అమ్మకానికి ఇంజనీరింగ్ కాలేజీలు

మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. కాలేజీలకు అనుమతికావాలన్నా,  రద్దుకావాలన్నా ఎఐసిటి ని సంప్రదించవలసిందే. ప్రస్తుతానికి  10 కాలేజీలు  ఈసంస్ధను అనుమతి రద్దు చేయాలంటూ కోరాయి. త్వరలో ఇది 50 కాలేజీలకు పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కాలేజీల పరిస్ధితి అలాగే వుందని, సిక్స్ పే అమలు చేస్తామన్న కాలేజీలు, ఫిఫ్త్ పే అమలు చేస్తున్న కాలేజీలు, 35 వేలకు ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న కాలేజీలుకూడా ఆర్ధికంగా నష్టాలలో నడుస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం తమను టాస్క్ ఫోర్స్ ల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ  ఆరోపణలు మరొక విధంగా ఉన్నాయి. కేవలం వ్యాపార పంధాలో కాలేజీలు నిర్వహించడం వల్ల ఇలా జరుగుతుందని, అరకొర సౌకర్యాలతో, నైపుణ్యంలేని అధ్యాపకులతో కేవలం సర్టిఫికేట్లు జారీ చేసే కార్యాలయాలుగా ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేస్తున్నాయని వారు అంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో యాజమాన్యాలు ఇంతగా నష్టపోటానికి కారణం ప్రభుత్వ మేనని జూన్ మొదటివారంలో నిర్వహించవలసిన అఢ్మిషన్లను సెప్టెంబర్ లో జర పటం వల్ల దాదాపు 50,000 మంది విద్యార్దులు మిగతా రాష్ట్రాలకు తరలిపోయారని కళాశాల యాజమాన్యులు చెబుతున్నాయి. అంతేకాక విద్యాసంవత్సరంలో జరిగిన జాప్యానికి కానూ విదేశీ విద్యార్ధులు కూడా వేరే రాష్ట్రాలకు తరలి పోయారని వారు తెలిపారు. అయిన అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. బెంగాల్లో 9 కోట్లమంది జనాభావుండగ 14 వేలమంది మాత్రమే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని, మనరాష్ట్ర జనాభా 8 కోట్లమంది ఉండగా ఆలస్యంగా మొదలైన ఈ విద్యాసంవత్సరంలో కూడా 1,75,000 మంది ఇంజనీరింగ్ లో చేరారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే యంబిఎ, యంసిఎ కాలేజీలు కూడా  ఇదే బాటలో ఉన్నాయని వారు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు మార్కెట్లో పెట్టి వేల మందికి ఉపాధి కల్పించామన్న యాజమాన్యాలు ఈ పరిస్దితికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. ఏది ఏమైనా కారు చౌకకు కాలేజీలు అమ్మబడును అనేది మాత్రం నిజం.

సినియర్ సిటిజన్లకోసం కూడా ఒక కమీషన్ ఉండాలి

సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్రత్యేక కమీషన్ ఉండాలని  మాదిగ దండోరా నేత మందా కష్ణ మాదిగ కోరారు. సీనియర్ సిటిజన్స్ కోసం వెంటనే ప్రత్యేక కమీషన్ నియమించాలని, మందా కోరారు. రాష్ట్రంలో చెట్టుకు, గుట్టలకు కమీషన్ ఉన్నా సీనియర్లకు, వితంతువులకు కమీషన్ లేక పోవడం విచారకరం అన్నారు. గవర్నర్ కోటాలో సీనియర్ సిటిజన్లను శాసనమండలికి ఎంపిక చేయాలన్నారు. వారికి క్యాబినేట్ హోదా తో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. ఎల్.కె.జీ నుండి పిహెచ్ డి వరకు వితంతువుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 28 నుండి విద్యార్ధులతో ఢిల్లీలో ఆందోళన చేపడతామని మందకష్ణ మాదిగ తెలిపారు.

జన్యు మార్పిడి పంటలు వద్దు

జన్యు మార్పిడి పంటలగురించి ఇంకా సమగ్రమైన చర్చలు జరగాలని , ఈ పంటలకు వ్యతిరేకంగా పార్లమెంటరీ కమిటీ నిర్ణయానికి తాను పూర్తి మద్దతు నిస్తానని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ తెలిపారు. అనేక దేశాల్లో పెద్దఎత్తున ఈ ఫంటలపై రైతుల, స్వచ్చంధ సంస్ధల నుండి నిరసన వ్యక్తమవుతున్నందున ధీన్ని కొనసాగించరాదని, వీటిపై జీవవైవిద్య నిపుణులు వెంటనే చర్చించి స్దానిక జీవవైవిద్యాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రముఖ వ్యవసాయసంస్కరణల  నిపుణులైన స్వామినాధన్ సూచించారు. అభివృద్ధి చెందినా దేశాలు ఈ విషయమై తలెత్తుతున్న దుష్పరిణాలపై దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు. దేశవాళీ విధానంతోనే హరిత విప్లవం కొనసాగించగలమని తెలిపారు. సేంద్రియ ఎరువుల వల్లనే కీటకాలను నాశనం చేయగలమని ఆయన అన్నారు.

