బాబు స్టయిల్‌ మారిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడు తన స్టయిల్‌ను మార్చుకున్నారు. నిన్నటి వరకూ ఖాళీగా రెండు వేళ్లను ‘వీ’ సింబల్‌గా చూపిన ఏకైక నేత చంద్రబాబు. తన మామ ఎన్టీఆర్‌ రెండు చేతులూ ఎత్తి మనస్ఫూర్తిగా చేసే నమస్కారాన్ని ఈయన ఎప్పుడూ అనుసరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేది బాబు పాలసీ. ఆ పాలసీ ప్రకారమే ఆయన రెండు వేళ్లను విక్టరీ అన్న అర్థం వచ్చేలా చూపేవారు. ఈయన చూపిన ఈ స్టయిల్‌ ఎంత పాపులర్‌ అయిందంటే అట్టడుగు తెలుగుదేశం కార్యకర్త కూడా రెండు వేళ్లు చూపేంత. ఈ స్టయిల్‌ నేర్చుకోవాలని కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా భావించేవారు. రాను రాను ఆ స్టయిల్‌ పాతబడిందనుకున్నట్లున్నారు చంద్రబాబు. అందుకే మీకోసం వస్తున్నా పాదయాత్రలో కొత్త స్టయిల్‌గా పాతపద్దతిని అనుసరిస్తున్నారు. రెండు చేతులూ కలిపి దణ్నం పెడుతున్నారు. ఇప్పటి దాకా చంద్రబాబు పోస్టర్లు, కటౌట్‌లు కూడా వీ స్టయిల్‌ ఉండేవి. బాబు తన పాలసీ మార్చుకున్న విషయం ఎవరికీ తెలియదు కాబోలు అనంతపురం జిల్లా హిందుపురంలో వాడిన పోస్టర్లు, బ్యానర్లలో పాతస్టయిల్‌ కనిపించింది. చంద్రబాబు ఆ బ్యానర్లు గురించి పట్టించుకోలేదు అనుకోండి. కానీ, దణ్నం పెడుతున్న చంద్రబాబు తాను పర్యటించే ప్రాంతాల్లో వచ్చింది బాబేనా అనే అనుమానానికి తావిస్తున్నారు. వీ స్టయిల్‌ మానేస్తే బాబును గుర్తుపట్టడం కష్టమని తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటున్నారు. 63ఏళ్ల చంద్రబాబు తన స్టయిల్‌ మార్చుకుంటే స్పందన మారుతుందని ఏ సిద్ధాంతైనా శెలవిచ్చారా? లేక వయస్సు ప్రభావమా? ఏమో ఏదేమైనా బాబు ఇప్పుడు నిజంగా పొలిటికల్‌ ట్రెండ్‌లో తెలుగుదేశం పార్టీలో కొత్తమార్పుకు బీజం వేశారు. విక్టరీ సింబల్‌ స్థానం దణ్నం పెట్టే సంస్కృతిని ప్రవేశపెడుతున్నారన్నమాట.

వైకాపా, కాంగ్రెస్‌ మధ్య సీమలో ప్రొటోకాల్‌ ఘర్షణలు?

నన్ను గౌరవించలేదంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రొటోకాల్‌ ఘర్షణలకు కాలుదువ్వుతున్నారు. తాజాగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రాయలసీమ నుంచి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిని ప్రభుత్వఅధికారులు, అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు పట్టించుకోవటం లేదు. దీంతో తమకు గౌరవం ఇవ్వటం లేదని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ నిరసనలకు దిగుతున్నారు. వీరితో పాటు కార్యకర్తలూ ఈ నిరసనల్లో పాల్గొని వివాదాన్ని పెంచుతున్నారు. రాయలసీమలో ఇటీవల తరుచుగా ఈ తరహా ఘర్షణలు ఎక్కువయ్యాయి. తాజాగా గాంధీజయంతి పురస్కరించుకుని తననెందుకు ఆహ్వానించలేదని అనంతపురం నగరంలోని పాతూరులో వైకాపా ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లోనే తమను పట్టించుకోకపోతే ఎట్లా అని ఆయన తరుపున కార్యకర్తలు ఎంపి అనంతవెంకటరామిరెడ్డిని, జిల్లా కలెక్టరు, ఎస్పీని నిలదీశారు. ఈ దశలోనే ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి విగ్రహం దగ్గర బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సమయంలోనే ఇరువర్గాల కార్యకర్తల మధ్య ప్రారంభమైన వాగ్వాదం పెరిగి చివరికి ఘర్షణ స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగేంత పరిస్థితి ఏర్పడిరది. పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేశారు. కావాలనే ఈ తరహాలో కాంగ్రెస్‌ పార్టీ తమను కవ్విస్తోందని రాయలసీమలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళ వ్యక్తం చేస్తోంది.

ప్రచారాభిలాషలో బాబుకు ప్రథమస్థానం?

ఎటువంటి చిన్న అవకాశం లభించినా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాన్ని భారీస్థాయిలో ప్రచారం చేసుకుంటారు. చేసినది కొంచెమైనా ప్రచారం భారీగా చేసుకునే స్టయిల్‌ చంద్రబాబు సొంతమంటారు.  రాష్ట్రంలో ఇటువంటి ప్రచారాభిలాష ఉన్న నేతలే తక్కువని కూడా గుర్తించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకమునుపు పత్రికలకు ప్రచారం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఓ ప్రత్యేకమైన వాటా వేసి మరీ పత్రికలను అప్పట్లో బాబు పోషించారు. ఆ తరహాలో ఇంకెవ్వరూ ప్రచారం చేయలేరని కూడా ఆయన నిరూపించారు. అందుకే అప్పటి ప్రతపక్షనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులాంటి ప్రచారకర్త ఏమి చేసినా అబ్బురమే మరి అని కూడా వ్యాఖ్యానించారు. దీనికి బాబు సమాధానం ఇవ్వలేదు. చంద్రబాబు అథికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ పుష్కరాలకు బాబు కాబట్టి అంత డబ్బు ఖర్చు పెట్టారని పలువురు కొనియాడారు. రాజమండ్రి రహదారులతో సహా అన్ని రూపురేఖలు అకస్మాత్తుగా మార్చేసిన ఘనత, ప్రచారం చంద్రబాబుకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు ప్రచారం కోసం ఏదో ఒక వింత పని చేయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఇటీవల విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌తో ఢీ కొనేందుకు సిద్ధమైన బాబు అస్సలు రాజగోపాల్‌కు దొరక్కుండా తిరిగేసి హైదరాబాద్‌ చేరుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలానే తాజాగా పాదయాత్రలను ప్రారంభిస్తూ సినీదర్శకుల సూచనలు పాటిస్తామన్నారు. ఇలాంటి వింతతరహా ప్రచారానికి బాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

