధంలో నడిపించడం మరో ఎత్తు. ఆయన ఇంతకాలంగా తెలంగాణా ప్రజల ఉద్యోగాలను, భూములను, నీళ్ళను అన్నిటినీ కూడా ఆంద్ర ప్రజలు, పాలకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దోచుకోన్నారని, అందువల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే వారి జీవితాలు మళ్ళీ బాగుపడతాయని వాదిస్తూ, వారి నమ్మకాన్ని చూరగొని చివరికి తెలంగాణా సాధించగలిగారు. ముఖ్యమంత్రి కూడా అవగలిగారు. అందువల్ల ఇకపై దోపిడీకి ఆస్కారం లేని రాజ్యం ఏర్పడింది గనుక, ఇక తెలంగాణా ప్రజల కష్ట సుఖాలకు, మంచి చెడ్డలకు అన్నిటికీ పూర్తిగా తెలంగాణా పాలకులదే బాధ్యత అవుతుందనే విషయం సదా గుర్తుంచుకొని ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా పరిపాలించవలసి ఉంటుంది.   ఇంతవరకు రాష్ట్రా సాధన కోసం చేసిన పోరాటాలలో తెరాస నేతలు కనబరిచినటువంటి స్పూర్తినే ఇకపై తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతూ తెలంగాణాను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుకొందాము.   తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేసిన అమరవీరులందరికీ తెలుగువన్ జోహారు పలుకుతోంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేతలకి, తెలంగాణా ప్రజలందరికీ తెలుగువన్ శుభాబినందనలు తెలియజేస్తోంది.

కేసీఆర్ ప్రభుత్వానికి వైకాపా అంశాల వారి మద్దతు!

  ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలకు మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి చాలా సార్లు ప్రశ్నించినా దానికి వారిరువురు నుండి సమాధానం రాలేదు. ఆ తరువాత మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనగా, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఘనవిజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అంతేకాదు..జగనేమీ అంటరానివాడు కాదని, అతనితో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అన్నారు.   కేసీఆర్ రాష్ట్ర విభజన కోసం పోరాడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి. కనుక సహజంగానే కేసీఆర్ కి బద్ద విరోధిగా పరిగణింపబడి ఉండాలి. కానీ వారిరువురూ నేటికీ మంచి మిత్రులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వారిరువురూ ఒకరినొకరు ఎన్నడూ విమర్శించుకోలేదు. ఒకరి దారికి మరొకరు అడ్డు తగలలేదు. చివరికి ఇప్పుడు పోలవరం ముంపు గ్రామాల విషయంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ని పల్లెత్తుమాటనలేదు.   కొద్ది రోజుల క్రితం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటిస్తే, ఈరోజు వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడిన నెల్లూరు యంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైకాపా కేసీఆర్ ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తుందని కేసీఆర్ అడగక ముందే ప్రకటించడం విశేషం.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్నచంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తో కలిసి పని చేసేందుకు సిద్దమని పదేపదే చెపుతున్నప్పటికీ, కేసీఆర్ ఆయనపై కత్తులు దూస్తూన్నారు. జగన్ తో మాత్రం దోస్తీకి సై అంటున్నారు. ఇంతకాలంగా  ఆంధ్రా ప్రజలను కేసీఆర్ అనరాని మాటలు అంటున్నా, వారిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తానని అవమానకరంగా మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. పైగా ఇప్పుడు ఆయన అడగక మునుపే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తూర్పుపడమర వంటి వీరిరువురు, రాష్ట్రాలు, పార్టీలు, సిద్దాంతాలు అన్నీ వేరయినా కూడా ఒకరికొకరు ఇంత గొప్పగా అభిమానించుకోవడం, సహకరించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వారిరువురి స్నేహం నేటికీ ఒక మిష్టరీగానే మిగిలిపోయింది.

ఉందిలే మంచి కాలం ముందు ముందునా...

  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు చెపుతున్న మాటలు వింటుంటే, రానున్న ఐదేళ్ళలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని హంగులను ఏర్పరచుకొని, ఆర్ధికంగా నిలదొక్కుకొని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడగలదనే నమ్మకం కలుగుతోంది. విజయవాడ-గుంటూరు నగరాలను మెట్రో నగరాలుగా తీర్చిదిద్దడం, వైజాగ్-విజయవాడ-గుంటూరు నగరాల మధ్య మెట్రో రైలు ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారం, విజయవాడ, విశాఖలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలో ఐఐటీ, యన్.ఐ.టీ. తదితర ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, వైజాగ్ లో ప్రత్యేక హైకోర్టు, రాష్ట్రానికి కొత్త రైల్వే జోను, వెనుకబడిన ఉత్తరాంధ్రా, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వంటివి అనేకం తమ ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూర్చబోతోందని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే ఈ హామీలు ఎంతవరకు అమలు చేసి చూపిస్తారో రానున్న ఐదేళ్ళలోనే తేలిపోతుంది.   ఒకవేళ తెదేపా, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపినట్లయితే, వచ్చే ఎన్నికలలో కూడా ప్రజలు వారికే పట్టం కడతారు. దేశంలో ప్రజలందరూ సత్వర అభివృద్ధిని కోరుకొంటున్నారు. ఇకనయినా తమ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశిస్తున్నారు. అందుకే మోడీ, చంద్రబాబుల మాటలను విశ్వసించి వారికి పట్టం కట్టారు. అందువల్ల వారిరువురూ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేయవలసి ఉంది. ప్రస్తుతం వారిరువురూ కూడా ఆవిధంగానే ముందుకు కదులుతున్నారు.   నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తన మంత్రి వర్గ సభ్యులకు 100రోజుల అజెండా ఇచ్చి, అందుకు అనుగుణంగా పనిచేయవలసినదిగా ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకు మంత్రుల పనితీరును, ప్రగతిని స్వయంగా తాను పరిశీలిస్తానని ముందే హెచ్చరించారు. అంతేకాక వారికి పది మార్గదర్శకాలు కూడా జారీ చేసారు. ఇక చంద్రబాబు కూడా ఇంకా ముఖ్యమంత్రి బాధ్యతలు చెప్పట్టక మునుపే పని మొదలు పెట్టేసారు. అందుకు ఆయనను అభినందించవలసిందే. శుక్రవారం ఆయన డిల్లీ వెళ్లి అనేకమంది కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి వారి సహాయ సహకారాలు అర్దించారు. దానికి వారు కూడా సానుకూలంగానే స్పందించారు.   గత పదేళ్లుగా కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంత చొరవ తీసుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్రాభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించింది. కానీ ఇప్పుడు కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ వాటి మధ్య చక్కటి అవగాహన, సహకార ధోరణి, సంకల్పదీక్ష స్పష్టంగా కనబడుతున్నాయి. బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే నమ్మకం కలుగుతోంది.

తెలంగాణకు సేవ చేసిన సీమాంధ్రులు వద్దు, ఆదివాసీలు ముద్దు?

  ఈరోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తిచేత మెడ పట్టించుకొని గెంటించుకొనే పరిస్థితి వస్తుందని ఊహించని అనేకమంది సీమాంధ్ర ప్రజలు, దశాబ్దాలుగా హైదరాబాద్ నే తమ స్వస్థలంగా భావిస్తూ, ఆంద్ర, తెలంగాణా అనే తారతమ్యం తెలుసుకోకుండానే వాటి అభివృద్ధికి తమ జీవితాలను ధారపోసారు. వారిలో కొందరు కొన్ని నెలలలో, మరి కొందరు రెండు మూడు సం.లలో పదవీ విరమణ చేయనున్నారు. అనేకమందికి ఇంకా చాలా సర్వీసు మిగిలి ఉంది.   రాష్ట్రవిభజనలో భాగంగా వారిలో కొందరు ఆంధ్రప్రదేశ్, మరికొందరు తెలంగాణా ప్రభుత్వాలకు కేటాయించబడ్డారు. వారందరూ తమ సేవలకు ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం లేదు. కానీ సగౌరవంగా పదవీ విరమణ చేసి, ప్రశాంతంగా శేష జీవితం గడిచిపోతే చాలని కోరుకొంటున్నారు. వారందరూ గత మూడు నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ లో స్థిరపడినందున, వారి పిల్లలు కూడా తెలంగాణాలో పుట్టిపెరిగి, అక్కడే చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసుకొంటూ తాము కూడా తెలంగాణా వాళ్ళమేనని భావిస్తారు తప్ప తాము ఆంధ్రావాళ్ళమని ఏనాడు అనుకోరు.   కానీ ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టనున్నకేసీఆర్, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులకు ఆప్షన్లు ఉండవని, తెలంగాణా సచివాలయంలో ‘కల్తీకి’ అంగీకరించబోమని, వారు సచివాలయం గుమ్మంలో అడుగుపెట్టడానికి కూడా అంగీకరించమని హెచ్చరిస్తుంన్నారు. ఇప్పుడు కట్టుబట్టలతో తమను బయటకు పొమ్మని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెపుతుంటే తాము ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి.   తమ వాదనలో చాలా న్యాయం, ధర్మం ఉన్నాయని గట్టిగా వాదించే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, పోలవరం ముంపు గ్రామాలకు మాత్రం ఇదే సూత్రం వర్తించదని అడ్డుగోలుగా వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రంలో వృధాగా పోతున్న నదీ జలాలను ఒడిసిపట్టి లక్షలాది ఎకరాలకు సాగు నీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించే పోలవరం ప్రాజక్టు నిర్మాణం కోసం, ఏడు మండలాలో గ్రామాలను ఆంధ్రాలో కలపడం, ఆ గ్రామాలలో నివసించే ఆదివాసీలను ఖాళీ చేయించడం చాలా అన్యాయమని, వారిని ఉన్నపళంగా ఊరువిడిచి పొమ్మంటే వారి పరిస్థితి ఏమిటని? కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణా బంద్ చేయించారు.   హైదరాబాద్ మరియు తెలంగాణా ప్రాంతాలలో మూడు నాలుగు దశాబ్దాలుగా స్థిరపడిన సీమాంధ్ర ప్రజలకు, పోలవరం ముంపు ప్రాంతాలలో స్థిరపడిన ఆదివాసీలకు కేసీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరు సిద్దాంతాలు సూత్రాలు అమలుచేయాలనుకోవడం చూస్తే వారికి సీమాంధ్ర ప్రజల పట్ల ఎంత విద్వేషం ఉందో స్పష్టం చేస్తోంది. నిజానికి కేసీఆర్ చేస్తున్న పోరాటం పోలవరం ముంపు గ్రామాలలో నివసించే ఆదివాసీల కోసమా? లేక తాము ద్వేషిస్తున్నఆంద్ర ప్రభుత్వం పైనా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఎవరూ కూడా ఆదివాసీలను ఆదుకొంటామని ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ వారి గ్రామాలన్నీ ఆంధ్రాలో కలపబడుతున్నందున, వారందరినీ తమ ప్రభుత్వం ఆదుకొంటుందని చంద్రబాబు ప్రకటించారు.

కేసీఆర్ తెలంగాణా బందుకు పిలుపునీయడం సమర్ధనీయమేనా?

  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ కేసీఆర్ రేపు తెలంగాణా బందుకు పిలుపునిచ్చారు. కేసీఆర్ తమ పార్టీ ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా ఏదో ఒక సాకుతో సీమాంధ్రులతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు తప్ప ఏనాడు కూడా సామరస్యంగా వ్యవహరించలేదు. అయినప్పటికీ చంద్రబాబు చొరవ చూపుతూ తాను ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఇరువురూ కూర్చొని సమస్యలను చర్చించుకొని సామరస్య ధోరణిలో పరిష్కరించుకొందామని స్నేహహస్తం అందించినప్పటికీ, దానికి కేసీఆర్ నుండి కనీస స్పందన లేదు.   కానీ కేంద్రం పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపబోతోందనే సంగతి రూడీ అయిన తరువాత, ఈ సమస్య గురించి ఇరువురు ముఖమంత్రులు చర్చించుకొని పరిష్కారం కనుగొనవలసి ఉందని, అందువల్ల మోడీ ప్రభుత్వం ఇరువురు ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. ఇదే విజ్ఞత ఆయన మొదటే కనబరిచి చంద్రబాబుతో చర్చలు మొదలు పెట్టి ఉండి ఉంటే, బహుశః ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో? తద్వారా వారిరువురి మధ్య ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, రేపు తెలంగాణా బంద్ కు పిలుపునీయడం ద్వారా, రానున్న ఐదేళ్ళలో తన పాలన ఏవిధంగా ఉండబోతోందో తెలంగాణా ప్రజలకు అప్పుడే రుచి చూపిస్తున్నట్లున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈవిధంగా బందులు, సమ్మెలకు పిలుపునిస్తుంటే, ఇప్పటికే ఉద్యమాలతో ఘోరంగా దెబ్బ తిన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బ తినడం ఖాయం. ఇటువంటి వాతావరణంలో కొత్తగా పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు ముందుకు రావడానికి వెనుకాడవచ్చును. ప్రస్తుతం ఉన్నవి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా ఆశ్చర్యం లేదు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదును కాపాడుకోవాలంటే, కేసీఆర్ ఇటువంటి యుద్దవాతావరణం సృష్టించే ఆలోచనలు విరమించుకోవడం చాలా అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముళ్ళ కిరీటం ధరించనున్న కేసీఆర్, చంద్రబాబు

  ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో అధికారం దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల యుద్దంలో విజేతలుగా నిలిచిన తెరాస, తెదేపాలు త్వరలో అధికారం చెప్పట్టబోతున్నాయి. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంతత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే వారిరువురు ఇంతగా పోరాడి గెలుచుకొన్న ఆ అధికారం వారికి పూలబాట మాత్రం కాదు. రాష్ట్రవిభజనతో ఊహించని అనేక సమస్యలు ఎదుర్కోబోతున్న వారిరువురికీ ముఖ్యమంత్రి పదవులు ముళ్ళ కిరీటం వంటివే. అయితే అది ధరించాలని వారే కొరుకొన్నారు గనుక, దానిని వారు చిరునవ్వుతో భరించవలసి ఉంటుంది.   మొదటగా జూన్ 2న కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోతున్నారు. 15మందితో ఏర్పాటుచేయబోయే ఆయన మంత్రివర్గంలో ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, తెరాస నేత ఈటెల రాజేందర్ తదితరులు ముఖ్యమయిన మంత్రిపదవులు పొందబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభుత్వ బాధ్యతలు చేప్పట్టిన తరువాత మళ్ళీ కొన్ని వారాలు లేదా నెలల తరువాత అవసరాన్ని బట్టి మరికొందరిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.   ఆయన విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి నీళ్ళు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలపై మొదట దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణాలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలను అడుగు పెట్టనీయమని ఆయన ముందే ప్రకటించడం వలన, ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను స్థాపనకు క్రుశిచేయవలసి ఉంటుంది. అయితే అది అంత తేలికగా అయ్యే పని కాదు. దేశ ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చెప్పట్టిన నరేంద్ర మోడీ, దేశ ఆర్ధిక వ్యవస్థపై పూర్తి పట్టు సాధించే వరకు బహుశః పెద్ద పెద్ద ప్రాజెక్టులను మంజూరు చేయకపోవచ్చును. అందువల్ల కేసీఆర్ తప్పనిసరిగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పతి సంస్థలకు ఆహ్వానం పలకవలసి ఉంటుంది.   ఇక వ్యవసాయానికి నీళ్ళు అందించాలంటే దానికి భారీ ప్రణాళికలు అవసరం. అయినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నఅంశమే కనుక దీని అమలుకు కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించవచ్చును. ప్రస్తుతం తెలంగాణకు ఆర్ధికంగా లోటు లేదు గనుక ఉద్యోగుల క్రమబద్దీకరణ, సంక్షేమ కార్యక్రమాలు వగైరా కూడా కేసీఆర్ మెల్లగా చేప్పట్టవచ్చును.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూన్ 8 ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారనే విషయం ఇంకా బయటకు పొక్కనివ్వలేదు. ఆయన కూడా మొదట చిన్న 15-20 మంది సభ్యులతో కూడిన చిన్న మంత్రివర్గంతోనే బాధ్యతలు చేప్పట్టి, ఆ తరువాత క్రమంగా విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   కేసీఆర్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు చాలా క్లిష్ట పరిస్తితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్దికసమస్యలకు తోడు, ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీలు, వివిధ సంక్షేమ పధకాల అమలు, కొత్త రాజధాని నిర్మాణం, హైదరాబాదు-గుంటూరు మధ్య తిరుగుతూ పరిపాలన సాగించవలసి రావడం వంటి అనేక సమస్యలున్నాయి.   వీటన్నిటినీ అమలు చేయాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం ఉంది. అందుకే ఆయన వారంలో ఒకరోజు డిల్లీ కూడా వెళ్లేందుకు యోచిస్తున్నారు. అయితే కేంద్రం నుండి నిధుల విడుదలలో జాప్యం అనివార్యం గనుక అంతవరకు ఆయన ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం గట్టిగా చేయవలసి ఉంటుంది. కానీ అందుకోసం ప్రజల మీద కొత్త పన్నులు వడ్డించే ఆలోచన చేస్తే మాత్రం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్, వైకాపాలకు అదొక ఆయుధంగా మారుతుంది. అందువల్ల చంద్రబాబు ఆర్ధికలోటుని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవలసి ఉంటుంది. ఆ పనిని ఆయన ఎంత త్వరగా, సమర్ధంగా చేయగలరనేదే ఆయన కార్యదక్షతకు పరీక్షగా భావించవచ్చును.

భారీ అంచనాల నడుమ మోడీ పట్టాభిషేకం

  ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ అసమర్ధ, అవినీతిమయపాలనతో విసిగిపోయిన ప్రజలు, కేవలం ఆయనపై నమ్మకంతోనే బీజేపీకి పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. యావత్ దేశ ప్రజలందరూ ఆయనపై కోటి ఆశలు పెట్టుకొన్నారు. ఒక సాధారణ ‘ఛాయ్ వాలా’ 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి పధంలో ఏవిధంగా ముందుకు నడిపించబోతున్నాడా? అని యావత్ ప్రపంచమూ ఆసక్తిగా చూస్తోంది.   ఇవన్నీ ఆయనపై తీవ్ర ఒత్తిడి కలిగించే అంశాలే. సచిన్ టెండూల్కర్ బ్యాటింగుకి దిగినప్పుడు, ఎవరయినా ఒక ప్రముఖ హీరో నటించిన సినిమా విడుదలవుతున్నపుడు ఏవిధంగా భారీ అంచానాలు ఉంటాయో, అంతకంటే కొన్ని వేల రెట్లు భారీ అంచనాలు దేశ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న నరేంద్ర మోడీపై ఉన్నాయి.   ఎన్నికలలో బీజేపీకి విజయావకాశాలు పెరగడంతోనే దేశంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో గుర్రాల్లా పరుగులు తీయడం మొదలు పెట్టాయి. నేడు మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోతుండటంతో షేర్ మార్కెట్ మరింత చురుకుగా కదులుతోంది. రూపాయి విలువ బలపడింది. బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. దేశంలో సత్వర పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్య, విద్యుత్, రవాణా వంటి కొన్ని రంగాలపై తాను ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించడంతో, దేశంలో దాదాపు అన్ని వ్యవస్థలు ఏదో రూపంలో వాటితో అనుసంధానమయ్యున్నందున, దేశంలో చాలా అశావాహక, సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.   మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన తరువాత ఆ కుర్చీలో కూర్చొని దేశాన్నిపాలించాలని కలలుగన్నరాహుల్ గాంధీ ఇరువురూ కూడా దేశంలో అన్ని సమస్యలను రాత్రికి రాత్రే తీర్చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏమీ లేదని అని చాలా నిరాశాజనకంగా మాట్లాడేవారు. మోడీ కూడా రాత్రికి రాత్రే దేశంలో సమస్యలన్నీ పరిష్కరించేస్తానని ఏనాడు చెప్పలేదు. కానీ ఆయన వారిరువురిలా ఏనాడు కూడా నిరాశ, నిస్పృహలతో మాట్లాడలేదు.   దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, తాను తప్పకుండా దేశాన్ని మళ్ళీ గాడిన పెడతానని, దేశానికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు పూర్తి భరోసా ఇస్తున్నారు. ఆ సానుకూల, ఆశవాహక దృక్పధమే ప్రజలలో ఆయనపై నమ్మకం కలిగేలా చేసింది. దేశాన్ని నడిపించే వ్యక్తి ఆ దైర్యం, ఆత్మవిశ్వాసం కనబరిస్తే, దేశ ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు కూడా ప్రభుత్వంపై గురి కుదురుతుంది. అది అనేక క్లిష్ట సమస్యలను అవలీలగా పరిష్కరించేందుకు దోహదపడుతుంది.   ఒక బీద కుటుంబం నుండి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీకి దేశ ప్రజల కష్టసుఖాలు, వారి సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. తనపై దేశప్రజలు కోటి ఆశలు పెట్టుకొన్నారనే సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించి, తన దీక్షాదక్షతలను చాటుకొన్న ఆయన దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పధంలో నడిపిస్తారని ఆశించడం అత్యాస కాదు.

