ఇప్పటికైనా...
వాస్తవాలు చేదుగా వున్నా కొన్ని సందర్భాల్లో వాటిని అంగీకరించి తీరాలి. ఎందుకంటే ఆ వాస్తవాల సృష్టికర్తలు కావచ్చు, వాటి ఎదుగుదలకు కారకులు కావచ్చు, లేదా వాటిని ప్రోత్సహించిన వారు కావచ్చు. ఎంతో ఘనంగా ప్రారంభమైన జీవవైవిధ్యం సదస్సులో జన్యుమార్పిడిపై జరుగుతున్న చర్చలు అలాగే వున్నాయి. సదస్సు రెండవరోజు జన్యుమార్పిడి పంటలపై భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. జన్యుమార్పిడి వల్ల సంభవించిన పరిణామాలపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్వచ్చంధ సంస్థలు, ఉద్యమకారుల వాదనలను కొన్ని విత్తన కంపెనీలు కొంతమంది రైతుల ద్వారా సానుకూలంగా చెప్పించేందుకు ప్రయత్నించాయి. జన్యుమార్పిడి పంటల వల్ల జంతువులకు ముఖ్యంగా పొలాల్లో ఉండే ఎలుకలు, కుందేళ్ళలో కాలేయం, మూత్రపిండాల సమస్యలు రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పంటలను మనుషులు తింటూపోత పరిస్థితులు ఎలా వుంటాయో ఆలోచించాలని కొందరు పరిశోధకులు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. జన్యుమార్పిడి పంటల వల్ల వరంగల్‌జిల్లాలో మనుషులకు చర్మసంబంధమైన వ్యాధులొస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని దానికి సంబంధించిన పత్రాలను సైతం సదస్సు ముందుంచారు. కొంతకాలం క్రిందటి వరకు పంటలకోసం రైతులు తమ సొంత విత్తనాలు వాడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్‌లో లభ్యమయ్యే విత్తనాలపైనే రైతాంగం ఆధారపడవలసివస్తోందని అమెరికాకు చెందిన ప్రొఫెసర్ చెబితే, జీవ వైవిధ్యానికి నష్టం జరిగితే భర్తీచేయలేమని మరో ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇలా ఎంతోమంది జన్యుమార్పిడి పంటలపై తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. వీరు సూచించిన సూచనలు ఆయా ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించి, వెంటనే అమలు చేసినట్లయితే జన్యుమార్పిడివల్ల పంటలతో పాటు వాటిని ఉపయోగించే మనుషులు సరికొత్త రోగాల బారినపడకుండా కాపాడినవారౌతారు. దీనిపై విస్తృతస్థాయిలో చర్చలు జరగాలి. ఇప్పటికే పలుదేశాల్లో నిషేధించిన ఎరువులు, రసాయనాలను కొన్ని ఇతరదేశాల్లో ఉపయోగించడం జరుగుతోంది. అయితే ఈ సదస్సు కేవలం చర్చల వరకేనా... లేకా అమలుకు కృషి జరిగేనా అన్నది కొద్దికాలం ఆగితే కాని తెలియదు. నేడు చాలా ప్రభుత్వాలు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. వారికి విరుద్ధంగా చర్యలు చేపట్టడమంటే... పదవులపై ఆశ వదులుకున్నట్లే... ఆ సహసం ఆయా ప్రభుత్వాలు చేయగలవా! అన్నదే అంతుచిక్కని ప్రశ్న?అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.