మల్లాడి మరో హైడ్రామా

ప్రతీసారి అవకాశం ఎప్పుడు దొరుకతుందా అని ఎదురుచూసే కేంద్రపాలితప్రాంతమైన యానాం శాసనసభ్యుడు మల్లాడికృష్ణారావు రాజీనామా ద్వారా హైడ్రామాకు తెరలేపారు. తాను యానాం అభివృద్థి కోసం 8 డిమాండ్లు నెరవేర్చాలని కోరితే పుదుచ్ఛేరి సిఎం రంగస్వామి స్పందించనందుకు నిరసనగా తాను ఈ రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను న్యూఢల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. ఈ రాజీనామా ద్వారా యానాంలో తిరిగి తమ కోసం ఎమ్మెల్యే పదవిని కృష్ణారావు వదులుకున్నారన్న ప్రచారం ఆల్‌రెడీ ప్రారంభమైపోయింది. ఈ ప్రచారంతో యానాం ఓటర్లు ఎన్నికల కోసం మళ్లీ ఎదురుచూస్తారు. ఎన్నికలు రాగానే కృష్ణారావుకు ఓటేస్తారు. దీంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారపార్టీపై పెత్తనం చెలాయిస్తారు. ప్రతీసారి అధికారపార్టీపై తన అధికారం చూపే అవకాశం వెదుక్కునే కృష్ణారావు అనుకోకుండా ఈసారి ప్రతిపక్షంలో ఉండిపోయారు. ప్రజలు ఎన్నుకుంటే తాను వదులుకున్నా ఓటర్లు గెలిపించుకున్నారని అధికారపార్టీపై కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందిన తీరు పరిశీలిస్తే ఆయన ఇంట్లో నుంచి రూపాయి తీయకుండా నేను కావాలనుకుంటే గెలిపించుకోండి, నాకు పదవీవ్యామోహం లేదు, నేను పేదవాడిని, గెలిపిస్తే మాత్రం సేవ చేసుకుంటానని మల్లాడి మౌనం వహించారు. ప్రచారం వదిలేసి ఇంట్లోనే ఉండిపోయిన మల్లాడిని యానాం ఓటర్లు గెలిపించుకున్నారు. ఇలాంటి హైడ్రామాలు ఆడటంలో అనుభవమున్న మల్లాడి మళ్లీ తెరపై తన హంగామాను మొదలుపెట్టారు. స్పీకర్‌ రాజీనామా ఆమోదిస్తే ఒకరకంగానూ, ఆమోదించకపోతే మరో రకంగానూ మల్లాడి మాట్లాడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిఎంకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలను చేరదీసిన మల్లాడి అంత అకస్మాత్తుగా రాజీనామా చేశారంటే ఆలోచించాల్సిన విషయమేనని రాజకీయపరిశీలకులు అంటున్నారు.

కేసిఆర్‌ తరువాత జానారెడ్డేనా?

‘ఈ నెల్లో వచ్చుద్ది...ఇక ఇవ్వకపోతే గుంజుడే...సోనియా అమ్మ కదిలొస్తోంది ఇంకో వారంలో తెలంగాణాయే...ఆందోళనలు అనవసరం...మేము షురూ చేసినాక ఎనకాడేదేముంది...’ వంటి ఎన్నో మాటలు విని విని తెలంగాణా ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రత్యేక తెలంగాణా కోసమే పార్టీగా అవతరించిన తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్‌) అధినేత కే. చంద్రశేఖరరావు(కేసిఆర్‌) పైమాటలను మార్చి మార్చి చెబుతూ ఏళ్లు గడిపేశారు. చివరికి ఆయనే స్వయంగా ఢల్లీలో మకాం చేసి తెలంగాణా ప్రకటన కోసం ఎదురు చూశారు. ఆ ఎదురుచూపుల్లో రోజులు కరిగిపోతున్నాయి కానీ, స్పందన రాకపోవటంతో నిరాశగా తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సమయంలో కేసిఆర్‌పై గతం నుంచి తిరుగుబావుటా ఎగురవేస్తూ వచ్చిన తెలంగాణా ఐక్యవేదిక(జెఎసి) ఛైర్మను, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణా మార్చ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కొంత మేరకు విజయవంతమైంది. దీంతో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించి కార్యక్రమాన్ని ముగించారు. కేసిఆర్‌ గత్యంతరం లేని స్థితిలో తమ పార్టీ శ్రేణులకు తెలంగాణామార్చ్‌ను విజయవంతం చేయమని పిలుపు ఇచ్చారు. ఇప్పటిదాకా కేసిఆర్‌ను తెలంగాణాలో గమనిస్తూ వచ్చిన ప్రజలు కొత్తగా తెరపైకి వచ్చిన మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు గురించి చర్చించుకుంటున్నారు. జానారెడ్డి తెలంగాణా 2014లోపు వచ్చేస్తుందని ప్రకటించారు. దీంతో తెలంగాణావాదులు ‘ఫిర్‌ తెలంగాణాబాత్‌ 2014తక్‌’ అంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పటి దాకా కేసిఆర్‌ టైమిస్తుంటే ఆయన తరువాత జానారెడ్డి కూడా టైమిచ్చేశాడంటున్నారు. కేసిఆర్‌లా జానా కూడా ఎదురుదెబ్బ తినేంతవరకూ ఇలానే మాట్లాడతారని అనుకుంటున్నారు.  

ఆడంబరాలకు పోయి...