రైలు ప్రమాదాల నివారణకు రిమోట్ కంట్రోల్

ఇకపై రైలు ప్రమాదాల జరగకుండా డ్రైవర్ మిషన్ ఇంటర్ పేష్ ( రిమోట్ కంట్రోల్ )పరికరంతో  రెండు వేర్వేరు రైళ్ళలో అధికారులు చేసిన  ప్రయోగం చేసి  విజయవంతం అయ్యింది. రంగారెడ్డి జిల్లాలో బషీర్ బాగ్ రైల్వేస్టేషన్ల మద్య ఈ ప్రయోగం చేసిన రైల్వే అధికారులు త్వరలో రాష్ట్రంలోని అన్ని రైళ్లలో ప్రవేశపెడతామన్నారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లను పోనిచ్చి ప్రయోగం చేశారు. ఈ పరికరంతో ప్రమాదాన్ని పసిగట్టిన రైళ్లు రెడ్ సిగ్నల్ చూపుతూ హారన్ మోగుతూ డ్రైవర్ ను అప్రమత్తం చేసింది.  దీంతో ఒకే పట్టాపై ఎదురుగా వస్తున్న రైళ్లు 500 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. ఈ పరికరాన్ని ట్రైన్ కొలీజియస్ అలైడ్ సిస్టం గా ( టిసి ఎ ఎస్ ) పిలుస్తారు. హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీ, రీసెర్చ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ( ఆర్ డియస్ ) సంయుక్తంగా ఈ పరికరాన్ని సమకూర్చారు.

అరుణ మాట...ఎంపిల గుండెల్లో తూట...

ఒక్కొక్కరి కవితల్లో పదాల పొందిక చదివేవారి కళ్లలో జీర తెప్పించి ఆవేశాన్ని రగులుస్తుంది. ఒక్కొక్కరి ప్రసంగం వెంటనే లేచి అన్యాయం చేసిన వారిని కాల్చి బూడిద చేయాలనిపిస్తుంది. ఈ రెండిరటిలోనూ భావుకత, ఆవేశం నరనరాల్లోకి జీర్ణించేలా ప్రభావం ఉంటుంది. అంతటి ప్రతిభ ఓ కవికి, ఒక ప్రసంగీకుడికి తరువాత రాజకీయనాయకులకు మాత్రమే ఉంటుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రి డికే అరుణ మాటల తూటాలు పేల్చటంలో మహాదిట్ట. ఈమె మాట వదిలినప్పుడు ఒక్కోసారి ఎదుటివారు తట్టుకోలేరు. తాజాగా విశాఖజిల్లాలో ఒక సభలో అరుణ మాటలకు సభమధ్యలోనే ఓ ప్రతినిధి అలిగి వెళ్లిపోయారు. ఆ ఘటన తరువాత ఆమె పెద్దగా నోటికి అంతటి పని చెప్పలేదు. తాజాగా తెలంగాణాప్రాంత ఎంపిలందరూ ఖాళీగా ఉండే నేతలతో కలిసి సరదాగా, కొంచెం వ్యంగం కూడా వ్యక్తీకరిస్తూ తెలంగాణా ప్రాంత మంత్రులందరూ రాజీనామా చేయాలని కోరారు. అసలే ఈ ఎంపిలు నియోజకవర్గంలో అభివృద్థి మరిచిపోయి చాలాకాలం అయిందని మంత్రుల చుట్టూ బాధితులు తిరుగుతుంటే....పని చేస్తున్న మంత్రులను రాజీనామా చేయమనటం ‘కూసే.....’ అన్న చందంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్ని ప్రకటనలకూ స్పందించని మంత్రి డికే అరుణకు కోపం వచ్చింది.  తెలంగాణా కోసం రాజీనామాలు చేయాల్సింది మంత్రులు కాదు ఎంపీలు అని ఆమె గుర్తు చేశారు. కేంద్రంలో ఉన్న సమస్యను రాష్ట్రం నెత్తిన రుద్దేందుకు చూస్తున్న ఎంపీలు తెలంగాణా ప్రాంత అభివృద్థి కుంటుపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఆమె వదిలిన ఈ తూటాలు తగులుతాయో లేదో?

ప్రజా ప్రతినిధుల ఇళ్లలో దొంగ గ్యాస్‌ కనెక్షన్ల మాటేమిటీ?

