తెదేపా-బీజేపీల మధ్య పొత్తుల కమలం వికసిస్తుందా

  మరొక నాలుగయిదు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నపటికీ, రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో రాజకీయ పార్టీలు వాటి కోసం కసరత్తు మొదలు పెట్టలేకపోతున్నాయి. దానిపై దృష్టి సారిస్తే, తమ రాజకీయ ప్రత్యర్ధులు సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ముందుకు దూసుకుపోతారనే భయమే వాటిని నిలువరిస్తోంది. అయితే కనీసం మరో నెల రెండు నెలలు కాలం పాటు సాగే ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎదురుచూస్తూ కూర్చొంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లే అవుతుందని గ్రహించిన తెదేపా ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే ప్రక్రియ సమాంతరంగా మొదలుపెట్టినట్లు సమాచారం.     బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తెదేపాతో సానుకూల సంకేతాల ఇచ్చిన తరువాత ఆ పార్టీతో తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. తెదేపాతో పొత్తులకు ఇష్టపడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఈసంగతి గ్రహించినందునే పదేపదే వ్యతిరేఖిస్తూ మాట్లాడుతున్నారు.   వారి అభ్యంతరాల కారణంగా బీజేపీ, తెదేపాలు తమ పొత్తులను కేవలం సీమాంధ్రకే పరిమితం చేసుకొంటాయా లేక తెలంగాణాలో కూడా కొనసాగిస్తాయా? అనే సంగతి కాంగ్రెస్-తెరాసల మధ్య ఏర్పడే బంధం బట్టి నిర్ణయం అవుతుంది. ఒకవేళ తెరాస, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోతే బీజేపీ తెదేపా కంటే తెరాసతో పొత్తులకే ప్రాధాన్యం ఈయవచ్చును. వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ గెలుపు తధ్యమని వెలువడుతున్న సర్వేనివేదికల నేపధ్యంలో తెరాస కూడా బీజేపీతో పొత్తులకి మొగ్గు చూపినట్లయితే, తెలంగాణాలో తెదేపా ఒంటరి పోరాటం చేయక తప్పదు.   ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని చూచాయగా ప్రకటించినప్పటికీ, ఒక కులం, మతానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వైకాపాతో పొత్తులకి బీజేపీ అంగీకరించే అవకాశం లేదు. అయితే ఎన్నికల అనంతరం అవసరమయితే వైకాపా మద్దతు స్వీకరించ వచ్చును. అందువల్ల సీమాంధ్రలో తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులకి ఎటువంటి అభ్యంతరమూ, ఇబ్బంది కూడా ఉండదు.   గతంలో ఎన్డీయే కూటమిలో ప్రధాన పాత్ర వహించిన చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఎన్డీయే సారధ్య భాద్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన సేవలు ఉపయోగించుకోవడం ద్వారా మళ్ళీ జేడీ(యూ) వంటి పార్టీలను కూడా ఎన్డీయే కూటమిలోకి తిరిగి రప్పించే వీలు కలుగుతుంది.   బీజేపీతో జతకడితే తన ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందని తెదేపా తొలుత కొంత బయపడినా, దేశ్యవ్యాప్తంగా క్రమంగా మోడీకి పెరుగుతున్న అన్నివర్గాల ఆదరణ చూసిన తరువాత బీజేపీతో పొత్తులు తన ముస్లిం వోటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపవని తెదేపా భావించడంతో రెండు పార్టీల మధ్య తెరవెనుక చర్చలు ఊపందుకొన్నాయి. ఈనెల 8న ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తరువాత ఏ క్షణంలోనయినా బీజేపీ-తెదేపాలు బహిరంగంగానే ఎన్నికల పొత్తుల గురించి ప్రకటన చేయవచ్చును.   రాష్ట్ర విభజన కారణంగా లెఫ్ట్ పార్టీలలో కూడా చీలిక రావడంతో ఈసారి సీపీయం పార్టీ మాత్రమే తెదేపాతో రెండు ప్రాంతాలలో పొత్తులకు సిద్దపడవచ్చును. అయితే సీపీఐ కూడా సీమాంధ్రలో మాత్రమే తెదేపాతో పొత్తులకి అంగీకరించవచ్చును. అయినప్పటికీ తెదేపా అందుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చును.   ఈసారి సమైక్యవాదం సెంటిమెంటుతో ఎన్నికలలో లబ్దిపొందాలని యోచిస్తున్న వైకాపాను డ్డీకొనేందుకు ఈవిధంగా పొత్తులు కుదుర్చుకొనగలిగితే అవి తేదేపాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల వాతావరణం

  రాష్ట్ర విభజనపై నెలరోజులు పైగా కసరత్తు చేసిన కేంద్రమంత్రుల బృందం, తెలంగాణా, రాయల తెలంగాణా అనే అంశంపై కేంద్రమంత్రి వర్గమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని సూచిస్తూ రెండు ప్రతిపాదనలతో తన తుది నివేదికను ఈ రోజు కేంద్రానికి సమర్పించబోతోంది. విభజన ప్రక్రియ కొలిక్కి వస్తున్నఈ దశలో కూడా సందిగ్దత కొనసాగడం కాంగ్రెస్ ప్రతిష్టని మసకబారుస్తోంది. అందువల్ల ఈరోజు తప్పని సరిగా దానిపై కేంద్ర మంత్రి వర్గం ఒక నిర్ణయం తీసుకొని దానిని ప్రకటించవలసి ఉంది.   ముందు ప్రకటించినట్లు తెలంగాణా ప్రకటిస్తే, తెలంగాణాలో ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ, తెలంగాణా బిల్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా రాష్ట్ర శాసనసభ గడప దాటే అవకాశాలుండవు. అలాగని శాసనసభ అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ మొండిగా ముందుకు సాగినట్లయితే రాష్ట్రపతి లేదా కోర్టులు లేదా పార్లమెంటులో ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే కాంగ్రెస్ పరువు గంగలో కలుస్తుంది.   ఈ సమస్యలను అధిగమించడానికి అది చేస్తున్న రాయల తెలంగాణా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తూ నేడు తెలంగాణా అంతటా బంద్ కొనసాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ దానికే మొగ్గు చూపినట్లయితే ఇక నుండి తెలంగాణాలో ఆందోళనలు, ఉద్యమాలు మళ్ళీ ఉదృతంగా మొదలవవచ్చును. రాష్ట్ర విభజన అంశం సరిగ్గా పరిష్కరించలేక నానా తిప్పలు పడుతున్నకాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన తెరపైకి తీవడంతో చేజేతులా సమస్యను మరింత జటిలం చేసుకొన్నట్లయింది.   ఇక రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే నానాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేఖంగా తయారవుతున్నాయి. రాష్ట్ర విభజన, తుఫాను సహాయం అందించడంలో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తదితర అంశాలపై రాష్ట్రంలో మొదలయిన ఆందోళనలకు ఇప్పుడు తాజాగా రాయల తెలంగాణాకు వ్యతిరేఖంగా తెరాస మొదలుపెట్టిన ఆందోళనలు కూడా తోడవడంతో రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి.   ఇక జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని దేశమంతా తిరుగుతూ అన్ని రాజకీయ పార్టీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రచారంతో యావత్ దేశం దృష్టి రాష్ట్ర రాజకీయాలు, విభజన అంశాలపై పడింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో కూడా వ్యతిరేఖత తప్పకపోవచ్చును.   ఇవి చాలవన్నట్లు వివిద మీడియా సంస్థలు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలలో బీజేపీ నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించే అవకాశాలున్నట్లు నిన్ననే ప్రకటించాయి. అంతే గాక 2014 ఎన్నికలలో కూడా బీజేపీయే విజయం సాదించే అవకాశాలున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సర్వే నివేదికలను చూసి ఉప్పొంగిపోతున్న బీజేపీ నేటి నుండి మొదలవనున్నపార్లమెంటు శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడిచేయవచ్చును.   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా వ్యతిరేఖ వాతావరణం కనిపిస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల నుండి కాంగ్రెస్ ఏవిధంగా బయటపడుతుంది? అసలు బయటపడగలదా లేదా? అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.

ఢిల్లీ పీఠం దక్కేదెవరికి?

  ఈ రోజు జరుగనున్న డిల్లీ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, అమ్ ఆద్మీ పార్టీలకు చాలా కీలకమయినవి. మూడు సార్లు వరుసగా డిల్లీ పీఠం దక్కించుకొన్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా దక్కించుకొనగలిగితే, అది కాంగ్రెస్ సుపరిపాలనను డిల్లీ ప్రజలు మెచ్చి పట్టం కట్టినట్లవుతుంది గనుక, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకు సానుకూల సందేశం అందిస్తుందని ఆశిస్తోంది. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా డిల్లీని పాలిస్తున్నషీలా దీక్షిత్ ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.   ఇక నరేంద్రమోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో గెలిచి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈసారి ఎలాగయినా డిల్లీ పీఠం దక్కించుకొని తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతూ అందుకోసం తీవ్రంగా శ్రమించింది. గత మూడు ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో భంగపడిన బీజేపీ ఈసారి తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా మార్చి డిల్లీలో మంచి పేరున్న డా.హర్ష వర్ధన్ ని తన అభ్యర్ధిగా ప్రకటించింది.   సామాజిక కార్యకర్త, ఒకప్పటి అన్నాహజారే అనుచరుడు అయిన అరవింద్ కేజ్రీ వాల్ స్థాపించిన అమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండు పెద్ద పార్టీల ఆశలకు గండి కొట్టవచ్చని సర్వేలు చాటుతున్నాయి. అయితే అమ్ ఆద్మీ పార్టీ గెలిచినా, గెలవకున్నాకాంగ్రెస్, బీజేపీల ఓట్లను చీల్చి వాటిని అధికారంలోకి రాకుండా అడ్డుపడగల శక్తి ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.   అమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల చిహ్నమయిన ‘చీపురుకట్ట’తో కలుషిత రాజకీయాలను పూర్తిగా తుడిచేసి, డిల్లీ వాసులకు నిజమయిన సుపరిపాలన అందిస్తానని ఇస్తున్నహామీలు డిల్లీ ప్రజలను బాగా ఆకర్షిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలు లోలోన చాలా కలవరపడుతున్నపటికీ, పైకి మాత్రం అసలు అమ్ ఆద్మీ పార్టీ లెక్కలోకే రాదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఈసారి ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.   కాంగ్రెస్, బీజేపీలు బ్రష్ట రాజకీయాలు చేస్తున్నాయని ఎన్నికలలో తెగ ప్రచారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, మళ్ళీ వాటికే మద్దతు ఇస్తారా లేక వాటి మద్దతుతోనే ముఖ్యమంత్రి అవుతారా? అనేది ఆసక్తికరం. అదే జరిగితే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కలుషిత రాజకీయ వ్యవస్థలో ఒక భాగమయిపోవడం ఖాయం.   ఈ రోజు జరిగే ఎన్నికలలో 70 శాసనసభ సీట్లకు మొత్తం 810మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 1.19 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. కొద్ది సేపటి క్రితమే పోలింగ్ కూడా మొదలయింది. డిల్లీతో సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, మిజోరం ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.

రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణా

    కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు, మళ్ళీ ఆఖరినిమిషంలో తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదనకు కూడా అన్నే కారణాలున్నాయి. అయితే అవి కాంగ్రెస్ పెద్దల ముచ్చట్లలో చాలా అద్భుతంగా అనిపించవచ్చునేమో కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం ఖాయం. ఇక ఈ ప్రతిపాదనకు కారణాలు చెప్పుకొంటే:   1. తెలంగాణకు రెండు కొత్త జిల్లాలను అతికించడం ద్వారా తెలంగాణాలో తన రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, తెరాస మరియు బీజేపీలను దెబ్బతీయడం. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, బీజేపీలకు అదనంగా వచ్చి జేరిన ఈ రెండు జిల్లాలో ఎటువంటి పట్టు లేదు గనుక కాంగ్రెస్ మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడవచ్చును.   2. ఈవిధంగా విభజిస్తే సీమాంధ్రలో కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చును. రెండు రాష్ట్రాల మధ్య యంపీ, యంయల్యేల సంఖ్య సరిసమానమవుతుంది గనుక సీమాంధ్రలో నష్టపోయినా రాయల తెలంగాణా లో లాభపడవచ్చును.   3. రాయలసీమకు చెందిన 28 మంది కాంగ్రెస్ నేతలు ఈ విభజన ప్రతిపాదనకు అంగీకరిస్తున్నందున కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో ప్రస్తుతం 153మంది సభ్యుల బలం కాస్త 125కి తగ్గిపోతే, అప్పుడు శాసనసభలో తెలంగాణా కోరుకొంటున్న సభ్యుల సంఖ్య 119 నుండి 147కు చేరుకొంటుంది గనుక బిల్లు రాజ్యంగా బద్దంగా శాసనసభ అమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరుకొంటే, ఆయన కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేరు.   4. పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పడితే, ఇంతవరకు రాజ్యాధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులస్తులు, ఇక ముందు వెనుకబడిన తరగతుల నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. అది వారికి చాలా కష్టమే గనుక అనంతపురం, కర్నూలు జిల్లాలలో అధికంగా ఉన్న రెడ్డి వర్గం నేతలు కూడా వారికి తోడయితే మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం సాధ్యం అవుతుంది. అదేసమయంలో రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం తగ్గడంతో వారిపైనే ప్రధానంగా ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కోరలు తీసిన పాములవుతారు. వారిరువురు తెలంగాణా కాలుపెట్టే పరిస్థితి లేదు గనుక, ఇక కాంగ్రెస్ పార్టీకి రాయల తెలంగాణాలో ఎదురుండదు. ఆ రెండు ప్రాంతాలలో బలంగా ఉన్న తెదేపా, వైకాపాలను ఘోరంగా దెబ్బ తీయవచ్చును.   5. కరువు ప్రాంతాలయిన అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణాలో కలిపితే, నీటి సమస్యలు ఉండవు.   6. ముఖ్యంగా ఇక తెరాస, వైకాపాలపై ఇకపై ఆధారపడనవసరం లేదు.   7. ప్రతిపాదిస్తున్నది రాయల తెలంగాణాయే అయినప్పటికీ దానిపేరు మాత్రం తెలంగాణా అని మాత్రమె ఉంటుంది. అదేవిధంగా రెండు జిల్లాలను తెలంగాణాలో ప్రస్తుతం ఉన్నపది జిల్లాలలో కలిపివేయడం ద్వారా మళ్ళీ పది జిల్లాలతో కూడిన తెలంగాణాయే ఇస్తున్నందున ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన నిర్ణయం ప్రకారమే ఉంది గనుక ఎవరూ తప్పు పట్టలేరు. అందువల్ల పార్లమెంటులో కూడా ఎవరూ బిల్లుని వ్యతిరేఖించలేరు.   ఈ ఆలోచనలు, వ్యూహాలు డిల్లీలో కూర్చొని ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా కనబడవచ్చును. కానీ, ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలనుకొంటే ఎవరు మాత్రం ఏమిచేయగలరు. ఈ విభజన ద్వారా బీజేపీతో సహా రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్దులందరినీ దెబ్బ తీయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో బహుశః ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఈయకపోవచ్చును.   ఆరిపోయే దీపం బాగా వెలుగుతుంది. గతంలో బీజేపీ కూడా భారత్ వెలిగిపోతోందని ప్రచారం చేసుకొని చివరికి తానే ఆరిపోయింది. అదే విదంగా ఇప్పుడు కాంగ్రెస్ బుర్రలు కూడా రకరకాల ఆలోచనలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.

మళ్ళీ రాయల తెలంగాణా ప్రతిపాదన

  కాంగ్రెస్ అధిష్టానం రోజుకొక మీడియా లీకుతో అనూహ్యమయిన పద్దతిలో రాష్ట్ర విభజనపై ముందుకు సాగుతోంది. ఇది తన ప్రత్యర్ధులను ఏమార్చేందుకు అనుసరిస్తున్న వ్యూహమా లేక నిజంగానే అయోమయంలో ఉండి కొట్టుమిట్టాడుతోందో తెలియని పరిస్థితి.   ఇక నేడో రేపో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గానికి సమర్పించడం, ఆ తరువాత తెలంగాణా బిల్లు శాసనసభకు, పార్లమెంటుకి చేరుకోవడం, ఆమోదం పొందడం జనవరి 1న కొత్త రాష్ట్రాలు ఏర్పాటయిపోవడం అంతా ఇక చిటికెల మీద పనేన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ రాయల తెలంగాణా గురించి ఆలోచిస్తున్నట్లు మీడియా లీకులు ఇచ్చింది.   పక్కా తెలంగాణావాది అయిన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా “తమ అధిష్టానం అటువంటి ప్రతిపాదనలు పరిశీలిస్తోందని, కానీ దానిని తానూ తీవ్రంగా వ్యతిరేఖించానని” మీడియాకి చెప్పడంతో అది నిజమేనని నమ్మవలసి వస్తోంది.   రాష్ట్ర విభజనలో తాము ఎటువంటి రాజకీయ ప్రయోజానాలను దృష్టిలో పెట్టుకొని చేయడం లేదని నిత్యం ప్రవచనాలు పలికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఇప్పుడు, అటు తెలంగాణా వాదులు, ఇటు రాయలసీమ వాసులు కూడా మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ఈ ప్రతిపాదనను ఎందుకు పునః పరిశీలన చేస్తున్నారో వివరణ ఈయవలసి ఉంటుంది.   రాయల తెలంగాణాతో తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలని కాంగ్రెస్ గనుక భావిస్తుంటే, అందుకు పూర్తి విరుదంగా ముందు ఆపార్టీయే రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. రాష్ట్ర విభజన చేస్తున్నందున ఇప్పటికే సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నఈ రాయల తెలంగాణా ఆలోచనతో ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.   తెలంగాణా కోసం ఉద్యమాలు తీవ్రతరం అవడంతో రాష్ట్ర విభజన ఆవశ్యకత ఏర్పడిందని అనుకొంటే, ఇప్పుడు ముందు ప్రకటించిన విధంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా చేయకుండా, బలమయిన రెండు విభిన్న సంస్కృతులు కలిగిన వేర్వేరు ప్రాంతాలను కలిపి, ఎవరూ కోరని విధంగా కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలని చూస్తే దానివల్ల మళ్ళీ తెలంగాణా లో ఉద్యమాలు మొదలవడమే కాదు, ప్రజల మధ్య విద్వేషాలు కూడా ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది.   ఇంతవరకు తెలంగాణా ప్రజలకు సోనియమ్మ ఇలవేల్పు అని టీ-కాంగ్రెస్ నేతలు ఎంత చెక్క భజనలు చేస్తున్నా, తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందనే ఏకైక కారణంతో తెలంగాణా ప్రజలు వారిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు రాయల తెలంగాణా అంటే మాత్రం సోనియమ్మకు చెక్క భజన చేస్తున్నవారినందరినీ కూడా తమ ప్రాంతం నుండి తరిమి కొడతారు. ఇంతవరకు మౌనంగా ఉన్న కేసీఆర్, తెరాస నేతలు మళ్ళీ తమ నోటికి పనిచెప్పడం ఖాయం. అంతే గాక ఇక ముందు ఒక్క సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో సైతం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవచ్చును.   కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరో కొందరు నేతల సలహాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొంటోంది తప్ప ప్రజల అభిప్రాయాలను, వారి మనోభావాలను, వారి సంస్కృతి సంప్రదాయాల వంటి అనేక అంశాలను పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. అందుకే అది ఇటువంటి వింత వింత ప్రతిపాదనల గురించి ఆలోచిస్తోంది. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ తను ఏ రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తుందో అది మాత్రం నెరవేరకపోగా, మొత్తానికే రాష్ట్రంలో దుంప నాశనమయ్యే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.   కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆలోచనలు చూస్తుంటే అసలు ఆపార్టీకి తెలంగాణా ఏర్పాటు చేసే ఉద్దేశ్యం, దైర్యం నిజంగా ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది.