  ఒకప్పుడు ఆ సంస్థ అంటే గాలిలో హాయిగా విహరింపజేసే అద్భుతమైన సంస్థ. సినీకళాకారుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ అందులో ప్రయాణించినవారే, పొగిడినవారే.. ఒకప్పుడు 64 విమానాలతో ఆకాశయానాన్ని మిగతావాటితో సవాల్‌ చేసిన కింగ్‌ ఫిషర్స్‌ సంస్థ నేడు 14 విమానాలను నడుపుతూ...అది కూడా ఎప్పుడు ఆగుతాయో తెలియని విధంగా నడుపుతూ పేరులో కింగ్‌ను పోగొట్టుకుంది. 7వేల కోట్ల రూపాయల అప్పుడు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థకు పైలెట్లు చేసే మెరుపుసమ్మెలతో రెక్కలు తెగి గిలగిలలాడుతోంది. ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ ఆప్‌ ఇండియాకు సైతం చెల్లించాల్సిన ఫీజులు సైతం సక్రమంగా చెల్లించడంలేదు. దీంతో విమానాలను లీజుకు ఇచ్చిన వారు తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఐదు విమానాలకన్నాతక్కువ నడిపితే ప్లయింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని విమానయానశాఖ ప్రకటించింది. ఒకప్పుడు ఎంతోమంది మోడల్స్‌కు, రాజకీయనేతలతో చుట్టూ చేరి నిత్య వినోదాలతో మహారాజుగా వెలిగిన కింగ్‌ ఫిషర్స్‌ యాజమాన్యం నేడు విమానాయాన సంస్థల్లోనే ఓ అనాథగా మిగిలిపోనుంది. దీనిపై అసలు తప్పెక్కడుందని ఎంతోమంది పెద్దలు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ‘ఆడంబరాలకు పోయి.. అప్పులు చేస్తే చివరకు మిగిలేది అప్పులే...’ అని పెద్దలమాటలే ముద్దుగా చెబుతున్నారు. అది భవిష్యత్‌లో కింగ్‌ ఫిషర్‌ విషయంలో నిజం కావచ్చు... ఈలోపు నేతలెవరైనా.. రక్షించే ఉద్దేశంతో తలచుకుంటే తప్ప...అని ఆకాశయాన ప్రేమికుల ఉవాచ.

నాకే దిక్కులేదు....ఇక...

  తన దాకా వస్తే కాని... అన్నట్లుగా ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు సామాన్యులు చెబితే నేతలు ఏ మాత్రం పట్టించుకోరు సరికదా.. అన్ని పనులు ఒకేసారి ఎలాచేస్తారు... ఓపికపట్టాలి... అంటూ నీతివచనాలు చెబుతుంటారు. అదే తనదాకా వచ్చినప్పుడే.. అది తెలిసేది. కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి కపిల్‌ సిబల్‌కు ఇటువంటి అనుభవమే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ నుండి ఎదురైంది. అప్పటికాని ఆయన ప్రభుత్వ సంస్థల పనితీరు అర్ధంకాలేదు. మా ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ పనిచేయకపోతే ప్రతిరోజు సంస్థకు ఫిర్యాదు చేసుకుంటూ వెళ్ళాను... నా కంప్లైంట్‌ను పరిష్కరించటానికి వారంరోజులు పట్టింది..’ అని ఆయన కంపెనీ పనితీరును విమర్శించారు. ఇది కూడా ఆయన బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవా పదక్‌ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటికైనా తెలిసింది నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు మారుపేరు ప్రభుత్వ రంగ సంస్థలని. ప్రభుత్వ అధికారులని. మంత్రికే వారం రోజులు పడితే... ఇక సామాన్యుడు తన అక్షరాభ్యాసంనాడు ఫిర్యాదు చేయిస్తే... అతని షష్టి పూర్తికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతవేగంగా వారి పనులుంటాయని... అదే డబ్బు వసూలు తదితరాల్లో మాత్రం ముందుంటారని సామాన్యుల ఉవాచ. నిజమేమిటో.. మంత్రిగారి వ్యాఖ్యలు అర్ధంచేసుకున్న అందరికి తెలియాలి!

‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’

  మేం ఏం చేసినా అదేమని ప్రశ్నించే అధికారం ఎవకవరికీ లేదంటూ ఒంటెత్తుపోకడలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. దేశాన్ని తమ చిత్తమొచ్చినరీతిలో పాలించేస్తామనీ, మాకోటేసిన పాపానికి మేం అధికారంలో ఉన్నన్నాళ్ళూ భరించాల్సిందేనన్న కాంగ్రెస్‌ పిడివాదానికి సుప్రీం చెక్‌ చెప్పింది.బొగ్గుగనులను ఇష్టంవచ్చినట్లుగా కేటాయించేసి, దేశాదాయానికి గండికొట్టారంటూ కంప్రోల్టర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికనివ్వడంపై షాక్‌కు గురైన కాంగ్రెస్‌ మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకెక్కడిదని సవాల్‌ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌పార్టీ అభిమానిగా చెప్పుకునే అరవింద్‌గుప్తా అనే ఆయన కాగ్‌ అధికారాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీం ఈ పిటీషన్‌ను త్రోసిపుచ్చుతూ, ప్రభుత్వం ఏం చేసినా విధేయత ప్రదర్శించేందుకు కాగ్‌ సర్కారు వారి గుమాస్తా కాదని స్ఫష్టం చేసింది. కాగ్‌ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అనీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో బాటు కేంద్ర పాలిత ప్రభుత్వాలు జరిపే ఆదాయవనరుల కేటాయింపులపై సమీక్ష జరిపే అధికారం కలిగి ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనుకున్న కేంద్రం ఎవరెన్ని మొట్టికాయలేసినా కాగ్‌ నివేదికపై బదులిచ్చేందుకు ససేమిరా అంటోంది. జవాబివ్వటంలేదంటే ఖచ్చితంగా ఏదో గోల్‌మాల్‌ జరిగే ఉంటుందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

హేరామ్..!