‘ఒక కుటుంబానికి ఒక గ్యాస్‌కనెక్షనే ఉండాలి. అంతకు మించి ఉంటే గ్యాస్‌కనెక్షను రద్దు చేస్తాం..’ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న ప్రకటన ఇది. దీన్ని మీడియాలోనూ ఎక్కువగా ప్రయార్టీ కూడా ఇచ్చారు. దీంతో పాటు తాజాగా కొన్ని కనెక్షన్లు రద్దు చేశామని కంపెనీలు చేసిన ప్రకటనలకు జాగా ఇచ్చారు. ఇళ్లపై గ్యాస్‌ కంపెనీల తాలుకూ అధికారులు, సివిల్‌సప్లయ్‌ అధికారులు దాడులు చేసి మరీ కనెక్షన్లు రద్దు చేస్తున్నారు కదా! ఈ దాడుల్లో ఒక్క పెద్ద ఇంటి ఓనరు పేరు వినబడిరడిందా? కనీసం ఛోటా నాయకుడి పేరైనా బయటకు వచ్చిందా? పోనీ గుసగుసగా ఉన్నతాధికారి ఇంట్లో ఉన్న కనెక్షన్ల లెక్కలు వినిపించాయా? ఎందుకని అలా జరగలేదు? పోనీలే అనుకుంటే మన శాసనకర్తలైన సభ్యుల ఇళ్లలో సోదాలు జరిగాయని సమాచారం ఉందా? అదీ కూడా లేదు అంటే కంపెనీల ప్రతినిధులకు పైవారంటే బిజినెస్‌మెన్‌ సినిమాలో మహేష్‌బాబు చూపిన వేలేనన్న మాట. సివిల్‌సప్లయ్‌ అధికారులకు అయితే ఎకరాలు తడిసిపోతాయి మళ్లీ ఇళ్లకు ముడుపులూ చేరవని భయం. అందుకే అసలు పెద్దల జోలికి పోకుండా నామమాత్రం నిబంధనలు సరిపెడుతుంటారు. గొర్రెలను వెదుక్కుని మరీ దాడులు చేస్తుంటారు. చట్టానికి అందరూ సమానమైతే ముందు గవర్నర్‌, తరువాత సిఎం, ఆ తరువాత ప్రతిపక్షనాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు, స్థానిక ప్రతినిధులు ఇళ్లల్లో సివిల్‌ సప్లయ్‌ కుటుంబానికి ఒక కనెక్షన్‌ ఉందని లెక్కతేల్చి ప్రజల్లోకి వెళితే అప్పుడు ఆ నిబంధనలపై గౌరవం ఉంటుంది.  అలా కాకుండా ముందు బడుగు, బలహీన, మధ్యతరగతి బలిపశువులను లెక్కల ప్రకారం ఎంచుకోవటం గ్యాస్‌కంపెనీలకు అలవాటైపోయింది. ప్రజాప్రతినిధుల ఇళ్లను విస్మరిస్తున్న కంపెనీలపై ప్రజాప్రయోజనాల వాజ్యం వేస్తేనే కానీ, గ్యాస్‌ కంపెనీల అసలు పనితీరు బయటపడదు. తనకు ఇవ్వాలనుకున్నప్పుడు విపరీతంగా కనెక్షన్లు ఇచ్చేసి ఇప్పుడు నియంత్రించేస్తానంటే ఎలా? నిజంగా అవసరం తీరని మధ్యతరగతి ప్రజలను బలిగొనడమేనా పాలసీ అంటే? ఏమైనా ప్రజాప్రతినిధుల ఇళ్లలో దొంగకనెక్షన్ల మాటేమిటీ? చట్టం వారి చుట్టమా? అన్నది ప్రభుత్వం, గ్యాస్‌కంపెనీలు, సివిల్‌సప్లయ్‌ అధికారులు సమిష్టిగా తేల్చాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారు.

కిరణ్‌పై హక్కుల తీర్మానం ఏమైందీ?

ఇప్పటి వరకూ దేశచరిత్రలో ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు. ఇటువంటి క్రమశిక్షణారాహిత్య ఘటనకు నాందీప్రస్తావన పలికిన ఘనత తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ఎంపిలకే దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై హక్కుల తీర్మానం పెట్టాలని ఈ ఎంపిలు లోక్‌సభ స్పీకర్‌ను కోరటం కాంగ్రెస్‌పార్టీ చరిత్రలోనే (తొలిసారి) మాయని మచ్చ. అదీ రాతపూర్వకంగా పంపించటం కూడా ఎవరూ మరిచిపోలేరు.  ఒకే పార్టీలో ఉంటూ ఎంపిలు సిఎంపై కక్ష పూనటం వారి వ్యక్తిగత ముద్రను మాత్రమే చాటుతోంది. దీని వల్ల కాంగ్రెస్‌ అధిష్టానం చాలా సీరియస్‌గా రాష్ట్ర పరిస్థితి పరిశీలించటం ప్రారంభించింది.  అస్సలు క్రమశిక్షణారాహిత్యాన్ని భరించటంలో కాంగ్రెస్‌ పార్టీ తరువాతే ఎవరైనా అన్నట్లు అధిష్టానం వేచి చూస్తోంది. అస్సలు ఈ ఎంపిలు ఎలా ప్రవర్తిస్తారు అన్న అంశంపై మాత్రం నిఘా పెట్టింది. ఆ నిఘాలో ఎంపిలు చేస్తున్న తప్పులు ఒక్కొక్కటి అధిష్టానం దృష్టికి వెళుతున్నాయి. తెలంగాణా జెఎసితో సంబంధాలు పెట్టుకోవటం వరకూ పెద్దగా ఫీలవ్వని కాంగ్రెస్‌ మార్చ్‌ఫాస్ట్‌కు ఎంపిలు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై పలువురి అభిప్రాయం తెలుసుకుంటోంది. ప్రత్యేకించి ఈ ఎనిమిది మంది తాజాగా కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ ఆర్‌ఎల్‌డి పార్టీ శాఖకు పరోక్షంగా మద్దతు ఇచ్చారని కనుగొంది. దీనికి తోడు అజిత్‌సింగ్‌తో వీరు ఎక్కువసేపు గడపటం వంటి విషయాలను కాంగ్రెస్‌ అధిష్టానం రికార్డు చేయించిందని తెలిసింది. ప్రత్యేకించి ఈ ఎనిమిది మంది ఎంపిల ఫైళ్లు అధిష్టానం రూపొందిస్తోందని తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఎంపిలపై కాంగ్రెస్‌పార్టీ మొత్తం ఫైర్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అయితే కిరణ్‌పై వీరు పెట్టిన హక్కుల తీర్మానం అంశం గురించి లోక్‌సభ స్పీకర్‌ ఇంకా ఆలోచించలేదు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం ఈ తీర్మానంపై చర్చ రాకముందే వీరి గురించి బయటపడవచ్చని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ వచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీఆజాద్‌ కూడా తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పరోక్షంగా ఎంపీలను హెచ్చరించారు. కొనసాగింపుగా తాము ప్రతీ అంశాన్నీ పరిశీలిస్తున్నామని, ఏమైనా తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