చంద్రబాబు అభివృద్ధికి, కేసీఆర్ గిల్లికజ్జాలకి ప్రాధాన్యం

  త్వరలో తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కేసీఆర్ నేటికీ ఆంధ్ర ప్రజల పట్ల విద్వేషాన్ని ప్రదర్శిస్తుండటం చాలా దురదృష్టకరం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాటం మొదలుపెట్టినపుడు, ఆయన తెలంగాణా ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు వారిలో ఈ విద్వేష భావనలను వ్యాపింపజేశారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన కల నెరవేరుతున్నప్పటికీ ఆయన ఆంద్ర ప్రజలు, పాలకులపై విషం కక్కుతూనే ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి వంటి ఒక గౌరవ ప్రధమయిన, అత్యున్నతమయిన పదవిని చెప్పట్టబోతున్న కేసీఆర్, ప్రభుత్వోద్యోగుల విషయంలో అంత హేళనగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్వయంగా తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నపుడు, ఈ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకొనే అవకాశం ఉంది. అవసరమయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కూడా. కానీ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాక నేటికీ ఒక ఉద్యమ నేతలాగే మాట్లాడుతూ, తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలలో అభద్రతాభావం కలిగిస్తున్నారు.   ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, చంద్రబాబుల వైఖరిలో తేడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నచంద్రబాబు, కేసీఆర్ కి స్నేహ హస్తం అందిస్తే, ఆయన నుండి ఇంతవరకు కనీస స్పందన కూడా లేదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో బాటు తెలంగాణా అభివృద్ధికి కూడా తను యధాశక్తిన సహకరిస్తానని, కేసీఆర్ తో కలిసిపనిచేస్తానని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు చొరవ చూపుతానని చెపుతుంటే, కేసీఆర్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు మాట్లాడుతున్నారు.   తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణాలో ఒక్క ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థను కూడా అడుగు పెట్టనీయమని కేసీఆర్ చెప్పడం అవివేకమే. చంద్రబాబు ఇంకా అధికారం చేప్పటక ముందే దేశవిదేశాలలోని పారిశ్రామికవేత్తలను, సాఫ్ట్ వేర్ కంపెనీలను, వ్యాపార సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించి వారిచే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కంపెనీలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేందుకు అప్పుడే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెడితే, కేసీఆర్ మాత్రం ఇంకా గిల్లికజ్జాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.   గత పదేళ్లుగా ఆయన చేసిన తెలంగాణా ఉద్యమాలతో తెలంగాణా అస్తవ్యస్తమయింది. ఉద్యమాల కారణంగా వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నాయి. ఇక హైదరాబాదులో స్థిరపడిన సినీ పరిశ్రమ, ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అటువంటప్పుడు కేసీఆర్ వారందరికీ దైర్యం కలిగేవిధంగా మాట్లాడకపోగా వారి భయాలను మరింత పెరిగేలా మాట్లాడుతున్నారు.   అనేక ఆర్ధిక సమస్యలకు తోడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవలసిన దుస్థితిలో ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా సానుకూల వాతావరణం కనబడుతోందంటే అందుకు కారణం చంద్రబాబు సమర్ధతపై ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. కానీ అన్నివిధాల అభివృద్ధి చెంది ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణాలో ఒక అనిశ్చిత, అభద్రతా వాతావరణం కనబడుతోంది అంటే అందుకు కేసీఆర్ వైఖరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరివల్ల తెలంగాణాకు, ప్రజలకు కూడా ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదు.

పవన్ కళ్యాణ్ కి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తున్నారా?

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ణి ఇటీవల ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించడంతో ఆయనకు బీజేపీ ఎంతటి ప్రాధాన్యం ఇస్తోందో అందరికీ అర్ధమయింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయనకున్న అపారమయిన జనాధారణను చూసి నరేంద్ర మోడీ సైతం చాలా ఆశ్చర్యపోయారు. ఆయనను ప్రశంశలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రచారం వలన ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ఓట్లశాతం మరింత పెరిగింది. అందుకే  చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ణి కూడా కీలకమయిన ఎన్డీయే సమావేశానికి బీజేపీ  ఆహ్వానించిందని ప్రజాభిప్రాయం.   ఈ సమావేశంలో బీజేపీ ఆయనకు కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్దపడిందని, కానీ ఆయన నిరాకరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ దృవీకరించలేదు. అలాగని ఖండించలేదు కూడా. అంటే ఆయనకు బీజేపీ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చునని భావించవచ్చును. కానీ ఎన్డీయే సమావేశం నుండి బయటకు వచ్చిన తరువాత తాను ఎన్నికలలో ఎన్డీయే కూటమిని బలపరిచినప్పటికీ తప్పులు చేస్తే వారినీ తప్పకుండా నిలదీస్తానని చెప్పడం గమానార్హం. తాను మోడీ, బాబు ప్రమాణ స్వీకారోత్సవాలకి హాజరుకాలేనని కూడా చెప్పడం మరో విశేషం. వారి కోసం ఎన్నికల ప్రచారం చేసి, తీరా చేసి వారు బాధ్యతలు స్వీకరిస్తున్నపుడు వెళ్లనని చెప్పడం దేనికో తెలియదు.   ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ ముందే చెప్పినట్లుగా తెదేపా, తెరాస ప్రభుత్వాలను, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మున్ముందు నిలదీయవచ్చును. వచ్చే ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్, అందుకోసం ఇప్పటి నుండే తన పార్టీని బలోపేతం చేసుకొంటానని ఇదివరకే చెప్పారు. బహుశః అందుకే ఆయన మంత్రి పదవులు వద్దనుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. అందుకే ఆయన తన సినిమాలను కూడా తగ్గించుకొంటానని చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.   అయితే పవన్ కళ్యాణ్ తను మద్దతు ఇచ్చిన పార్టీలను, వాటి ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజలలో నిలదీయడం మొదలుపెడితే అది తెదేపా-బీజేపీ ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు చేసిన అనేక ఎన్నికల హామీలను అమలుచేయమని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లయితే, ఆయన అభిమానులు, ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఆవిధంగా జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రజలలో మరింత ఆదరణ పెరుగవచ్చును. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నపవన్ కళ్యాణ్ణి, అలాగే దూరంగా ఉంచినట్లయితే, జనసేన పార్టీ క్రమంగా బలపడటమే కాకుండా, ఆయన నుండి మున్ముందు రెండు పార్టీలకు పెను సవాలు ఎదుర్కోక తప్పదు.   అయితే పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే, దానిని నడిపించడం మరో ఎత్తు. రెంటికీ కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి తన జేబులో చిల్లి గవ్వ కూడా లేదని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్, అది సంపాదించడానికి సినిమాలు కూడా చేయకుండా, రాజకీయ పార్టీని నడిపించగలరా? అనే ప్రశ్నను  పక్కనబెడితే, పవన్ కళ్యాణ్ణి ఎన్డీయే కూటమి బయట ఉంచితే అతని వల్ల తెదేపా-బీజేపీ ప్రభుత్వాలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ఆయనను కూడా ప్రభుత్వంలో పాలుపంచుకొనేలా చేయాలని తెదేపా-బీజేపీలు భావిస్తుండవచ్చును. కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ వాటితో కలిసి పనిచేసేందుకు నిరాకరించినట్లయితే, మున్ముందు ఆయన వల్ల ఆ రెండు పార్టీలకు సమస్యలు ఎదుర్కోకతప్పదని చెప్పవచ్చును.