సత్యమే ఆచారం, అహింసే ఆయుధం.. బతికున్నన్నాళ్లూ మహాత్ముడి ఈ రెండు ఆయుధాల్నే నమ్ముకున్నాడు. వీటితోనే అత్యద్భుతమైన విజయాల్ని సాధించాడు. తను నమ్మిన సిద్ధాంతంకోసం, భారతీయులకు దాస్య విముక్తిని కల్పించడంకోసం మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. తన సర్వస్వాన్నీ త్యాగం చేశాడు. తన జీవితాన్ని జాతికి అంకింతం చేశాడు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. గాంధీ తత్వం ముందునుంచీ కొంతమంది అతివాదులకు నచ్చేదికాదు. కానీ.. గాంధీ ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. సత్యాన్ని, అహింసని నమ్ముకుని వాటి శక్తిని గ్రహించి నిబ్బరంగా ముందుకు సాగాడు. వీరావేశాన్ని ప్రదర్శించినవాళ్లు లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఎంతోమంది గొప్ప దేశభక్తులు ప్రాణాల్ని దేశంకోసం ధారపోశారు. కానీ.. స్వాతంత్ర్యాన్నిమాత్రం సాధించలేకపోయారు. అది మహాత్ముడు నమ్ముకున్న సత్యమార్గంలోనే వచ్చింది.  అఖరికి గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపినప్పుడుకూడా మహాత్ముడి పెదాలపై చిరునవ్వు చెదరలేదు. హేరామ్.. అంటూ కుప్పకూలిపోయారు తప్ప గాడ్సేమీద ఆయనకు కోపం కూడా రాలేదు. అదీ మహాత్ముడి గొప్పదనం. అందుకే ఆయన జాతిపిత అయ్యాడు. అందుకే మహనీయుడిగా మనందరి గుండెల్లో కొలువయ్యాడు.

అంతిమ లక్ష్యం....!

నేడు ఎవరు ఎటువంటి ఉద్యమాన్ని నడిపినా దాని అంతిమ లక్ష్యం రాజకీయ అధికారమేనన్నది దేశంలో నేడు జరుగుతున్న  పలు సంఘటనలను బట్టి తెలుస్తోంది.  అవినీతికి వ్యతిరేకంగా పోరు సల్పుతూ యువతలో, ప్రజల్లో అవినీతిపై ఓ అవగాహన కల్పించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులువేస్తున్న సమయంలో  అన్నా హజారే బృందంలోని   అరవింద్‌ క్రేజీవాల్‌ స్వంత పార్టీపై తనకు గల సందేహాలను నివృత్తి చేయమని అన్నా హజారే కోరినా కేజ్రీవాల్‌ జవాబులు ఇవ్వలేదట! దీన్ని బట్టి  ఇందులో రెండుకారణాలుండవచ్చని ప్రజలనుకుంటున్నారు. ఒకటి` అవినీతి అంటని పార్టీ లేదు.. అవినీతి లేని పార్టీలేదు.. అందుకే  అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హాజారే బృందాన్ని బ్రిటీష్‌వారి తరహాలో విభజించు పాలించులా  విడదీసేందుకు క్రేజీవాల్‌ను ఓ పావుగా వాడుకుంటున్నారన్నది ఒకటయితే.. రెండోవది` అవినీతిపై పోరాటంలో ప్రజల నుండి వచ్చిన విశేష స్పందనను రాజకీయంగా ఉపయోగించుకుంటే ఓ నేతగా ఎదగవచ్చునన్న  క్రేజీవాల్‌ బృందం ఆశే ఈ పార్టీ రూపకల్పనకు కారణం కావచ్చన్నది రెండోవది. ఏదేమైనా ... నిజానికి నిజాయితీ విలువలు తగ్గిపోతున్నాయి.  నిజాయితీపరులను  బ్రతికున్నప్పుడు చచ్చేవరకు చచ్చేలా సతాయిస్తారు.. చచ్చినతర్వాత..  బ్రతికుండాలని కోరుకుంటారు? ఇవా దేశాన్ని ప్రగతిపథం వైపు తీసుకుపోయే రాజకీయాలు.. ఇటువంటి రాజకీయాల్లోనా కాస్తోకూస్తో.. ప్రజలంటే అభిమానం.. ప్రజలకు వారిపై అభిమానం ఉన్న నాయకులు రావడం... దీని పర్యవసానం.

అప్పుడు కోతలే.... ఇప్పుడూ కోతలే...!

ఏమిటో...! అధికారంలోకి వచ్చే వరకు కొన్ని కోతలు.. వచ్చిన తర్వాత ఇంకో కోతలు. కోతలు మాత్రం రాజకీయనాయకుల జన్మహక్కుగా మారిపోయింది.  ఎన్నికల్లో అదిచేస్తాం... ఇదిచేస్తాం... అని చెబుతారు. గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఖజానాలో ఏం మిగల్చలేదు.. కాబట్టి చేయలేకపోతున్నాం... అంటారు. అటువంటప్పుడు ఆ కోతలు దేనికి? జనాన్ని పిచ్చివాళ్ళక్రింద జమకట్టేస్తున్నారు!  వర్షాలు పడినా కరెంట్‌ కోతలే.. పడకపోతే మరిన్ని కోతలు.. ప్రస్తుతం  కొన్ని చోట్ల మూడుగంటలు, మరికొన్ని చోట్ల ఆరుగంటలు, ఎనిమిది గంటలు సాగుతున్న కరెంట్‌కోతలు ఇంచుమించుగా గంట, రెండుగంటలు అదనంగా కోతలు ప్రారంభమయ్యాయి!  రోజుకు 24 గంటలు అయితే కరెంట్‌ కోతలు సుమారుగా అందులో సగం!  విద్యుత్‌ వాడకం పెరిగిపోతోంది.. అనుకున్నంతగా సరఫరా కావడంలేదు.. అందుకే ఈ కోతలు.. అని మంత్రులనుండి అధికారుల వరకు అందరూ కోతలే...! ఒక్కసారి అధికారులు కాని మంత్రులు రహదారులపైకి వచ్చి వీధిలైట్లవైపు చూస్తే తెలుస్తుంది. మిట్టమధ్యాహ్నం 12గంటలు అయినా కూడా కొన్నిరోజులు లైట్లు వెలుగుతూనే ఉంటాయి.  సూరీడు వెలుతురుకు ప్రజలకు కనిపిస్తున్నా.. పాపం ఆయా అధికారులకు కనిపించకపోవడం కడు శోచనీయం.!  నెలలో కనీసం వారంరోజుల పాటు ఇలా లైట్లను పట్టపగలే వెలిగిస్తే  కొరత రాక ఏమవుతుంది! దీనికి తోడు  పలు అడ్వర్ట్‌టైజ్‌మెంట్ల హోర్డింగులు కూడా అర్ధరాత్రులు సైతం అతి ఖరీదైన విద్యుద్దీపాలతో వెలిగిపోతుంటాయి. ఇటువంటి వాటి నుండి ఎలా వసూలు చేస్తున్నారో... ఎవరికి తెలియదు! వీటికి కూడా కోతలు ఇవ్వడం, అధికంగా వసూలు చేసి గృహ అవసరాలకు వసూలు చేసే ఛార్జీలను తగ్గించడం చేస్తే బావుంటుంది. ఈ హోర్డింగుల వల్ల ఆయా  కంపెనీలకు వచ్చే లాభాలలో ప్రభుత్వానికి ఏమి ఇవ్వదు కదా! అందుచేత ఖచ్చితంగా  ఏ హోర్డింగులకైనా సరే... తప్పనిసరిగా అత్యధిక మొత్తంలో వసూలు చేయడం లేదా దానికి ఆయా కంపెనీల వారికి ఇతరత్రా  వనరులను ఉపయోగించుకోమనడం ఉత్తమం! లేదంటే 24 గంటల్లో కనీసం 10 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేస్తారో లేదో కూడా అనుమానమే!  వేసిన కొద్ది సమయానికే ఛార్జీలు మాత్రం పెరిగిపోతాయి! ఇక్కడ సరఫరా అయ్యే విద్యుత్‌ను, గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం.. వారినుండి అత్యధిక ధరకు కొనుక్కోవడం... పాలకులకు అలవాటుగా మారింది..  పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన విద్యుత్‌ను, గ్యాస్‌ను మనకు సమృద్ధిగా ఇవ్వన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఓట్లు వేయడం దేనికి? అని ఆలోచిస్తున్నారు సామాన్యులు!