స్వార్ధ రాజకీయాలపై బాబు ఆవేదన

రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. స్నేహాలు చిరకాలం నిలబెట్టుకోవటమూ కష్టమే. కుటుంబాలలో అన్నా చెల్లి వంటి అనుబంధాలు కూడా రాజకీయంలో మనగలగటం కష్టమే. ఎవరి స్థాయి వారు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో రక్తసంబంధీకులు కూడా ప్రత్యర్థులైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేంటో తెలియదు కానీ, రాజకీయంలోకి వచ్చాక ఎంతమంది మిత్రులను కూడగట్టుకుంటామో అంతమంది శత్రువులూ తయారైపోతారు. అజాతశత్రువుగా రాజకీయంలో నిలవటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ మాటలు చరిత్రను పరిశీలించిన అనుభవంతో ఎందరో రచయితలు కూడా ఖరారు చేసినవే. కుటుంబాలతో కలిసిపోయిన వారికీ ఇవి వర్తిస్తాయి. ఇటీవల మీకోసం వస్తున్నా పాదయాత్రలో చంద్రబాబునాయుడును పలమనేరుకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఆ సందర్భంగా రాజకీయనాయకునిగా విశేష అనుభవం గడిరచిన చంద్రబాబు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర నాథ్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డిలకు తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. అమర నాథ్ రెడ్డి కుటుంబంతో తనకు 30ఏళ్ల అనుబంధమున్నా అతను అలా చేసారేమిటీ అని చంద్రబాబు ఒకసారి గతాన్ని తవ్వుకున్నారు. ఏమైనా ఈ రాజకీయంలో స్వార్థం ఎక్కువ అని, అమర నాథ్ కూడా స్వార్థంతోనే టిడిపిని వదిలేశారని ఓ అభిప్రాయానికి వచ్చారు. ఏమైనా కార్యకర్తలు అలానే ఉన్నారు కాబట్టి అక్కడ పార్టీ అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా 50వేల మెజార్టీ వచ్చి తీరుతుందని చంద్రబాబు అంచనా వేశారు.

యంగ్ బాబు @ 60

  చంద్రబాబు నాయుడు పాదయాత్ర “వస్తున్నా మీకోసం” విజయవంతంగా సాగుతోంది. ప్రజల ఇబ్బందులు, సాధకబాధకాల్ని తెలుసుకుంటూ బాబు ముందుకు దూసుకుపోతున్నారు. ఆదివారం సాయంత్రానికి వందకిలోమీటర్ల యాత్రని చంద్రబాబు పూర్తి చేశారు. చంద్రబాబు నడకతీరుని వేగాన్ని చుట్టూ ఉన్నవాళ్లు అందుకోలేకపోతున్నారు. గతంలోకూడా చంద్రబాబు రెండున్నర గంటల్లో తిరుమలకొండ ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత మెట్లదారిలో కొండెక్కిన చిరంజీవి ఆపసోపాలుపడ్డ విషయంకూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి అరవైఏళ్లు దాటిన చంద్రబాబు ఇంత కష్టతరమైన విషయాన్ని భుజాలకెత్తుకోవడం అంత సమంజసం కాదేమో అన్న అనుమానాలుకూడా వ్యక్తమయ్యాయి. లేనిపోని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయేమోనన్న భయం అభిమానుల్లో వ్యక్తమయ్యింది. కానీ.. పార్టీని బలోపేతం చేసేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్రని చేపట్టితీరాలని నిర్ణయించారు. వయస్సుని లెక్కచేయకుండా చంద్రబాబు పాదయాత్రలో దూసుకుపోతున్న తీరునిచూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అరవైఏళ్ల వయసులోకూడా యంగ్ బాయ్ లా చంద్రబాబు దూసుకుపోవడం వెనకున్న అసలు కారణం ఆయన తన ఆరోగ్యంమీద ప్రత్యేక మైన శ్రద్ధ చూపించడం, రెగ్యులర్ గా యోగా చేయడం, ఆహారపు అలవాట్లు, ఆలోచనా సరళేనని బాబుని దగ్గరగా ఎరిగున్నవాళ్లు చెబుతున్నారు.

