అడకత్తెరలో మంత్రి సబిత?
posted on Oct 2, 2012 @ 9:50AM
రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. విడవమంటే పాముకు కోపం...వదులుతానంటే కప్పకు కోపం అన్నట్లు ఆమె తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలంగాణామార్చ్ ఆమె పట్ల తెలంగాణావాదుల్లో కొంత వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అడపాదడపా పోలీసులు చేసిన అరెస్టులు ఆమె చుట్టూ రాజకీయం చేయటానికి దోహదపడుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్చ్ విషయంలో పోలీసులు ముందస్తుజాగ్రత్తలు తీసుకున్నారు. కిరణ్‌తో పాటు ఈమె కూడా ఆదేశాలు ఇచ్చి ఉంటారని తెలంగాణావాదులు అనుమానిస్తున్నారు. హోంశాఖా మంత్రి ఆదేశాలు లేకపోతే పోలీసులు రెచ్చిపోరని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. అందుకే మంత్రి సబిత గురించి ఆలోచించాలన్నట్లు వారు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సిఎం కిరణ్ ప్రత్యక్షజోక్యంతోనే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారని సమాచారం. రాష్ట్ర డిజిపి, డిఐజి తదితరులు సిఎం చెప్పినట్లే శాంతిభద్రతల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి అరెస్టులు చేయకపోతే అల్లర్లు తప్పవన్న ముందస్తు హెచ్చరికలు కూడా పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో ఒకవైపు సిఎం కాంగ్రెస్ అధిష్టానం, మంత్రుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంత్రి సబిత తన ప్రమేయం ఏమీ లేదన్నట్లు నాటకం ఆడుతున్నారని జరిగిన ప్రచారం తెలంగాణావాదులను ఉసిగొల్పుతోంది. అసలు ఈ విషయంలో తన పాత్ర ఏమీ లేదని నిరూపించుకోవాలంటే సబిత కేసులు లేకుండా చూడాలని తెలంగాణావాదులు ఆమెకు ప్రత్యేకసూచనలు కూడా చేశారట. దీంతో ఆమె సిఎంకు చెప్పకుండా కేసులు గురించి చర్య తీసుకోవాలో? లేక తన సొంత నిర్ణయాన్ని అమలు చేసి సిఎం ముందు దోషిగా నిలబడాలో? తెలియని స్థితిలో ఉన్నారు.