హమ్మయ్య...ఇప్పటికి ఓ.కె.!

ఈమధ్య కాలంలో సమ్మెలు లేని రంగంకాని, సంవత్సరం కాని లేదంటే అతిశయోక్తికాదేమో. అయితే ఆ సమ్మెలు రకరకాలనుకోండి! అయితే అవి సగటు మనిషి జీవితంపై పడితే అసలే బ్రతకడం కోసం బతుకీడుస్తున్న జనం ఈ సమ్మెల సమ్మెట దెబ్బలతో  కాస్తకూస్తో జోరువాన కురిసి వర్షం  వెలిసింది అనుకునే లోపే సునామి వచ్చినట్లుగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కొంచెం ఆనందకర వార్త విన్నా పండుగ జేసుకున్నంత ఆనందిస్తారు. అటువంటి వార్తే ఇది. కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కారణంగా తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్లు రాష్ట్ర గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌  తెలిపింది.  తమ సమస్యల పరిష్కారానికి 4,5 తేదీల్లో విస్తృత సమావేశం ఏర్పాటుచేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని,  ఈ నేపథ్యంలో తాము చేయతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు  పేర్కొన్నారు. ఈ వార్త ఆ డిస్ట్రిబ్యూటర్లుకు కాని,  ఆ శాఖకు సంబంధించిన మంత్రులకు కాని  ప్రభుత్వానికి సంతోషంకాకపోవచ్చునేమోకాని... సామాన్యులకు ఇది ఎంతో ఆనందించదగ్గ వార్త.  అసలే పండుగలను పండుగగా చేసుకోవడం చాలాకాలమే మరచిపోయారు సామాన్యులు. ఇటువంటి వార్తలే వారికి నిజమైన పండుగలు. ఏంచేస్తాం... అంత కాల వైపరీత్యం!

భ్లాక్‌ సృష్టిస్తున్న టుబాకో డీలర్లు

అన్నిటా ధరలు పెరిగిపోయిన ప్రస్తుత రోజుల్లో సిగరెట్లకు కూడా కరువొచ్చిపడిరదని ధూమపానప్రియులు వాపోతున్నారు. మొన్న మేనెలలోనే సిగరెట్ల రేట్లు భారీగా పెరిగాయి. అయినా ఇప్పుడు మళ్ళీ సిగరెట్లకు కొత్తరేట్లొస్తున్నాయంటూ ఎమ్మార్పీ రేటుకు మూడు నుంచి అయిదు రూపాయల వరకూ అదనంగా వసూలు చేస్తున్నారని ధూమపానప్రియులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గానీ, సిగరెట్ల కంపెనీల నుంచి గానీ ఎటువంటి ప్రకటనా వెలువడనప్పటికీ అనధికారికంగా ఈ వసూళ్ళు జరిగిపోతున్నాయనీ, అదేమని అడిగితే కొత్తరేట్లు వచ్చాయంటూ బదులిస్తున్నారని వారు చెబుతూ, కేవలం నాలుగు నెలలు కూడా గడవకుండానే మళ్ళీ రేట్లు ఏవిధంగా పెంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు. తిండిగింజలకేకాదు, చుట్టపీకలక్కూడా ఆందోళనలు చేయ్యాల్సిన అగత్యం ఈ ప్రభుత్వపాలనలో దాపురించిందని సామాన్యజనం వాపోతున్నారు.

బాబు భవిత చెప్పిన బ్రహ్మంగారు?

భవిష్యత్తును ముందుగానే కనిపెట్టి తన కాలజ్ఞానం ద్వారా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించారు. ఆయన రచనలో కరువుకాటకాలు, ఆధునిక ప్రపంచ పోకడలు, వావి వరసలు లేని శృంగారం వంటి పలు అంశాలు నిజరూపం దాల్చి ఇప్పటికే సామాజిక అథ్యయనపరులను కలవరపెట్టాయి. ఈ మూడు అంశాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ప్రచారాన్ని కూడా పొందాయి. అయితే కాలజ్ఞానంలో కరువు గురించి బ్రహ్మంగారు ప్రస్తావించినప్పుడు ఓ తెల్ల మచ్చలు గల వ్యక్తి  రాజ్యమేలుతున్నప్పుడు ప్రజలు ఆకలి అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు.  చంద్రబాబు హయాంలోనే కరువు కాటకాలు విజృంభించాయన్నది జగమెరిగిన సత్యం. ఈ నిజాన్ని వైఎస్‌ అభిమానులు రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించారు. వారు చెప్పినట్లే కరువు కోరల నుంచి రాష్ట్రం కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే వైఎస్‌ అభిమానులు ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారారు. అలా మారిన వారిలో ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, అమరనాధ్‌రెడ్డి తదితరులున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా కరువుకు  చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. అన్ని విమర్శలకు వెంటనే స్పందించే తెలుగుదేశం పార్టీ ఈ విమర్శపై బాబు పాదయాత్రల హడావుడిలో పడి పట్టించుకోలేదు. అయితే ఈ విమర్శకు కర్నూలు, అనంతపురం, కడప తదితర రాయలసీమ జిల్లాల్లో  తగిన ప్రాధాన్యత లభించింది. నిజమే కదా అని రాయలసీమవాసులు స్పందించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాటెలా ఉన్నా చంద్రబాబుకు కరువుకు మధ్య ఉన్న లింకు మాత్రం తమను పీడిరచి వదిలేసిందని వారు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మద్దతు బేరీజు వేసుకుంటున్న బాబు?

తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే వారి సంఖ్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేరీజు వేసుకుంటున్నారు. దీని కోసం తన కుమారుడు నారా లోకేశ్‌, బావ బాలకృష్ణ, కోడలు, ఇతర కుటుంబసభ్యులకు బాబు పని కల్పించారట. యాత్రకు ఎంత మంది మద్దతు ఇస్తారు అన్నది లెక్కించటమే కుటుంబం మొత్తం చేయాల్సిన పని. పాదయాత్రలు ముగిసిన తరువాత తమ పార్టీ వాస్తవ పరిస్థితి అంచనా వేసుకోవాలని చంద్రబాబు ఆలోచన. ప్రత్యేకించి ఇలా అంచనాలన్నీ క్రోడీకరించాక నాయకత్వ మార్పు కనుక ప్రజలు కోరుకుంటే నారా లోకేశ్‌బాబును రంగంలో దింపవచ్చని కూడా బాబు ఆలోచిస్తున్నారట. తన కుమారుడినే రంగంలోకి దింపాల్సి వస్తే కోడలును ప్రచారకార్యదర్శిగా నియమించాలని కూడా యోచిస్తున్నారని బాబు విశ్వాసపాత్రుల భోగట్టా! ఇంతకీ బాబు తన 17వేల కిలోమీటర్ల పాదయాత్రను భారీస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సన్నాహాల్లో అన్నిరంగాల వారినీ బాబు సంప్రదించారు. ప్రత్యేకించి పారిశ్రామికవేత్తలు ఇచ్చిన భరోసా పాదయాత్ర నిర్వహణ కొంతవరకూ లాభదాయకమనే భావన కూడా బాబుకు కలిగిందట. గతంలో తమ ప్రభుత్వహయాంలో పారిశ్రామిక మేళ్లు పొందిన వారందరినీ పాదయాత్ర వల్ల ఉపయోగాల గురించి బాబు  ప్రశ్నించారని కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. దాంతో పాటు పార్టీపై ఎవరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో గమనించిన బాబు భవిష్యత్తులో తమకు సహకారం అందించాలని ఓ మాట వేసి ఉంచారట. దీంతో ఎన్నికల ఖర్చుకు కొంత వెసులుబాటు కూడా లభించవచ్చన్న నమ్మకం బాబుకు కుదిరిందని కూడా చెప్పుకుంటున్నారు. దాంతో పాటు సినీరంగంలో తమ మద్దతుదార్లను కనిపెట్టేందుకు నిర్మాతలను, దర్శకులను బాబు ఆహ్వానించారు. దర్శకులు బాబు ఆహ్వానం అందగానే తమ వంతు సలహాలను ఇచ్చేశారు. దీంతో సినీరంగంలో ఇప్పటికే తమ పార్టీ పరిస్థితిపై బాబు ఒక అంచనాకు వచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబును బాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారని తాజాసమాచారం. ఈ సమాచారం ప్రకారం చిత్తూరు పర్యటన విజయవంతం చేసేందుకు మోహన్‌బాబు అభిమానులను తెలుగుదేశం నేతలు సిద్ధం చేశారని తెలిసింది. ఇలా చంద్రబాబు తన పర్యటనలో ఊహించని మలుపులు తిప్పేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నారని తాజాగా తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా జరిగే ఈ పాదయాత్రలకు బావ హరికృష్ణ మద్దతు ప్రకటించటం చంద్రబాబు శుభసూచకంగా భావిస్తున్నారట.

అడకత్తెరలో మంత్రి సబిత?

రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. విడవమంటే పాముకు కోపం...వదులుతానంటే కప్పకు కోపం అన్నట్లు ఆమె తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలంగాణామార్చ్‌ ఆమె పట్ల తెలంగాణావాదుల్లో కొంత వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అడపాదడపా పోలీసులు చేసిన అరెస్టులు ఆమె చుట్టూ రాజకీయం చేయటానికి దోహదపడుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్చ్‌ విషయంలో పోలీసులు ముందస్తుజాగ్రత్తలు తీసుకున్నారు. కిరణ్‌తో పాటు ఈమె కూడా ఆదేశాలు ఇచ్చి ఉంటారని తెలంగాణావాదులు అనుమానిస్తున్నారు. హోంశాఖా మంత్రి ఆదేశాలు లేకపోతే పోలీసులు రెచ్చిపోరని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. అందుకే మంత్రి సబిత గురించి ఆలోచించాలన్నట్లు వారు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సిఎం కిరణ్‌ ప్రత్యక్షజోక్యంతోనే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారని సమాచారం. రాష్ట్ర డిజిపి, డిఐజి తదితరులు సిఎం చెప్పినట్లే శాంతిభద్రతల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి అరెస్టులు చేయకపోతే అల్లర్లు తప్పవన్న ముందస్తు హెచ్చరికలు కూడా పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో ఒకవైపు సిఎం కాంగ్రెస్‌ అధిష్టానం, మంత్రుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంత్రి సబిత తన ప్రమేయం ఏమీ లేదన్నట్లు నాటకం ఆడుతున్నారని జరిగిన ప్రచారం తెలంగాణావాదులను ఉసిగొల్పుతోంది. అసలు ఈ విషయంలో తన పాత్ర ఏమీ లేదని నిరూపించుకోవాలంటే సబిత కేసులు లేకుండా చూడాలని తెలంగాణావాదులు ఆమెకు ప్రత్యేకసూచనలు కూడా చేశారట. దీంతో ఆమె సిఎంకు చెప్పకుండా కేసులు  గురించి చర్య తీసుకోవాలో? లేక తన సొంత నిర్ణయాన్ని అమలు చేసి సిఎం ముందు దోషిగా నిలబడాలో? తెలియని స్థితిలో ఉన్నారు.

బేష్‌ అనిపించుకునేందుకు టి.మంత్రుల పాట్లు!

