అప్పుడు కోతలే.... ఇప్పుడూ కోతలే...!
posted on Oct 2, 2012 @ 9:58AM
ఏమిటో...! అధికారంలోకి వచ్చే వరకు కొన్ని కోతలు.. వచ్చిన తర్వాత ఇంకో కోతలు. కోతలు మాత్రం రాజకీయనాయకుల జన్మహక్కుగా మారిపోయింది. ఎన్నికల్లో అదిచేస్తాం... ఇదిచేస్తాం... అని చెబుతారు. గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఖజానాలో ఏం మిగల్చలేదు.. కాబట్టి చేయలేకపోతున్నాం... అంటారు. అటువంటప్పుడు ఆ కోతలు దేనికి? జనాన్ని పిచ్చివాళ్ళక్రింద జమకట్టేస్తున్నారు! వర్షాలు పడినా కరెంట్ కోతలే.. పడకపోతే మరిన్ని కోతలు.. ప్రస్తుతం కొన్ని చోట్ల మూడుగంటలు, మరికొన్ని చోట్ల ఆరుగంటలు, ఎనిమిది గంటలు సాగుతున్న కరెంట్‌కోతలు ఇంచుమించుగా గంట, రెండుగంటలు అదనంగా కోతలు ప్రారంభమయ్యాయి! రోజుకు 24 గంటలు అయితే కరెంట్ కోతలు సుమారుగా అందులో సగం! విద్యుత్ వాడకం పెరిగిపోతోంది.. అనుకున్నంతగా సరఫరా కావడంలేదు.. అందుకే ఈ కోతలు.. అని మంత్రులనుండి అధికారుల వరకు అందరూ కోతలే...! ఒక్కసారి అధికారులు కాని మంత్రులు రహదారులపైకి వచ్చి వీధిలైట్లవైపు చూస్తే తెలుస్తుంది. మిట్టమధ్యాహ్నం 12గంటలు అయినా కూడా కొన్నిరోజులు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. సూరీడు వెలుతురుకు ప్రజలకు కనిపిస్తున్నా.. పాపం ఆయా అధికారులకు కనిపించకపోవడం కడు శోచనీయం.! నెలలో కనీసం వారంరోజుల పాటు ఇలా లైట్లను పట్టపగలే వెలిగిస్తే కొరత రాక ఏమవుతుంది! దీనికి తోడు పలు అడ్వర్ట్‌టైజ్‌మెంట్ల హోర్డింగులు కూడా అర్ధరాత్రులు సైతం అతి ఖరీదైన విద్యుద్దీపాలతో వెలిగిపోతుంటాయి. ఇటువంటి వాటి నుండి ఎలా వసూలు చేస్తున్నారో... ఎవరికి తెలియదు! వీటికి కూడా కోతలు ఇవ్వడం, అధికంగా వసూలు చేసి గృహ అవసరాలకు వసూలు చేసే ఛార్జీలను తగ్గించడం చేస్తే బావుంటుంది. ఈ హోర్డింగుల వల్ల ఆయా కంపెనీలకు వచ్చే లాభాలలో ప్రభుత్వానికి ఏమి ఇవ్వదు కదా! అందుచేత ఖచ్చితంగా ఏ హోర్డింగులకైనా సరే... తప్పనిసరిగా అత్యధిక మొత్తంలో వసూలు చేయడం లేదా దానికి ఆయా కంపెనీల వారికి ఇతరత్రా వనరులను ఉపయోగించుకోమనడం ఉత్తమం! లేదంటే 24 గంటల్లో కనీసం 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేస్తారో లేదో కూడా అనుమానమే! వేసిన కొద్ది సమయానికే ఛార్జీలు మాత్రం పెరిగిపోతాయి! ఇక్కడ సరఫరా అయ్యే విద్యుత్‌ను, గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం.. వారినుండి అత్యధిక ధరకు కొనుక్కోవడం... పాలకులకు అలవాటుగా మారింది.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన విద్యుత్‌ను, గ్యాస్‌ను మనకు సమృద్ధిగా ఇవ్వన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఓట్లు వేయడం దేనికి? అని ఆలోచిస్తున్నారు సామాన్యులు!