రాష్ట్ర విభజన జరగదు: బొత్ససత్యనారాయణ

  పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి తిరుగు ఉండదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసేందుకే గట్టిగా కృషిచేస్తోందని ఆయన అన్నారు. ఈ పాపంలో రాష్ట్రంలో ఒక్క సీపీయంకి తప్ప అన్ని పార్టీలకు భాగం ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరుగకపోవచ్చునని అన్నారు.   రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్న వారిలో తాను ప్రధముడినని, అందువల్ల శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చినప్పుడు దానిని తనతో సహా ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు అందరూ వ్యతిరేఖిస్తామని స్పష్టంగా చెప్పారు. అయితే ఇది కేవలం తమ ప్రజల మనోభావాలను ప్రతిబింబించడమే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించడం కాదని ఆయన అన్నారు.   రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఆ పేరుతో పార్టీని కించపరిచేలా మాట్లాడటం రెండు వేర్వేరని అన్నారు. పార్టీలో కొందరు నేతలు వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొని ఈ సాకుతో పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై తాను క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. పార్టీలో అందరిదీ ఒక దారయితే లగడపాటిది వేరే దారని విమర్శించారు.   రాష్ట్ర విభజన జరిగినా జరుగకపోయినా తను వచ్చే ఎన్నికలలో గెలవడం నూటికి 200 శాతం ఖాయమని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాలో కొంత బలపడిందని, కానీ సీమాంధ్రలో మాత్రం ఎదురీత తప్పకపోవచ్చునని, అయినా పార్టీని గెలిపించుకోనేందుకు తన శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని రాసిపెట్టి ఉంటే ఎప్పటికయినా తప్పకుండా అవుతానని, అయితే అంతకంటే ప్రజాభిమానం ఉంటే తాను చాల సంతోషిస్తానని అన్నారు. పదవులపై తనకు ఎటువంటి వ్యామోహం లేదని, కేవలం అధిష్టానం ఆదేశాల మేరకే జోడు పదవులలో కొనసాగుతున్నానని చెప్పారు.   విజయనగరంలో జిల్లాలో తన కుటుంబ ఆధిపత్యం పెరిగిపోతునందునే, అది భరించలేని ప్రజలు ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై దాడులకు పాల్పడ్డారా? అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, తను రాజకీయ పనుల కారణంగా రెండు, మూడు నెలలు జిల్లాకు వెళ్లకపోవడంతో ప్రజలలో అపోహలు కలిగి ఉండవచ్చని అన్నారు. ఫేస్ బుక్కులో మెసేజులు ద్వారా తనపై దుష్ప్రచారం సాగినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే తను పూర్తి సమైక్యవాదినని, పదవులకోసం తానెన్నడూ ఆశపడలేదని అన్నారు.   పీసీసీ అధ్యక్షుడిగా భాద్యతలు చెప్పటిన కొత్తలో పార్టీని బలోపేతం చేసేందుకు కొంత కృషి చేసినా, తదనంతర రాజకీయాల పరిణామాల వలన నిమిత్త మాత్రుడిగా మిగిలిపోయానని అన్నారు.   అనుమతులు లేకుండా తిరుగుతున్న ప్రవేట్ బస్సులను పట్టుకొనేందుకు రవాణాశాఖా మంత్రిగా తనే ఆదేశించానని, ఈ ప్రక్రియ ఇక నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, రెండవసారి కూడా అనుమతి లేకుండా తిరుగుతూ పట్టుబడిన బస్సుల లైసెన్సులు రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తాను చాలా కృషి చేసానని, అయితే రాష్ట్రంలో నిరంతరంగా సాగిన ఉద్యమాల కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతిందని తెలిపారు. అయినప్పటికీ దానిని కాపాడుకొనేందుకు శాయాశక్తుల కృషిచేస్తున్నాని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితికి అనేక కారణాలున్నాయని ఆన్నారు.   ఆయన కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లుగానే, తన తరువాత కూడా అనేకమంది పీసీసీ అధ్యక్షులు ఈ సమైక్యరాష్ట్రంలో ఉంటారని, ఉండాలని తను కోరుకొంటున్నట్లు తెలిపారు.

టీ-కాంగ్రెస్ జైత్రయాత్రకి తెరాస కౌంటర్ దీక్ష దివస్

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నట్లు దాదాపు నాలుగు నెలల క్రితమే ప్రకటించినా, తెలంగాణాలో దైర్యంగా తిరిగి ఆమాటని నమ్మకంగా చెప్పుకోలేని టీ-కాంగ్రెస్ నేతలు డిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత గానీ జైత్ర యాత్రలు మొదలుపెట్టలేకపోయారు. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తామన్నట్లు కాంగ్రెస్-మార్క్ వేషదారణలతో, సోనియమ్మ చక్క భజనలతో “తెలంగాణా ఇచ్చింది తెచ్చిందీ కూడా తామే”నంటూ తెలంగాణా లో హోరెత్తించేస్తున్నారు.   జాతీయ పార్టీ అయిన తమ పార్టీ తప్ప వేరే చిన్నచితకా పార్టీలేవీ తెలంగాణా పునర్నిర్మాణానికి పనికిరావన్నట్లు కూడా వాళ్ళు తేల్చిపడేసారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరి సిద్ధాంతాలు, వాదనలు వారు వినిపిస్తున్నపటికీ, తెలంగాణా సాదించిన ఘనత మాత్రం తమదేనని గట్టిగా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అధికారం చెప్పట్టాలని, కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశపడుతున్న తెరాస వారి స్పీడు చూసి ఉలిక్కి పడింది. దేశమదుర్లవంటి ఈ కాంగ్రెస్ నేతలను అలాగే వదిలేస్తే, వారు ఇదివరకు ఒకసారి ఆఖరి నిమిషంలో రంగ ప్రవేశం చేసి ‘తెలంగాణా సాధన సభ’ పెట్టి తమ చేతి నుండి తెలంగాణా అంశాన్నిఏవిధంగా ఎత్తుకుపోయారో మళ్ళీ ఇప్పడు తమ చేతికందే అధికారాన్ని కూడా అలాగే ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన తెరాస నేతలు వారిని ఎదుర్కొనేందుకు రంగం సిద్దం చేసారు.   పండగ చేసుకోవాలనే కోరిక ఉండాలే గానీ ఎప్పుడయినా ఏ కారణంతోనయినా పండగ చేసుకోవచ్చని నిరూపిస్తూ తెరాస నేతలు తమ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు నిరవధిక నిరాహార దీక్ష చేసి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ‘దీక్ష దివస్‌’ పేరుతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని జిల్లాలన్నిటిలో సభలు, సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి, తెలంగాణా సాధించింది తమ పార్టీయేనని ప్రజలకు తెలియజేసేపనిలో పడ్డారు.   ఈ సందర్భంగా తెలంగాణా కోసం కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి ఏవిధంగా నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని ఒప్పించారో, రాష్ట్ర ఏర్పాటుకి తాము ఎంతగా శ్రమించింది, ఏవిధంగా పోరాడింది, రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకొంటున్న సీమాంధ్ర నేతల కుట్రలు, వాటిని తమ పార్టీ ఏవిధంగా ఎదుర్కొంటున్నదీ ప్రజలకి తెలియజేసి, అంతిమంగా తెలంగాణా సాధన తమవల్లనే జరిగిందని గుర్తుచేయాలని భావిస్తున్నారు.   ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ ఖ్యాతి అంతా తమదేనని మరో పక్క ప్రచారం చేసుకొంటున్నారు. తెదేపా నేతలు తమ పార్టీ లేఖ ఇచ్చినందునే రాష్ట్రం ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యిందని చెప్పుకొంటున్నారు. మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి బేషరతుగా మద్దతు ఇస్తున్న సీపీఐ పార్టీ మాత్రం ఈ రేసులో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు.   అయితే తెలంగాణా ప్రజలు తాము చెపితే తప్ప తెలుసుకోలేనంత అమాయకులేమి కారనే సంగతి ఆ పార్టీలకు తెలుసు. కానీ ప్రయత్నలోపం ఉండకూడదనే ఆలోచనతో అందరూ ఎవరి దారిలో వారు దూసుకుపోతున్నారు.

కాంగ్రెస్ తవ్వుకొన్న గోతిలో తనే పడబోతోందా?