తెలుగు ప్రజలకు మళ్ళీ మంచి రోజులు

  మళ్ళీ చాలా ఏళ్ల తరువాత తెదేపా, బీజేపీలు జత కట్టి, ఎన్నికలలో అఖండ విజయం సాధించి పూర్తి మెజార్టీతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెప్పట్టబోతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య మంచి సఖ్యత కూడా ఏర్పడటంతో, ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా చేరేందుకు అంగీకరించింది. అయితే ఎంతమందికి ఏఏ పదవులు ఇస్తారనే విషయం ఇంకా బయటపెట్టలేదు. నిన్న డిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సమావేశం అనంతరం ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వంలో బీజేపీ చేరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు.   బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నపటికీ, తన విజయానికి సహకరించిన అన్ని పార్టీలకు తన ప్రభుత్వంలో తగు ప్రాతినిధ్యం ఇవ్వాలని నరేంద్ర మోడీ పట్టుబట్టిన్నట్లు సమాచారం. తెదేపా-బీజేపీల మధ్య ప్రస్తుతం కనబడుతున్నసఖ్యత, సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభసూచికం. ఆ రెండు పార్టీలు తమ మైత్రిని ఇదే రీతిలో వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగించగలిగితే రాష్ట్రం ఊహించిన దానికంటే చాలా తక్కువ సమయంలో మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంత చక్కటి సంబంధాలు ఏర్పడటమే కాక, కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా మంచి సమర్ధులు, కార్యదక్షులు, దూరదృష్టికల మోడీ, చంద్రబాబులు అధికారం చెప్పట్టబోతున్నందున రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని భావించవచ్చును. తెలుగు ప్రజలు చక్కటి విజ్ఞతను కనబరుస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిరమయిన ప్రభుత్వాలను నెలకొల్పి ఇటువంటి సానుకూల వాతావరణం కల్పించగలిగారు. అందుకు వారందరినీ అభినందించవలసిందే.   తెలంగాణాలో ప్రజలు కూడా తెరాసకు పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టినందున అక్కడ ముఖ్యమంత్రిగా చేపడుతున్న కేసీఆర్ ఇకనయినా ఆంద్ర ప్రజల పట్ల, ఆంధ్ర పాలకుల పట్ల తన విద్వేష ధోరణి విడనాడి, సఖ్యతతో మెలుగుతూ తెలంగాణా అభివృద్ధికి గట్టిగా కృషిచేసినట్లయితే, కేంద్రంలో మోడీ కూడా ఆయనకు సహకరించేందుకు సంసిద్దంగా ఉన్నారు.   నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, మంచి పరిపాలన అందిస్తున్న కారణంగానే ప్రధానమంత్రిగా ఎన్నికయిన విషయం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తుంచుకొని తమ తమ రాష్ట్రాలను పోటీపడి అభివృద్ధి చేసినట్లయితే, మళ్ళీ వచ్చే ఎన్నికల సమయంలో ప్రజలను ఓట్లకోసం దేబీరించవలసిన అవసరం ఉండదు.

మార్పు అసాధ్యమని తేల్చి చెప్పిన కాంగ్రెస్

  ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఏకధాటిగా ఓడిపోతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక ఎన్నికలలో కూడా ఘోరపరాజయం పాలయి పార్టీ చరిత్రలో మరో సరికొత్త రికార్డు సృష్టించుకొంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, చివరికి అసెంబ్లీలో అడుగుపెట్టలేని దుస్థితికి చేరుకొంది. ఇక జాతీయ స్థాయిలో కనీసం యాబై సీట్లు కూడా సాధించలేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మరో ఘోర అవమానం.   ఎనబై యంపీ సీట్లున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలలో మాత్రమే గెలవగలిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పరువుకు సంబంధించిన విషయం కనుక, తమకు కంచుకోటవంటి రాయ్ బరేలీ, అమేథీ నుండి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడినందునే ఆ రెండు స్థానాల నుండి వారు గెలవగలిగారు.   ఈ ఎన్నికలలో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయి, ఇప్పుడు ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ పార్టీ కుచించుకు పోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సోనియా, రాహుల్ గాంధీలిరువురూ ఈ ఓటమికి తమదే బాధ్యత అని ప్రకటించుకొన్నారు. ఆ తరువాత ఈ ఓటమికి కారణాలను కనుగొనేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న సమావేశమయింది.   ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ గాంధీలు రాజీనామాలకు సిద్దపడటం, బయట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడం, ఊహించినట్లే కాంగ్రెస్ నేతలు వారి రాజీనామాలను ముక్తకంటంతో తిరస్కరించడం వంటి తంతులన్నీ చకచకా జరిగిపోయాయి. వివిధ రాష్ట్రాలలో పార్టీ ఓటమికి కారణమయిన పీసీసీ అధ్యక్షులను బాధ్యులను చేసి పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు మాత్రం ఆ సూత్రం వర్తించదని తేల్చి చెప్పారు. పార్టీకి ఈ గతి పట్టించిన వారిరువురే పార్టీని ఒడ్డున పడేయమని కోరుతూ కాంగ్రెస్ నేతలందరూ చేతులు జోడించి అభ్యర్ధించి మరీ వారిని ఒప్పించుకోగలిగారు. వారి రాజీనామాల వలన ఒరిగేదేమీ లేకపోయినా పార్టీకి మరింత నష్టం జరుగుతుందని ప్రధానమంత్రితో సహా అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో అధిష్టాన దేవతలిరువురూ వారిపై దయతో తమ రాజీనామా ఆలోచనని విరమించుకొన్నారు.   ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసేందుకు పెద్ద పనేమీ కూడా లేదు గనుక ఓటమికి కారణాలను ఆన్వేషించేందుకు, బహుశః నేడో రేపో మళ్ళీ ఆ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ఒక అరడజను కమిటీలు వేసి, పార్టీలో అటు వారిని ఇటు, ఇటువారిని అటు మార్చేసి ప్రక్షాళణా కార్యక్రమం కూడా పూర్తి చేసేయవచ్చును. ఎన్నికలలో ఓడిపోయిన ప్రతీసారి కూడా ఆత్మవిమర్శ చేసుకొంటామని చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మార్చుకొన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ కలిసి, అతి త్వరలోనే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం వంటి ఈ ఎన్నికల వైరాగ్యం నుండి కూడా బయటపడి మళ్ళీ యధావిధిగా సోనియా, రాహుల్ గాంధీల భజనలో తరించిపోవడం తధ్యం. అంతిమంగా తేలేదేమిటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఏపంధాలో నడుస్తోందో ఆవిధంగా నడిస్తేనే దానికి మనుగడ ఉంటుంది తప్ప, ఆ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తే ఈవిధంగానే కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ నేతలు మరోమారు ఋజువు చేయబోతున్నారు.

టీ-కాంగ్రెస్ పోస్టుమార్టం రిపోర్ట్

  కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఇది ముందు నుండి అందరూ ఊహించిందే. కానీ, తెలంగాణా ఇచ్చినప్పటికీ అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోవడమే చాలా ఆశ్చర్యం కలిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తెరాస కంటే స్వల్ప ఆధిక్యత ప్రదర్శించడంతో కనీసం 40-50 అసెంబ్లీ స్థానలయినా దక్కుతాయనుకొంది. కానీ కనీసం గౌరవ ప్రధమయిన స్థానాలయినా పొందలేక చతికిలబడింది.   పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం సహించలేని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మధు యాష్కీ వంటివారు ఓటమికి అతనే పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాల్వాయి మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర విభజనకు కారకుడయిన దిగ్విజయ్ సింగ్ ను కూడా తప్పు పట్టారు. రాష్ట్ర విభజన ఖరారు అయినప్పటికీ తెలంగాణకు పీసీసీ ఏర్పాటులో జాప్యం చేయడం, కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందనే విషయాన్ని బలంగా ప్రచారం చేసుకోకపోవడం, కేసీఆర్ ని తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు దూరంగా ఉంచడం ప్రధాన కారణాలని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమని చెప్పవచ్చును.   కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడి కాంగ్రెస్ నేతలు టీ-కాంగ్రెస్ నేతల కంటే  చాలా కలిసికట్టుగా ప్రచారం చేసారు. రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చాలా గట్టిగా చేసారు. బహుశః ఓటమి భయమే వారిని కలిసికట్టుగా పనిచేసేలా చేసింది. కానీ, విజయంపై చాలా ధీమాతో ఉన్న టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎన్నికలు దగ్గిరపడే వరకు కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం, తమకు, తమ బందుకోటికి టికెట్స్ సాధించుకోవడం కోసం సిగపట్లతో కాలక్షేపం చేసారు. ఆ తంతు పూర్తయిన తరువాత కూడా వారు ప్రమాదాన్ని గుర్తించలేక వారిలో వారు కీచులాడుకొంటూ ఎన్నికలకు వెళ్లి భంగ పడ్డారు.   కానీ, తెరాస నేతలు, వారి అధ్యక్షుడు కేసీఆర్ మాత్రం రాష్ట్ర విభజన బిల్లుకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన మరుసటి రోజు నుండే ఆ ఘనత తమదేనని బలంగా ప్రచారం చేసుకొని ప్రజలను తమవైపు తిప్పుకోగలిగారు. ఆ దైర్యంతోనే కేసీఆర్ తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పగలిగారు. రాష్ట్ర విభజన తరువాత తెరాసను విలీనం లేదా దానితో పొత్తుల కోసం కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, కేసీఆర్ అంగీకరించకపోవడానికి కారణం ఆ ఆత్మవిశ్వాసమే.   పాల్వాయి చెప్పినట్లు కేసీఆర్ ని తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు దూరంగా ఉంచడం కూడా అందుకు మరో కారణమని అంగీకరించవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం తెరాసను విలీనం చేసుకోవాలనుకొన్నప్పుడు, అతనిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేసిఉన్నట్లయితే, తెరాసను విలీనం చేసి ఉండేవారేమో. కానీ కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ ఇరువురూ ఏనాడూ కూడా ఒకరినొకరు నమ్మలేదు. ఎవరి జాగ్రత్తలో వారుంటూ ఇరువురు పావులు కదిపారు. చివరికి ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ నెగ్గారు.   కాంగ్రెస్ అధిష్టానం అతి తెలివికి తోడు, టీ-కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం, అతిశయం, పదవులు, టికెట్స్ కోసం కీచులాటలు, అనైక్యత అన్నీ వెరసి తెలంగాణాలో కాంగ్రెస్ కొంప ముంచింది. ఇప్పుడు ఇక చేసేపనేమీ కూడా లేదు గనుక టీ-కాంగ్రెస్ నేతలందరూ తీరికగా ఒకరినొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆత్మహత్యకి కారణాలెన్నో