తిరుమలేశుడికి పూలమాలల రథాలు

  తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచి పూల రథాలు బయలుదేరుతున్నాయి. తిరుమలకు వెళ్లి శ్రీవారికి సేవచేసుకోలేనివారికోసం పన్నెండేళ్లుగా కొండవీటి జ్యోతిర్మయి ట్రస్ట్ ఈ సేవాకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఔత్సాహికులైన భక్తులు పూలమాలల్ని కట్టి ఇస్తే వాటిని ప్రత్యేక రథాల్లో తీసుకెళ్లి తిరమలలో శ్రీవారి సేవకోసం అందజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. బంతి, చామంతి, లిల్లీ, మరువం, ధవనం, తులసిమాలల్ని కట్టి పంపిచాల్సుంటుంది. 14వ తేదీన హైదరాబాద్ నుంచి, 15వ తేదీన మహబూబ్ నగర్ నుంచి, 16వ తేదీన అనంతపురం నుంచి, 17వ తేదీన కోవూర్ నుంచి, 18న గుంటూరునుంచి, 19న ఒంగోలు నుంచి, 20న రాజమండ్రి నుంచి, 22వ తేదీన విశాఖపట్నంనుంచి శ్రీవారి పూలమాలల రథాలు బయదుదేరతాయి. ఆసక్తి ఉన్నవాళ్లు 9246522132 నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

వాద్రా అక్రమాస్తులపై వైసిపి ఎందుకు మౌనం.........

కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్టుడైన రాబర్ట్ వాద్రా పై అక్రమ ఆస్తుల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేయడమేకాకుండా ఆధారాలను కూడా చూపుతూ అవినీతిని అరికట్టాలంటూ దేశప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రతిపకాలన్నీ దీనిపై గళం విప్పుతున్నాయి. అయితే వైసిపి మాత్రం దీనికి విరుద్దంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కేవలం తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనైతిక కుమ్మక్కేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పై సిబిఐ తో సోనియా కుట్ర చేయిస్తున్నారన్న జగన్ వర్గం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని వారు అడుగుతున్నారు. జగన్ సోదరి షర్మిల  పాద యాత్ర ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఒక విలేకరి ఇదే విషయాన్ని ప్రస్ధావిస్తే ఇప్సుడెందుకు ఆవిషయాలు అంటూ దాటవేయటం కాంగ్రెస్, వైసిపి కుమ్మక్కుకు అద్దం పడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక వైసిపి నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

చంద్రబాబునాయుడుకు స్వల్ప అస్వస్ధత

చంద్రబాబునాయుడు రోజూ కిలోమీటర్ల కొద్గీ నడవటం వల్ల స్వల్ప అస్వస్ధతకు గురి అవుతున్నారు. వస్తున్నా మీకోసం యాత్ర  మొదలు పెట్టిన రోజే కాళ్లనెప్పులతో బాధపడ్డారు. దానికి గానూ ఫిజియోధెరపిస్టును అందుబాటులో ఉంచుకున్నారు. మూడురోజుల క్రితం అభిమానులు కురిపించిన బంతిపూల వానకు గానూ కళ్లలోకి పుప్పొడి వెళ్లి కళ్ళు ఎర్రగా మారి నీరు  కారాయి. దీంతో ఆరోజు చంద్రబాబు కళ్ళపై కీర దోస ముక్కలు పెట్టుకొని స్వంత వైద్యం చేసుకొని రిలీఫ్ పొందారు. శుక్రవారం ఎండకు డిహైడ్రేషన్తో బాధ పడ్డారు. వికలాంగులతో మాట్లాడి లేవబోతూ నడుమునొప్పితో బాధపడ్డారు. వెంటనే వైద్యులు పెయిన్ కిల్లర్లు ఇచ్చి ఉపశమనం కలుగ ఛేశారు. ఫిజియోధెరపిస్టు సేవలను అందిస్తున్నారు. నిన్నటితో 200 కిమీ యాత్రను పూర్తిచేశారు. కాళ్లబొబ్బలు బాధపెడుతున్నాయి. రోజూ రాత్రిపూట కాళ్లను ఐసువాటరుపై పెట్టి ఉంచడం, మసాజ్ చేయించడం జరుగుతున్నాయి. వయసు, శారీరక బలహీనతలను కూడా లెక్క చేయకుండా 63 ఏళ్ల వయస్సులో ప్రజాయాత్రకు ప్రాధాన్యత నిచ్చి ప్రజలకు ఉత్సాహానివ్వండం పార్టీ వర్గాలను ఆనంద పెడుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అరోగ్యకారణాల వల్ల చంద్రబాబు యాత్రను కొససాగించలేకపోయినట్లయితే కుమారుడు లోకేష్ యాత్రను కొనసాగిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