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం తమ బలాన్ని నిరూపించుకునేందుకు చేపట్టిన మార్చ్‌ఫాస్ట్‌ కాంగ్రెసుపార్టీలో పెద్ద కలకలాన్నే రేపింది. మార్చ్‌ఫాస్ట్‌ ముగిసిన తరువాత తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు హంగామా చేస్తున్నారు. తామే ప్రభుత్వానికి పెద్ద దిక్కు అని చెప్పుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ కాంగ్రెస్‌ పార్టీపై అలుగుతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా మొత్తం నలుగురు తెలంగాణా మంత్రులూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ప్రత్యేకించి అధిష్టానానికి సిఎంపై ఫిర్యాదు చేసేందుకు అవసరమైన గ్రౌండ్‌ను కూడా తయారు చేసుకున్నారు. దీని ఆధారంగా సిఎంపై ఒత్తిడి చేసి టిఆర్‌ఎస్‌, తెలంగాణా జెఎసి నుంచి బేష్‌ అనిపించుకోవాలని తపనపడుతున్నారు. ముందుగా ఈ కోవలోకి కరీంనగర్‌ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జానారెడ్డి చేరిపోయారు. ఆయన తనకున్న ఢల్లీ బలాన్ని సిఎంపై ఒత్తిడి రూపంలో తీసుకువచ్చేందుకు తెగఫోన్లను వాడేస్తున్నారు. తనతో పాటు ఈ జాబితాలో చేరిన డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహను కూడా రెచ్చగొడుతున్నారు. అంతేకాకుండా సిఎంను దుర్భాషలాడేటప్పుడు నరసింహను కూడా తోడుగా ఉంచుకున్నారు. వీరిద్దరికి మరో ఇద్దరు మంత్రులు వంత పాడుతున్నారు. తెలంగాణా ప్రాంతంలో పేరెన్నికగన్న ఈ మంత్రులూ వీరితో పాటు కయ్యానికి సిద్ధపడ్డారు.

భానుని విశ్వరూపం? పెరుగుతున్న నమ్మకం!

భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సూర్యోదయాన్ని తన వెలుగులతో నింపాడు. ఇది ఏ రచనలో వాడిన వాక్యాలు కావు. నిజంగానే అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో అరుదైన వెలుగులు ప్రసరించాయి. అసలు ఆలయ నిర్మాణంలో సూర్యుని కిరణం పడటానికి అవకాశాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆ సూర్యకిరణాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విగ్రహంపై పడి భక్తుల నమ్మకాన్ని పెంచుతుంటాయి. గ్రహదోషాలతో బాధపడే వారి కోసం అరసవిల్లిలో నిర్మించిన ఈ సూర్యదేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది. గ్రహదోషాలను పరిహరించే శక్తి ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని శాస్త్రరీతుల ప్రకారం నిర్మించారు. ఆ విగ్రహం నిర్మించినప్పటి నుంచి ప్రతీ ఏడాది  ప్రత్యేకదినాల్లో క్రమంగా తప్పకుండా సూర్యనారాయణుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు. ఆయన వెలుగులు అరుదైన వింతగా చరిత్రపుటల్లో నమోదవుతూనే ఉంది. భారతదేశంలో సూర్యనారాయణమూర్తికి కోణార్క్‌, ఆ తరువాత అరసవిల్లిలో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలను ప్రతిపాదికగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలోనూ సూర్యనారాయణమూర్తి దేవాలయం నిర్మించారు. ఈ మూడు ఆలయాల్లోనూ సూర్యకాంతి పడటానికి ప్రధానద్వారం, గవాక్షంలో సుదూరంగా ఖాళీలు ఉంచితే ప్రత్యేకదినాల్లో సూర్యకాంతి విగ్రహాలపై పడుతోంది. ఇది ఎలా సాధ్యమైందని పరిశోధకులు పలురకాల పరిశీలనలు జరిపారు. కానీ, వైజ్ఞానికశాస్త్రానికి ఇది అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. అటువంటి అరుదైన సందర్భం తాజాగా ఆదివారం నమోదైంది. ఈ వారాన్నే భానువారం అని కూడా పిలుస్తారు. అందువల్ల తన వారపురోజున వింత ప్రకాశంతో సూర్యనారాయణమూర్తి దర్శనమివ్వటం భక్తుల్లో నమ్మకాన్ని పెంచింది. అలానే హిందువులు విశ్వసించే గ్రహదోషాలు నివారించుకునేందుకు పూజలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఆలయంలోని పూజారులూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ మార్చ్‌ తేల్చి చెప్పిన నగ్న నిజాలు