  తెలంగాణా ప్రజలను, నేతలను సంతృప్తిపరచి ఉద్యమాలను చల్లార్చి తిరిగి రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలనే సదుద్దేశ్యంతోనే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం వినసొంపుగానే ఉంది. అయితే అది ఆ పని రెండు మూడేళ్ళ క్రితమే చేసి ఉంటే నిజంగా నమ్మశక్యం ఉండేది.   రేపు ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్నకాంగ్రెస్ పార్టీ, తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీ మద్దతు ఇస్తే తప్ప పూర్తి చేయలేని ఈ పనిని ఎందుకు తలెకెత్తుకొని ఆయాసపడుతోందో అందరికీ తెలుసు. సరే! ఇంత కష్టపడుతున్నాఅది ఆశించిన ఫలితాలయినా పూర్తిగా పొందగలుగుతుందా అంటే అదీ అనుమానమే.   తెలంగాణా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయలేదని ఇప్పటికే కొంత స్పష్టం అవుతోంది. హైదరాబాద్, భద్రాచలం, హైదరాబాద్ ఆదాయంలో సీమంద్రాకి వాటా, ఉద్యోగాలు వంటి అనేక అంశాలలో వారికి ఆగ్రహం కలిగించే నిర్ణయాలు కొన్నితీసుకోక తప్పదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటువేస్తారు? తెరాస ఎందుకు మద్దతు ఇస్తుంది?   ఇక కేసీఆర్ మొదట తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఒప్పుకొన్నా,ఇప్పుడు మాట మార్చి కనీసం పొత్తులకి కూడా అంగీకరించకపోవడం చూస్తే, తెరాస వలన కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండబోదని అర్ధం అవుతోంది. వచ్చేఎన్నికల తరువాత కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంటే దాని నుండి పూర్తిప్రయోజనం పొందాలనే ఆలోచనతోనే బహుశః కేసీఆర్ తన మనసు మార్చుకొని ఉండవచ్చును.   ఇక తన సీమాంధ్ర నేతల భవిష్యత్ పణంగా పెట్టి మరీ ఆడుతున్న ఈ రాజకీయ జూదంలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదు. పార్టీకి అత్యంత విదేయులయిన వారినందరినీ కాదనుకొని, మొండిగా, అనుమానాస్పదంగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం మరో విచిత్రం.   అతనిదీ, తమ కాంగ్రెస్ డీయన్.యే. అని , అతను తన కొడుకు వంటి వాడని దిగ్విజయ్ సింగ్ చెపుతుంటే, అతను కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో దేశాటన చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముకొని తన పార్టీ నేతలని బలిపెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ అది వైకాపాను, జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉండకపోతే, సీమాంధ్రలో తన పార్టీని బలిపెట్టేది కాదు గదా!    కాంగ్రెస్ అధిష్టానం ఇదే పనిని అతని తండ్రి చనిపోయిన నాడే చేసి ఉండి ఉంటే, పరిస్థితులు వేరేలా ఉండేవేమో! కానీ అప్పుడు దూరం చేసుకొని సమయం కాని సమయంలో ఇప్పుడు అతనిని చంకనెత్తుకోవాలని ప్రయత్నిచడం మరో పెద్ద చారిత్రిక తప్పిదం కావచ్చును. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ బోటాబోటి సీట్లు సాధిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు లభిస్తుందా? అతను మద్దతు ఈయకపోతే మాత్రం ఏమి చేయగలదు?   కాంగ్రెస్ తలచినదొకటయితే జరుగుతున్నదీ, జరుగబోయేది వేరొకటి. ఒకవేళ ఈ వ్యవహారంలో ఎక్కడయినా రాజ్యాంగానికి విరుదంగా ఒక్క అడుగు పడినా సుప్రీం కోర్టు కనుక జోక్యం చేసుకొంటే ఉన్న పరువు కూడ కోల్పోవడం ఖాయం. ఒకవేళ ఎలాగో కష్టపడి విభజన చేసినా పైన చెప్పుకొన్న కారణాల వలన అటు తెలంగాణాలో ఇటు సీమాంధ్రలో చావు దెబ్బ తినడం కూడా ఖాయం.   తనది ఒక కన్ను కోల్పోయినా పరువాలేదు,కానీ ఎదుట వాడివి రెండు కళ్ళు పోవాలనే కాంగ్రెస్ దురాలోచనే ఈ అనర్ధానికంతటికీ మూల కారణం.

అంటరాని బీజేపీతో అంటుకట్టేందుకు సై

  ఇంతవరకు మన దేశంలో దాదాపు అన్ని రాజకీయపార్టీలు బీజేపీని అంటరాని పార్టీగా చూసేవి. కారణం బీజేపీ మతతత్వ పార్టీ అని భావించే ఆయా పార్టీల కుహనా లౌకికవాదమే.   బీజేపీతో చేతులు కలపాలని అనేక పార్టీలకు ఆసక్తి ఉన్నపటికీ, తమ ముస్లిం వోటు బ్యాంకులో లాభనష్టాలు లెక్కలు సరిచూసుకొని, తదనుగుణంగానే ఆ పార్టీతో చేతులు కలపాలా? వద్దా? అనేది నిర్ణయించుకొంటాయి తప్ప, అవి చెపుతున్న మతతత్వపార్టీ కారణం కానే కాదు. తమకున్న ముస్లిం ఓటు బ్యాంకుతో పోలిస్తే, బీజేపీతో చేతులు కలపడం వలనే తమకు ఎక్కువ లాభం కలుగుతుందని అవి భావిస్తే, అప్పుడు వాటికి ఆ మతతత్వ ముద్ర అడ్డు రాదు.   ఒకవేళ వాజపేయి వంటి నిజమయిన లౌకికవాది నేడు ఆ పార్టీకి సారధ్యం వహిస్తూ ఉండి ఉంటే, బహుశః ఈ చర్చ అవసరం కూడా ఉండేది కాదేమో! కానీ నూటికి నూరు శాతం హిందూవాది అయిన నరేంద్ర మోడీ పార్టీ పగ్గాలు చెప్పటడం వలనే పార్టీలలో కొంత అయోమయం నెలకొని ఉంది. అయితే ఆయన నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చుననే సర్వే నివేదికలు చూసిన తరువాత రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణిలో కూడా కొంత మార్పు కనబడుతోంది.   ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ గనుక విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు బీజేపీ వైపు ఆకర్షించబడినా ఆశ్చర్యం లేదు.   ఇక మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూసుకొంటే, ప్రస్తుతం తెదేపా, తెరాస, వైకాపా ఆ పార్టీతో దోస్తీకి సై అంటున్నాయి. పార్లమెంటులో తన రాజకీయ ప్రత్యర్ధి ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే అంశంపై ఆ దోస్తీలు పెరిగే, తరిగే అవకాశాలున్నాయి.   ఒకవేళ కాంగ్రెస్ గనుక తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ఆమోదింప జేయలేక చేతులెత్తేస్తే, రానున్నఎన్నికల కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. గనుక, అప్పుడు తెరాస బీజేపీకి మద్దతు ఇచ్చి తెలంగాణా సాధించుకొనే ప్రయత్నం చేయవచ్చును. అయితే బీజేపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అంగీకరిస్తేనే వైకాపా మద్దతు ఇస్తానని షరతు పెట్టవచ్చును. కేంద్రంలో అధికారం చెప్పట్టాలంటే బీజేపీకి రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు అత్యవసరమే గనుక, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తానని హామీ ఇచ్చి మద్దతు కోరే అవకాశం ఉంది. ఈవిధంగా బీజేపీ రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు పొందవచ్చని కాగితాల మీద ఎన్ని లెక్కలు వేసుకొన్నపటికీ, రెండు కత్తుల వంటి తెదేపా, వైకాపా ఒకే ఒరలాంటి ఎన్డీయే కూటమిలో ఇముడుతాయా? లేదా? అనే విషయం అప్పటి పరిస్థితులు, రాజకీయ సమీకరణాలను బట్టి తేలుతుంది.   ఏమయినప్పటికీ, డిశంబర్ 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో బీజేపీతో ఏ పార్టీలు పొత్తులకి, మద్దతుకి ఆసక్తి చూపుతాయో క్రమంగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. దానిని బట్టే పార్టీలు రాష్ట్రంలో సీట్ల సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది గనుక వీలయినంత త్వరగానే చర్చలు మొదలు కావచ్చును.