జిఎంఆర్ సంస్ధలపై ఐటి దాడులు

ఇన్ కంటాక్స్ అధికారులు గత కొద్దికాలంగా అనేక కన్ స్ట్రకన్ కంపెనీలపై దాడులు నిర్వహిస్తూ వస్తుంది. అయితే అవన్నీ చిన్న చితకవే ఉన్నాయి. ఈ కంపెనీలు ఏ ఏ బ్యాంకుల్లో లోన్లు తీసు కున్నాయి  రూణాలకు ఖర్చుకు  ఎంతవరకు సరిపోయిందివర్కు ఎంత మేరకు జరిగింది అనేది కూడా చూస్తున్నాయి. అంతే కాక కంపెనీల వద్దనున్ననగదుని, టాక్సులను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. దీనికి అవసరమైతే ఉద్యోగుల దగ్గరనుండి కంపెనీ సెల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డు వేర్ ను కూడా వారు స్వాదీన పరుచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలను కట్టించిన జిఎంఆర్ సంస్ధ పై గురువారం అర్ధరాత్రినుండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇవి ఇంకా రెండు మూడు రోజులు జరుగుతాయనుకుంటున్నారు. ఉద్యోగులంతా అధికారులకు సహకరిస్తున్నారు.

మహిళాలకై ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం

కేంద్ర ప్రభుత్వం 1986 చట్టం ద్వారా మహిళలను అసభ్యంగా చూపినా  అశ్లీలమైన ఈ సందేశాలు లేదా మెయిళ్లు పంపినా నేరం రుజువయితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు జీవితం, యాభై వేలనుండి లక్ష వరకు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి నేరానికి పాల్పడితే ఏడేళ్లవరకు జైలు, 5,00,000 రూపాయలవరకు జరిమానా విధిస్తారని చట్టం రూపొందించ బడింది. అయితే  ఈ చట్టం ఎంతవరకు అమలవుతుందో  చెప్పటం కష్టమేనని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటె  ఈ రెండిటిని పెంచి ప్రోత్సహించే టివి ఛానల్స్,  సినిమాలు ఈ చట్ట పరిధిలోకి ఎంత వరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకం. ఇప్పటి వరకు చిన్నపిల్లలతో చేయించే రియాల్టీ షోలు, అరికట్టబడుతుందనేది అపోహ మాత్రమే నని సామాజిక వేత్తల అభిప్రాయం. ఎందుకంటె చట్టంలో ఎక్కడా అశ్లీలం ఏమిటన్నది నిర్వచించ బడలేదు.  అలాగే  సినిమాలు ఆర్ట్ లుగా చూడాలని డైరెక్టర్ల ఉవాచ. అదీకాకుండా సినిమాలను అసభ్య సీన్లు రాకుండా చూడటానికి సెన్సా ర్ సభ్యులు ఉంటారు. కాని వారిని డైరెక్టర్లు, ప్రోడ్యూసర్లు కవర్ చేస్తుంటారు. వారు సోషల్ రెస్సాన్స్ ఫీలవనంతవరకు  ఈ వ్యవస్థను ఎవరూ కాపాడలేరని , హీరోలు, హీరోయిన్లు విషసాంప్రదాయాలను ఉత్పత్తి చేస్తున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఈ చట్టాలన్నీ కేవలం పేపర్లకు మాత్రమే పనికి వస్తాయని వారు భావిస్తున్నారు.

ప్రభుత్వభూములంటే ఎంత చులకన?

కబ్జా చేయాలంటే ప్రభుత్వ భూములను వెదుక్కుంటే సరి. దానిపై దొంగపట్టాలు, దొంగపత్రాలు సృష్టించేసుకుని పన్ను కట్టేస్తే ఆ భూమి సొంతమైనట్లే. ఇంత చులకనైన వ్యవహారం మరకొటి లేదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వభూములను ఇదే దృష్టితో చూస్తారని ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కబ్జాదారులందరూ ఈ భూముల్లో పెద్దభవంతులు నిర్మించుకుని తిరిగి అమ్మకం ద్వారా సొమ్ము చేసుకున్నారని కూడా వెల్లడిరచింది. అలానే ఎమ్మెల్యే అయినా ఎంపి అయినా కూడా ప్రభుత్వభూములపైనే కన్నేస్తారు. దీనికి ప్రత్యేకమైన ఉదాహారణలు అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే పంటకాలువను ఆక్రమించుకుని భవంతులు లేపారు.  ఈయనలానే మిగిలిన పలు జిల్లాల్లోనూ ఆరోపణలున్నాయి. అయితే ఎక్కడా చర్యలు ఉండవు. తాజాగా రూ.450కోట్ల విలువైన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ప్రభుత్వభూమిపై కబ్జాకు కన్నేశారని ఉపకలెక్టరు చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీదస్తావేజులతో కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని విచారణ చేయాలని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.