తెలంగాణ తెచ్చేదెవరు? ఇచ్చేదెవరు? అన్న విషయానికి సంబంధించి తెలంగాణ మార్చ్‌ తేల్చిచెప్పిన నిజాలు రాజకీయవర్గాలకు మింగుడు పడేలా లేదు. పసి పిల్లలను ఎత్తుకుని వర్షంలో తడుస్తూ, ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచీ ఆడపిల్లలు మార్చ్‌కు హాజరుకావడం, ఆరేళ్ళ నుంచీ 70 ఏళ్ళ వరకూ అన్ని వర్గాల నుంచీ ప్రజలు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మార్చ్‌ తేల్చిచెప్పింది. అంతేకాదు తెలంగాణ సాధనకు రాజకీయ సాధన ఆశించిన స్థాయిలో లేదని కూడా తేల్చి చెప్పింది. తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం నాలుగు గంటలు అవకాశం ఇస్తే నిరాఘాటంగా 12 గంటల పాటు నిర్వహించిన ఘనత మార్చ్‌ నిర్వాహకులకు దక్కుతుంది. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్న  రాజకీయనేతలు లేకుండా పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ సభ సజావుగా నిర్వహించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టింది. ముఖ్యంగా సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి భారతీయ జనతాపార్టీ, సిపిఐ, న్యూడెమోక్రసీ పార్టీల జెండాలు కలిసి ఎగరడం ఒక ప్రజా ఉద్యమంలో ఇదే తొలిసారేమో. ప్రజల ఆకాంక్షలను గుర్తించి, దానిని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే అధిక శాతం పార్టీలు కృషి చేసిన విషయాన్నికూడా తెలంగాణవాదులు గుర్తించారు. అందుకే రాజకీయపార్టీల వ్యవహారాన్ని విస్మరించి ప్రభుత్వంలోనే కాదు సామాజికంగా ఎన్ని విభాగాలుంటే అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావడం తెలంగాణ మార్చ్‌ ప్రత్యేకం. తెలంగాణ మార్చ్‌ జరిగిన తీరుతెన్నులను గమనిస్తే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయాల ప్రమేయం లేకుండా జెఎసి చేతుల్లోకి తీసుకున్నట్లు అర్థమవుతున్నది. అంతేకాదు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా తెలంగాణ తమకు దగ్గరలోనే ఉందన్న విషయాన్నీ తెలంగాణవాదులు అర్థం చేసుకున్నారు.     తెలంగాణ పది జిల్లాల్లో ప్రతీ జిల్లా నుంచి లక్ష మంది వరకూ తెలంగాణ మార్చ్‌కు తరలారు. ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులుగా నిలిచారు. ప్రజాఆకాంక్షతో వచ్చిన వారు కనుక ఎన్ని కష్టాలకయినా ఓర్చి మార్చ్‌కు తరలారు. ప్రతీ బృందం తమ ఆహారం, నీళ్ళు మోసుకుంటూ వచ్చారు. స్వచ్ఛందంగా ఆహార, నీళ్ళు పొట్లాల పంపిణీ జరిగింది. తమ తెలంగాణ సభకు ఎవరు ఆహారం ఇవ్వడం ఏమిటని తామే కొనుక్కుని మరీ భోజనం చేశారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం. భారీ వర్షం పలుసార్లు కురియడంతో తెలంగాణ అభిమానులు నిరవధిక మార్చ్‌ కొనసాగించలేకపోయారు.      రాజకీయ వ్యవహారానికి వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పోరాడినా, 1969 నుంచీ ఉద్యమం ఏదో రూపంలో ప్రజల్లో నిక్షిప్తమై తీవ్ర ఉద్యమం ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  సాధ్యం కాలేదు. ప్రజల ఆకాంక్షలను అన్ని పార్టీలూ గుర్తించాయి. తమదైన శైలిలో పోరాటాన్ని ప్రారంభించాయి. టిఆర్‌ఎస్‌లో కుటుంబపాలన కొనసాగుతుందని, ఛాందసవాదంతో బిజెపి ఉన్నదని పలు రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ప్రజా ఆకాంక్షను సాఫల్యం చేసేందుకు రాజకీయ పక్షాలను ఏకం చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఆవిర్భవించింది. తొలుత అన్ని పక్షాలూ జెఎసిలో చేరాయి. జెఎసిపై గౌరవం ఉంచుతూ వివిధ రకాల కారణాలు చూపిస్తూ కొన్ని పార్టీలు వైదొలిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జెఎసిలో స్పష్టంగా పాలుపంచుకోలేదు. అయితే ఆ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా  కోరుతూ వచ్చాయి. తెలంగాణమార్చ్‌లో తెలుగు దేశం, కాంగ్రెస్‌, లోక్‌సత్తా జెండాలు మినహాయించి అన్ని పార్టీల రంగులూ కనిపించాయి. అయితే ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాజకీయ పార్టీలు తమదైన శైలిలో కైవసం చేసుకునేందుకు పలు రాజకీయ పార్టీలు ప్రయత్నించాయనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే అన్ని రాజకీయపార్టీలూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలని ఉద్యమంతో మమేకం అయ్యాయి. ఎవరి లాభం వాళ్ళు చూసుకోవడంతో తెలంగాణ జెఎసి అన్ని సంఘాలనూ ఒక తాటిపైకి తేగలిగింది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంతో జెఎసి ఛైర్మన్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన బాధ్యత తెలంగాణ మంత్రుల పరిధిలోకి నెట్టింది. ఇప్పటి వరకూ అదో ఇదో చెబుతూ వస్తున్న రాష్ట్ర మంత్రులకు అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి తీసుకురావడంలో అయిదుగురు మంత్రులు మాత్రమే కీలకపాత్ర వహించారు. మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్‌, ఒకదశలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహలు కీలక పాత్రవహించారు. వీరిలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితారెడ్డిలు ప్రభుత్వం పక్కన కూడా బాధ్యత వహించాల్సి కూడా ఉన్నది. అయితే జెఎసి ప్రతినిధులతో లిఖిత పూర్వకంగా తీసుకున్న తరువాతే అనుమతి ఇవ్వడాన్నికూడా తెలంగాణ సంఘాలు తప్పుబడుతున్నాయి. అయితే అనుమతిస్తే తమపై బాధ్యత తీరిపోతుందని, మిగిలిన విషయాలను పోలీసులే చూసుకుంటారని అధికారపక్షం భావించినట్లుంది. అందుకే కావచ్చు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. ప్రత్యేక తెలంగాణకావాలని, ఎలాగైనా సరే మార్చ్‌కు హాజరు కావాలన్న యూనివర్సిటీల విద్యార్థులను నిర్బంధించినా మార్చ్‌ విజయవంతమైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత అంటూ షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడం తెలంగాణవాదులకు మంచిఫలితాన్నే ఇచ్చింది. సంఖ్య విషయాన్ని పక్కనబెడితే అన్ని వర్గాల నుంచీ ప్రజలుహాజరు కావడం జెఎసికి సంతృప్తిని కలిగించింది. ప్రజలకూ విషయం అర్థమైంది. ఇకమిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడమే.     ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమై ఆరు దశాబ్దాలు గడచింది. దశాబ్ద కాలంనుంచీ ఇది తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో బంద్‌లు, వంటావార్పూ కార్యకమ్రాలు, ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌ విజయవంతమయ్యాయి, తాజాగా తెలంగాణ మార్చ్‌ నిర్బంధంలో సైతం విజయం సాధించింది. అయితే తెలంగాణ రావడానికి అడ్డేమిటి? ఈ విషయంపైనే తెలంగాణ జెఎసి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. పార్టీపెడుతూనే స్థానిక సంస్థల ఎన్నికలకుఉరికిన టిఆర్‌ఎస్‌పై విశ్వాసాన్ని తగ్గించి, అన్ని దశల్లోనూ తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన తెలంగాణవాదులు, ప్రజలపై విశ్వాసాన్ని ఉంచి పోరాట పటిమతో తెలంగాణ జెఎసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాల్సిన అవరం ఉన్నది..