ఒక హైటెక్ విషాద కధ

                                  సంపదను సృష్టించడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం, అభివృద్ధి చేయడం కూడా అంతే కష్టం.   చంద్రబాబు హయంలో ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ మొన్ననే 15ఏళ్ళు పూర్తి చేసుకొంది. ఆయన వ్యక్తిగత శ్రద్ద కృషి, పట్టుదల వలన ఏర్పడిన ఈ హైటెక్ సిటీ నేడు రాష్ట్ర ప్రధాన ఆదాయవనరని వేరే చెప్పనవసరం లేదు. ఆ బంగారు బాతు కోసం ఆంధ్ర, తెలంగాణావాదులు నేడు చేస్తున్న పోరాటం గమనిస్తే దాని ప్రాముఖ్యత అర్ధం అవుతోంది. అయితే దానికోసం కీచులాడుకొంటున్నవారికి అక్షయపాత్ర వంటి ఈ అపార సంపదను సృష్టించిన చంద్రబాబుని, అతని ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి రాజకీయాలు అడ్డువస్తున్నాఅది ఖచ్చితంగా ఆయన గొప్పదనమేనని వారికీ తెలుసు.   చంద్రబాబు కృషి ఫలితంగా ఏర్పాటయిన ఈ హైటెక్ సిటీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న మేలు కంటికెదురుగా స్పష్టంగా కనబడుతున్నపటికీ, తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్నిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్లక్ష్యం వహింది.   మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఈ ఐటీ రంగాన్ని విశాఖకు విస్తరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఆకస్మిక మరణంతో అవన్నీ గాలి మేడలయ్యాయి. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ కూడా ఈ ఐటీ రంగం పట్ల పెద్దగా శ్రద్ద కనబరచకపోవడం వలన, ఐటీ రంగం ఎటువంటి అభివృద్దికి నోచుకోకుండా పోయింది. దానికి తోడూ గత రెండు మూడేళ్ళుగా తెలంగాణాలో జరుగుతున్న సమ్మెలు ‘హైదరాబాద్ బ్రాండ్’ విలువను ఘోరంగా దెబ్బతీసాయి.   ఆ దెబ్బకి కొత్త కంపెనీలు ఏవీ కూడా రాష్ట్రం వైపు కన్నెతి చూడలేదు. వచ్చినవాటిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, అరాచకం, ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం వెరసి, ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఐటీ రంగం తరలించుకుపోయెందుకు గొప్ప సదావకాశాన్ని కల్పించాయి. అయితే అందుకు మన నేతలు కానీ, ప్రభుత్వం గానీ కించిత్ చించలేదు. పరిస్థితిని చక్కదిద్దుదామని ప్రయత్నం చేసింది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదలు గల్లీలో కార్పొరేటర్ వరకు అందరికీ రాష్ట్ర విభజన ధ్యాసే తప్పమరొకటి లేకపోవడమే.   ఈ పరిస్థితులు ఇలాగుంటే, హైదరాబాదులో హైటెక్ సిటీ ఏర్పడిన తరువాత నగరం ఐటీ కేంద్రంగా ఎదిగి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగడంతో, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చనే ఆశతో యువత ఐటీ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సులలో చేరేందుకు ఆసక్తి చూపడంతో, వారి బలహీనతను సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వీధికొకటి, ఊరుకి వంద చొపున వెలిసి , గత ఐదు-పదేళ్ళలో లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్ధులను తయారు చేసి రోడ్ల మీదకు వదిలేయి.   అయితే అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి జరగకపోవడంతో వారందరూ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. దానితో యువతలో అశాంతి పెరిగి సామాజిక సమస్యలు కూడా క్రమంగా పెరగసాగాయి. ఉన్నదంతా ఊడ్చిపెట్టి లక్షలు పోసి ఇంజనీరింగ్ చేయించినా కూడా పిల్లలకు ఉద్యోగాలు దొరకకపోవడంతో, అనేక మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యార్దులు లేక ఇంజనీరింగ్ కాలీజీలు ఒకటొకటిగా మూతపడటం ఆరంభం అయ్యింది.   ఐటీ రంగాన్నిఅభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది, పట్టుదల ప్రభుత్వానికి ఉంటే దాని ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చంద్రబాబు చూపిస్తే, అశ్రద్ద వహిస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడుతాయో కాంగ్రెస్ ప్రభుత్వం మన కళ్ళకు కట్టినట్లు చూపుతోందిప్పుడు.   కనీసం రానున్న ఎన్నికలలోనయినా ప్రజలు “పనిచేసే ప్రభుత్వాలను” ఏర్పరుచుకొంటే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇటువంటి వ్యాసాలే మరిన్ని చదువుకోక తప్పదు.

హైటెక్ సిటీకి 15వ పుట్టిన రోజు నేడు

  హైదరాబాద్ సమీపంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్ళు పూర్తయింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాదుకి ఐటీ కేంద్రంగా మరో కొత్త గుర్తింపు ఏర్పడింది. అప్పటి నుండే నగరం మెట్రో హంగులు సంతరించుకోవడం కూడా మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు ఒకటొకటిగా హైటెక్ సిటీలో తమ కార్యాలయాలను తెరవడంతో వేలాది మంది యువతకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. దీనితో రాష్ట్రం, దేశం నలుమూలల నుండి హైదరాబాద్ నగరానికి భారీ వలసలు కూడా మొదలయ్యాయి.   సాంకేతిక నిపుణులను తయారుచేసే విద్యాసంస్థలు ఉద్భవించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్స్, మౌలిక సదుపాయాలూ, విమాన సర్వీసులు, విద్యాసంస్థలు ఒకటేమిటి క్రమంగా అన్నిరంగాలలో ఊహించనంత అభివృద్ధి జరిగింది. ఐటీ రంగం పూర్తిగా నిలద్రోక్కుకొన్న తరువాత ఐటీసంస్థల ఆదాయం ఊహించనంతగా పెరిగింది.   దానితో బాటే ప్రజల తలసరి ఆదాయాలు కూడా పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాలు ఎగువ మధ్య తరగతిలోకి మారారు. బంగారు బాతువంటి ఐటీ కంపెనీలకు అవసరమయిన వివిధ రకాల సేవలందించడం ద్వారా దిగువ తరగతుల వారి జీవన ప్రమాణాలు క్రమంగా పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగమే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందంటే హైదరాబాదులో ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందిదో అర్ధం అవుతుంది.   ఈ ఐటీ రంగం కేవలం హైదరాబాదుతోనే ఆగిపోకుండా వైజాగ్ వంటి నగరాలకు కూడా వ్యాపించింది. ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాదు తరువాత వైజాగ్ రెండవ ఐటీ కేంద్రంగా ఎదుగుతోంది.   నేటి ఈ అభివృద్దికి మూల కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తుంది. హైటెక్ సిటీని, చంద్రబాబుని వేరుగా చూడలేము. హైటెక్ సిటీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆయనదే. దాని అభివృద్ధి కోసం ఆయన అంతగా కృషి చేసారు.   హైటెక్ సిటీ నిర్మాణం జరిగి నేటికి 15సం.లు పూర్తయిన శుభసందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభకు ఐటీ సంస్థలు చంద్రబాబుని ఆహ్వానించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”ఒకప్పుడు కొండలు గుట్టలతో పనికిరాని ప్రాంతంగా పడి ఉన్న ఈ ప్రాంతాన్నిహైటెక్ సిటీగా మలచడానికి మా ప్రభుత్వం చాలా కృషి చేసింది. తత్ఫలితంగా ఈ రోజు కనబడుతున్న అభివృద్ధిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనసు తృప్తితో నిండిపోయింది. హైటెక్ సిటీ నిర్మాణం ఒక ఎత్తయితే, ఇక్కడికి ఐటీ సంస్థలను రప్పించి అవి ఇక్కడ స్థిరపడేలా చేయడం మరో ఎత్తు. చివరికి మా కృషి ఫలించి హైదరాబాద్ ఐటీ కేంద్రంగా యావత్ దేశంలోనే కాక ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది."   "ఇంతవరకు ఒక తరంవారు దీని ఫలాలను పొందగలిగారు. ఇక ముందు కూడా ఇలాగే యువత దీనివలన ప్రయోజనం పొందాలని నేను మనసారా కోరుకొంటున్నాను. అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ ఐటీ రంగాన్ని, హైటెక్ సిటీని నిర్లక్ష్యం చేయడంతో జరుగవలసినంతగా అభివృద్ధి జరుగలేదు. యువత కూడా రాజకీయాలలో ప్రవేశించిన నాడే అభివృద్ధి వేగవంతం అవుతుంది. అభివృద్దిని సాధించగల ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవలసిన బాధ్యత యువత మీదే ఉంది,” అని చంద్రబాబు అన్నారు.

తెలంగాణా ఏర్పాటుతో భద్రతా సంస్థలకు పెను సవాలు

  తెలంగాణా ఏర్పడితే అక్కడ నక్సల్స్ మరియు ఉగ్రవాద సమస్యలు పెరిగిపోతాయని ముఖ్యమంత్రితో సహా చాలా మంది హెచ్చరిస్తునప్పటికీ అవన్నీతెలంగాణాను అడ్డుకొనేందుకు చెపుతున్నభూటకపు కబుర్లని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. సాక్షాత్ హోం మంత్రి షిండే “తెలంగాణా ఏర్పడితే నక్సల్స్ సమస్య ఉండదు” అని భరోసా ఈయలేక “నక్సల్స్ సమస్య పెరుగుతుందని మేము భావించడం లేదు” అని అనడం చూస్తే ఆ సమస్య తీవ్రతను ఆయన కూడా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.   తమిళనాడు పోలీసు అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కూడా ఇంచుమించు ఇదేవిధమయిన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మొండిగా ముందుకు సాగిపోతోంది.   ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే మరో ఉన్నత నిఘా సంస్థ అయిన కేంద్ర ఇంటలిజన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం నిన్నడిల్లీలో జరిగిన అఖిలభారత పోలీసు అధికారుల సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొన్న రాష్ట్ర పోలీసు డీఐజీ మరియు ఇనస్పెక్టర్ జనరల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పాటు కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయిన సమస్య కాదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో, దేశంలో అన్ని భద్రతా వ్యవస్థలకు ఇదొక సరికొత్త సవాళ్ళను విసరబోతోంది,”అని అన్నారు.   రాష్ట్ర రాజకీయాలతో కానీ, పార్టీలతో గాని ఎటువంటి సంబంధమూ లేని దేశంలో ఒక అత్యున్నత నిఘావ్యవస్థ అధిపతి ఈవిధంగా రాష్ట్ర విభజన వలన ఏర్పడే దుష్పరిణామాలు గురించి ఆందోళన వ్యక్తం చేయడం చూస్తే సామాన్య ప్రజలకు ఊహలకు అందనంత తీవ్ర సమస్యలు దీనిలో ఇమిడి ఉన్నాయని అర్ధం అవుతోంది.   కానీ, రాష్ట్రంలో, దేశంలో రాజకీయ నేతలు, కొన్ని పార్టీలు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకోసమే ఇంత రిస్క్ తీసుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. హైదరాబాద్ మరో పదేళ్ళవరకు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న కారణంగా అక్కడ ఒక రాజకీయ సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. దానిని ఆసరాగా తీసుకొని సంఘ వ్యతిరేఖ శక్తులు, నక్సల్స్, ఉగ్రవాదులు చాప క్రింద నీరులా విస్తరించే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే బయటపడుతుండటం వలన నగరానికి ప్రత్యేకమయిన అదనపు భద్రత వ్యవస్థ ఏర్పాటు కూడా అవసరమే.   తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం అవసరమే. కానీ ఏర్పాటు చేసే ముందు అందుకు తగిన విధంగా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపాటు చూపడాన్ని మాత్రం ఖండించవలసిందే. ఇదే పనిని రానున్న ఎన్నికల తరువాత చేప్పట్టి ఉండి ఉంటే మరింత పటిష్టంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉండేది. కానీ ప్రజల భావోద్వేగాలని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు ఇదే సరయిన సమయమని తొందరపాటు ప్రదర్శించడమే అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది.   ఇంటలిజన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం వ్యక్తం చేసిన ఆందోళనను రాజకీయాలకు, ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా చూడవలసి ఉంది, ఇది తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖమనో లేక సమైక్యవాదుల వాదనలకు ఉపయోగపడే కొత్త అస్త్రంగానో భావించరాదు.

