జగన్ బయటకు రావటం డౌటేనా? వైకాపాకార్యకర్తల్లో అనుమానాలు
ఇంకో ఐదు నెలల్లో (అక్టోబర్ నుంచి 2013మార్చినెల వరకూ) అక్రమాస్తుల నేపథ్యంతో అరెస్టు అయి చంచల్‌గూడాజైలులో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డిపై దర్యాప్తు, విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సిబిఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు కలవరపడుతున్నారు. ఎందుకంటే తమ పార్టీ అధ్యక్షున్ని ఇన్ని నెలలు జైలులో ఉంచడమే కాకుండా దోషిగా నిరూపిస్తే తమ పరిస్థితి ఏమిటన్నది వారి ఆందోళన. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణబలాన్ని ఎవరూ కాదనలేరని వారు అంగీకరిస్తున్నారు. కానీ, జగన్ బయటకు రావటం మాత్రం డౌటేనా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా పునాది వేసిన అధ్యక్షుడు జైలులో ఉంటే వైఎస్ కుటుంబమే పార్టీ నడపాలంటే కష్టమేమోనని కూడా బయటపడుతున్నారు. అందుకే జిల్లాల్లో వైకాపా కార్యక్రమాలు ఇటీవల కాలం తగ్గాయి. కనీసం సమావేశాలు నిర్వహించటం కూడా మానేశారు. ద్వితీయశ్రేణి నాయకులు తమకున్న సందేహాల వల్ల తమతో పాటు కార్యకర్తలను తిప్పుకోవటమూ తగ్గించేశారు. దీంతో వారు ఏమి చేయాలో తెలియక, ఖాళీగా ఉండలేక ఇతర పార్టీల కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, ప్రభుత్వ కార్యాలయాల బయట తిరుగుతున్నారు. వ్యక్తిగతమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరపార్టీల వారితో సఖ్యతగా ఉంటున్నారు. వైకాపా కార్యకర్తల్లో వచ్చిన ఈ మార్పు గమనించిన తెలుగుదేశం పార్టీ నేతలు వారికి దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని పరిశీలకులు కూడా గుర్తించారు. ఎందుకంటే ఓ పార్టీని ఎలా నిర్వహించాలో దానికి ఏ మాత్రం తీసిపోకుండా జగన్ గట్టి చర్యలు చేపట్టారు. ఓ కమ్యూనిస్టు పార్టీల సాంప్రదాయ నిర్వహణలో కీలకమైన కమిటీలకూ వైకాపా ప్రాధాన్యత ఇస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడపటానికి మైసూరారెడ్డి, ఎస్‌విసుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి తదితర సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వీరు పార్టీని నడపటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. వీరి కార్యక్రమాల డిజైన్‌ను పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి, జగన్ సోదరి షర్మిల తదితరులు ఆమోదించేలా నిర్మించారు. తాజాగా షర్మిల పాదయాత్రల డిజైన్ కూడా వీరు రూపొందించిందే. వయస్సు రీత్యా విజయలక్ష్మికి ఆరోగ్యసమస్యలు ఎదురవకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. గత ఉపఎన్నికల్లో ప్రభావవంతమైన ప్రసంగాలు చేసిన షర్మిలకు పాదయాత్రల అవకాశం కల్పించటం ఒకరకంగా ఆమెలోని నాయకత్వ లక్షణాలకు ఓ పరీక్షలాంటిదే. ఇందులో కనుక ఆమె విజయవంతమైతే ప్రత్యామ్నాయం దొరుకుతుందని కమిటీ భావిస్తోంది. అందు వల్ల నిర్మాణబలం గురించి అనుమానించకపోయినా పార్టీని నిలబెట్టుకోవాలంటే అవసరమైన డబ్బు జగన్ కేసుల వల్ల సీజ్ అయితే భవిష్యత్తు ఏమిటని కార్యకర్తలు కలవరపడుతున్నారు. ప్రతీ అంశాన్ని నేడు ప్రభావితం చేస్తున్న డబ్బే ఇడి వల్ల సీజ్ అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసం నేతలు ఎంత వరకూ ఖర్చు చేయగలరని కార్యకర్త అనుమానిస్తున్నాడు. దీనికి విజయలక్ష్మి గతంలో సమాధానం ఇచ్చినా నేడు కార్యకర్త స్తబ్దుగా మారటానికి ఇదే కారణమవుతోంది.