కేసిఆర్ తరువాత జానారెడ్డేనా?
posted on Oct 3, 2012 @ 11:16AM
‘ఈ నెల్లో వచ్చుద్ది...ఇక ఇవ్వకపోతే గుంజుడే...సోనియా అమ్మ కదిలొస్తోంది ఇంకో వారంలో తెలంగాణాయే...ఆందోళనలు అనవసరం...మేము షురూ చేసినాక ఎనకాడేదేముంది...’ వంటి ఎన్నో మాటలు విని విని తెలంగాణా ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రత్యేక తెలంగాణా కోసమే పార్టీగా అవతరించిన తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్) అధినేత కే. చంద్రశేఖరరావు(కేసిఆర్) పైమాటలను మార్చి మార్చి చెబుతూ ఏళ్లు గడిపేశారు. చివరికి ఆయనే స్వయంగా ఢల్లీలో మకాం చేసి తెలంగాణా ప్రకటన కోసం ఎదురు చూశారు. ఆ ఎదురుచూపుల్లో రోజులు కరిగిపోతున్నాయి కానీ, స్పందన రాకపోవటంతో నిరాశగా తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సమయంలో కేసిఆర్‌పై గతం నుంచి తిరుగుబావుటా ఎగురవేస్తూ వచ్చిన తెలంగాణా ఐక్యవేదిక(జెఎసి) ఛైర్మను, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కొంత మేరకు విజయవంతమైంది. దీంతో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించి కార్యక్రమాన్ని ముగించారు. కేసిఆర్ గత్యంతరం లేని స్థితిలో తమ పార్టీ శ్రేణులకు తెలంగాణామార్చ్‌ను విజయవంతం చేయమని పిలుపు ఇచ్చారు. ఇప్పటిదాకా కేసిఆర్‌ను తెలంగాణాలో గమనిస్తూ వచ్చిన ప్రజలు కొత్తగా తెరపైకి వచ్చిన మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు గురించి చర్చించుకుంటున్నారు. జానారెడ్డి తెలంగాణా 2014లోపు వచ్చేస్తుందని ప్రకటించారు. దీంతో తెలంగాణావాదులు ‘ఫిర్ తెలంగాణాబాత్ 2014తక్’ అంటూ నవ్వుకుంటున్నారు. ఇప్పటి దాకా కేసిఆర్ టైమిస్తుంటే ఆయన తరువాత జానారెడ్డి కూడా టైమిచ్చేశాడంటున్నారు. కేసిఆర్‌లా జానా కూడా ఎదురుదెబ్బ తినేంతవరకూ ఇలానే మాట్లాడతారని అనుకుంటున్నారు.