వైకాపాకు జగనే శత్రువా?

  ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నకారణంగా ఎప్పటికప్పుడు పార్టీ అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలను చర్చించే వీలుండేది కాదు. పార్టీలో మైసూర, అంబటి, కొణతాల, పిల్లి సుభాష్, వాసిరెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు చాలా మందే ఉన్నపటికీ వారు పార్టీకి దిశానిర్దేశం చేసే అంతటి అధికారం, స్వేచ్చ లేనందున వారి రాజకీయ అనుభవమంతా కేవలం తెదేపా, కాంగ్రెస్ పార్టీలను, ప్రభుత్వాన్నిదుయ్యబట్టేందుకే పరిమితమయింది. జగన్ అందరిపై చలాయించే కర్ర పెత్తనమే అందుకు కారణమని చెప్పవచ్చును.   అందువల్ల జగన్ జైలులో ఉన్నంత కాలం, వైకాపా గుడ్డిగా తెదేపా వ్యూహలనే అనుసరించక తప్పలేదు. తెదేపా విద్యుత్ సమస్యలపై చేసిన ధర్నాలు, రైతుల సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలను వైకాపా కూడా నీటుగా ఫాలో అయిపోయింది. చివరికి చంద్రబాబు పాదయాత్ర చేస్తే, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తే బస్సు యాత్రలు చేస్తూ వైకాపా ఎలాగో భారంగా రోజులు దొర్లించేసింది.   జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయితే ఈ పరిస్థితుల్లో మార్పువస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ నేటికీ ఆ పరిస్థితిలో మార్పులేదు. కారణం జగన్ జైల్లో ఉన్నా, బయట ఉన్నాతన కర్ర పెత్తనం అలవాటును మానుకోకపోవడమే.   ఇటీవల అతను హైదరాబాదులో నిర్వహించిన సమైక్య శంఖారావమే ఒక చక్కటి ఉదాహరణ. జోరుగా కురుస్తున్న జడివానల మధ్య సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా అతను సభ నిర్వహించాలనుకోవడమే అతని కర్ర పెత్తనానికి ఒక ఉదాహరణ. కానీ అదృష్టవశాత్తు ఆరోజు భారీ వర్షాలు పడలేదు. పడిఉంటే సభ పరిస్థితి ఏమిటో అతనికే తెలియాలి.   సమైక్య రాష్ట్రం కోరుతూ పూరించిన సమైక్యశంఖారవం సభలో వేలాది ప్రజల సమక్షంలో తనకి ముప్పై లోక్ సభ స్థానాలు వస్తే డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించడం అతని దురాలోచనలకి అద్దం పడితే, అతను రాష్ట్ర విభజన అనివార్యమని అప్పటికే బలంగా నమ్ముతున్నందునే, కేవలం సీమాంధ్రలో సీట్ల గురించి మాట్లాడినట్లు స్పష్టం అయింది.   జగన్ తనకి తగిన రాజకీయ అనుభవము లేనప్పుడు కనీసం పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసినా ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదు. కానీ, ఒక హీరోకి ‘దూకుడు’ గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే ఆ దూకుడే వైకాపా కొంప ముంచుతోంది.   పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా, తెదేపాను చూసి జగన్ కూడా రాష్ట్ర విభజనకు లేఖ అయితే ఇచ్చేశారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు జగన్ రాజకీయ అపరికత్వతని,దుందుడుకు స్వభావాన్ని ప్రస్పుటంగా పట్టి చూపాయి.   అందరి కంటే ముందే సమైక్యరాగం ఆలపించేసి, సమైక్య చాంపియన్ అయిపోదామని రాత్రికి రాత్రే తెలంగాణాలో దుఖాణo బంద్ చేసేసుకొని సీమాంధ్రలోకి దూకేసిన తరువాత, తెదేపా నేటికీ తన లేఖకే కట్టుబడి ఉండటం, తెలంగాణాలో కూడా పార్టీని యధాతధంగా నిలబెట్టుకొని ఉండటం చూసి కంగు తిన్నారు. అందుకే మళ్ళీ తెలంగాణా నేతలని మంచి చేసుకొనే ప్రయత్నాలు ఆరంభించారు.   అయితే దానివల్ల అతనికి తెలంగాణా ప్రజల నుండి అవమానాలు, చీదరింపులే మిగిలాయి చివరికి. అది స్వయంకృతాపరాధమే కనుక పార్టీలో ఎవరినీ నిందించవలసిన పనిలేదు.   ఇక నిత్యం కాంగ్రెస్, తెదేపాలను తిట్టిపోసే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆ పార్టీల అడుగుజాడలలోనే తన రాజకీయ జీవితం నిర్మించుకోబూనడం విచిత్రం. పార్టీ రాజకీయ కార్యక్రమాలకు తెదేపాను అనుసరించే జగన్, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ విభజన రాజకీయాలను చక్కగా అనుసరిస్తున్నారు. కనీసం ఇప్పటికయినా తన పద్దతులు మార్చుకొని పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసి ఉంటే, నేడు తెదేపా చేపడుతున్న’ఇంటింటికీ తెదేపా’వంటి కార్యక్రమాలను గుడ్డిగా అనుసరించవలసిన దుస్థితి ఉండేది కాదు.  

రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371 బ్రేక్

రాష్ట్ర విభజన ప్రక్రియ ఎవరికీ అంతుచిక్కని ఒక బ్రహ్మ పదార్ధంగా తయారయింది. ఇంతవరకు హైదరాబాద్, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు వంటి చిక్కు ముళ్ళని విప్పేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రమంత్రుల బృందానికి ఇప్పుడు ఆర్టికల్ 371 (డీ) ప్రధాన అడ్డంకిగా మారింది. దీని గురించి న్యాయ నిపుణులే కాక, సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు కూడా మొదటి నుండి హెచ్చరిస్తున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ముందుకు సాగింది.   కానీ నిన్న భారత అటార్నీ జనరల్ వాహనవతి ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో చేయకుండా రాష్ట్ర విభజనపై ముందుకు సాగడం అసాధ్యమని కేంద్రమంత్రుల బృందానికి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ప్రకారం ఏ రాష్ట్రాన్నయినా విభజించాలంటే ముందుగా ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో తప్పనిసరి అని ఆర్టికల్ 4లో స్పష్టంగా పేర్కొన్నట్లు వాహనవతి కేంద్రమంత్రుల బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది.   అయితే ఇది రాష్ట్ర విభజనకి ఎంతమాత్రం అడ్డంకి కాదని, దీనిని యధాతదంగా కొనసాగిస్తూనే విభజన చేయవచ్చని, ఆ తరువాత కూడా దీనిని చిన్నచిన్న రాజ్యంగా సవరణలతో రెండు రాష్ట్రాలలో యధాతధంగా కొనసాగించవచ్చని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతల వాదన.   అయితే రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ, దానివలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలో పనిచేస్తున్న ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ ఉండదు. ఎక్కడివారు అక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చును. అంతే కాక, జోనల్, క్యాడర్ విధానాలు అమలు కూడా సాధ్యం కాదని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇది కొత్త రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణాకు ప్రధాన అవరోధంగా మారుతుంది గనుక రాష్ట్ర విభజన కంటే ముందుగానే ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో తప్పనిసరి అవుతుందని న్యాయ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.   ఆ పనిచేయాలంటే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమయిన బీజేపీ మద్దతు తప్పనిసరి. బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది గానీ ఆర్టికల్ 371ని సవరించేందుకు మద్దతు ఇస్తామని ఎన్నడూ హామీ ఇవ్వలేదు. బీజేపీ తెలంగాణాలో తన పార్టీ కోరిక మేరకు తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇటువంటి సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును.   తెలంగాణా ఏర్పాటుకి కాంగ్రెస్ కి సహకరించడం వలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేకపోగా దానివల్ల కాంగ్రెస్ మరింత బలపడేందుకు అవకాశం కలుగుతుంది. పైగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్,బీజేపీలు ఒకదానిపై మరొకటి నిప్పులు చేరుకొంటున్న తీరు చూస్తే, బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో సహకరించే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.   ఈ పరిసితుల్లో కాంగ్రెస్ దీనిని తప్పనిసరిగా రాజకీయంగా పరిష్కరించవలసి ఉంటుందే తప్ప ఈవిషయంలో బహుశః కేంద్రమంత్రుల బృందం కూడా ఏమీ చేయలేకపోవచ్చును.

టీ-కాంగ్రెస్ కి కూడా సీమాంధ్ర నేతల గతి తప్పదా?

