ఆడంబరాలకు పోయి...
posted on Oct 3, 2012 7:30AM
ఒకప్పుడు ఆ సంస్థ అంటే గాలిలో హాయిగా విహరింపజేసే అద్భుతమైన సంస్థ. సినీకళాకారుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ అందులో ప్రయాణించినవారే, పొగిడినవారే.. ఒకప్పుడు 64 విమానాలతో ఆకాశయానాన్ని మిగతావాటితో సవాల్ చేసిన కింగ్ ఫిషర్స్ సంస్థ నేడు 14 విమానాలను నడుపుతూ...అది కూడా ఎప్పుడు ఆగుతాయో తెలియని విధంగా నడుపుతూ పేరులో కింగ్‌ను పోగొట్టుకుంది. 7వేల కోట్ల రూపాయల అప్పుడు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థకు పైలెట్లు చేసే మెరుపుసమ్మెలతో రెక్కలు తెగి గిలగిలలాడుతోంది. ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆప్ ఇండియాకు సైతం చెల్లించాల్సిన ఫీజులు సైతం సక్రమంగా చెల్లించడంలేదు. దీంతో విమానాలను లీజుకు ఇచ్చిన వారు తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఐదు విమానాలకన్నాతక్కువ నడిపితే ప్లయింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని విమానయానశాఖ ప్రకటించింది. ఒకప్పుడు ఎంతోమంది మోడల్స్‌కు, రాజకీయనేతలతో చుట్టూ చేరి నిత్య వినోదాలతో మహారాజుగా వెలిగిన కింగ్ ఫిషర్స్ యాజమాన్యం నేడు విమానాయాన సంస్థల్లోనే ఓ అనాథగా మిగిలిపోనుంది. దీనిపై అసలు తప్పెక్కడుందని ఎంతోమంది పెద్దలు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ‘ఆడంబరాలకు పోయి.. అప్పులు చేస్తే చివరకు మిగిలేది అప్పులే...’ అని పెద్దలమాటలే ముద్దుగా చెబుతున్నారు. అది భవిష్యత్‌లో కింగ్ ఫిషర్ విషయంలో నిజం కావచ్చు... ఈలోపు నేతలెవరైనా.. రక్షించే ఉద్దేశంతో తలచుకుంటే తప్ప...అని ఆకాశయాన ప్రేమికుల ఉవాచ.