కరవర పెడుతున్న బాబు ఆరోగ్యం

62ఏళ్ల వయస్సు. ఓ రిటైర్మెంట్‌ జీవితం. ఆ తరుణంలో రోజుకు 20కిలోమీటర్లు నడవగలరా? కష్టమే అని ఒప్పుకోవాల్సిందే! నిజంగానే వైద్యశాస్త్రపరంగా ఆరోగ్యవంతమైన మనిషి కూడా ఒక వయస్సు వచ్చాక లొంగకతప్పదని తేలుస్తోంది. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఓ పెద్ద సహసం చేసినట్లే. ఆయన తన 62 ఏళ్ల వయస్సులో ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు 117రోజుల మీకోసం వస్తున్నా పాదయాత్ర రెండు పెనుసవాళ్లుగా మారాయి.  ఒకవైపు బాబును కంటి ఇన్‌ఫెక్షన్‌ బాధిస్తోంది. దీనికి తోడు రేణుమాకులపల్లి గ్రామంలో వికలాంగులతో మాట్లాడుతూ సొమ్మసిల్లారు. అలానే కండరాలు పట్టేయడంతో చాలాసేపు ఇబ్బంది పడ్డారు. అలానే గతంతో పోల్చుకుంటూ చంద్రబాబు నడకవేగం కూడా తగ్గింది. పైగా, బాబు బాగా అలసటగా కనిపిస్తున్నారు. వైద్యుని సలహాల మేరకు కొంత విశ్రాంతి తరువాత బాబు మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటికే 200కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన బాబు తన ఆరోగ్యం సంగతెలా ఉన్నా ముందున్న లక్ష్యం పూర్తి చేస్తానంటున్నారు. అలానే తమకు మద్దతు పలికిన సిపిఐ నేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు. 

జగన్‌ ఆకర్షణ శక్తి తగ్గిందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోనరెడ్డి చంచల్‌గూడజైలులో ఉన్నంత కాలం ఆ పార్టీలోకి వచ్చే వలసల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి కేంద్రంలో కాంగ్రెస్‌తోనే కలిసుంటామన్న మాటతో కాంగ్రెస్‌ అధిష్టానంలోని నేతలను ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో తాము ప్రత్యేకపార్టీగానే ఉంటామని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఈమెతో ఆ మాట చెప్పిస్తున్న జగన్‌ ఎలాగైనా తాను బయటకు వస్తే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చే వారితో 2014 అధికారం సొంతం చేసుకోవచ్చని కలలు కంటున్నారు. ఈ కలలు సంగతెలా ఉన్నా ఈపాటికే పార్టీకి విపరీతమైన స్పందన వచ్చేస్తుందని మొదట్లో అందరూ అంచనా వేశారు. ఊహించినంత స్పందన అయితే లేదు. కానీ, ఇడి ఆస్తుల సీజ్‌ ప్రతిపాదన విన్న తరువాత కొందరు వెనుకడుగువేశారని తెలుస్తోంది. అలానే జగన్‌ ఆస్తులన్నీ సీజ్‌ అయితే మనకేమి చేస్తారన్న డౌట్‌ కూడా కార్యకర్తల్లోనూ వస్తోంది. దీంతో కొందరు బయటపడ్డనేతలు మినహా మిగిలిన వారందరూ అసలు పరిస్థితి ఏమిటీ? అన్న పరిశీలనలో ఉన్నారు. తాజాగా సినీనటుడు మోహన్‌బాబు తాను వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. అలానే నల్గండజిల్లా భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిద్దరు కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ఇద్దరు నేతలు మినహా మిగిలిన వారందరూ వెనుకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా జగన్‌ పార్టీలో చేరటానికి సిద్ధమైన నేతలకు కొందరు ఎమ్మెల్యేలు తామే ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని సలహాలు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి గోళ్లు గిల్లుకునే బదులు అవసరమైన పని ఉన్నప్పుడే నువ్వు పార్టీలోకి వద్దువుగానీ ఆగిపోమ్మని చెబుతున్నారట. ఇలా ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పటంతో ఊడా స్థానికంగా ఉండే వలసలు కూడా కొంత మేర తగ్గాయి.

తమ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆప్షనల్‌ నాయకురాలు, జగన్‌ సోదరి షర్మ?