  రానున్న ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఇక నరేంద్ర మోడీ అతనికి మరెన్నటికీ ఆ కుర్చీలో కూర్చొనీయడనే భయమే కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజనలో మొండి దైర్యం కలిగించిందని చెప్పక తప్పదు. రెండు రాష్ట్రాలనుండి కీలకమయిన యంపీ సీట్లు సంపాదించుకోవడమే ఏకైక లక్ష్యంగా మొదలయిన ఈ ప్రక్రియను ఎన్నిఅడ్డంకులు ఎదురయినా లెక్కజేయకుండా అందుకే కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.   తను నిర్దేశించుకొన్న ఈ మహత్తర లక్ష్యం కోసం కాంగ్రెస్ తన స్వంత పార్టీని, తన నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టేందుకు కూడా వెనకాడట్లేదంటేనే ఈ విషయంలో అది ఎంత పట్టుదలగా ఉందో అర్ధం అవుతోంది. ముందు కేంద్రంలో ఏదో ఒక విధంగా అధికారం నిలబెట్టుకోగలిగితే, ఆ తరువాత రాష్ట్రం సంగతి ఆలోచించవచ్చనే ఉద్దేశ్యంతోనే ఇంతకు తెగిస్తోందని చెప్పవచ్చును.   ఈ లెక్కన చూస్తే ఇప్పుడు సీమాంధ్రలో నేతలని కాలరాసి ముందుకు సాగుతున్నట్లే రేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలనీ తన ప్రయోజనం కోసం బలిచేసినా ఆశ్చర్యం లేదు. రానున్న ఎన్నికలలో తెరాసకే మెజారిటీ యంపీ సీట్లు రావచ్చని సర్వేల ఖరారు చేస్తునందున, తెరాస ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దపడుతోంది. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉండనే ఉందని విస్పష్టంగా చెపుతున్నతెరాస, నిజంగా అన్నంత పనీ చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడుతుంది. కనుక తెరాస కోసం తన టీ-కాంగ్రెస్ నేతలను బలిపెట్టినా ఆశ్చర్యం లేదు.   అయితే ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. టీ-కాంగ్రెస్ నేతలలో కేసీఆర్ ను ఎదుర్కొని నిలువరించే మొనగాడు ఎవరూ లేడని భావించినందునే ఆయనని తెరమీదకి తెచ్చింది. అయితే అనేక ఏళ్లుగా తెలంగాణకు దూరంగా ఉంటున్నఆయన, ప్రజలతో మమేకమయి తిరుగాడే కేసీఆర్ ను సమర్ధంగా ఎదుర్కొని ఓడించగలడని ఆశించడం అత్యాశే అవుతుంది. కేసీఆర్ ప్రజాకర్షక శక్తి, మాటకారితనం ముందు జైపాల్ రెడ్డి చెప్పే నీతి సూక్తులు ప్రజల చెవులకెక్కడం కష్టమే.   ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇస్తున్నపటికీ ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలోనే జమా అవుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంగతి తమ అధిష్టానం కూడా దృడంగా నమ్మినట్లయితే తమకు కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల గతే పడుతుందనే భయంతోనే వారు జైత్రయాత్రలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం వారివల్ల తనకు ఉపయోగం ఉండదని భావిస్తే, వారు ఎన్ని యాత్రలు చేసి ఎంత సోనియా భజన చేసినా వారిని కూడా పక్కన బెట్టి కేసీఆర్ ని చంకనెత్తుకోక మానదు.   ఇంతకాలం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతలందరినీ పక్కనబెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏవిదంగా హటాత్తుగా జైపాల్ రెడ్డిని చంక నెత్తుకొందో, రేపు జైపాల్ రెడ్డి కేసీఆర్ ను, అతని తెరాసను ఓడించలేడని అనుమానం కలిగిననాడు, వెంటనే ఆయనని కూడా పక్కన పడేసి కేసీఆర్ ను చంక నెత్తుకోవడానికి కాంగ్రెస్ అదిష్టానం వెనకాడబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే దాని ప్రధాన లక్ష్యం కేంద్రంలోనే కానీ రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు. 

రాష్ట్ర విభజన ఖరారు చేసే కీలక సమావేశం

  రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయిన నాటి నుండి అనేక ప్రకటనలు, సమావేశాలు. వాటికి ముందు అంతులేని ఊహాగానాలు, తరువాత విశ్లేషణలు, విమర్శలు. ఈ తతంగమంతా చూస్తే బహుశః రాష్ట్ర విభజన ఈవిధంగానే చేయలేమో! అనే విధంగా తయారయింది. ఈ రోజు మళ్ళీ మరో కీలక సమావేశం. మళ్ళీ అన్నీషరా మామూలే.   కేంద్రమంత్రుల బృందం తెలంగాణా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో, చివరిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈ రోజు భేటీ కాబోతోంది. ఈ సారి సమావేశంలో మూడు ఆసక్తికరమయిన విషయాలున్నాయి.   1.రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మొక్కుబడిగా ఒకసారి రాష్ట్ర విభజనను వ్యతిరేఖించిన తరువాత సీమాంధ్రకు ఎటువంటి ప్యాకేజి కావాలనుకొంటున్నారో చెప్పబోతున్నారు. ఇది తెలంగాణా వాదులకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా మారుతుంది. వారి తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ మారోమారు వాదనలు వినిపించబోతున్నారు. కానీ దానివల్ల విభజన ప్రక్రియ ఆగకపోయినా, ఆయన సమైక్యవాదిగా మరింత గొప్ప పేరు సంపాదించుకొనేందుకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది.   2. ఇంతవరకు తెలంగాణా అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జైపాల్ రెడ్డి, ఇప్పుడు తెర ముందుకు వచ్చి తెలంగాణా కేంద్రమంత్రులకు నేతృత్వం వహించబోతున్నారు. తెలంగాణా ఏర్పాటు ఇప్పటికే దాదాపు ఖాయమయిన ఈ సమయంలో ముందుకు దూసుకువచ్చిన ఆయన, ఈ విజయం తన స్వంతం చేసుకోబోతున్నారు.   3. రాష్ట్ర విభజన అంశంపైనే కాక రాజకీయంగా కూడా ప్రత్యర్దులయిన ఇద్దరు రెడ్లు-కిరణ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి తమ తమ రాజకీయ భవితకు ఈ సమావేశం ద్వారానే బలమయిన పునాది వేసుకొనేందుకు ప్రయత్నించబోతున్నారు.   ఇక రాష్ట్రం నుండి ఒక్క ముఖ్యమంత్రి నుండి తప్ప ఇతరత్రా ఎటువంటి బలమయిన ప్రతిఘటన లేనందున ఈరోజు సమావేశంతో రాష్ట్ర విభజనకు మార్గం సుగమం అయినట్లే. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం కేవలం ముఖ్యమంత్రిని సరి చేయడమో లేక తప్పించడమో చేసినట్లయితే ఇక రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను అధిగమించినట్లే చెప్పవచ్చును.

మోడీగిరితో సోనియా రాహుల్ కు అగ్నిపరీక్షలు

  క్రికెట్ లో సచిన్ అధ్యాయం ముగిసే సమయానికి భారత రాజకీయాలలో మోడీ అధ్యాయం మొదలవుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు బీజేపీలో అనేకమంది అతిరధ మహారధులను ఎంతో సమర్ధంగా డ్డీ కొనప్పటికీ, మోడీ రాకతో ఇప్పుడు ఒక సరికొత్త ఇబ్బందిని ఎదుర్కొంటోంది. మంచి రాజకీయ అనుభవజ్ఞుడు మరియు మంచి వక్త అయిన మోడీని డ్డీ కొనేందుకు కాంగ్రెస్ లో చాల మంది నేతలున్నపటికీ, వారిలో ఎవరికీ కూడా ప్రజలలో సరయిన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారి సేవలు ఉపయోగించుకోలేకపోతోంది.   ఇక బీజేపీ మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా  ప్రకటించేసి చేతులు దులుపుకొన్నపతి నుండి ఆయన చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీనే తన ప్రధాని అభ్యర్ధిగా భావిస్తున్నకారణంగా, ప్రజలు సహజంగానే వారిరువురిని ఒకరితో మరొకరిని పోల్చి చూడటం మొదలుపెట్టారు. దానితో మోడీ ముందు రాహుల్ గాంధీ ప్రతీ విషయంలోను తేలిపోతున్నారు.   కనీసం అతను తన ఉపన్యాసాల ద్వారానయినా జనాలను ఆక్కట్టుకొంటారంటే, నాయనమ్మ, తండ్రి, తన మరణాల గురించి, ముజఫర్ నగర్ లో పాకిస్తానీ గూడచారుల కదలికల గురించి అసందర్భ ప్రసంగాలు చేస్తూ, పార్టీకి మేలు చేయకపోగా సరి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అతని తల్లి సోనియా గాంధీయే చొరవ తీసుకోక తప్పడం లేదు.   కానీ ఆమెకు భాష పెద్ద ఇబ్బందిగా మారింది. ఇటలీ దేశస్తురాలయిన ఆమెకు హిందీపై నేటికీ పూర్తి పట్టు లేకపోవడంతో ముందుగా వ్రాసిచ్చిన ప్రసంగాలతో ఆమె గ్రామీణులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. హిందీపై మంచి పట్టున్న రాహుల్ గాంధీకి అనుభవ రాహిత్యం సమస్య అయితే, అనుభవమున్న తల్లికి బాష సమస్యగా మారింది.   మోడీకి సరిగ్గా ఈ రెండు అంశాలే బాగా కలిసి వచ్చాయి. అపారమయిన రాజకీయ పరిజ్ఞానం, సమయం, సందర్భానుసారంగా మాట్లాడే నేర్పు, హిందీ బాషాపై మంచి పట్టు, పండిత పామరులను సైతం అక్కట్టుకోగల సరళమయిన ప్రసంగ శైలి, బాషలతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోనియా, రాహుల్ విసురుతున్న ప్రతీ అస్త్రాన్నిఆయన సమర్ధంగా తిప్పి కొట్టడమే కాకుండా, వారి ప్రసంగాల నుండే లోపాలను వెతికి పట్టుకొని వారిపైనే వాటిని తన అస్త్రాలు ప్రయోగిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు.   సోనియా ప్రసంగాలు ప్రజలకు అర్ధం కావు. రాహుల్ గాంధీ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల వారు ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా అవి మోడీ చేస్తున్న ప్రసంగాలకి సరి తూగడం లేదు. చివరికి ఇది సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్నికల యుద్ధంగా కాక, రాజకీయ ప్రసంగ పరీక్షగా తయారయింది. “కేవలం మాటకారితనంతోనే ప్రజలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకోవచ్చునని మోడీ భావించడం చాలా హాస్యాస్పదం,” అని సోనియా గాంధీ పలకడం ఈవిషయంలో మోడీ ఆధిక్యతను అంగీకరిస్తున్నట్లుగా అర్ధం అవుతోంది.   ప్రస్తుత రాజకీయాలలో మంచి వక్త అయి ఉంటే ఏవిధంగా లాభిస్తుందో తెలుసుకోవడానికి మోడీయే సజీవ ఉదాహరణగా నిలుస్తారు. మరి కాంగ్రెస్ ఈ ‘మోడీగిరి’ని తట్టుకొని గెలుస్తుందో లేదో మరొక నెలలో స్పష్టమయిపోతుంది.