  కర్ణుడి చావుకి వేయి కారణాలు, వేయి శాపాలు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కూడా అన్నీ కారాణాలు, శాపాలు (ప్రజల ఉసురు) ఉన్నాయని చెప్పవచ్చును. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కళ్ళు బైర్లు కమ్మేలా దేశప్రజలు తిరుగులేని తీర్పునిచ్చి తగిన గుణపాటం చెప్పారు. గత పదేళ్ళ పాలనలో కాంగ్రెస్ అవినీతి గురించి ప్రతిపక్షాలు, కోర్టులు,మీడియా ఎంత మొత్తుకొన్నా అందరినీ బేఖాతరు చేస్తూ రాజరిక పాలన సాగించి ప్రజాగ్రహానికి గురయింది. అందుకే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకున్న కోట్లాది భారతీయులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ చరిత్రలో ఇందిరా గాంధీ హయం తరువాత ఇంత ఘోర పరాభావం ఎన్నడూ ఎదురవలేదు.   కాంగ్రెస్ అసమర్ధ పాలనకు తోడు అంతులేని అవినీతి, ఎవరినీ లెక్క చేయని నిర్లక్ష్యధోరణి ప్రజలలో ఆ పార్టీని అసహ్యించుకొనేలా చేసాయి. ఇవి సరిపోవన్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతకానితనం గురించి ఎన్నికల సమయంలో పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా విడదీసి ఎన్నికల ముందు మరో ఘోర తప్పిదం చేసింది. ఆ ప్రభావం కేవలం ఆంధ్రాకే పరిమితమవలేదు. యావత్ దేశ ప్రజలు కాంగ్రెస్ అనుసరించిన పద్దతిని చూసి తీవ్రంగా అసహ్యించుకోవడం మొదలుపెట్టారు.   అయినప్పటికీ సోనియాగాంధీ మేల్కొనకపోగా అసమర్దుడయిన తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని దేశ ప్రజల నెత్తిన పెట్టాలని చూసింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అన్ని విధాల సమర్ధుడు, మంచి పరిపాలనా దక్షుడయిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో దిగడంతో, కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్న దేశ ప్రజలకు మోడీ రూపంలో ప్రత్యామ్నాయం కనబడింది.   నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడినప్పటి నుండి ఎదురయిన అన్ని అడ్డంకులను ఒకటొకటిగా అధిగమిస్తూ దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ, తనను తాను పరిచయం చేసుకొంటూ ప్రజలలో తనపట్ల అపోహలు తొలగించి, వారిలో మళ్ళీ నమ్మకం కలిగించగలిగారు. క్రమంగా మోడీకి ఆదరణ పెరుగుతున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీ అతనిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడంతో, ప్రజలలో మరింత పలుచన అయింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకపోయినప్పటికీ, కాంగ్రెస్ గెలిస్తే అతనే ప్రధాని కుర్చీలో కూర్చోవడం తధ్యం గనుక, ప్రజలు అతనిని మోడీతో బేరీజు వేసి చూసుకోవడంతో, అతని అసమర్ధత మరింత స్పష్టంగా కనబడింది.   ప్రధాని మొదలు ఒక సామాన్య కాంగ్రెస్ నేతవరకు అందరూ కూడా రాహుల్ గాంధీకి ఎర్ర తివాచీ పరిచి దాసోహమంటూ అతని వెనుక నడిచేందుకు సిద్దపడినప్పటికీ రాహుల్ గాంధీ ఆ సువర్ణావకాశాన్నిఉపయోగించుకోలేక చతికిలబడితే, నరేంద్ర మోడీకి స్వంత పార్టీ నుండే కాదు దేశంలో అనేక వర్గాల ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటూ, తన తెలివి తేటలతో, నాయకత్వ లక్షణాలతో వాటినన్నీ అధిగమించి చివరికి తన కల నెరవేర్చుకోవడమే కాక, తనకీ ఈ అద్భుతమయిన అవకాశం కలిగించిన తన బీజేపీకి మళ్ళీ పదేళ్ళ తరువాత అధికారం కట్టబెట్టి ఋణం తీర్చుకొన్నారు.   రాహుల్ గాంధీ పదేళ్ల పుష్కలమయిన సమయం దొరికినప్పటికీ తన చేతకానితనంతో దానిని సద్వినియోగించుకోలేని అసమర్ధుడుగా మిగిలిపోతే, కేవలం ఆరేడు నెలల కాలంలోనే నరేంద్ర మోడీ అనేక అగ్ని పరీక్షలు అన్ని దైర్యంగా ఎదుర్కొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొని మరీ ప్రజల ఆశీర్వాదం పొందారు. దేశ ప్రజల విజ్ఞతకు పరీక్షగా వచ్చిన ఈ ఎన్నికలలో భారతీయులందరూ నూటికి నూరు శాతం ఉతీర్ణులయ్యారని ఒప్పుకోవలసిందే.

సీమాంద్రా ఛాంపియన్ ఎవరు?

