హమ్మయ్య...ఇప్పటికి ఓ.కె.!
posted on Oct 2, 2012 @ 9:57AM
ఈమధ్య కాలంలో సమ్మెలు లేని రంగంకాని, సంవత్సరం కాని లేదంటే అతిశయోక్తికాదేమో. అయితే ఆ సమ్మెలు రకరకాలనుకోండి! అయితే అవి సగటు మనిషి జీవితంపై పడితే అసలే బ్రతకడం కోసం బతుకీడుస్తున్న జనం ఈ సమ్మెల సమ్మెట దెబ్బలతో కాస్తకూస్తో జోరువాన కురిసి వర్షం వెలిసింది అనుకునే లోపే సునామి వచ్చినట్లుగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కొంచెం ఆనందకర వార్త విన్నా పండుగ జేసుకున్నంత ఆనందిస్తారు. అటువంటి వార్తే ఇది. కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కారణంగా తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్లు రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తెలిపింది. తమ సమస్యల పరిష్కారానికి 4,5 తేదీల్లో విస్తృత సమావేశం ఏర్పాటుచేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో తాము చేయతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్త ఆ డిస్ట్రిబ్యూటర్లుకు కాని, ఆ శాఖకు సంబంధించిన మంత్రులకు కాని ప్రభుత్వానికి సంతోషంకాకపోవచ్చునేమోకాని... సామాన్యులకు ఇది ఎంతో ఆనందించదగ్గ వార్త. అసలే పండుగలను పండుగగా చేసుకోవడం చాలాకాలమే మరచిపోయారు సామాన్యులు. ఇటువంటి వార్తలే వారికి నిజమైన పండుగలు. ఏంచేస్తాం... అంత కాల వైపరీత్యం!