నాలుగు బేతాళ ప్రశ్నలు

  రెండున్నర నెలలు రోడ్లెక్కి ఉద్యమాలు చేసిన తమకి బోలెడంత రాజకీయ చైతన్యం, పరిజ్ఞానం సంపాదించుకొన్నామని సీమాంధ్ర ప్రజలు ఒకటే విర్ర వీగుతున్నారు. మరి వారికి రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవాలని సీమాంధ్ర నేతలకి కూడా ఒక చిన్న కోరిక కలిగింది. అంతే! వెంటనే మారు వేషాలు వేసుకొని జనాల మధ్య తిరుగుతూ ప్రశ్నలు వేస్తున్నారుట!   మొదటి ప్రశ్న: ఏ రాజకీయ పార్టీ దేనితో కుమ్మక్కయింది? అని వారికి మొదట ‘కుమ్మక్కు టెస్ట్’ పెట్టారు. కానీ పాపం! ఇన్ని కోట్ల మందిలో ఒక్కరు కూడా దానికి సరయిన సమాధానం చెప్పలేక పోవడంతో దానిని సీబీఐ ఫైలులా పక్కన పడేసి, ఈసారి కొంచెం ఈజీ ప్రశ్నవేసారు.   రెండో ప్రశ్న: సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులలో నిజంగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వారి పేర్లు చెప్పండి? అని అడిగారు. పాపం పామర జనం, ఒక్కడు నోరు విప్పితే ఒట్టు. మరీ ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతే వీళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతికేస్తున్నారో పాపం? అనుకొంటూ ఈసారి రాజకీయ నేతలు ఇంకా ఈజీ కొశ్చన్ అడిగారు ప్రజలని.   మూడో ప్రశ్న: అసలు రాష్ట్ర విభజన ఎందు కోసం చేస్తున్నారు?  ‘ఓస్! ఈ మాత్రం రాజకీయ జ్ఞానం కూడా మాకు లేదనేనా మీకు ఇంత అలుసయిపోయాము?’ అంటూ ‘తెలంగాణా ప్రజల అడుగుతున్నారు గనుక చేస్తున్నారని’ టక్కున సమాధానం చెప్పేశారు. ‘మరయితే మిగతా రాష్ట్రాలలో కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అడుగుతున్నారు కదా? మరి వారికెందుకు రాష్ట్రాలను విభజించి ఈయడం లేదు?’ అని నేతలు ఎదురు ప్రశ్న వేసేసారికి జనాలు బిక్క చచ్చిపోయారు.   సరే పాపం! ఎంత వద్దనుకొన్నా వెర్రి జనాలు మళ్ళీ మళ్ళీ మనకే ఓటేసి గెలిపిస్తున్నారు గనుక వాళ్ళని మరీ అంత ఆట పట్టించకూడదని భావించి ఈసారి ఇంకా ఈజీ ప్రశ్నేవేసారు.   నాలుగో ప్రశ్న: అసలయిన గొప్ప సమైక్యవాది ఎవరు? రాష్ట్ర విభజన కోరుతున్నవారు ఎవరు? దీనికయినా పామర ప్రజలు టక్కున సమాధానం చెపుతారని వారు ఊహించారు. గానీ వాళ్ళు కూడా రాజకీయ నాయకులలాగే ఒకరు ఔనన్నవారిని మరొకరు కాదనడంతో ప్రజలింకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని వారికి అర్ధమయిపోయింది. అందుకే జనాలు ఈ కన్ఫ్యూజన్ లోంచి బయటపడక మునుపే మధ్యంతర ఎన్నికలు పెట్టేస్తే ఎన్నికల సంఘానికి వెయ్యి నామినేషన్ పార్మ్స్ వేస్తామని అందరూ మొక్కుకొంటున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన కూడా ఒక బ్రహ్మ పదార్ధమా?

  జైపాల్ రెడ్డి మాటలలో చెప్పాలంటే రాష్ట్ర విభజన అంతుపట్టని ఒక బ్రహ్మపదార్ధంగా మారింది. కాంగ్రెస్ రహస్య వైఖరే అందుకు ప్రధాన కారణం. విభజన సవ్యంగా ఎలా చేయాలనే విషయంపై తనకు అవగాహన లేదనే సంగతిని ప్రతిపక్షాలు గుర్తించకుండా ఉండేందుకు చాలా తిప్పలుపడుతోంది.   ఇదివరకే ఈ ఈంశంపై అందరితో చర్చించినందున ఇకపై ఎవరితో చర్చలు ఉండబోవని ప్రకటించిన షిండే, మళ్ళీ తనే స్వయంగా మొన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే చక్కటి ఉదారణ. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ముందు మీ వైఖరి ఏమిటో చెప్పమని నిలదీసినప్పుడు, రాష్ట్ర విభజన చేస్తున్న కేంద్రమంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న షిండే ఆ విషయం గురించి తనకూ పూర్తిగా తెలియదని చెప్పడం కాంగ్రెస్ లో నెలకొన్నఅయోమయ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే మళ్ళీ ఆయనే “ఈ శీతాకాల సమావేశాలలోనే పార్లమెంటులో తెలంగాణా బిల్లుపెట్టి ప్రవేశపెడతామని” ప్రకటించడం విశేషం.   బొటాబొటి మెజార్టీతో తుమ్మితే ఊడిపోయే ముక్కులా సాగుతున్న యు.పీ.యే. ప్రభుత్వం ఎంత చమటోడ్చినప్పటికీ బీజేపీ మద్దతు లేకపోతే బిల్లుని ఆమోదింపజేసేందుకు సరిపోయే యంపీలను కూడగట్టలేదు.   రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ “సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే మేము గుడ్డిగా ఆ బిల్లుకి మద్దతు ఈయబోమని తెలిపారు. ఈ రోజు ఛత్తీస్ ఘర్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై సీబీఐని ఉసిగొల్పుతోందని తెలిపారు.   అంటే ఏ పార్టీ నుండి బిల్లుకి మద్దతు ఆశిస్తోందో, ఆ పార్టీకి చెందిన సాక్షాత్ ప్రధాని అభ్యర్ధిపై సీబీఐని ప్రయోగిస్తుంటే, బీజేపీ అవేమి పట్టించుకోకుండా తనకు ఇంత కీడు చేస్తున్నకాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే బిల్లుకి ఉదారంగా మద్దతు తెలుపుతుందా? తెలిపి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మరింత పడేందుకు సాయపడి తన పార్టీని ముంచుకొంటుందా? అని ప్రశ్నించుకొంటే బీజేపీ ఏవిధంగా వ్యవహరించాబోతోందో స్పష్టంగా అర్ధం అవుతుంది.   కనీసం తెరాస తరపునున్న ఏకైక ఓటు కేసీఆర్ దయినా ఈ బిల్లుకి పడుతుందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే తమకు ఎటువంటి షరతులు లేని తెలంగాణా కావాలని, అలా కాకపోతే బీజేపీ ఉండనే ఉందని కేసీఆర్ స్వయంగా చెపుతున్నప్పుడు, తెలంగాణా బిల్లుకి కనీసం తెరాస ఓటు కూడా పడకపోవచ్చునని అర్ధం అవుతోంది.   ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ యంపీలలో ఎంతమంది బిల్లుకి మద్దతు ప్రకటిస్తారనేది అనుమానమే. స్వంత పార్టీవారి మద్దతే అనుమానంగా ఉన్నఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బిల్లుకి ఎక్కడి నుండి మద్దతు కూడగడుతుంది? యు.పీ.యే. ప్రభుత్వం పడిపోకుండా బయట నుండి మద్దతు ఇస్తున్నవాటిలో యస్పీ, బీయస్పీ మాత్రమే ప్రధానమయినవి. వీటిలో యస్పీ రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేఖిస్తుండగా, బీయస్పీ మాత్రం మద్దతు ఇస్తోంది. అంటే భూమి గుండ్రంగా ఉన్నట్లు, తెలంగాణా బిల్లు ఆమోదం పొందాలంటే తను నిత్యం దూషిస్తున్నబీజేపీ తప్ప వేరే గతి లేదని స్పష్టం అవుతోంది. కానీ బీజేపీ మద్దతు ఈయకపోతే? అందుకే రాష్ట్రవిభజన ఒక బ్రహ్మ పదార్ధంగా మారిందని ఒప్పుకోక తప్పదు.   మరి ఈ విషయాలన్నీ కాంగ్రెస్ నేతలకి తెలియవనుకోవాలా? తెలిసి భ్రమలో ఉన్నారనుకోవాలా? లేక ప్రజలని మభ్యపెట్టవచ్చనుకొంటున్నారా? ఈ జైత్ర యాత్రలు దేనికి? జనవరి ఒకటో తేదీ గడువు దేనికి?