  ఇటీవల వరుసగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలలో ఏదో ఒకటి అధికారంలోకి రావచ్చని అర్ధమవుతోంది. ఇవి పట్టణ, గ్రామీణ ఓటర్ల అభిప్రాయాలను సమగ్రంగా ప్రతిబింబించే ఫలితాలు కనుక సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చును.   సర్వేలలో సిద్దహస్తుడని పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్, తెలంగాణాలో తెరాస, ఆంధ్రాలో తెదేపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం కూడా ఇంచుమించు స్థానిక సంస్థల ఫలితాలకు అనుగుణంగానే ఉంది. కానీ, నిన్న ఎన్డీటీవీ ఛానల్ ప్రకటించిన సర్వే ఫలితాలలో తెలంగాణా విషయంలో ఏకీభవించినా, ఆంధ్రాలో మాత్రం వైకాపాకి తెదేపాపై స్వల్ప ఆధిక్యత రావచ్చని ప్రకటించింది. తెదేపాకు 75-95అసెంబ్లీ, 13యంపీ సీట్లు, వైకాపాకు 80-100 అసెంబ్లీ, 12యంపీ సీట్లు రావచ్చని ప్రకటించింది.   మొన్న వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఆ ఫలితాలలో తెదేపా పట్టణ ప్రాంతాలతో బాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్పష్టమయిన ఆధిక్యత కనబరచగా, గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తుందని భావించిన వైకాపా ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఏ పార్టీ అయినా అన్ని ప్రాంతాలలో సరిసమానంగా ఓట్లు సాధించగలిగినప్పుడే విజయావకాశాలు ఉంటాయి. కానీ వైకాపాకు రెండు ప్రాంతాలలో ఏ ఒక్క చోట కూడా తెదేపాపై ఆధిక్యత చూపలేకపోయింది.   వరుసపెట్టి జరిగిన మూడు స్థానిక సంస్థ ఎన్నికలలో తెదేపాకే మొగ్గు చూపిన ప్రజలు, సార్వత్రిక ఎన్నికల సమయానికి అకస్మాత్తుగా మనసు మార్చుకొని వైకాపాకు ఓటు వేసి, జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడతారని చెప్పడానికి సహేతుకమయిన కారణాలు కనబడటం లేదు. కానీ తెదేపాకే ఓటేస్తారని చెప్పేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి.   స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయానికి తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కుదరలేదు. అందువల్ల ఆ ఎన్నికలలో పడిన ఓట్లు అన్నీ కూడా కేవలం చంద్రబాబు సమర్ధతకు, తెదేపా జెండాకు పడినవిగానే చెప్పుకోవచ్చును. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయని వైకాపా నేత మైసూరా రెడ్డే స్వయంగా చెప్పారు. అయితే అవేవీ వైకాపాకు అనుకూలంగా జరిగినవి కావు.   తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నాయి. ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లయితే తాను అన్నివిధాల ఆయనకీ సహకరిస్తానని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించారు. నరేంద్ర మోడీ స్వయంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడం కాకుండా, తాను ప్రధానమంత్రి అవగానే, ఆయనపై కేసుల విచారణను వేగవంతం చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు.   ఇక పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైకాపా సమాధానాలు చెప్పలేక తడబడి ఎదురుదాడికి దిగి ప్రజలలో మరింత పలుచనయింది. ఇవ్వన్నీ వైకాపాకు ప్రతికూలాంశాలే. అయినప్పటికీ, ప్రజలు ఎటువంటి పాలనానుభావం లేని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికే అధికారం కట్టబెడతారని ఎన్డీటీవీ ఛానల్ వారు ఊహించడం, ఆనందం కలిగించే ఆ ఊహలలో వైకాపా తేలియాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమయినప్పటికీ రేపు ఫలితాలు వెలువడగానే ఈ ఊహాగానాలకు కూడా తెరపడి ఎవరు అసలు సిసలయిన ఛాంపియనో తేలిపోతుంది.

తెదేపా తిరిగి అధికారంలోకి రానుందా?

  తెలుగుదేశం పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపటికీ, ఇటీవల జరిగిన మున్సిపల్, యంపీటీసీ. జెడ్.పీ.టీ.సీ. ఎన్నికలలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. పట్టణ ప్రాంత ఓటర్లు తెదేపాకు, గ్రామీణ ప్రాంత ఓటర్లు వైకాపావైపు మొగ్గు చూపవచ్చనే విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ అత్యధిక శాతం ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ ఫలితాలు రూడి చేసాయి. జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మల సభలకు, రోడ్ షోలకు అన్ని ప్రాంతాలలో మంచి స్పందన కనబడినప్పటికీ, అది ఓట్లుగా మారలేదని ఈ ఫలితాలు స్పష్టం చేసాయి.   వైకాపా ప్రభావం అది బలంగా ఉన్న కడప, కర్నూలు మరియు నెల్లూరు జిల్లాలకే పరిమితమని ఈ ఫలితాలు తెలియజేసాయి. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు సానుభూతి చూపుతున్నపటికీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని అనుభవరహితుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని చేతిలో పెట్టేందుకు సిద్దంగా లేరని అర్ధమవుతోంది. అందువల్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిష్పత్తిలో సార్వత్రిక ఫలితాలు వచ్చినట్లయితే, తెదేపా ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, భారీ మెజార్టీ మాత్రం రాకపోవచ్చును.   ఈ మూడు ఎన్నికలు కూడా తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు కుదుర్చుకోక ముందు జరిగినవే గనుక, ఇది చంద్రబాబు సమర్ధకు, అనుభవానికి ప్రజలు వేసిన ఓటుగానే భావించవచ్చును. ఈ స్థానిక ఎన్నికల తరువాత తెదేపా విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నందున అది కూడా తెదేపాకు సానుకూలాంశంగా మారవచ్చును. మంచి సమర్ధులు, పరిపాలనాదక్షులు అని పేరుగాంచిన నరేంద్ర మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ లో దేశం, రాష్ట్రం రెండూ కూడా మంచి ప్రగతి సాధించే అవకాశం ఉందని ప్రజలు విశ్వసిస్తునందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూడా సీమాంధ్ర ప్రజలు తెదేపావైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

రాజకీయ పార్టీలకు గుణపాటం చెప్పిన మున్సిపల్ ఫలితాలు

  నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అన్నిరాజకీయపార్టీలకు గుణపాటం వంటివని చెప్పవచ్చును. మాయమాటలతో, భూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూసే రాజకీయ నేతలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పగలరని నిన్నటి మున్సిపల్ తీర్పు ఋజువు చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక కంట ఆనంద బాష్పాలు, మరొక కంట కన్నీరు కార్చవలసిన విచిత్ర స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, దానిని టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ లాగ గట్టిగా ప్రచారం చేసుకోలేక పోయారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. కానీ, ప్రజాభిప్రాయానికి వీసమెత్తు విలువీయకుండా రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంద్రా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కటినంగా శిక్షించారు. ఇది రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించే తీర్పు అని చెప్పవచ్చును. అదేవిధంగా ఎటువంటి సిద్దాంతాలు లేకుండా ప్రజల భావోద్వేగాలను, సానుభూతిని వారి బలహీనతగా భావించి రాజకీయాలు చేసేవారికీ ఈ ఎన్నికలలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారనుకోవచ్చును.   రాజకీయంగా చైతన్యవంతమయిన ప్రజలను మభ్యపెట్టడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని ఈ మున్సిపల్ ఫలితాలు ఋజువు చేసాయి. ప్రజలు ఇప్పుడు సమర్ధమయిన పాలన కోరుకొంటున్నారని, అది అందించే వారికే తమ ఓటు అని మరొకమారు గట్టిగా చాటిచెప్పారు.అయితే ఇప్పటికే ప్రజలు అన్ని ఎన్నికలలో అంతిమ తీర్పు ఇవ్వడం జరిగిపోయింది గనుక, ఎన్నికలలో గెలిచిన రాజకీయ పార్టీలు ఇకనైనా తమ ఆలోచన ధోరణిలో, పద్దతులలో ప్రజానుగుణంగా మార్పు తెచ్చుకొని చక్కటి పరిపాలన అందించగలిగితే, ఓట్లకోసం ప్రజలను ఇంతగా ప్రాధేయ పడవలసిన అవసరం ఉండదని గ్రహించితే మేలు.