అసలు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై ఏకాభిప్రాయం సాధ్యమా? ప్రస్తుత వాతావరణం పరిశీలిస్తేనే ఇది అసాధ్యమని చిన్నపిల్లలు కూడా తేల్చి చెప్పేస్తారు. అటువంటిది రాజకీయమేథావులు ఉన్న తెలంగాణ ప్రాంతీయులు ఎందుకు అనవసరంగా ఒకపార్టీని, కొందరు నేతలను అడ్డుపెట్టుకుని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు స్వార్థం కూడా ఉద్యమరూపం దాల్చవచ్చు. కొందరు బలికి కూడా కారణం కావచ్చు. కానీ,  అసలు అవకాశం లేని అంశాన్ని ఆశగా చూపి తాము నేతలుగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారిని పసిగట్టలేకపోతే ఎలా? తెలంగాణాఅభివృద్థికి చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక స్పెషల్‌ ప్యాకేజీ కోరితే సరిపోయేది. అలాంటిది ప్రత్యేక తెలంగాణా పేరిట ఇంకెన్నాళ్లు కూలీల పొట్టకొడతారు? విద్యార్థుల చదువులకు విఘాతం కల్పిస్తారు? ఉద్యమం అన్నప్పుడల్లా కూలిపని మానేసి వస్తున్న అమాయకప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చే కన్నా సరైన నిర్ణయం తెలంగాణాలోనే తీసుకోవాలి.  ప్రత్యేకరాష్ట్రం అన్న ప్రతిపాదన ఆధారంగా తెరాస(తెలంగాణారాష్ట్రసమితి) ఏర్పాటైంది.  ఈ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్పీకర్‌ పదవిని వదిలేసి తెలంగాణా ఉద్యమం పేరిట నేతగా ఎదిగారు. ఆయన తన ఎదుగుదల కోసం తెలంగాణా రేపే వచ్చేస్తాది...జల్దీగా శుభవార్త ఇంటాం జరా మందిని తోల్కని రారాదే...అంటూ గడువులు పెడుతూ కాలం గడిపారు. అసలు ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనే దానిపై అవగాహన లేని కాంగ్రెస్‌ అధిష్టానంలో కొందరు కూడా ఈ కేసీఆర్‌ స్టేట్‌మెంట్లకు తలగ్గారు. కానీ, అదే నాయకులు వాస్తవాలు తెలుసుకుని అసలు తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అనేది అసాధ్యమని తేల్చేస్తున్నారు. మొదట్లో అలానే మొగ్గుచూపిన రాష్ట్రకాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీఆజాద్‌ ఇప్పుడు తెలంగాణా అసాధ్యమంటున్నారు. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఏకాభిప్రాయం వస్తేనే తెలంగాణా సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ తాను ఢల్లీలో బోల్డెన్ని మంతనాలు చేశానని కథలు చెబుతున్న కేసీఆర్‌ గుటకలు మింగాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోలేదని ప్రజలకు అర్థమైంది. తెలంగాణావాదులకు మాత్రమే కేసీఆర్‌ నాటకాలు ఇంకా అర్థం కాలేదు. అసలు ఢల్లీలో అందరు నేతలను ఒప్పిస్తే ఆజాద్‌ ఇలా ఎందుకు స్పష్టంగా మాట్లాడతారు? ఒక్కసారి తెలంగాణావాదులూ ఆలోచించండి!

షర్మిళ యాత్ర అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుందా?

తమ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆప్షనల్‌ నాయకురాలు, జగన్‌ సోదరి షర్మిల 3వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఆయన కనుక ఈ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ముగిసేలోపు బయటకు వస్తే జగనే ఫైనల్‌గా యాత్ర పూర్తి చేస్తారు. లేకపోతే ప్రారంభించారు కాబట్టి పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకూ యాత్ర షర్మిల పూర్తి చేస్తారు. అయితే ఇలా ప్రకటించిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి తాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జగన్‌ విడుదల కోసం సిబిఐపై ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  రాష్ట్రపతి ప్రణబ్‌ ఇప్పటికే రాష్ట్ర పరిణామాలు తెలిసున్న వ్యక్తి కాబట్టి ఆమెకు ఆపాయింట్‌మెంట్‌ ఇచ్చినా పెద్దగా ఒత్తిడి చేయకపోవచ్చు. దీంతో ఆప్షన్‌ అనుకున్న షర్మిలే పాదయాత్ర పూర్తి చేయాల్సి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జనబలంతో ఉప ఎన్నికల్లో విజయం సాధించామనుకుంటున్న వైకాపా గుట్టు ఈసారి చంద్రబాబు యాత్ర ద్వారా వెలుగులోకి వస్తుంది. ఆయనకు వస్తున్న స్పందన చూసి వైకాపా తన కార్యకర్తలను కాపాడుకునేందుకు ఈ యాత్ర ప్రారంభించింది. అయితే చంద్రబాబు తన పాదయాత్రకు రమ్మని ఎవరినీ పిలవనక్కర్లేదు. ఎందుకంటే ఆయన సీనియార్టీ, సిఎంగా చేసిన అనుభవం అదనపు ప్లస్‌ అవుతున్నాయి.  సొంత ఇమేజ్‌ కూడా ఆయనకు ఉంది. అందరితోనూ కలిసిపోయే స్వభావం ఆయన సొంతం. అందువల్ల చంద్రబాబు యాత్రకు ఆ పార్టీ నాయకులు రాకపోయినా కూడా విజయవంతమవుతుంది. కానీ, షర్మిల యాత్రకు ఆ పార్టీ నేతలు ముందస్తు ఫోన్లు చేసి నాయకులన్న వారితో ప్రచారం చేయించి జనాన్ని పోగేసేందుకు ద్వితీయస్థాయి నేతలను మెప్పించి చాలా కసరత్తులు చేయాలి. లేకపోతే షర్మిల యాత్ర అట్టర్‌ప్లాప్‌ అవుతుంది. ఆప్షనల్‌ అని ప్రకటించినప్పటికీ షర్మిలయాత్ర ముగించకతప్పదన్న అనుమానాలు ఆ పార్టీలోనూ ఉన్నాయి. అందుకని యాత్ర అనుకున్నప్పటి నుంచి పార్టీలో ఉన్న అందరినీ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈసారికి ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు సొంతఖర్చు పెట్టయినా సక్సెస్‌ అనిపించమని ఆ పార్టీ రాష్ట్రనేతలు కోరుతున్నారట. జగన్‌ బయటికి వచ్చాక దానికి తగిన ప్రతిఫలం ఇప్పిస్తామని చెబుతున్నారట.