అవును వారిద్దరూ ఇష్టపడ్డారు

  కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్దపడిన రోజునే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దానివెనుక దాగి ఉన్నకుట్రను, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో చేసుకొన్న రహస్య ఒప్పందాలు గురించి ప్రజలకు చెప్పారు. ఆయన ఆరోపణలను అనేకమంది కాంగ్రెస్ నేతలు కూడా దృవీకరించారు. ఆ తరువాత తెదేపా-బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం ప్రస్తావించి జగన్, కేసీఆర్ లను ఎండగట్టారు. కానీ అప్పటికి ఇంకా ఎన్నికలు పూర్తి కానందున వారివురూ కూడా ఆ ఆరోపణలకు నేరుగా జవాబీయకుండా, విషయాన్ని పక్క దారి పట్టించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ప్రజలు నవ్వితే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు వచ్చారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటరారని వ్యక్తేమీ కాదని, ఆయనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, అదేవిధంగా తెలంగాణాలో అధికారంలోకి రాబోయే తాను అతనితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణాలకు సమ న్యాయం జరగాలని తెలంగాణా ఏర్పాటుకు సానుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడుకి ఆయన పిల్లి శాపాలు పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా ఇక తెదేపా కనబడకుండాపోతుందని, చంద్రబాబు నాయుడు అధ్యాయం ముగిసిందని కేసీఆర్ జోస్యం చెప్పారు.   ఆయన చంద్రబాబుని ఇంతగా ద్వేషించడానికి కారణం, ఆయన తెలంగాణాలో తనకు సవాలుగా మారడమే. జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావడానికి కారణం అతను తెలంగాణా నుండి బిచాణా ఎత్తేసి తెరాసకు అడ్డుతొలగడమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణాలో తన పార్టీని యధాతధంగా నిలుపుకొని, తెరాసకు పోటీ ఇచ్చినట్లయితే అప్పుడు అతను కూడా కేసీఆర్ శత్రువుల జాబితాలో ఉండేవారు. కానీ కాంగ్రెస్, కేసీఆర్, జగన్ లమధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం జగన్ రాత్రికి రాత్రి తెలంగాణా నుండి బిచాణా ఎత్తేసి కేసీఆర్ కు అడ్డుతొలగారు. కానీ తెరాస బలహీనంగా ఉన్న ప్రాంతాలలో సెటిలర్ల ఓట్ల కోసం తెదేపాతో పోటీ పడ్డారు. ఆంధ్రాలో కేవలం 25 యంపీ సీట్లే ఉన్నప్పటికీ, జగన్ సమైక్య ఉద్యమాలు చేస్తున్న సమయంలో తనకు 30 యంపీ సీట్లు కావాలని, వస్తాయని చెపుతున్నదీ అందుకే.   ఈవిధంగా కేసీఆర్, జగన్ ఒకరి పరిధిలోకి మరొకరు ప్రవేశించకుండా చాలా జాగ్రత్తపడుతూ ఇంతవరకు చాలా తెలివిగా కధ నడిపించారు. కేసీఆర్ విభజనవాది అయితే, జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది. వారిరువురు కూడా రాష్ట్ర విభజన కోరుకొన్నవారే. అందుకే ఏనాడు కూడా వారిరువురూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. ఇద్దరూ కలిసి తమకు తెర వెనుక నుండి మార్గదర్శనం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానంతో బద్దవైరం ఉన్నట్లు నటించారు. ఇక ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ఇక నిస్సిగ్గుగా తమ ముసుగులను తొలగించి ప్రజలకు తమ అసలు రూపాలు చూపిస్తున్నారు. ముగ్గురూ ఒకరికొకరు సహకరించుకొనేందుకు సిద్దపడుతున్నారు. బహుశః నేడో రేపో జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించవచ్చును. ఎన్నికలలో ఓట్లు సంపాదించుకొనేందుకు ఇంత కపటనాటకం ఆడి ప్రజలను మభ్యపెట్టిన వీరు నేటికీ నీతి సూక్తులు, నైతిక విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

కాంగ్రెస్ కొంపముంచనున్న సోనియా పుత్రవాత్సల్యం

  ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలకు అగ్నిపరీక్షగా నిలిచాయి. ఒకవేళ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ గనుక అధికారం దక్కించుకోగలిగితే, ఇక రాహుల్ గాంధీ ఇక తన జీవితంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. 15ఏళ్ల క్రితం గుజరాత్ రాష్ట్రంలో మోడీ అధికారం కైవసం చేసుకొన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆయనను ఓడించలేకపోయింది. పైగా  ఆయనే ఇప్పుడు కేంద్రంలో పాగా వేసేందుకు సిద్దమవుతున్నారు. ఒకవేళ ఆయన ప్రధాని కుర్చీలో స్థిరపడి దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టించగలిగితే, ఇక రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు అంధకారమే. ఈ విషమ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మున్ముందు రాహుల్ ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సెటిల్ అయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకోకుండా ఉండేందుకు, అదీ కుదరకపోతే కనీసం నరేంద్ర మోడీ ప్రధాని కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేయగలిగినంతా చేయడం తధ్యం.   సోనియాగాంధీకి తన కొడుకు అసమర్ధత గురించి తెలిసి ఉన్నప్పటికీ, తల్లి ప్రేమ ఆమె కళ్ళకు గంతలుగా మారాయి. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి పునాది వంటిదని ఆమెకు కూడా తెలిసి ఉన్నప్పటికీ అపారమయిన పుత్రవాత్సల్యంతో రాహుల్ గాంధీ అనే చాలా బలహీనమయిన పునాదిపై కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేసారు. తత్ఫలితంగా అతని రాజకీయ జీవితాన్ని, దానితో బాటు కాంగ్రెస్ పార్టీని, దానిపై ఆధారపడిన వేలాది కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోబోతున్నారు. ఒకవేళ సోనియాగాంధీ తన పుత్రవాత్సల్యాన్ని అధిగమించి, ప్రియాంకా గాంధీని గనుక అతని స్థానంలో నిలబెట్టి ఉండి ఉంటే నేడు కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేదేమో!   కానీ ఆమె తన అసమర్దుడయిన కొడుకుకే మొగ్గు చూపి అతనిని ప్రదానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, అనేక నీచరాజకీయాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, జగన్, కేసీఆర్ లతో రహస్య ఒప్పందాలు, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్ నాశనం చేయడం, ఇందుకు కొన్ని ఉదాహరణలు. బహుశః ఇతర రాష్ట్రాలలో కూడా ఇంతకు ఏమాత్రం తీసిపోని కపట రాజకీయాలు చేసే ఉండవచ్చును.   గత పదేళ్ళ కాంగ్రెస్ అసమర్ధ పాలనలో జరిగిన అవినీతికి తోడు ఈ నీచరాజకీయాలను కూడా చూస్తున్న ప్రజలు ఆపార్టీ పట్ల చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. నిత్యం నీతి సూక్తులు వల్లించే యువరాజావారు కూడా తమ కాంగ్రెస్ పార్టీ ఇంత అవినీతికి పాల్పడుతున్నా, అసమర్ధ పాలన చేస్తున్నా, నీచ రాజకీయాలు చేస్తున్నా కూడా మౌనం వహించి తాను కూడా సగటు కాంగ్రెస్ నేత మాత్రమేనని చాటుకొన్నారు. అందుకు ఆయన ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. సోనియాగాంధీ కన్నప్రేమకి ఆమె కొడుకు రాజకీయ భవిష్యత్తే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా బలయిపోబోతోంది.